Potti Sriramulu: పొట్టిశ్రీరాములు త్యాగానికి తగిన గుర్తింపునివ్వాలి!
ABN , Publish Date - Dec 13 , 2025 | 04:17 AM
పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికనీ!’ అన్న కవి వాక్కుకు అనుగుణంగా జీవించారు పొట్టిశ్రీరాములు. ‘కష్టాలలో వున్న వారి కన్నీరు తుడిచే శక్తి...
‘పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికనీ!’ అన్న కవి వాక్కుకు అనుగుణంగా జీవించారు పొట్టిశ్రీరాములు. ‘కష్టాలలో వున్న వారి కన్నీరు తుడిచే శక్తి ప్రసాదించు ప్రభూ!’ అని పరమాత్మను వేడుకున్న రంతిదేవుని ప్రార్థనలకు ఆకృతినిచ్చినవాడు ఆయన. అమరజీవి మరణం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకే కాకుండా, భాషా ప్రయుక్త రాష్ట్రాల నిర్మాణానికీ దోహదం చేసింది. అంతేకాదు, ఆమరణ నిరాహారదీక్షకు పూర్వం కూడా ఆయన ఖాళీగా కూర్చున్నదే లేదు. నిత్యం ఏదో ఒక ప్రజాసమస్యపై పోరుతో తలపడుతూనే వెళ్ళేవారు. ఆయన ఒక్కడే ఓ పెద్ద సైనిక పటాలంతో సమానం. పొట్టి శ్రీరాములు వంటి యోధులు 20మంది ఉంటే ఒక్క ఏడాదిలో దేశానికి స్వాతంత్య్రాన్ని సాధిస్తానని ఒకనొక సందర్భంలో శ్రీరాములు కార్యదక్షతపై గాంధీజీ వ్యాఖ్యానించారు. దళితుల ప్రయోజనాల నిమిత్తం, అస్పృశ్యతా నిర్మూలన కోసం అహోరాత్రులు యుద్ధమే చేశారు. అంటరానితనం నివారణకై శాసనాలు చేయించేందుకై దీక్షలు చేశారు. సహపంక్తి భోజనాల కోసం కాలాన్నెంతో వెచ్చించారు. స్వాతంత్య్ర పోరాటయోధునిగా దండియాత్ర నుంచి మూడు పర్యాయాలు కారాగార వాసం చేశారు. దళితులు దేవాలయ ప్రవేశం కోసం యెడతెగని సమరం చేసి ఫలితం సాధించారు.
మితిమీరిన మదరాసీల ఆగడాలతో అవమానాలపాలవుతూ, అణచివేతకు గురవుతున్న తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆశించి 1952 డిసెంబర్ 15న పొట్టిశ్రీరాములు ప్రాణాన్ని బలిదానమిచ్చారు. శ్రీరాములు ఆత్మత్యాగంతో మందకొడిగా మొదలైన ప్రజాగ్రహం దావానలంలా మారి అప్పటి తెలుగు ప్రాంతాలన్నీ అగ్నిగుండంలా ఎగసిన తరువాతే నాటి ప్రధాని నెహ్రూ కళ్ళు తెరిపిళ్ళు పడ్డాయి. డిసెంబర్ 19న రాష్ట్ర ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసిన ప్రధాని నెహ్రూ 1953 మార్చి 25న పార్లమెంట్‌లో రాష్ట్ర ఏర్పాటుకు విధివిధానాలపై ‘వాంఛూ’ కమిషన్ ఇచ్చిన నివేదికను ఆమోదిస్తూ అధికారికంగా నూతన రాష్ట్ర నిర్మాణాన్ని ధృవపరిచారు. ఈ మేరకు 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. విస్తృత ప్రయోజనాల రీత్యా 1956 నవంబర్ 1న ఆంధ్ర, హైదరాబాద్ (తెలంగాణ) రాష్ట్రాలు విలీనమై ‘ఆంధ్రప్రదేశ్’గా అవతరించింది. రెండు ప్రాంతాలకు పొసగని నేపథ్యంలో 2014 జూన్ 2న తిరిగి ‘ఆంధ్రా’, ‘తెలంగాణ’ రాష్ట్రాలుగా ‘ఆంధ్రప్రదేశ్’ విడిపోయింది. విడిపోయిన ఆంధ్రరాష్ట్రానికి సమైక్య రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1వ తేదీ ఎట్లా నప్పుతుంది?
ప్రాణం అమూల్యమైనది. ప్రాణత్యాగం మహోన్నతమైనది. ఒక మనిషి ఇంతకు మించి చేయదగిన అర్పణ మరొకటేముంటుంది! తన అవసరాలకు కాకుండా, ప్రజల సౌభాగ్యం కోరి తనను తాను బలిపెట్టుకున్న అమరజీవి పట్ల హృదయం పట్టనంత కృతజ్ఞత చూపడం ఆంధ్ర రాష్ట్ర వాసులుగా మనందరి విధి. ఆయన విగ్రహానికి పూలదండలు వేసి సరిపుచ్చే మొక్కుబడి కార్యక్రమాల నుంచి వెలుపలికి రావాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో ‘అమరజీవి స్మృతివనం’ ఏర్పాటుకు ప్రతిపాదన సిద్ధం చేశారు. ఇదో హర్షణీయమైన అడుగు. ఇందుకు చంద్రబాబు అభినందనీయుడు. ఐతే స్మృతివనం మాత్రమే ఆ మహానుభావుని అనితర సాధ్యమైన త్యాగంతో సరితూగదు. పొట్టిశ్రీరాములు ఆత్మత్యాగంతో సాధించిన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని, ఆయన వర్ధంతి రోజైన డిసెంబర్ 15న గానీ, జయంతినాడైన మార్చి 16న గానీ... ఏదో ఒక తేదీని ఎంచుకొని జరపడం ఉత్తమంగా ఉంటుంది. ఆయన జయంతినాడు అన్ని ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించడం ద్వారా, సెలవు ప్రాధాన్యతనీ, శ్రీరాములు బలిదానాన్ని నెమరుకు తేవాలి. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, కళాశాల విద్యలో ప్రతి తరగతిలోనూ పొట్టి శ్రీరాములు జీవితం, పోరాటాలు, ప్రాణదానంపై ఒక పాఠ్యాంశాన్ని విధిగా ఉంచాలి. వర్ధంతి రోజున అన్ని రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లోనూ, విద్యాసంస్థల్లోనూ అధికారికంగా నివాళులు అర్పించి, అంజలి ఘటించే కార్యక్రమాలను చట్టబద్ధం చేయాలి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నామం నుంచి నెల్లూరును తొలగించి పొట్టిశ్రీరాములు జిల్లాగానే నమోదు చేస్తూ జీవో తేవాలి. ఆయన ముఖ చిత్రంతో ఒక నాణాన్ని విడుదల చేసే విధంగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనను పంపాలి.
వై.హెచ్.కె.మోహన్‌రావు
కవి, రచయిత