War Beyond Words: సృష్టి.. స్థితి.. లయంలో గాజా
ABN , Publish Date - Jul 22 , 2025 | 03:19 AM
యుద్ధ బీభత్సాన్ని వ్యక్తం చేయలేని భాష ప్రపంచంలోనే ఉండదు. యుద్ధం ఏ స్థాయిదైనా కావచ్చు.
యుద్ధ బీభత్సాన్ని వ్యక్తం చేయలేని భాష ప్రపంచంలోనే ఉండదు. యుద్ధం ఏ స్థాయిదైనా కావచ్చు. అది ఆదిమ తెగల మధ్యదీ కావచ్చు, సమ ఉజ్జీల మధ్యదీ కావచ్చు. భాషలో ఒకపట్టాన వర్ణించలేని యుద్ధాలు చాలా అరుదు. మానవ సమూహాలన్నీ ఏదో ఒక దశలో యుద్ధంతో సహజీవనం చేశాయి. అందుకే వీర కావ్యాలూ గాథలూ లేని మానవ సమూహమే లేదు. కానీ నిరంతర బీభత్సమై, కిరాతకమై, నరమేధమై, సర్వస్వ హననమైన యుద్ధాలు మనుషుల విషాద వ్యక్తీకరణ సామర్థ్యానికే సవాలుగా నిలుస్తాయి. ఆ యుద్ధాలకు దూరంగా నివసించే మనుషులకు అదింకా కష్టంగా మారుతుంది. 2023 అక్టోబరు 7 నుంచి గాజాలో జరుగుతున్న జీవన విధ్వంసంపై ఇంకా గొంతుకలు పూర్తిగా పెగల్లేని పరిస్థితే ఉంది. మాటలకు తడుముకోవటమే ఉంది. వాక్యాల కోసం వ్యాకులత చెందటమే ఉంది. భావాల కోసం భాషలను గాలించటమే ఉంది. దృశ్యాలను ప్రదర్శించలేని అశక్తతే ఉంది. మన అనుభవం పూర్తిగా ఆకళింపు చేసుకోలేని, ఊహించుకోలేని విచ్ఛిన్న, విషాదకర, వివర్ణ పరిస్థితి గాజాలో నెలకొంది. నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం! కిందామీదా పడుతూ నిటారు కఠిన కొండ శిలలను ఎక్కి చుట్టూ పరచుకున్న ప్రపంచాన్ని ఎంతమేరకు చూడగలమో అందులో వెయ్యోవంతు స్థాయిలోనే ఇప్పుడు గాజా బీభత్సాన్ని చూడగలం. అది అసంపూర్ణం. అసమగ్రం. అయినా ఆ పరిమిత దృశ్యమే అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. జరుగుతోన్న దారుణాలకూ కిరాతకాలకూ చరిత్ర మూలాల్లోకి వెళ్లేలా చేస్తోంది.
సరిహద్దు గోడలనూ, ఇనుపముళ్ల కంచెలనూ పగలగొట్టి హమాస్ తీవ్రవాద ప్రేరేపితులు (2023 అక్టోబరు 7) ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడి 1200 మందికి పైగా చంపేశారు. ఎంతో మందిని బందీలుగా పట్టుకెళ్లారు. ఆ దారుణాన్ని అందరూ ఖండించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తినీ, సాంస్కృతిక భిన్నత్వాన్నీ మనసావాచాకర్మణా కోరుకునే వారిని నిలువెల్లా కలచివేసిన సంఘటన అది. అయినా హమాస్ లాంటి సంస్థలను ఎదుర్కొనటానికి యుద్ధాన్నే పరిష్కారంగా వారు భావించటం లేదు. ఏదో ఒక మిషతో గాజాపై యుద్ధాలు ప్రకటించటం, దాడులు చేయటం ఇజ్రాయెల్‌కు కొత్తకాదు. 2014 నాటికే గాజాపై 12 సార్లు ఇజ్రాయెల్ యుద్ధానికి పాల్పడిన విషయాన్ని ప్రముఖ ఫ్రెంచ్ చరిత్రకారుడు జీన్ పియర్ ఫిలియు పదేళ్ల కిందటే చెప్పారు. ఆ యుద్ధాల్లో ఇజ్రాయెల్ వేలాది మందిని చంపేసింది. అనేక భౌతిక సౌకర్యాలను విధ్వంసం చేసింది.
మధ్య ఆసియాలోనే కాదు, ప్రపంచంలోని ఏ దేశమూ ఇజ్రాయెలంత శత్రుదుర్భేద్యంగా ఉండదు. ఏదో చేస్తారన్న అనుమానంతో, అంచనాతో, ముందుగానే పడగొట్టాలనే ఆలోచనతో చుట్టుపక్కల దేశాలపై దాడులు చేయటంలో ఇజ్రాయెల్‌కు సాటి వచ్చే దేశమేదీ లేదు. అత్యాధునిక ఆయుధాలతో, డ్రోన్లతో, సైబర్ సెక్యూరిటీతో, క్షిపణి రక్షణ వ్యవస్థలతో, పటిష్ఠ గూఢచర్యంతో, అణ్వస్త్రాలతో ఇజ్రాయెల్ నెలకొల్పుకున్న ఆధిపత్యాన్ని సవాల్ చేయగలిగిన పరిస్థితి ఇరుగుపొరుగున కనపడదు. అయినా హమాస్ దాడితో తన అస్తిత్వానికే ముప్పు ఏర్పడిందనే కారణంతో గాజాపై 20 నెలలుగా కనీవినీ ఎరగని రీతిలో దాడులు చేస్తోంది. ఒక చిన్న ప్రదేశంపై చరిత్ర చూడని దాడులకు పాల్పడుతూ ఇప్పటికే 60 వేలకు పైగా మరణాలకు కారణమైంది. ఆహార పదార్థాలను అందనీయటం లేదు. మందులను చేరనీయటం లేదు. వితరణ హస్తాలనూ విరిచేస్తోంది. వేలభవనాలను శిథిలాలుగా మార్చుతోంది. మంచినీరునూ పారనీయటం లేదు. కరెంటుకు అంతరాయాలు సృష్టిస్తోంది. పాఠశాల భవనాలను కుప్పకూల్చుతోంది. ఆసుపత్రులపైనా బాంబుల వర్షం కురిపిస్తోంది. సొరంగాలు పేలుస్తోంది. ప్రాణం నిలుపుకోటానికి అవసరమైన ప్రతిదాన్నీ పనికి రాకుండా చేస్తోంది.
గాజా (గాజా స్ట్రిప్) అనేది 140 చదరపు మైళ్ల ప్రాంతం. దాని సృష్టే కృతకమైంది. 1948 నాటి యుద్ధ సమయాన అసంబద్ధ సరిహద్దులతో దాన్ని ఏర్పరచారు. ప్రాచీన నాగరికత చరిత్రలో ఘనమైన పాత్రను పోషించిన ఒక నగరాన్నీ దాని చుట్టుపక్కల ప్రాంతాన్నీ.. విశాల పూర్వ పాలస్థీనాతో సంబంధాలను తెంచి సామాజిక జీవనాడులను ఛిన్నాభిన్నం చేసిన దృశ్యమే 77 ఏళ్లుగా అక్కడ ఉంది. 28 మైళ్ల పొడవు, ఉత్తరాన 4.3 మైళ్ల వెడల్పు, దక్షిణాన 7.8 మైళ్ల వెడల్పు, మళ్లీ మధ్యలో 3.4 మైళ్లకు కుదింపు.. పశ్చిమాన మధ్యధరా సముద్రం.. ఇలా భౌగోళికంగా అసహజ సరిహద్దులను నిర్దేశించిన గాజాకు.. 1948 నుంచి విషాదాలు, వైపరీత్యాలు వెన్నాడుతూనే ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన పరిమితులను అతిక్రమించి పాలస్తీనాకు కేటాయించిన (44శాతం) భూభాగంలో అధికభాగాన్ని 1948లో బలవంతంగా స్వాధీనం చేసుకోవటంతోనే ఇజ్రాయెల్ ఆక్రమణల చరిత్ర మొదలైంది. మరోవైపు గాజా ప్రాంతాన్ని ఈజిప్టు, వెస్ట్‌బ్యాంకు ప్రాంతాన్ని జోర్డాన్ ఆక్రమించటంతో పాలస్థీనా ప్రజలకు తమదంటూ స్వేచ్ఛగా మసలే భూభాగమే లేకుండా పోయింది. ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో పాలస్తీనా ప్రజల్లో భయోత్పాతాన్ని కలిగించటానికి వందలాది గ్రామాలను నేలమట్టం చేశారు. ప్రజలను తరిమేసిన తర్వాత గ్రామాల అవశేషాలను లేకుండా చేశారు. చచ్చీచెడి ఎవరైనా పాలస్థీనా వ్యక్తి మమకారంతో స్వప్రాంతానికి వచ్చినా తన గ్రామం ఎక్కడుందో కనిపెట్టలేని దుస్థితికి తీసుకువచ్చారు.
ఇజ్రాయెల్ ఘాతుకాలకు భీతావహులై పారిపోయిన ప్రజలు గాజాకు చేరుకున్నారు. 1948కి ముందు గాజాలో 80 వేల మంది ప్రజలు మాత్రమే ఉండేవారు. ఇజ్రాయెల్ తరిమివేయటంతో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని 2,50,000 మంది గాజాకు తరలి వచ్చారు. అప్పటి నుంచీ గాజా శరణార్థుల మెజారిటీ ప్రాంతమైపోయింది. ప్రపంచంలోనే ఒక చిన్న ప్రదేశంలో అత్యధిక శరణార్థులున్న ప్రాంతంగా గాజా మారిపోయింది. అదొక సంక్షుభిత పరిస్థితి. ప్రస్తుతం 24 లక్షలు ఉన్న గాజా జనాభాలో 70 శాతం మంది శరణార్థుల కుటుంబాలకు చెందినవారే! జనాభాలో సగం మంది 18 ఏళ్లలోపు వాళ్లే. కిక్కిరిసిన జనసాంద్రతలో గాజాకు సాటివచ్చే ప్రాంతమే లేదు! 1948 నుంచి 1967 వరకూ గాజా ఈజిప్టు పాలన కింద ఉన్నా తన రాజ్యంలో విలీనం చేసుకోలేదు. గాజా వాసులకు పౌరసత్వాన్నీ ఇవ్వలేదు. స్వేచ్ఛగా ఈజిప్టుకు వచ్చిపోయే పరిస్థితినీ కల్పించలేదు. రహస్య సొరంగాలను తవ్వి ఆ మార్గాల ద్వారా ఈజిప్టులోకి ప్రవేశించి, మారుపేర్లతో కూలీలుగా వెళ్లటం, అక్రమంగా సరుకులు కొనుగోళ్లు, అమ్మకాలు చేయటం జీవన వ్యాపారమైంది. 1988లో హమాస్ ఏర్పడి, 2006లో గాజాలో అధికారాన్ని సొంతం చేసుకున్న తర్వాత సొరంగాల వ్యవస్థ (500 కిలోమీటర్లు) విస్తృతమైంది. సొరంగాలు ఆర్థిక జీవన కేంద్రాలుగా, సమరవ్యూహ–రక్షణ క్షేత్రాలుగా మారాయి.
1967 నాటి యుద్ధంలో గాజాను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. అంతకుముందు నుంచీ కూడా గాజాని ప్రమాదకరంగానే భావించింది. లక్షలాది శరణార్థులున్న చోటులో తీవ్ర ఇజ్రాయెల్ వ్యతిరేకతో పాటు పాలస్థీనా విమోచన ఉద్యమాలూ అక్కడే ఊపిరిపోసుకున్నాయి. అందుకే గాజాను అన్ని విధాలుగా తొక్కిపెట్టటమే ఇజ్రాయెల్ భద్రతా వ్యూహంలో కీలకంగా మారింది. పగటిపూట కూలీలుగా పనిచేసి రాత్రి వెనక్కి వచ్చేసేలా 1967 తర్వాత గాజా ప్రజలకు కొంత వెసులుబాటు కల్పించినా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచటానికి ఏ విధంగానూ ప్రయత్నించలేదు. పరిశ్రమలు అభివృద్ధి కాలేదు. వ్యవసాయం విస్తరించలేదు. రవాణా సౌకర్యాలను పొడిగించలేదు. విద్యావ్యాప్తికి దోహదం చేయలేదు. అంతర్జాతీయ సహాయంపై ఆధారపడటం గాజా వాసులకు తప్పలేదు. ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచి ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించటానికి గాజాలో ఏ ప్రయత్నం జరగలేదు. నిరసన ప్రదర్శనలకు దిగినప్పుడూ, సైనికులపై రాళ్లు రువ్వినప్పుడూ, రాకెట్లను ప్రయోగించినప్పుడూ అసాధారణరీతిలో విరుచుకుపడి కాల్పులు జరపటం.. సామూహికంగా శిక్షలు విధించటం.. తీవ్రవాదులకు ఆశ్రయాలుగా ఉన్నాయనే నెపంతో ఇళ్లపై బాంబులు కురిపించటం.. విచారణలు లేకుండా జైళ్లల్లో ఉంచటం.. జనసంచారాన్ని నియంత్రించటం గాజాలో నిత్యకృత్యమైంది. ఇలాంటి దుర్భర పరిస్థితులు నుంచి యువకులు ఫిదాయీలుగా మారటం గాజాలో మొదలైంది.
పాలస్థీనా కోసం పోరాడే సంస్థల్లో మొదట్లో లౌకిక, వామపక్ష దృక్పథంతో ఉండేవే ఎక్కువ. ఈ సంస్థలు అనుకున్న విధంగా ఫలితాలు సాధించలేకపోవటంతో హమాస్, ఇస్లామిక్ జిహాద్ లాంటి సంస్థలు గాజాలో బలాన్ని సంపాదించుకున్నాయి. ఏడు ప్రధాన సంస్థల్లో ఆ రెండు మాత్రమే మతదృక్పథంతో, జిహాద్ పేరుతో కార్యకలాపాలు నిర్వహించేవి. పాలస్థీనా ఏర్పాటు లక్ష్యానికి మతాన్ని జోడించి ప్రచార వ్యూహాన్ని రూపొందించటంలో హమాస్ ప్రజలను ఆకర్షించగలిగింది. గాజా, వెస్ట్‌బ్యాంక్ ప్రాంతాలకు పరిమిత పాలనాధికారాలు కల్పించటానికి ఉద్దేశించిన ఓస్లో ఒప్పందానికీ ఇజ్రాయెల్ తూట్లుపొడవటంతో గాజాలో అసంతృప్తి పెరిగిపోయింది. ఎంత అణచివేసినా ఆగని పోరాటాలతో సతమతమైన ఇజ్రాయెల్ గత్యంతరం లేని పరిస్థితుల్లో గాజా నుంచి వైదొలగింది. గాజాలో 2006 నాటి ఎన్నికల్లో హమాస్ విజయం సాధించింది. దీన్ని ఆమోదించని ఇజ్రాయెల్, అమెరికా, యూరోపియన్ యూనియను కూటమి గాజాపై ఆర్థిక దిగ్బంధాన్ని అమలుపరచాయి. 17 ఏళ్లుగా గాజా జీవితం మరింత తీవ్రంగా కుంగిపోయింది. గాజాలో తీవ్ర మానవ సంక్షోభం నెలకొందని వందలాది నివేదికలు వచ్చినా లక్ష్యపెట్టలేదు. మరోవైపు పాలస్థీనా సమస్య పరిష్కారం అంతర్జాతీయ రాజకీయ చిత్రపటం నుంచి చేజారిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అరబ్ దేశాలు కూడా పాలస్థీనా సమస్యపై శీతకన్ను వేయటంతో హమాస్ అక్టోబర్ 7న రాకెట్టు దాడులకు దిగటం ప్రపంచాన్ని కుదిపివేసింది.
ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా గుర్తించటానికీ, 1967 నాటికి ఉన్న సరిహద్దుల్లో స్వతంత్ర పాలస్థీనా ఏర్పాటుకూ హమాస్ సిద్ధపడి 2017లో విధానాన్ని మార్చుకున్నా ముందడుగులు పడకపోవటం ఈ శతాబ్దపు విషాదంగానూ, చరిత్రాత్మక తప్పిదంగానూ భావించక తప్పదు. 44శాతం భూభాగం దక్కాల్సిన పాలస్థీనాకు గాజా, వెస్ట్‌బ్యాంక్‌తో కూడిన 22 శాతం భూమి ఇవ్వటానికి నిరాకరించటమే పరమ రాజకీయ లక్ష్యమైనప్పుడు.. ఎంత ఆయుధశక్తి ఉన్నప్పటికీ హృదయాల్లో రగిలే పాలస్థీనా జాతీయ ఆకాంక్ష ఇజ్రాయెల్‌కు ఎప్పటికీ స్థిమితత్వాన్ని ఇవ్వదు. మధ్యప్రాచ్యంలో పాలస్థీనా సమస్య కేంద్రంగా మండుతోన్న అసంతృప్త జ్వాలా చల్లారదు. భయానక, అమానుష, జాతివిద్వేష రాజకీయాలు యూరపులో 60 లక్షల మంది యూదుల ప్రాణాలను బలితీసుకోవటం మానవ చరిత్రను ఇంకా వెన్నాడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆ బాధిత జాతి భద్రత పేరుతో గాజాను బలిపీఠం ఎక్కించటం ప్రపంచ మానవత్వాన్ని వెంటాడదా?
-రాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎడిటర్)