Share News

War and Peace: యుద్ధాల చీకటిలో మానవత

ABN , Publish Date - Oct 04 , 2025 | 05:32 AM

ఇక యుద్ధం వద్దు, ఇంకెప్పుడూ యుద్ధం వద్దు అని 1965లోనే పోప్‌ ఆరవ పాల్‌ ఘోషించారు. శాంతిని కోరుకునేవారు ఆయనను అభిమానించకుండా ఎలా ఉంటారు...

War and Peace: యుద్ధాల చీకటిలో మానవత

‘ఇక యుద్ధం వద్దు, ఇంకెప్పుడూ యుద్ధం వద్దు’ అని 1965లోనే పోప్‌ ఆరవ పాల్‌ ఘోషించారు. శాంతిని కోరుకునేవారు ఆయనను అభిమానించకుండా ఎలా ఉంటారు? యుద్ధాలు ఏ సమస్యనూ పరిష్కరించవు. శత్రుత్వాన్ని, విద్వేషాన్ని మాత్రమే పెంపొందిస్తాయి. 1945లో 51 దేశాలు సమున్నత ఆశయాలతో ఐక్యరాజ్యసమితిని సృష్టించాయి. అన్ని దేశాలూ శాంతి సామరస్యాలతో శాంతియుత సహజీవనం చేస్తూ సంపద్వంతం చేస్తూ తమ ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరుస్తాయని ఆశించాయి. చరిత్ర చెప్పిందేమిటి? ఐక్యరాజ్యసమితి విఫలమయిందనే కాదూ? ఆ ప్రపంచ సంస్థ చూస్తుండగానే గత ఎనిమిది దశాబ్దాలలో అనేక యుద్ధాలు జరిగాయి. ప్రస్తుతం రెండు యుద్ధాలు ప్రపంచాన్ని కుదిపివేస్తున్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధం ఫిబ్రవరి 24, 2022న ఆరంభమయింది. ఉక్రెయిన్‌ను రష్యా దురాక్రమించడంతో ప్రజ్వరిల్లిన ఈ యుద్ధాగ్నులు ఇప్పటికీ ఆరలేదు. ఎప్పటికి ఆరిపోతాయో తెలియదు. సోవియట్‌ యూనియన్‌ ఆఫ్ సోషలిస్ట్‌ రిపబ్లిక్స్‌ ఉనికిలో ఉన్నప్పుడు ఉక్రెయిన్‌ అందులో భాగంగా ఉండేది. చాలా మంది రష్యన్లు, రష్యన్‌ భాష మాట్లాడేవారు ఉక్రెయిన్‌గా పిలవబడే ప్రాంతంలో నివశిస్తుండేవారు. 1991లో సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమైనప్పుడు ఉక్రెయిన్‌ ఒక సార్వభౌమిక గణతంత్ర రాజ్యంగా ప్రభవించింది. 2014–22 సంవత్సరాల మధ్య ఉక్రెయిన్‌ ప్రాంతాలు అయిన క్రిమియా, డొనెట్‌స్క్‌, లుహన్‌స్కిలను రష్యా ఆక్రమించుకుని బలవంతంగా తనలో కలిపివేసుకున్నది. తనను వ్యతిరేకించే సైనిక కూటమి ‘నాటో’ సభ్యత్వానికై ఉక్రెయిన్‌ దరఖాస్తు చేసుకుందని, ఉక్రెయిన్‌ను ఉపయోగించుకుని నాటో దేశాలు తనను చుట్టుముట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని, తత్కారణంగా తన జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడినందునే ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవడం అనివార్యమయిందని రష్యా సమర్థించుకున్నది. ఉక్రెయిన్‌ ఒక సార్వభౌమిక దేశం.


ఆ దేశం నాటోలో చేరినా, చేరకపోయినా స్వతంత్ర దేశంగా మనుగడ సాగించేందుకు ఆ దేశానికి సంపూర్ణ హక్కు ఉన్నది. ప్రపంచ దేశాలు ఆ హక్కును గౌరవించాలి. ఉక్రెయిన్ స్వతంత్ర రాజ్యంగా సంపూర్ణ రక్షణతో మనగలిగేందుకు ప్రపంచం హామీ పడాలి. మూడేళ్ల క్రితం ప్రారంభమైన యుద్ధం ఉక్రెయిన్‌ మనుగడకు తీవ్ర హానికరంగా పరిణమించింది. సెప్టెంబర్‌ 10, 2025 నాటికి రష్యా దాడుల్లో ఉక్రెయిన్‌లో 14,116 మంది పౌరులు మరణించారని, 36,481 మంది క్షతగాత్రులు అయ్యారని ఆ దేశంలో ఉన్న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం ప్రతినిధులు సమగ్ర సాక్ష్యాధారాలతో నమోదు చేశారు. 56 లక్షల మంది ఉక్రెయిన్‌ పౌరులు ఇతర దేశాలకు పరారవ్వగా మరో 37 లక్షల మంది పౌరులు దేశంలోనే నిరాశ్రయులు అయ్యారు. ఈ యుద్ధంలో ఉభయ పక్షాలలోను (రష్యా తరపున పోరాడుతున్న కొరియా సైనికులతో సహా) మొత్తం పది లక్షల మందికి పైగా సైనికులు మరణించారు.


ఉక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాలు వందల కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలు, సైనిక సామగ్రిని సరఫరా చేస్తున్నాయి (ఈ యుద్ధంలో నేరుగా పాల్గొనేందుకు అవి వెనుకాడుతున్నాయి). అయినప్పటికీ ఉక్రెయిన్‌ యుద్ధంలో ఓడిపోతోంది. అన్ని విధాల భారీనష్టాలు చవిచూస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఒత్తిడి చేసి ఈ యుద్ధాన్ని నిలిపివేయగల దక్షత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు ఉన్నది. అయితే ట్రంప్ అందుకు సుముఖంగా లేడు. ఆత్మరక్షణకై ఉక్రెయిన్‌ యుద్ధం చేస్తోంది. నైతికత, న్యాయబద్ధత ఉక్రెయిన్‌ పక్షానే ఉన్నాయి. అయినా నిస్సహాయంగా నలిగిపోతోంది. అమెరికా ఊగిసలాట ధోరణి, ఐక్యరాజ్యసమితి అసమర్థతకు ఉక్రెయిన్‌ బలవుతోంది. ఉక్రెయిన్‌ యుద్ధం పనికిమాలిన, అనైతిక యుద్ధమని ఒక బలమైన దేశం, పొరుగున ఉన్న ఒక బలహీన రాజ్యంపై చేస్తున్న దురాగతం మినహా మరేమీ కాదని చరిత్ర తప్పక నమోదు చేస్తుంది. ప్రపంచాన్ని అమితంగా కలవరపరుస్తోన్న మరో యుద్ధాన్ని హమాస్‌ ప్రారంభించింది. పాలస్తీనాలో భాగమైన గాజా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న మిలిటెంట్‌ గ్రూపే హమాస్‌. ఈ పశ్చిమాసియా ప్రాంతం ఇప్పటికే అనేక యుద్ధాలతో అతలాకుతలమైపోయింది. అక్టోబర్‌ 7, 2023న హమాస్‌ ఎలాంటి కవ్వింపు లేకుండా ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఇది సమర్థించరాని చర్య. హమాస్ దాడిలో 1200 మంది ఇజ్రాయెలీ పౌరులు మరణించారు. మరో 251 మంది ఇప్పటికీ హమాస్ వద్ద బందీలుగా ఉన్నారు. హమాస్ దాడిపై ఇజ్రాయెల్‌ భీకరంగా ప్రతిస్పందించింది. ఎడతెగని, బహుముఖీనమైన దాడులు ప్రారంభించింది. గాజా నుంచి పాలస్తీనియన్లు అందరినీ గెంటివేయడమే ఇజ్రాయెల్‌ లక్ష్యంగా ఉన్నది. పాలస్తీనియన్లు లేని గాజాను పూర్తిగా ఇజ్రాయెల్‌లో కలుపుకోవడమే లక్ష్యంగా ఉన్నది. ఇజ్రాయెల్‌ ఇప్పటికే మరో పాలస్తీనియన్‌ ప్రాంతమైన వెస్ట్‌ బ్యాంక్‌ను చాలావరకు ఆక్రమించుకుని అక్కడి జనజీవనాన్ని నియంత్రిస్తోంది. పశ్చిమాసియాలో సుస్థిర శాంతికి ఒక పరిష్కారంగా ఉన్న రెండు దేశాల సిద్ధాంతాన్ని ఇజ్రాయెల్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇజ్రాయెల్‌ దాడుల్లో గాజాలో 67,000 మంది మరణించారు.


వారిలో అత్యధికులు మహిళలు, బాలలే. పాఠశాలలు, ఆసుపత్రులు మొదలైన మౌలిక సదుపాయాలు అన్నీ ధ్వంసమైపోయాయి. ఆహారం, మంచినీరు, ఔషధాలు అందుబాటులో లేక పాలస్తీనియన్లు చనిపోతున్నారు. హమాస్ దాడికి ప్రతీకారంగానే తాము దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్‌ సమర్థించుకొంటోంది. అయితే ఇది సమర్థించలేని విషయం. ఇజ్రాయెల్‌ దాడులు మహాభీకరంగా ఉన్నాయి. ఎడతెగకుండా సాగుతున్నాయి. పైగా ఈ దాడుల లక్ష్యం న్యాయవిరుద్ధమైనది.. ఎంతమాత్రం ఆమోదయోగ్యమైనది కాదు. మాతృభూమిని కలిగి ఉండేందుకు పాలస్తీనియన్లకు హక్కు ఉన్నది. గాజాలో శాంతికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ 20 అంశాల ‘శాంతి ప్రణాళిక’ నొకదాన్ని ప్రతిపాదించారు. ఇజ్రాయెల్‌ డిమాండ్లను చాలావరకు ఆమోదిస్తున్నట్టు ఈ శాంతి ప్రణాళిక కనిపిస్తున్నది. నేనీ వ్యాసం రాస్తున్న సమయానికి హమాస్‌ ఆ శాంతి ప్రణాళికను ఆమోదిస్తున్నదీ లేనిదీ తెలియరాలేదు. అన్నీ కోల్పోయి ఆకలి దప్పులతో అలమటిస్తున్న పాలస్తీనియన్లకు శాంతిని సమకూర్చాలంటే ట్రంప్ శాంతి ప్రణాళికను ఆమోదించడం మినహా హమాస్‌కు గత్యంతరం లేదు. అయితే ట్రంప్ శాంతి ప్రణాళికను ఆమోదించడమంటే పాలస్తీనియన్ల భవిష్యత్తును బాహ్యశక్తులకు స్వాధీనం చేయడమే అవుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇంతకూ ట్రంప్‌ ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక ప్రకారం పాలస్తీనా 157 దేశాల గుర్తింపుతో ఒక సార్వభౌమిక దేశంగా ప్రభవించేందుకు దోహదం జరుగుతుందా లేదా అన్న విషయమై స్పష్టత లేదు. హమాస్‌ను, పాలస్తీనియన్లను ఒకటిగా చూడడం సమంజసం కాదు. ఏమైనా హమాస్‌ దుస్సాహసం చాలా అవమానకరంగా ముగిసిందని చెప్పక తప్పదు. అంతేకాదు, పాలస్తీనియన్ల హక్కుల అణచివేత యథావిధిగా కొనసాగుతుంది. సరే, ఉక్రెయిన్ యుద్ధంపై భారత్‌ చాలావరకు సూత్రబద్ధమైన వైఖరిని పాటిస్తూ వస్తోంది. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య శాంతిని నెలకొల్పేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించారు.


అయితే భారత్‌కు 1950లు, 1960ల్లో ఉన్న నైతిక అధికారం, రాజకీయ పలుకుబడి ఇప్పుడు లేవు. ఇజ్రాయెల్‌–హమాస్ యుద్ధం విషయమై భారత్‌ బాగా తడబడింది. మొదటి నుంచీ పాలస్తీనాకు అన్నివిధాల మద్దతునిస్తున్న భారత్‌ ఇజ్రాయెల్‌ వైపు మొగ్గు చూపుతూ వస్తోంది. ఇది ఒక విధంగా పాలస్తీనియన్లను వంచించడమేనని చాలా మంది భావించారు. పలువురు బహిరంగంగా విమర్శించారు. ‘రెండు దేశాల ప్రణాళిక’ కింద ఉనికిలో ఉండే హక్కు పాలస్తీనా, ఇజ్రాయెల్‌ రెండిటికీ ఉందని భారత ప్రభుత్వం సుదీర్ఘకాలంగా వాదిస్తూ వస్తోంది. అయితే ఈ వాదనను విడనాడడం తప్పు అనే విషయాన్ని భారత్‌ గుర్తించి తన వైఖరిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించింది. శక్తిమంతమైన దేశాలు, తమను వ్యతిరేకిస్తున్న బలహీన విరోధులపై ఎడతెగని వినాశనకర యుద్ధాలు చేస్తున్నాయనే సత్యాన్ని పాఠకుల దృష్టికి తీసుకురావడమే ఈ వ్యాసం లక్ష్యం. ఉక్రెయిన్‌, గాజా యుద్ధాల నిష్ఫలతను కూడా ఈ వ్యాసం ఎత్తి చూపింది. ఇవి వ్యర్థ యుద్ధాలు, ఎవరికీ ఏమీ ఒరిగేదేమీ లేదు. ప్రతి దేశంలోను యుద్ధోన్మాదులు ఉన్నారు. అనేక వివాదాలకు యుద్ధమే పరిష్కారమనేది వారి ప్రగాఢ విశ్వాసం. ఈ యుద్ధోన్మాద వైఖరిని అంతర్గత విభేదాల పరిష్కారానికి కూడా వారు వర్తింపచేస్తున్నారు. దేశీయ వ్యవహారాలలో వివాదాల పరిష్కారానికి ‘యుద్ధం’కు ప్రత్యామ్నాయంగా ‘హింస’ను ఉపయోగించడాన్ని వారు సమర్థిస్తున్నారు. ‘బలవంతులే సరైనవారు’ అన్న భావాన్ని వారు అంగీకరిస్తున్నారు. ఇదెలా న్యాయం? తమ నైతిక అధికారంతో సమస్యలు పరిష్కరించగల జవహర్‌లాల్‌ నెహ్రూ, డాగ్‌ హమ్మర్స్క్‌ జోల్డ్‌, మార్టిన్‌ లూథర్‌ కింగ్ జూనియర్‌ లాంటి సమున్నత నాయకులు ఇప్పుడు ప్రపంచానికి అవసరం. వినాశనకర ఘర్షణ పథం నుంచి వైదొలిగేలా కలహించుకుంటున్న దేశాలను మరింతగా ప్రభావితం చేయగల దేశాలు కలిసికట్టుగా ముందుకురావలసిన అవసరం నేడు ప్రపంచానికి ఎంతైనా ఉన్నది. ప్రస్తుత ఐక్యరాజ్యసమితి వలే కాకుండా కొత్త అంతర్జాతీయ సంస్థల అవసరం నేడు ప్రపంచానికి చాలా ఉన్నది. ప్రస్తుతానికి మాత్రం అంతా అంధకారమే, శాంతి కుసుమాల ఉదయం కనుచూపుమేరలో లేదు.

-పి. చిదంబరం

Updated Date - Oct 04 , 2025 | 05:32 AM