Hindu Rashtra Debate: భావజాల మార్పుతోనే హిందూరాజ్య స్థాపన
ABN , Publish Date - Jul 11 , 2025 | 01:52 AM
సుమారు ఆరున్నర దశాబ్దాల హిందూ వ్యతిరేక పాలన తర్వాత అనూహ్యంగా ఆవిర్భవించిన ప్రస్తుత బీజేపీ నాయకత్వంలోని ప్రధాని మోదీ పాలన దేశాన్ని హిందూ రాజ్యం వైపుగా నడిపిస్తున్నదనడంలో ఎవరికీ సందేహం లేదు.
సుమారు ఆరున్నర దశాబ్దాల హిందూ వ్యతిరేక పాలన తర్వాత అనూహ్యంగా ఆవిర్భవించిన ప్రస్తుత బీజేపీ నాయకత్వంలోని ప్రధాని మోదీ పాలన దేశాన్ని హిందూ రాజ్యం వైపుగా నడిపిస్తున్నదనడంలో ఎవరికీ సందేహం లేదు. ఈ తరుణంలోనే రాజ్యాంగ ప్రవేశిక నుంచి ‘సెక్యులర్’, ‘సోషలిస్ట్’ అనే పదాలను తొలగించాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కోరడం కూడా గమనార్హం. దేశం యాభై ఏళ్ల ఎమర్జెన్సీని గుర్తు చేసుకుంటున్న సందర్భంలో, హిమంత బిశ్వశర్మ భారతీయ రాజ్యాంగ ప్రవేశిక నుంచి ‘లౌకిక’ (సెక్యులర్), ‘సామ్యవాద’ (సోషలిస్ట్) పదాలను రద్దు చేయాలని పిలుపునిచ్చారు. ఈ పదాలను మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాలనలో రాజ్యాంగంలో చేర్చారని, తొలినాటి రాజ్యాంగంలో ఇవి లేవని ఆయన అన్నారు. ‘లౌకికవాదం’ అనేది భారతదేశం ప్రాథమిక నమ్మకమైన సర్వధర్మ సమభావన (అన్ని మతాలను సమానంగా గౌరవించడం) అనే దానికి విరుద్ధమని, ‘సోషలిజం’ ఎప్పుడూ అసలు భారతీయ ఆర్థిక ఆలోచన కాదని కూడా ఆయన వాదించారు. బదులుగా, భారతదేశం ఎల్లప్పుడూ సర్వోదయ (అందరికీ మంచి), అంత్యోదయ (అత్యల్ప వర్గాలకు ప్రయోజనం) సూత్రాలను అవలంబించిందని ఆయన పేర్కొన్నారు.
ఈ తరుణంలో భారత్ ‘లౌకిక’ దేశంగా ఉండటంలో తప్పేముంది అన్న ప్రశ్న ప్రజల మనసుల్లో తలెత్తడం సహజం. దారితప్పిన లౌకికవాదం వల్ల హిందూ ధర్మానికి, సమాజానికి కలిగే హానితోపాటు ఈ దేశాన్ని పూర్తి స్థాయి హైందవ దేశంగా పునరుద్ధరించడం ఎందుకు ముఖ్యమో ప్రజలందరూ తెలుసుకోవాలి. 1947లో జరిగిన భారత్ విభజనతో ఈ కథ ప్రారంభమైంది. ఇది అసంపూర్ణంగానే కాకుండా ఏకపక్షంగా, పూర్తి అహేతుకంగా జరిగిందన్న అభిప్రాయం అనేకులలో ఉంది. 1947 విభజన సమయంలో హిందువులు ఎక్కువగా నష్టపోయారన్నది వాస్తవం. బ్రిటిష్ వారు భారత్‌ను దోచుకున్న తర్వాత, ఇస్లామిక్ పాకిస్థాన్ రూపంలో మన దేశానికి శాశ్వత తలనొప్పిని మిగల్చాలని నిర్ణయించుకున్నారు. కొత్తగా ఏర్పాటైన రెండు దేశాల మధ్య పూర్తి జనాభా మార్పిడి గురించి వీర సావర్కర్, డాక్టర్ అంబేడ్కర్ ఇచ్చిన వివేకవంతమైన సలహాను ఆనాడు గాంధీ, నెహ్రూ ప్రభృతులు ఎవరూ పట్టించుకోలేదు. భారతదేశంలోకి స్థానభ్రంశం చెందిన ముస్లిం జనాభాకు వక్ఫ్ బోర్డును ప్రసాదించారు. ప్రతిగా స్థానభ్రంశం చెందిన హిందువులకు మాత్రం రిక్తహస్తం చూపించారు. పాకిస్థాన్‌లో ప్రతిదీ వదులుకున్న హిందువులకు శూన్యమే మిగిలింది. ఇన్ని దశాబ్దాల అనంతరం కూడా భారతదేశంలో హిందువుల పరిస్థితి మెరుగుపడలేదు. ఈ అసమానత్వం 1940ల్లోనే ప్రామాణికంగా నమోదైంది. అయినా, రాజకీయంగా సరిదిద్దే యత్నం జరగలేదు.
ఈ పరిస్థితికి ప్రధాన కారణమైన రాజకీయ వర్గం ఉదాసీనత ఏమేరకు వ్యాపించిందో చరిత్రకు బాగా తెలుసు. వారి ముస్లిం సంతృప్తీకరణ భావజాలం పతాక స్థాయికి చేరింది. నాటి నుంచి నేటి వరకూ రాజకీయ నాయకులు ముస్లింలను సంతృప్తిపరుస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో హిందూ ప్రయోజనాలను తుంగలో తొక్కుతూనే ఉన్నారు. 2014 నుంచి ఈ దృశ్యం బాగా మారిపోయింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్, ఇతర ప్రభుత్వాలు ముస్లింలను సంతృప్తిపరచడానికి చాలా వేగంగా పోటీ పడుతూ ముందుకు సాగాయి. ఓట్ల కోసం చివరకు భారతీయ నగరాల మురికివాడల్లో బంగ్లాదేశీయులను అక్రమంగా స్థిరపరిచినట్లు కూడా కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు ఉన్నాయి. ప్రధాని మోదీకి ముందున్న బీజేపీ ప్రభుత్వం (వాజ్‌పేయి హయాంలో) కూడా ఎక్కువగా లౌకికవాదంగానే ఉండేది. అయితే, నాటి బీజేపీ పాలకులు హిందువుల పట్ల ఎప్పుడూ వివక్ష చూపకపోవడమే రక్షణాత్మక దయగా భావించాలి. భారత్‌లో మెజారిటీ హిందువులు. అయినా, దురవస్థ తప్పడం లేదంటే దాని కారణాలు విశ్లేషించుకొని ఆ మేరకు రాజకీయ నిర్ణయాలు తీసుకోవలసి ఉంది. హిందూ ద్వేష భావజాలాన్ని నిర్మూలించకుండా, బలవంతంగా హిందుస్థాన్‌ను ఏర్పరచడం వల్ల దేశ మనుగడ మళ్లీ ప్రశ్నార్థకం అవుతుంది. మానవీయ కోణంలో ఈ దిశగా అందరూ ఆలోచించాలి.
– దోర్బల బాలశేఖరశర్మ