డిగ్రీ అతిథి అధ్యాపకుల గోడు వినండి
ABN , Publish Date - May 27 , 2025 | 01:05 AM
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని 150 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 1,940 మంది గెస్ట్ లెక్చరర్లు పని చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ అతిథి అధ్యాపకులతో బోధనా విధానం 2012లో మొదలైంది. ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ‘త్రీ మెన్ సెలెక్షన్ కమిటీ’ ద్వారా గెస్ట్ లెక్చరర్లను..
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని 150 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 1,940 మంది గెస్ట్ లెక్చరర్లు పని చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ అతిథి అధ్యాపకులతో బోధనా విధానం 2012లో మొదలైంది. ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ‘త్రీ మెన్ సెలెక్షన్ కమిటీ’ ద్వారా గెస్ట్ లెక్చరర్లను స్వయంగా నియమించుకుంటున్నాయి. పీహెచ్‌డీ, నెట్, సెట్ వంటి ఉన్నత విద్యార్హతలున్నప్పటికీ మా శ్రమకు తగిన వేతనం, గుర్తింపు దక్కడం లేదు. ‘గంటల’ విధానంలోనే ప్రభుత్వం మాకు గౌరవ వేతనం చెల్లిస్తోంది. పాఠం చెబితేనే జీతం అనే నిబంధన ఉంది. అంటే ఒక్క పీరియడ్‌కు 390. నెలలో 21 రోజులు 72 పీరియడ్‌లు వస్తే ఆ నెల రూ. 28,080వస్తాయి. దసరా, సంక్రాంతి వంటి పండుగలతో పాటు విద్యార్థులకు ప్రిపరేషన్ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ సెలవుల సమయంలో మాకు నెలకు కేవలం రూ. 3000 నుంచి 10,000 ఇస్తారు. అంటే ఏడాదిలో మాకు ఆరు నుంచి ఏడు నెలలు మాత్రమే బోధన ఉంటుంది. మా సాలీన వేతనం రూ. 1,80,000 మాత్రమే. అంటే ఓ గవర్నమెంట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ నెల వేతనం మా గెస్ట్ లెక్చరర్ల వార్షిక వేతనంతో సమానం! సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని న్యాయస్థానాలు చెబుతున్నప్పటికీ ప్రభుత్వాలు మా గోడును పట్టించుకోవడం లేదు. ఆ జీతం కూడా మాకు మూడు నాలుగు నెలలకోసారి మాత్రమే అందుతోంది. రాష్ట్రంలోని యూనివర్సిటీలతో పాటు రెసిడెన్షియల్స్, డైట్, బీఈడీ, ఎంఈడీ, ఇంటర్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్లుగా చేస్తున్న వారిని ప్రతి ఏడాదీ రెన్యువల్ చేస్తున్నారు కానీ మాకు మాత్రం ఉద్యోగభద్రత లేకుండా ప్రతి ఏడాదీ ఇంటర్వ్యూలు నిర్వహించడం ఎంత వరకు సమంజసం? ప్రస్తుతమున్న ‘అవర్లీ’ చెల్లింపుల విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలి. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా గెస్ట్ లెక్చరర్లకు నెలకు రూ. 50 వేల ‘కన్సాలిడేషన్ పే’ను ప్రభుత్వం అమలు చేయాలి.
ప్రస్తుతం ప్రతి ఏడాదీ నిర్వహిస్తున్న డెమో విధానాన్ని రద్దు చేసి, హైకోర్టు తీర్పు ప్రకారం మమ్మల్ని రెన్యువల్ చేయాలి. ఉచిత వైద్యం, ప్రమాద బీమా వంటి సౌకర్యాలనూ కల్పించాలి. డిగ్రీ అధ్యాపకుల రెగ్యులర్ పోస్టుల నియామకంలో అనుభవం ఆధారంగా మాకు వెయిటేజీ ఇవ్వాలి. ప్రమోషన్ ఆధారంగా ఏర్పడే ఖాళీల్లో గెస్ట్ లెక్చరర్లను నియమించి, వారిని కొనసాగించాలి. మేమూ ఉన్నత విద్యా వ్యవస్థలో భాగమే అని గుర్తించి, మా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి.
కొర్ర ఈశ్వర్, ఓయూ,
డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
ఇవి కూడా చూడండి
నక్సలైట్లపై సీజ్ ఫైర్ ప్రకటించాలి