The Journey of Revu Choodani Naava: నాడు అందరూ ఆకాంక్షించిన దిశలో నేను ప్రయాణించలేదు
ABN , Publish Date - Nov 03 , 2025 | 04:25 AM
రేవు చూడని నావ అన్న కవితా సంపుటి ప్రచురించాలన్న ఆలోచన ఎలా వచ్చిందో గుర్తులేదు కానీ వచ్చాక మొదట ఆచార్య తిరుమలగారి అభిప్రాయం అడిగాను. ఆయన చాలా బావున్నాయి...
‘రేవు చూడని నావ’ అన్న కవితా సంపుటి – ప్రచురించాలన్న ఆలోచన ఎలా వచ్చిందో గుర్తులేదు కానీ వచ్చాక మొదట ఆచార్య తిరుమలగారి అభిప్రాయం అడిగాను. ఆయన ‘‘చాలా బావున్నాయి, తప్పకుండా పుస్తకం వేయవచ్చు’’ అంటూ ముందుమాట కూడా రాసి ఇచ్చారు. మాధవి ప్రింటర్స్ గురించి కూడా ఆయనే చెప్పినట్లున్నారు. తర్వాత చంద్రగారిని ముఖచిత్రం వేసి ఇవ్వమని అడిగాను. ఆయన మొత్తం కవితలన్నీ చదివి, ఒక్కొక్క కవితనీ అందులోని పదాలనీ చాలా మెచ్చుకుంటూ మాట్లాడారు. అందమైన ముఖచిత్రాన్నీ గీసి ఇచ్చారు. ఆ ముఖచిత్రాన్ని చూసి సింగిల్ కలర్లో అంత అందమైన ముఖచిత్రం రావడం అరుదని చాలామంది అన్నారు. సినారెగారి అభిప్రాయం కూడా తీసుకోమని చంద్రగారే చెప్పారు. పరిచయం లేదని నేను సందేహిస్తుంటే ‘‘పరిచయం అక్కర్లేదు, అడగండి’’ అని మరీమరీ చెప్పడంతో నారాయణరెడ్డిగారికి ఫోన్ చేశాను. సారస్వత పరిషత్ దగ్గర పుస్తకం అందిస్తే ఆయన ఒక్క వారంలోనే ముందుమాట రాసి పోస్టులో పంపారు. ‘నాస్నేహితుడు’ కథకు రచయిత్రిగా వచ్చిన గుర్తింపు వలన మా కంపెనీ ఎమ్.డి. డాక్టర్ డి.ఎన్.రావుగారు ‘‘ఈ ప్రాజెక్ట్‌ని డ్యూక్ ఆర్నిక్స్ సపోర్ట్ చేస్తుంది’’ అంటూ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. పుస్తకం ప్రింటుకి ఇచ్చాం. తీరా పుస్తకం తెచ్చుకుందామని వెళ్ళేసరికి షాపు మూసేసి ఉంది. ఆ ప్రింటింగ్ ప్రెస్ ఊట్ల కొండయ్యగారిది. మొదట మాట్లాడి పని తీసుకున్నది వారి అబ్బాయి. తర్వాత వారిద్దరి మధ్య ఏవో విభేదాలు రావడంతో కొండయ్యగారు షాపుకి తాళం వేసేశారు. ‘‘అమ్మాయి దిగులు పడుతుందేమో, మీరు ఓదార్చండి’’ అంటూ దుర్వార్త చెప్పే డాక్టరు ధోరణిలో మావారికి విషయం తెలియచేసి, షాపు తెరిచే ప్రసక్తి లేదని కచ్చితంగా చెప్పారు. అయితే నేనేమీ కంగారు పడినట్లూ, దిగులు పడినట్లూ గుర్తు లేదు. ఎలా సర్దుబాటు చేసుకున్నారో తెలియదు కానీ ఒక నెల తర్వాత మళ్ళీ షాపు తెరిచి పుస్తకాలు అందించారు. ఆవిష్కరణసభ 1997 జనవరిలో నగర కేంద్ర గ్రంథాలయంలో జరిగింది. తిరుమల అధ్యక్షులు. సి. నారాయణరెడ్డి ఆవిష్కర్త. చిల్లర భవానీదేవి, తేళ్ళ అరుణ పుస్తకం గురించి మాట్లాడారు. ఎందరో ప్రముఖ రచయితలు, బంధువులు, స్నేహితులతో హాలు క్రిక్కిరిసి పోయింది. సభలో అందరూ చిన్న వయసులోనే మంచి పుస్తకం తెచ్చానన్న అబ్బురాన్నీ, రచయితగాను, జీవితంలోను కూడా చాలా ఉన్నత స్థితికి ఎదుగుతానన్న ఆకాంక్షనీ వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ఆ తర్వాత ఆంధ్రప్రభలో విశ్వనాథ పావనిశాస్త్రి, వార్తలో నాగభైరవ కోటేశ్వరరావు చక్కని సమీక్షలు రాశారు. ఆంగ్లపత్రిక హిందూలో కూడా మంచి సమీక్ష వచ్చింది. ముప్పై ఏళ్ళ తర్వాత అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటే రెండు విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటి ఆరోజున సాహితీవేత్తలూ బంధువులూ ఆశించిన విధంగా నేను ఎదగలేదు. వారు ఆకాంక్షించిన దిశలో నేను ప్రయాణించలేదు. అందరూ పెదవి విరిచే దారిలో ఒంటరిగా చాలా దూరం వచ్చేశాను. రెండు, అప్పటిది ఏ పరిస్థితినైనా అనుకూలంగా మార్చుకోగలనన్న దూకుడు. ఇప్పుడున్నది ఏ పరిస్థితి అయినా ఆనుకూల్యమే అనుకోగలిగిన నిలకడ.