Share News

India Voter List Accuracy: ఓటర్‌ జాబితాల విశ్వసనీయత ఎంత

ABN , Publish Date - Aug 16 , 2025 | 05:26 AM

బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ సర్‌ ను సవాల్‌ చేసిన పిటిషన్లపై విచారణలో భాగంగా దేశ..

India Voter List Accuracy: ఓటర్‌ జాబితాల విశ్వసనీయత ఎంత

బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ –సర్‌)ను సవాల్‌ చేసిన పిటిషన్లపై విచారణలో భాగంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం గత వారాంతంలో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)కు రెండు ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది. అవి: ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్ల జాబితాను, తీసివేతకు కారణాలతో సహా ప్రచురించాలి; ఆధార్‌ కార్డును ఒక ధ్రువీకరణ పత్రంగా అంగీకరించాలి. ‘సర్‌’ను సవాల్‌ చేసిన పిటిషన్లపై విచారణ ఇంకా కొనసాగుతోంది. అయితే ‘సర్‌’కు సంబంధించి, న్యాయసమీక్ష పరిధిలోకి రాని, అంశాలు కొన్ని ఉన్నాయి. అవి అసాధారణమైనవే కాదు, చాలా కలవరం కలిగిస్తున్నవి కూడా. ముందుగా పేర్కొనవలసినది సవరణ ప్రక్రియ పేరు. గతంలో ఓటర్ల జాబితా సవరణను ప్రత్యేక లేదా సంగ్రహ సవరణగా పేర్కొనేవారు. రెండోది సవరణను చేపట్టిన నిర్దిష్ట సమయం: ప్రత్యేక సమగ్ర సవరణ లాంటి కార్యక్రమాన్ని గతంలో ఎన్నడూ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలల ముందుగా నిర్వహించలేదు. మూడోది టైమ్‌ షెడ్యూల్‌: ఈ ప్రత్యేక సమగ్ర సవరణ తొలిదశను కేవలం 30 రోజులలో పూర్తి చేశారు. అభ్యంతరాలు, వాదనలను మరో 30 రోజుల్లో పరిష్కరిస్తారు. నాల్గోది ‘సర్‌’ పరిధి: ఇంతకు ముందు ఓటర్ల జాబితా సవరణకు అప్పటికి చివరిసారిగా జరిగిన సవరణను ప్రాతిపదికగా తీసుకునేవారు. అయితే బిహార్‌ ‘సర్‌’కు 2024ఓటర్ల జాబితాలను ప్రాతిపదికగా తీసుకోలేదు. వాటిని పక్కన పెట్టేశారు. బిహార్‌కు పూర్తిగా సరికొత్త ఓటర్ల జాబితాను రూపొందించడమే ఈ ‘సర్‌’ లక్ష్యం, సందేహం లేదు. ఐదోది: ఓటర్ల జాబితా నుంచి పెద్ద ఎత్తున ఓటర్ల పేర్లను తొలగించేందుకు ఎనలేని ప్రాధాన్యమిస్తూ కొత్త ఓటర్ల పేర్లను చేర్చడంపై మౌనం వహించడం. ఎన్నికల సంఘం అనుసరిస్తున్న ఈ వైఖరి వింతగా ఉన్నది. ఈ ప్రత్యేక సవరణలో 64 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితాను తొలగించినట్టు ఈసీఐ వెల్లడించింది. వీరిలో 22 లక్షల మంది ‘మరణించినట్టు’, 7 లక్షల మంది పలు ప్రదేశాలలో ఓటర్లుగా నమోదు చేయించుకున్నారని, 36 లక్షల మంది బిహార్ నుంచి శాశ్వతంగా వలస పోయినవారు లేదా ఎటువంటి జాడ తెలియనివారు అని ఈసీఐ పేర్కొంది.


జనన మరణాలు సహజం. చనిపోయిన వ్యక్తుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం సరైన విషయమే. అయితే 18 సంవత్సరాల వయసు వచ్చిన యువతీ యువకుల పేర్లను ఓటర్ల జాబితాలో విధిగా చేర్చడం సముచితం కాదూ? ఇది ఎన్నికల సంఘం విధ్యుక్తధర్మం కాదూ? బిహార్‌ ముడి జనన రేటు (క్రూడ్‌ బర్త్‌ రేట్‌ – ఒక నిర్దిష్ట సంవత్సరంలో ప్రతి 1000 మంది జనాభాకు సంభవించే ప్రత్యేక జననాల సంఖ్యను సూచిస్తుంది. ఇది సంతానోత్పత్తి స్థాయి, జనాభా పెరుగుదలకు ప్రాథమిక సూచన) దృష్ట్యా 2024లో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి 18 సంవత్సరాల వయస్సు వచ్చిన యువతీ యువకులు లక్షల సంఖ్యలో ఉంటారు. ఇది సందేహాతీతమైన వాస్తవం. మరి ఈ కొత్త వయోజనుల పేర్లను కొత్త జాబితాలో చేర్చారా? ఈసీఐ ప్రతిస్పందించలేదు. కారణమేమిటి? ఎవరికీ తెలియదు.


36 లక్షల మంది బిహారీలు ‘శాశ్వతంగా వేరే ప్రదేశాలకు వెళ్లిపోయారని’ లేదా ‘జాడ తెలియనివారు’ అన్న నిర్ణయానికి ఈసీఐ ఎలా వచ్చింది? ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించారా? సంబంధిత వ్యక్తులు తాము శాశ్వతంగా బిహార్‌ నుంచి వెలుపలి ప్రదేశాలకు వలసపోయామని తమకు తామే అంగీకరించారా? సదరు 36 లక్షల మంది ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించిందా? ‘సాధారణంగా స్థానికుడు’ అన్న భావన ప్రామాణికతకు న్యాయపరమైన వ్యాఖ్యానాన్ని త్రోసిపుచ్చి దానికి ప్రత్యామ్నాయంగా ‘శాశ్వతంగా వలసపోయినవాడు’ అన్న భావనను ఈసీఐ ఎప్పుడు, ఎందుకు ప్రవేశపెట్టింది? ఏ ఒక్కరికీ తెలియదు. ‘సర్‌’ కార్యక్రమానికి విశ్వసనీయత లేదు, పారదర్శకత లోపించింది, సమర్థించే సాక్ష్యాధారాలు, సహేతుకమైన నిర్ణయాలు కొరవడ్డాయి. అసలు ఈ ప్రత్యేక సమగ్ర సవరణను ముందస్తు భావనలతో చేపట్టినట్టు కనిపిస్తోంది. వాటిని నిరూపించేందుకే ఆ కార్యక్రమాన్ని అమలుపరుస్తున్నట్టుగా ఉన్నది. జాతి జనాభా ఏటా 0.89 శాతం చొప్పున పెరుగుతున్న దేశంలో ఓటర్ల జాబితా సవరణ ఏ విధంగా చేసినా ఓటర్ల సంఖ్య విధిగా పెరుగుతుంది. అయితే భారత ఎన్నికల సంఘం బిహార్‌లో చేపట్టిన ‘సర్‌’ కార్యక్రమం అందుకు పూర్తి విరుద్ధమైన ఫలితాలనే చూపిస్తోంది! ‘సర్‌’ అసలు ఉద్దేశం సంఖ్యానేక ప్రజల ఓటు హక్కును రద్దు చేయడమే. ఈ కారణంగానే తాము ఓటు హక్కు కోల్పోతామేమోనని బిహార్‌లో లక్షలాది ఓటర్లు భయపడుతున్నారు. ఈ ఏడాది చివరలో జరగనున్న శాసనసభ ఎన్నికలలో తాము ఓటు వేసేందుకు అనుమతి ఉండదేమోనని ఎంతో మంది బిహారీలు సహేతుకంగానే శంకిస్తున్నారు. ‘సర్‌’ను ఇతర రాష్ట్రాలలో కూడా చేపడతారని తెలుస్తోంది. బిహార్‌లో ఆ ప్రక్రియ ఫలితాల ఆధారంగా చూస్తే కోట్లాది ప్రజల ఓటుహక్కు రద్దయ్యే అవకాశమున్నది.


కర్ణాటకలో ఓటర్ల జాబితాకు సంబంధించి బహిర్గతమైన మరొక వాస్తవం ప్రజాస్వామ్యవాదులను అమితంగా జడిపిస్తోంది. ఆ రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో బెంగళూరు సెంట్రల్‌ ఒకటి. ఆ లోక్‌సభా నియోజకవర్గంలో ఎనిమిది శాసనసభా నియోజకవర్గాలు ఉన్నాయి. 2024 సార్వత్రక ఎన్నికలలో బెంగళూరు సెంట్రల్‌ ఫలితాలు చూద్దాం. అందులోని ఎనిమిది శాసనసభా నియోజకవర్గాలలో ఒకటైన మహదేవపుర విషయాన్ని కాసేపు పక్కన పెడదాం. కాంగ్రెస్‌ అభ్యర్థి నాలుగు అసెంబ్లీ, బీజేపీ అభ్యర్థి మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలోను ఆధిక్యతలో ఉన్నారు. ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో నికర ఆధిక్యత 82,178 ఓట్లతో కాంగ్రెస్‌ అభ్యర్థికి అనుకూలంగా ఉన్నది. ఇప్పుడు మహదేవపుర నియోజకవర్గ ఫలితాన్ని చూద్దాం. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థికి 1,14,046 ఓట్ల ఆధిక్యత ఉన్నది. ఇది, కాంగ్రెస్‌ అభ్యర్థికి ఉన్న 82,178 నికర ఓట్ల ఆధిక్యతను రద్దు చేసి బీజేపీ అభ్యర్థికి 31,868 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సమకూర్చింది. వీటికి తోడు పోస్టల్‌ బ్యాలెట్లను కలుపుకుని బీజేపీ అభ్యర్థి మొత్తం 32,707 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. స్పష్టంగా ఉన్న ఈ వివరాలు తుది ఫలితాన్ని అనుమానాస్పదం చేయలేదు. అయితే ఈ 32,707 ఓట్ల ఆధిక్యత ఎలా సాధ్యమయింది? ఈ విషయాన్ని నిశితంగా పరిశీలించాలి. కాంగ్రెస్‌ అభ్యర్థి, ఆయన బృందం ఓటర్ల జాబితాలు, ఇతర డాక్యుమెంట్లను అత్యంత జాగ్రత్తగా పరిశీలించి కొన్ని అసాధారణ తప్పులను కనుగొన్నారు. బలవత్తరమైన ఈ ప్రాథమిక సమాచారం ఆధారంగా బీజేపీ అభ్యర్థికి లభించిన ఆధిక్యతలోని గుట్లు తెలుసుకున్నారు. మితిమీరిన సంఖ్యలో విభిన్న ఓటర్లు ఒకే నివాసంలో ఉన్నట్టుగా నమోదయ్యారు; సదరు ఓటర్ల ఓటర్‌ కార్డుపై వారి తండ్రి పేరు ‘Xtkaprbsu’ అని అర్థంకాని విధంగా ఉన్నది. ఓటరు కార్డుపై ఓటర్ల వయసు ‘0’ లేదా ‘124’ అని ఉన్నది. ఇటువంటి ప్రాథమిక తప్పులు వేల సంఖ్యలో ఉన్నాయి.


ఓటర్ల జాబితాలో ఇటువంటి తప్పులు ఉన్నట్టు స్పష్టంగా వెల్లడయినప్పుడు వాటిపై విచారణ జరిపించవలసిన అవసరం లేదా? సామాన్య వ్యక్తి ఎవరైనా ‘అవును, జరిపించాల్సిందే’ అని వెన్వెంటనే ప్రతిస్పందిస్తాడు. అయితే మన ఎన్నికల సంఘం ఇంకెంత మాత్రం నియమబద్ధమైన ఒక మామూలు వ్యక్తిగా లేదా సంస్థగా వ్యవహరించడం లేదు! తాను రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థనని, ఎన్నికలతో ప్రమేయమున్న ఓటర్లు, అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు జవాబుదారీనికానని ఈసీఐ గర్విస్తోంది. బిహార్‌ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై పౌర సమాజ ఆక్షేపణలు, రాజకీయ పార్టీల ఆరోపణల విషయమై పార్లమెంటు ఉభయ సభలలో చర్చించేందుకు గౌరవనీయ సభాపతులు ఇరువురూ విముఖత చూపుతున్నారు. దీనితో ఈసీఐ తనను తాను ఒక ‘న్యాయస్థానం’గా భావించుకుంటూ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు అఫిడవిట్లు దాఖలు చేయాలని డిమాండ్‌ చేస్తోంది! ఈ వ్యవహారంలో మహదేవపుర శాసనసభా నియోజకవర్గ ఓటర్ల జాబితా విశ్వసనీయత ఒక ప్రధాన వాదాంశం అన్న వాస్తవాన్ని ఎట్టి పరిస్థితులలోను విస్మరించకూడదు. పార్లమెంటులో దానిపై చర్చ జరగాలి. ఆ అంశం పైన కాకుండా అన్య అంశాలపై పార్లమెంటు దృష్టి పెట్టేందుకు అనుమతించకూడదు. ఈ విషయాన్ని మళ్లీ నొక్కి చెప్పుతున్నాను: ప్రధాన వాదాంశం ఓటర్ల జాబితాల విశ్వసనీయతే. మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినవైనా లేదా బిహార్‌కు చెందినవైనా ఓటర్ల జాబితాల విశ్వసనీయతే ప్రధాన వాదాంశం. ఈ రోజు కాకపోయినా భవిష్యత్తులో ఈ మహోన్నత ప్రజాస్వామ్య దేశ ఓటర్లు తమ తీర్పు చెప్పే రోజునైనా భారత ఎన్నికల సంఘం కచ్చితంగా సమాధానమివ్వవలసి ఉంది.

-పి. చిదంబరం (వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - Aug 16 , 2025 | 05:26 AM