Share News

Mother Tongue EEducation: మాతృభాషలో బోధనతోనే సరైన అవగాహన

ABN , Publish Date - Jul 19 , 2025 | 02:23 AM

ప్రపంచంలోనే దాదాపు సగం దేశాలలో తెలుగువారు తమ సత్తా చూపుతూ తెలుగు బావుటాని ఎగురవేస్తున్నారు..

Mother Tongue EEducation: మాతృభాషలో బోధనతోనే సరైన అవగాహన

ప్రపంచంలోనే దాదాపు సగం దేశాలలో తెలుగువారు తమ సత్తా చూపుతూ తెలుగు బావుటాని ఎగురవేస్తున్నారు. కానీ దేశంలో అక్షరాస్యతలో, భాష తదితర విషయాల పట్ల అవగాహనలో అట్టడుగు స్థాయిలో ఉన్నారు. నేడు ఉన్నత స్థానాల్లో ఉన్న చాలా మంది ఉన్నత పాఠశాల స్థాయి వరకు తెలుగు మాధ్యమంలో చదివినవారే. 5 నుంచి 10 శాతం మంది ఆంగ్ల మాధ్యమంలో చదివినా, వారి తల్లిదండ్రులు విద్యావంతులైనందున వారి సహకారంతో మాతృభాషపై పట్టు సాధించినవారే. వీరు ఇతర భాషలు, విషయాలపై కూడా పట్టు సాధించి ఉన్నత స్థానానికి ఎదిగారని మరచిపోకూడదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలోని సీబీఎస్‌ఈ వారు రెండవ తరగతి వరకు తప్పనిసరిగా తమ పాఠశాలల్లో మాతృభాషలోనే విద్యాబోధన ఉండాలని ఉత్తర్వులు జారీ చేశారు.


ఇటీవల కాలంలో మన రాష్ట్ర విద్యా విధానం క్రమంగా కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానం పద్ధతిలోకే వెడుతోంది. కాబట్టి మన రాష్ట్రంలో రెండవ తరగతి వరకు తప్పనిసరిగా మాతృభాషలోనే విద్యాబోధన అమలుపరచాలి. మూడో తరగతి నుంచి సరళమైన పద్ధతిలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టవచ్చు. దీనివల్ల ఐదవ తరగతి పూర్తయ్యే సమయానికి తెలుగు భాషపై ఓ మాత్రం పట్టు లభిస్తుంది. ఇంగ్లీషు భాష కూడా పరిచయం అవుతుంది. నిత్య జీవితావసరమైన గణితంలోని చతుర్విధ ప్రక్రియలు తెలుగు పుస్తకంలోనే పొందుపరచవచ్చు. ప్రచురణ, ముద్రణ మాఫియాలకు లొంగకుండా అనవసరమైన పుస్తకాల బరువును తగ్గిస్తూ, రెండవ తరగతి వరకు కేవలం తెలుగువాచకం మాత్రమే ఉండాలి. మూడవ తరగతి నుంచి తెలుగువాచకంతో పాటు సరళమైన ఆంగ్లవాచకం ప్రవేశపెట్టవచ్చు. అంటే ప్రాథమిక స్థాయిలో భాష పట్ల, నిత్యజీవితావసరమైన గణితం కూడా మాతృభాషలో ఉన్నందున పట్టు లభిస్తుంది. ఆంగ్లాన్ని కూడా ప్రవేశపెట్టడం వల్ల జనబాహుళ్యం కోరికను మన్నించినట్లవుతుంది.


ఆరవ తరగతి నుంచి ఒకేసారి అన్ని సబ్జెక్టులు ఆంగ్ల మాధ్యమంలో కాకుండా గణితం, విజ్ఞాన శాస్త్రం ఆంగ్ల మాధ్యమంలోనూ, సాంఘికశాస్త్రం తెలుగు మాధ్యమంలో కొనసాగించవచ్చు. దానివల్ల ఒకేసారి మొత్తం ఆంగ్ల మాధ్యమం అయిపోయి, కష్టమైందన్న భావన లేకుండా అన్ని విషయాల పట్ల అవగాహనకు వీలవుతుంది. తొమ్మిదవ తరగతి నుంచి సాంఘికశాస్త్రం కూడా ఆంగ్ల మాధ్యమంలో కొనసాగించవచ్చు. అప్పుడు తెలుగు మాధ్యమం, ఆంగ్ల మాధ్యమం అనే తేడా ఉండదు. కామన్ మీడియం లేదా మిక్స్‌డ్‌ మీడియంగా వ్యవహరించవచ్చు. ఫలితంగా విద్యార్థికి తెలుగు భాషపై పట్టు లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వ పరీక్షల విభాగమైన యూపీఎస్సీ అంచనాల మేరకు వారు నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలలో దాదాపుగా 10 శాతం స్థానిక భాషల పరీక్షలలో సాధించవలసిన కనీస అర్హత 25 శాతం మార్కులు కూడా సాధించలేకపోతున్నారని తెలుస్తోంది. ఇలా ఉత్తీర్ణులు కాని వారిలో చాలా మంది తెలుగువారే. అందుకు కారణం మార్కుల యావతో మొదటి నుంచి కూడా తెలుగుకు బదులు ఇతర భాషలు ఎంపిక చేసుకోవడమే. కానీ ఆ భాషలలో వారికున్న పరిజ్ఞానం పోటీ పరీక్షలకు సరిపడేంతగా లేదు. యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలలో ఇతర సబ్జెక్టులలో మంచి మార్కులు సాధించినా, తెలుగులో కనీస అర్హత మార్కులు సాధించకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో తెలుగువారి సంఖ్య భవిష్యత్తులో తగ్గిపోనున్నది. దీనికి పరిష్కారంగా ఇంటర్మీడియట్ వరకు తెలుగును తప్పనిసరి చేయాలి.

– యనమందల ఆనందం, ఏలూరు

Updated Date - Jul 19 , 2025 | 02:23 AM