Share News

Charminar Building Fire: మహావిషాదం

ABN , Publish Date - May 20 , 2025 | 02:28 AM

హైదరాబాద్‌ చార్మినార్‌ సమీపంలో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది మృతి చెందడం మానవ తప్పిదం, వ్యవస్థాగత నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. సరైన భద్రతా ప్రమాణాలు లేకపోవడం, అగ్నిమాపక సిబ్బంది ప్రవేశానికి అడ్డంకులు ఉండటం ప్రమాద తీవ్రతను పెంచింది.

Charminar Building Fire: మహావిషాదం

హైదరాబాద్‌ చార్మినార్‌ సమీపంలోని ఒక భవనంలో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించి పదిహేడుమంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అత్యంత విషాదకరమైనది. వేసవిసెలవుల్లో సరదాగా గడిపేందుకు ఒకేచోటకు చేరిన ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాలు ఈ భయానకప్రమాదంలో చిక్కుకొని ప్రాణాలుకోల్పోవలసి వచ్చింది. అంతాగాఢనిద్రలో ఉండగా అగ్నికీలలు భవనాన్ని కమ్మేయడంతో, మొదటి అంతస్తులో ఉన్నవారు కిందకు దిగలేక, పైకిపోలేక గదిలోనే ఉండిపోయి, పొగకు, వేడిమికి గురై అపస్మారక స్థితిలోకి జారుకొని, ఆస్పత్రికి తరలించేలోగానే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అత్యధికులు చిన్నారులు, మిగతావారు మహిళలు, వృద్ధులు. దేశం యావత్తూ ఈ దుర్ఘటనకు నిర్ఘాంతపోయింది. రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖులంతా దిగ్భ్రాంతిని, సంతాపాన్ని తెలియచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతోపాటు, ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి సమగ్ర విచారణకు ఆదేశించారు. ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న చిన్నారులతో సహా పదిహేడుమంది జీవితాలను అర్థంతరంగా ముగించేసిన ఈ దారుణం మనసులను కలచివేయడంతో పాటు కొన్ని ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది. ఇటువంటి ప్రమాదాలు ఆకస్మికంగా, అకారణంగా జరిగిపోయినట్టు ఉపరితలంలో కనిపిస్తాయి కానీ, మానవతప్పిదం, వ్యవస్థాగత నిర్లక్ష్యం వాటికి దోహదపడుతున్నాయన్నది వాస్తవం. కింద మూడు దుకాణాలతో వ్యాపారం, పైన నివాసం కలగలిసిన ఈ భవనం ప్రవేశద్వారం ఎంత ఇరుకుగా ఉన్నదో, ఉన్న ఆ కాస్త స్థలంలోనూ వాహనాలు సహా అనేక అడ్డంకులవల్ల అగ్నిమాపక సిబ్బంది ప్రవేశం ఎంత కష్టమైపోయిందో వార్తలు తెలియచెబుతున్నాయి. ఈ ఇంట్లోకి ప్రవేశించేందుకు మరో మార్గమన్నదే లేక, పక్కభవనం గోడలకు రంధ్రాలు చేసి అగ్నిమాపక సిబ్బంది బాధితులను కాపాడవలసివచ్చిందట. ఖరీదైన వ్యాపారాలు చేసుకుంటున్నవారు కూడా కనీసజాగ్రత్తలమీద శ్రద్ధపెట్టకపోవడం ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో ఉండటానికి దోహదం చేసింది. ఏమీ జరగదన్న అర్థంలేని నమ్మకమో, బాధ్యతారాహిత్యమో తెలియదు కానీ, ఆ వ్యాపార కుటుంబం భవన నిర్మాణంనుంచి నిర్వహణ వరకూ పలు తప్పిదాలకు పాల్పడి తమ భద్రతనే ప్రమాదంలో నెట్టేసుకుంది.


ఏసీల వంటివి వాడుతున్నప్పుడు ఇటువంటి ఆవాసాలను ప్రమాదరహితంగా తీర్చిదిద్దుకోవడం మరింత ముఖ్యం. ప్రమాదం ఎందుకు జరిగిందో, మంటలు త్వరితగతిన మొత్తం భవనాన్ని ఎలా కమ్ముకురాగలిగాయో తెలుస్తూనే ఉంది. మానవ నిర్లక్ష్యం, నియమనిబంధనలపట్ల బేఖాతరు, పలు వ్యవస్థల బాధ్యతారాహిత్యం కలగలిసిన దారుణం ఇది. ఈ ఒక్క భవనమే కాదు, ఈ ప్రాంతంలోనే ఇటువంటివి అనేకం ఇదే తరహాలో అతి సునాయాసంగా ప్రమాదానికి లోనయ్యేరీతిలో ఉన్నాయన్న వాస్తవం అధికారులకు తెలియందీ కాదు. నిబంధనలకు లోబడి నిర్మాణాలు ఉన్నాయా, ప్రమాదాలు జరిగినప్పుడు తప్పించుకోగలిగే మార్గాలు ఉన్నాయా, అగ్గిరాజుకోగానే తక్షణం ఆర్పగలిగే పరికరాలు పనిచేస్తున్న స్థితిలో అందుబాటులో ఉంటున్నాయా అన్నది అధికారులు నిరంతరం గమనిస్తూ, యజమానులను అప్రమత్తం చేస్తూవుంటే ప్రమాదాలను నివారించవచ్చు. పాతభవనాలు, మరీముఖ్యంగా ఇరుకైన ప్రాంతాల్లోని ఇటువంటి గృహ, వాణిజ్య సదుపాయాలమీద అధికారుల నిఘా మరింత అధికంగా ఉండాలి. ప్రమాదాలు జరిగినప్పుడు ఫైరింజన్లు ఆ సందుల్లోకి పోలేకపోతున్నాయి, అగ్నిమాపక సిబ్బంది ప్రవేశం సైతం సమస్యగా పరిణమిస్తున్నది. భవనం కింద అంతస్తులో నిప్పు అంటుకుంటే, పై భాగాన ఉంటున్నవారు కిందకు దిగలేక, చివరకు కమ్మేసిన పొగవల్లనే ప్రాణాలు వదిలేయడం చాలా ఘటనల్లో చూస్తున్నాం. నిప్పుకంటే పొగే ప్రాణాంతంగా పరిణమిస్తున్నది. ప్రాణాలు దక్కించుకోవాలంటే పైనుంచి దూకేయడం తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గమంటూ లేకపోవడం విషాదం. వ్యాపారాలు సాగిపోతూంటాయి, నగరాలు ఎదిగిపోతూంటాయి, ప్రాణాలకు మాత్రం నమ్మకం లేని స్థితి. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఘటన చేజేతులా చేసుకున్నదీ, కచ్చితంగా నివారించగలిగిందీ. అనేకానేక ఈ తరహా దుర్ఘటనల్లో ఇది కూడా ఒకటిగా కాలగర్భంలో కలిసిపోయి, విషాదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే, దీని హెచ్చరికలను లక్ష్యపెట్టాలి, పాఠాలు నేర్చుకోవాలి.

Updated Date - May 20 , 2025 | 02:34 AM