Share News

Jammu and Kashmir Lost Its Statehood: కశ్మీర్‌కు రాష్ట్ర హోదా గతించిన గతమేనా

ABN , Publish Date - Aug 23 , 2025 | 05:28 AM

కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ నిరుడు కురిసిన హిమసమూహమేనా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి...

Jammu and Kashmir Lost Its Statehood: కశ్మీర్‌కు రాష్ట్ర హోదా గతించిన గతమేనా

శ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ నిరుడు కురిసిన హిమసమూహమేనా? జమ్మూ– కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన భారత రాజ్యాంగ అధికరణ 370 ‘రద్దు చేసేందుకు’ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను దేశ సర్వోన్నత న్యాయస్థానం సమర్థించిందనే భావన ఒకటి దేశ ప్రజలలో విస్తృతంగా ఉన్నది. అధికరణ 370 రద్దు సక్రమమేనని సుప్రీంకోర్టు ప్రమాణీకరించిందని ప్రభుత్వం వాదించింది. న్యాయశాస్త్ర పండితులు కొంతమంది ప్రభుత్వ వాదనను అంగీకరించారు. పొరపాటు, డిసెంబర్‌ 17, 2023న ఇదే కాలమ్‌లో నేనా విషయాన్ని బలమైన రుజువులతో స్పష్టం చేశాను. నిజానికి సుప్రీంకోర్టు అధికరణ 370 రద్దుపై ప్రభుత్వ వాదనకు విరుద్ధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అధికరణ 370 రద్దు రాజ్యాంగ విరుద్ధం, సందేహం లేదు. ఆగస్టు 5, 2019న మోదీ ప్రభుత్వం మూడు చర్యలు చేపట్టింది: అధికరణ 370(1)ని దృష్టాంతంగా చూపుతూ రాజ్యాంగ నిర్వచన నిబంధన (అధికరణ 367)కు అదనంగా 4వ నిబంధనను చేర్చింది; విస్తరింపచేసిన నిర్వచన నిబంధనను అధికరణ 370(3)లోని నిబంధన సవరణకు ఉపయోగించింది; సవరణ చేసిన అధికరణ 370(3), అధికరణ 370ని రద్దుచేసేందుకు ఉపయోగించింది. ఈ మూడు చర్యలూ న్యాయసమ్మతమైనవికావని, రాజ్యాంగ విరుద్ధమైనవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయినప్పటికీ రాజ్యాంగ నిబంధనలు అన్నిటినీ జమ్మూ–కశ్మీర్‌కు వర్తింపచేస్తూ అధికరణ 370(1) కింద అధికారాలను ఉపయోగించడం సక్రమమేనని, అధికరణ 370 రద్దుతో సమమైన ప్రభావదాయకమవుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.


సరే, జమ్మూ–కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు అయిందని అంగీకరిద్దాం. అయితే ప్రత్యేక హోదా ఉపసంహరణ కశ్మీర్ ప్రజలకు అమిత మనస్తాపం కలిగిస్తోందని, కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వంపై వారిలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని చెప్పడం సత్యదూరం కానే కాదు. అధికరణ 370 రద్దుతో ఆ వ్యవహారం ముగిసిపోలేదు. ఆగస్టు 5, 2019న, భారత్‌లో విలీనమైన నాటినుంచి రాష్ట్ర ప్రతిపత్తితో వర్ధిల్లుతున్న జమ్మూ–కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ‘ఇది రాజ్యాంగ సమ్మతమూ, న్యాయబద్ధమేనా?’ కేంద్ర ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసినవారు పై ప్రశ్నపై కూడా విచారణ జరపాలని అభ్యర్థించారు. సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. కారణమేమిటి? లద్దాఖ్‌ మినహా జమ్మూ–కశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరిస్తామని, ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. మోదీ సర్కార్‌ నివేదనను అంగీకరిస్తూ ‘ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న ఒక రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం రాజ్యాంగ సమ్మతమూ, న్యాయబద్ధమైన చర్యేనా?’ అన్న అంశాన్ని విచారణ చేపట్టకుండా వదిలివేసింది. అయితే జమ్మూ–కశ్మీర్‌లో ఎన్నికలను సెప్టెంబర్‌ 30, 2024లోగా నిర్వహించి తీరాలని మోదీ సర్కార్‌కు నిర్దేశించింది. ఆ నిర్దేశానికి అనుగుణంగా సెప్టెంబర్ 2024లో కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించారు. అయితే ఈ రోజుకీ రాష్ట్ర హోదాను పునరుద్ధరించలేదు. దేశ సర్వోన్నత న్యాయస్థానానికి లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీని మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదు. ఇది స్పష్టంగా వాగ్దాన భంగమే.


జమ్మూ–కశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించే విషయమై జరుగుతున్న తాత్సారానికి బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యత వహించి తీరాలి. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ–కశ్మీర్‌లో సెప్టెంబర్‌ 2024లో నిర్వహించిన ఎన్నికలలో విజయం సాధించిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అక్టోబర్ 16, 2024న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బహుశా, వ్యూహాత్మకంగానే కశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించాలన్న డిమాండ్‌ గట్టిగా చేయడం లేదు. ప్రభుత్వం నుంచి గానీ, ప్రజల నుంచి గానీ బలమైన డిమాండ్ లేకపోవడంతో రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరణకు కశ్మీర్‌ ప్రజలు ప్రథమ ప్రాధాన్యమివ్వడంలేదని కేంద్ర ప్రభుత్వం విశ్వసించేందుకు దారితీసింది. వాస్తవంగా ప్రతి కశ్మీరీ కూడా తమ జన్మభూమి రాష్ట్ర ప్రతిపత్తి కోల్పోయినందుకు ఆగ్రహిస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రగిలిపోతున్నాడు. పహల్గాంలో ఉగ్రదాడికి ప్రతి భారతీయుడూ చలించిపోయాడు. పాకిస్థాన్‌ నుంచి చొరబడిన ఉగ్రవాదులతో భారత్‌కు చెందిన ఉగ్రవాదులు కూడా ఆ హింసాకాండలో పాల్గొన్నారని నేను గట్టిగా భావిస్తున్నాను. పాకిస్థాన్‌ నుంచి చొరబడిన ముగ్గురు ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చారనే ఆరోపణపై పహల్గాంలో ఇద్దరు భారతీయులను నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ అరెస్ట్‌ చేసింది. ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం, జూలై 28, 29 తేదీల్లో ముగ్గురు విదేశీ ఉగ్రవాదులను ఒక ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టారు. ఈ ఘటనతో ‘పహల్గాం’కు ప్రభుత్వం తెరదించినట్టు కనిపిస్తోంది. అయితే పహల్గాంలోనే అరెస్ట్‌ చేసిన ఇద్దరు భారతీయుల విషయమై ప్రభుత్వం పూర్తి మౌనం వహిస్తోంది. వారు భద్రతాదళాల కస్టడీలో ఉన్నారా? లేక విడుదల చేసి కేసు ముగించారా? అన్నది స్పష్టంగా తెలియదు. అంతా రహస్యం.


అయితే ప్రజలకు అన్ని విషయాలు జ్ఞాపకముంటాయి. జమ్మూ–కశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీ ఇంకా నెరవేరలేదన్న వాస్తవాన్ని వారు ఎలా విస్మరిస్తారు? ఆ హామీని నెరవేర్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కొంతమంది బాధ్యతాయుత పౌరులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై విచారణలో భాగంగా సర్వోన్నత న్యాయస్థానం మౌఖికంగా కొన్ని నిర్దిష్ట వ్యాఖ్యలు చేసింది. పహల్గాంలో సంభవించినదాన్ని ఎట్టి పరిస్థితుల్లోను ఉపేక్షించడం తగదనేది ఆ వ్యాఖ్యల సారాంశం. ‘ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న ఒక రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం రాజ్యాంగ విహిత, న్యాయబద్ధమైన చర్యేనా?’ అన్న న్యాయపరమైన సమస్య సర్వోన్నత న్యాయస్థానం ముందు స్పష్టంగా ఉన్నది. కశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సుప్రీంకోర్టు ఆ న్యాయపరమైన సమస్యపై నిర్ణయం తీసుకోకుండా సంయమనం వహించింది. కేంద్రం ఆ హామీని నెరవేర్చలేదు. సుప్రీంకోర్టు ఇప్పుడు ఆ హామీని వెన్వెంటనే నెరవేర్చాలని కేంద్రాన్ని ఆదేశించడమో లేదా అపరిష్కృతంగా ఉన్న ఆ అంశంపై తీర్పు వెలువరించడమో చేసి తీరాలి. రాజ్యాంగ న్యాయస్థానం న్యాయాన్ని సమకూర్చగలదని నేను విశ్వసిస్తున్నాను.

పి. చిదంబరం (వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - Aug 23 , 2025 | 05:28 AM