Share News

Hidma Death: హిడ్మా.. ఇంత స్పందనా?

ABN , Publish Date - Nov 22 , 2025 | 04:11 AM

హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత సోషల్ మీడియాలో ఆయనకు మద్దతుగా వస్తున్న కథనాలు, పోస్టులను చూస్తే ఒక అజ్ఞాత నక్సలైట్ నాయకుడు మరణిస్తే ఇంత స్పందనా అని ఆశ్చర్యం కలుగుతుంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ మరణించినప్పుడు కూడా ఇంత స్పందన లేదేమో....

Hidma Death: హిడ్మా.. ఇంత స్పందనా?

హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత సోషల్ మీడియాలో ఆయనకు మద్దతుగా వస్తున్న కథనాలు, పోస్టులను చూస్తే ‘ఒక అజ్ఞాత నక్సలైట్ నాయకుడు మరణిస్తే ఇంత స్పందనా?’ అని ఆశ్చర్యం కలుగుతుంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ మరణించినప్పుడు కూడా ఇంత స్పందన లేదేమో.

హిడ్మా బయటి ప్రపంచానికి తెలిసిన వ్యక్తి కాదు. పుట్టింది ఒక గోండు గూడెంలో. 25 ఏళ్లుగా ఆయుధంతో పోరాడుతున్నాడు. ఆదివాసీల గుండెల్లో హిడ్మాకు వెలకట్టలేని స్థానం ఉంది కాబట్టే ఇంతకాలం రకరకాల పోలీసు బలగాలు గాలించినా, దాడి చేసినా దొరకలేదు. ఒక విప్లవోద్యమ నాయకుడిగా ఈ ప్రపంచానికి సుపరిచితుడైన హిడ్మా మరణం తర్వాత ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి మాధ్యమాల్లో ఆయనకు జేజేలు పలుకుతూ పోస్టులు మారుమోగిపోతున్నాయి. హిడ్మా బతికుంటే బాగుండునని వేల గొంతులు నినదిస్తున్నాయి. ఆయనను గుండెల్లో దాచుకున్న ఆదివాసీలకు అక్షరజ్ఞానం ఉంటే, ఈ సోషల్ మీడియాను వాడుకోవడం తెలిస్తే, ఈ ప్లాట్‌ఫాంలు ఇంకెంతగా మారుమోగిపోయోవో! తాము చేయలేని పనిని తమ నాయకుడు, చేయాలని ప్రజలు కోరుకుంటారు. అందుకే వీళ్లు అభిమానులు మాత్రమే అవుతారు, వాళ్లు చరిత్రలో హీరోలు అవుతారు.

ఆదివాసీల్లో హిడ్మాకు ఏ స్థాయిలో ఆదరణ ఉందో ఆయన అంత్యక్రియల దృశ్యాలు తెలియచెబుతాయి. జాతీయ, అంతర్జాతీయ, స్థానిక మీడియా సంస్థల ప్రతినిధులతో పూవర్తి కిక్కిరిసిపోయింది. తమ నేతను విగతజీవిగా చూసి ఆదివాసీలు భోరున విలపిస్తూ, శవాన్ని గుండెలకు హత్తుకుని ముద్దాడిన దృశ్యాలు ఆదివాసీల గుండెల్లో ఎన్నటికీ చెరగని హిడ్మా స్థానానికి నిదర్శనం. కొమురం భీం, రాంజీ గోండు, అల్లూరి సీతారామరాజుల వారసుడిగా హిడ్మాకు ఆదివాసీల్లో స్థానం దక్కుతుంది.

అర్జెంటీనాలో పుట్టి, క్యూబా విప్లవం తర్వాత, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో కూడా విప్లవ బీజాలు నాటిన చెగువేరా ప్రపంచ విప్లవోద్యమ చరిత్రలో ఐకాన్‌గా నిలిచిపోయాడు. అదే తరహాలో, పూవర్తిలో పుట్టి, దండకారణ్యం, గడ్చిరోలి, ఏఓబీలో విప్లవజ్వాలను రగిలించిన నేతగా, కొందరి గుండెల్లో నిద్రించిన యోధుడిగా మడావి హిడ్మా భారత విప్లవోద్యమ చరిత్రలో నిలిచిపోతాడు. చెగువేరా ఎంతటి ప్రజాదరణ పొందాడంటే, ఆయన ఫొటో ఉన్న టీ–షర్ట్‌లను నేటితరం కాలేజీ కుర్రాళ్లు వేసుకుంటున్నారు. అలాగే రాబోయే రోజుల్లో హిడ్మా ఫొటోతో ఉన్న టీ–షర్ట్‌ను కూడా కుర్రాళ్లు వేసుకుని తిరిగే రోజులు వస్తాయి. హిడ్మా మరణం తర్వాత సోషల్ మీడియాలో ఆయనకు మద్దతుగా వెలుస్తున్న పోస్టులే అందుకు నిదర్శనం.

– ఎ.రమణ కుమార్, జర్నలిస్టు

Updated Date - Nov 22 , 2025 | 04:11 AM