Share News

Oil Resources: ఇరాన్‌లో మనకు కనిపించని ఇంధనమూ ఉంది!

ABN , Publish Date - Jul 01 , 2025 | 12:47 AM

మానవ చరిత్రలో రాజ్యాలు మొదలైన దగ్గర నుంచి రెండు విషయాలు క్రమం తప్పకుండా కనపడతాయి. రాజ్యరక్షణ.. రాజ్యభక్షణలుగా వాటి గురించి చెప్పుకోవచ్చు. సందర్భానుసారం వీటిల్లో ఏదో ఒకదాంట్లో మునిగిపోయి, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేయటం పాలకవర్గాలకు పరిపాటి.

Oil Resources: ఇరాన్‌లో మనకు కనిపించని ఇంధనమూ ఉంది!

మానవ చరిత్రలో రాజ్యాలు మొదలైన దగ్గర నుంచి రెండు విషయాలు క్రమం తప్పకుండా కనపడతాయి. రాజ్యరక్షణ.. రాజ్యభక్షణలుగా వాటి గురించి చెప్పుకోవచ్చు. సందర్భానుసారం వీటిల్లో ఏదో ఒకదాంట్లో మునిగిపోయి, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేయటం పాలకవర్గాలకు పరిపాటి. ప్రజాస్వామ్యాలు, అంతర్జాతీయ చట్టాలు వచ్చిన తర్వాత కూడా ప్రజలకు ఇవి తప్పటంలేదు. రాజ్యరక్షణకు పొరుగు దేశాలను భక్షించక తప్పదనే చాణక్యనీతితో జరిగిన యుద్ధాలను తెలుసుకోటానికి గడిచిపోయిన చరిత్రల్లోకి వెళ్లాల్సిన పనిలేదు. ఇప్పటికీ అవి ప్రబలంగానే ఉన్నాయి. యుద్ధాలకు సమర్థనలు మాత్రమే మారుతున్నాయి. రాజ్యం వీరభోజ్యం లాంటి ముతక సమర్థనలు పోయి జాతీయ ప్రయోజనాలు, స్వీయరక్షణ పేరుతో యుద్ధాలు పేట్రేగుతున్నాయి. ఇజ్రాయెల్‌, అమెరికాలు కలిసికట్టుగా ఇరాన్‌పై 12 రోజుల పాటు చేసిన యుద్ధమే ఇందుకు నిదర్శనం. ఇజ్రాయెల్‌కూ ఇరాన్‌కూ సరిహద్దు తగాదాలు లేవు. రెండిటికీ మధ్య వందల కిలోమీటర్ల దూరం ఉంది. ఇరు దేశాల రాజధానుల మధ్య దూరమే 1770 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అరబ్‌ దేశాలతో ఇజ్రాయెల్‌కు యుద్ధాల చరిత్ర ఉంది. 1948 నుంచి ఏదో ఒక కారణంతో ఆ దేశాలతో తలపడి వాటి భూభాగాలను ఆక్రమించటం, వైదొలగటం ఇజ్రాయెల్‌కు మామూలే. అరబ్‌–ఇజ్రాయెల్‌ యుద్ధాల్లో ఇరాన్‌ ప్రత్యక్ష భాగస్వామి కాదు. మరి ఇరాన్‌తో ఇజ్రాయెల్‌కు ఎందుకు ఇంత శత్రుత్వం? వందలాది యుద్ధ విమానాలతో దాడిచేయటమే కాకుండా, అమెరికాను కూడా రంగంలోకి దించి అణుశుద్ధి కేంద్రాలపై భీకరమైన బంకర్ల విధ్వంసక బాంబులతో విరుచుకుపడటానికి వినిపిస్తున్న సమర్థనల వెనుక అసలు నిజాలు ఏమిటి? ఇరాన్‌ అణుకార్యక్రమానికి ఒకనాడు పాశ్చాత్యదేశాల ప్రాపకం లేదా? అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్‌ ఎందుకు తీవ్రశత్రువుగా మారిపోయింది? ముస్లిందేశాల నడిబొడ్డున తిష్టవేసుకుని తన ఆధిపత్యాన్నీ ఆక్రమణలనూ ఆ దేశాలు కిక్కురుమనకుండా ఆమోదించటానికి ఇజ్రాయెల్‌ సాగిస్తున్న రణతంత్రం ఎటు దారితీస్తుంది? ఈ ప్రశ్నలకు జవాబుల కోసం చరిత్రను వెతికితే అమెరికానే బోనులో నిలబడుతుంది.


పాశ్చాత్యదేశాలు చేసిన పాపపు చరిత్రే కనపడుతుంది. ఐక్యరాజ్యసమితి (ఐరాస) తీర్మానం ప్రకారం ఇజ్రాయెల్‌తో పాటు పాలస్తీనా స్వతంత్ర దేశంగా ఏర్పడాలి. రెండిటికీ సరిహద్దులూ అప్పట్లో స్పష్టంగానే నిర్దేశితమయ్యాయి. ఆ తీర్మానం అమలయ్యేలోపలే బలప్రయోగంతో పాలస్తీనాకు కేటాయించిన భూభాగాలను సైతం ఆక్రమించుకోవటంతోనే అసలు సమస్య మొదలైంది. అరబ్‌ దేశాలు ఆనాడు ఇజ్రాయెల్‌ ఏర్పాటును మొండిగా వ్యతిరేకించటం ఇప్పటి దృష్టితో చూస్తే వ్యూహాత్మక తప్పిదంగా అనిపిస్తుంది. దానికి మూల్యం మాత్రం పాలస్తీనా ప్రజలు చెల్లించాల్సి వచ్చింది. ఒకటి మాత్రం నిజం. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా ఏర్పాటు కాకుండా చూడాలనే వ్యూహంతోనే యూదు ఆధిపత్యవాదులు మొదటి నుంచి పావులు కదిపారు. చివరికి గాజా, వెస్ట్‌బ్యాంక్‌ భూభాగాలతో పరిమిత పాలస్తీనాను ఏర్పాటు చేయటానికి కూడా ఇజ్రాయెల్‌ అంగీకరించటం లేదు. గతంలో పాలస్తీనాగా గుర్తించిన భూభాగంలో ఏ ముక్కనూ ఒదులుకోటానికి ఇజ్రాయెల్‌ సిద్ధంగా లేదు. నెతన్యాహు సారథ్యంలోని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం.. స్వతంత్ర పాలస్తీనా అన్న భావననే లేకుండా చేయటానికి ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకుంటోంది. గాజాలో నరమేధమూ అందుకే సాగుతోంది. మధ్య ప్రాచ్యంలో తిరుగులేని ఆధిపత్యం ఇజ్రాయెల్‌కు ఏర్పడేలా నెతన్యాహు చేస్తున్న ప్రయత్నాలకు ఇరాన్‌ శక్తి అడ్డంకిగా కనపడుతోంది. 12 రోజుల యుద్ధమూ అందులో భాగమే. మతపరంగానో, ఇతర భావజాలంపరంగానో అమెరికా, ఇజ్రాయెల్‌ ఆధిపత్యాన్ని అంగీకరించని ఏ దేశాన్నైనా అస్థిరం చేయటం దశాబ్దాలుగా అమలవుతోంది. చమురు, సహజవాయువులు సమృద్ధిగా ఉన్న దేశాలను నయానభయాన గుప్పిట్లో పెట్టుకోవటం ఒకప్పుడు బ్రిటన్‌ చేస్తే రెండో ప్రపంచయుద్ధం తర్వాత అమెరికా ఆ పనిని మొదలుపెట్టింది.


మధ్యప్రాచ్య దేశాల మధ్య విభేదాలను ఎగదోయటం, సందర్భానుసారం కొన్నిటిని మిత్రపక్షాలుగా, మరికొన్నిటిని వైరిపక్షాలుగా భావించటం, వాటి రక్షణ పేరుతో యుద్ధాలు చేయటం, తిరుగుబాట్లను ప్రోత్సహించటం అమెరికా విదేశాంగ విధానంలో కీలక వ్యూహంగా మారింది. అణువిద్యుత్తు పేరుతో అణ్వస్త్రాలు తయారుచేయగలిగే స్థాయికి యురేనియాన్ని ఇరాన్‌ శుద్ధిచేస్తోందని అమెరికా, ఇజ్రాయెల్‌లు ఆరోపిస్తున్నాయి. నిజానికి ఇరాన్‌ అణుకార్యక్రమం ఈనాటిది కాదు. అమెరికాకు, పాశ్చాత్య దేశాలకు అన్నివిధాలుగా అనుకూలంగా వ్యవహరించిన ఒకనాటి ఇరాన్‌ పాలకుడు ముహమ్మద్‌ రెజాషా పహ్లవి (1941–1979) కాలంలోనే అది పెద్దఎత్తున మొదలైంది. అమెరికా ఆశీస్సులతో రెజాషా 23 పౌర అణువిద్యుత్తు కేంద్రాలను ఏర్పాటు చేయటానికి ప్రణాళిక రూపొందించారు. సొంత అవసరాలకే కాకుండా చుట్టుపక్కల దేశాలకు కూడా విద్యుత్తు సరఫరా చేయాలనే ఉద్దేశంతో వాటిని ఏర్పాటు చేయబోతున్నట్లు రెజాషా ప్రకటించారు. రెండు కేంద్రాలకు సంబంధించి అప్పట్లోనే పనులు మొదలయ్యాయి. ఇరాన్‌ లాంటి చిన్న దేశంలో ఒక్కసారిగా 23 అణువిద్యుత్తు కేంద్రాల ఏర్పాటుకు అంగీకరించటం అప్పట్లో అమెరికాకు అసంబద్ధంగా అనిపించలేదు. ఇరాన్‌ దగ్గర త్వరలో అణ్వస్త్రాలు కూడా ఉంటాయని అమెరికన్‌ జర్నలిస్టుతో రెజాషా గర్వంగా కూడా చెప్పారు. ఇటీవల ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల సందర్భంగా దెబ్బతిన్నట్లు వార్తల్లోకి ఎక్కిన బుషెహర్‌ అణువిద్యుత్తు కేంద్రం రెజాషా ప్రకటించిన 23 కేంద్రాల్లో ఒకటి. అపార చమురు, సహజవాయువు నిల్వలున్న ఇరాన్‌కు అణువిద్యుత్తే అవసరం లేదన్న వాదనలు అమెరికా మేధావులు ఇప్పుడు చేస్తున్నారు కానీ ఒకనాడు ఆ ఆలోచనే వాళ్లకి తట్టలేదు. 1970ల్లో అమెరికా విదేశాంగమంత్రిగా హెన్రీ కిసింజర్‌ ఇరాన్‌ అణుకేంద్రాల ఏర్పాటుపై తాను ఎలాంటి అభ్యంతరాలూ తెలపలేదనీ, అక్కడ అణ్వస్త్రవ్యాప్తి గురించిన ఆలోచనే తమకు రాలేదనీ ఒక ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు. ‘శాంతి కోసం అణువులు’ అంటూ ఎంతో ఆర్భాటంగా ఇరాన్‌ అణుకార్యక్రమాన్ని అమెరికా, బ్రిటన్‌లు ప్రారంభించాయి. పర్షియన్‌ గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, బ్రిటన్‌ ప్రయోజనాల పరిరక్షకుడిగా రెజాషాకి ఇచ్చిన గుర్తింపు, చేసిన సహాయం అంతా ఇంతా కాదు. 1978 నాటికి ఇరాన్‌లో అమెరికా సైనిక సలహాదారులు, పౌరులు 50 వేలమందికి పైగా ఉండేవారు.


వీళ్లందరికీ స్థానిక చట్టాలు వర్తించకుండా ప్రత్యేకహక్కులు కల్పించారు. ఇరాన్‌ సైనిక వ్యయం 1977 నాటికి 9.5 బిలియన్‌ డాలర్లకు చేరింది. అప్పటి భారత్‌ సైనిక వ్యయం 3.46 బిలియన్‌ డాలర్లతో పోల్చితే ఇరాన్‌ వ్యయం ఏ స్థాయిలో ఉండేదో తేలికగా అర్థం అవుతుంది. అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలు వ్యయం 1977లో 6 బిలియన్‌ డాలర్లకు చేరింది. సైనికదళాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. 4,10,000 మంది సైన్యంలో ఉండేవారు. బలమైన సైనిక రాజ్యంగా ఇరాన్‌ మారటం అమెరికాకు అప్పుడు అవసరమైంది. ఒక సైనిక రంగంలోనే కాదు ఇతరత్రా కూడా రెజాషా పహ్లవి కాలంలో ప్రభుత్వ కార్యకలాపాలు, సంస్థలూ విపరీతంగా విస్తరించాయి. రాజ్య కేంద్రీకరణ ఉచ్ఛస్థాయికి చేరింది. అన్నిటినీ పైనుంచి రుద్దటం ఎక్కువైంది. ఆర్థికపరమైన మార్పులూ చాలా వచ్చాయి. మధ్యతరగతి బాగా పెరిగింది. పట్టణీకరణా వేగం పుంజుకుంది. అణుకేంద్రాలతో పాటు భారీ డ్యాంలూ ప్రాజెక్టులకూ ప్రాధాన్యం పెరిగింది. కొంత మేరకూ భూసంస్కరణలూ అమలయ్యాయి. మరోవైపూ అసమానతలూ పెరిగాయి. రాజకీయ ప్రజస్వామ్యమూ భిన్నాభిప్రాయగళం లేకపోయినా.. ఆర్థికాభివృద్ధి జరిగిపోతే సమాజం ఆధునికమై తన అదుపులో ఉంటుందని రెజాషా భావించారు. ఆ అదుపు లభించకపోవటంతో అసమ్మతిపై ఉక్కుపాదం మోపారు. మరోవైపు ఆధునిక విద్యతో సాంస్కృతిక జీవితంపై మత గురువుల పట్టు బలహీనమయ్యే క్రమం మొదలైంది. పాశ్చాత్య అభివృద్ధిని అనుకరించటంలో మతవిశిష్టత అంతరించిపోతుందన్న భయం షియా మత నేతల్లో ఎక్కువైంది. ఇస్లామిక్‌ విప్లవం (1979) తదనంతరం పాశ్చాత్య దేశాలు సాగించిన ప్రచారంతో ఇరాన్‌ ప్రజల ప్రజాస్వామిక ఆందోళనలు, ఉద్యమాలు, ఆధునికత కోసం పడిన తపనలు బాగా మరుగున పడిపోయాయి. 1905–1909 మధ్య ఇరాన్‌లో వచ్చిన రాజ్యాంగ విప్లవం అనేక రాజకీయ మార్పులను తీసుకువచ్చింది. ప్రాతినిధ్య శాసనసభ, అధికారాల విభజన, ఎన్నికలు లాంటివి అప్పుడే వచ్చాయి. ఆసియాలోనే అదొక అరుదైన విప్లవం. రాజ్యాంగబద్ధ రాచరికం పేరుతో రాజు అధికారాలను పరిమితం చేసి జాతీయ అసెంబ్లీకి వాటిని కట్టబెట్టారు. 1921లో కల్నల్‌ రెజాఖాన్‌ సైనిక కుట్రతో అధికారాన్ని చేజిక్కించుకుని పహ్లవి పేరుతో రాచరికాన్ని స్థాపించుకున్నా రాజ్యాంగ విప్లవస్ఫూర్తి ఇరానీలకూ అవసరమైనప్పుడల్లా ప్రేరణ శక్తిగానే ఉంది.


వామపక్ష భావజాలం, సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయవాదం ప్రబలంగా ఉండేవి. 1951లో నేషనల్‌ ఫ్రంట్‌ తరపున ప్రధానమంత్రి అయిన మొసాదేఖ్‌.. పెట్రోల్‌ పరిశ్రమపై గుత్తాధిపత్యం వహిస్తున్న బ్రిటిషు కంపెనీని జాతీయం చేశారు. ఆగ్రహించిన అమెరికా, బ్రిటన్‌ ప్రభుత్వాలు ఇరానీ సైనికాధికారులతో కుమ్మకై మొసాదేఖ్‌ను పదవీచ్యుతుడిని చేసి రెజాషాకు సంపూర్ణాధికారాలు కట్టబెట్టారు. ఇరానీ రాజకీయాలను ఆ సంఘటన తీవ్రంగా ప్రభావితం చేసింది. అప్పటి నుంచి అమెరికన్‌ వ్యతిరేకత ఇరానీల్లో పాతుకుపోయింది. స్వతంత్రత, స్వీయనిర్ణయాధికారం కోసం అగ్రరాజ్యాలను ఎదుర్కోవటం ఇరానీ రాజకీయ సంస్కృతిలో భాగమైపోయింది. అణు కార్యక్రమం కొనసాగించటానికి పట్టుబట్టటం కూడా కొంతమేరకు ఆ సంస్కృతిలో భాగంగానే సాగుతోంది. ఇరాన్‌ ఎప్పుడూ పూర్తిగా వలసపాలన కిందలేదు. పూర్తి స్వాతంత్ర్యాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. 2500 సంవత్సరాలుగా పర్షియన్లుగా ఘనచరిత్రను నిత్యం గుర్తుచేసుకునే జాతీయభావన, ఎన్నో దేశాలను ప్రభావితం చేసిన పారశీక సంస్కృతీ సాహిత్యమూ, పదికోట్ల జనాభా, ఫ్రాన్స్‌కంటే మూడింతలున్న భూభాగం, చమురు–సహజ వాయువు ఉత్పత్తిలో మూడో స్థానం, బలమైన రాజ్యవ్యవస్థ ఉన్న ఇరాన్‌ని ఆయుధశక్తితో లొంగదీసుకోవటం తేలికకాదు! చరిత్ర సృహతో ఇరానీయుల్లో ఉండే సామాజిక చైతన్యం ఒక ఇంధనంలా సమరశీలతను మండిస్తూనే ఉంటుంది. మతగురువుల ప్రభావానికి ఎదురొడ్డి నిలిచే పౌరసమాజం అక్కడ ఉంది. మతరాజ్యాన్నే అదెన్నో మార్పులకు లోనుచేస్తోంది. వర్సిటీ విద్యార్థుల్లో 63శాతం, కాలేజీ విద్యార్థుల్లో 54శాతం, వైద్యుల్లో 47శాతం, ప్రభుత్వ ఉద్యోగుల్లో 28శాతం, శ్రామికశక్తిలో 33శాతం మహిళలు ఉన్న ఇరానీ సమాజంలో అంతగా ప్రచారంకాని విషయాలు చాలానే ఉన్నాయి.

(ఆంధ్రజ్యోతి ఎడిటర్‌)

Updated Date - Jul 01 , 2025 | 12:51 AM