Social Inequality: సంపదల్లో సమానత్వం ఎందుకు
ABN , Publish Date - Nov 14 , 2025 | 04:29 AM
మానవ సమాజంలో అసమానతలపై వచ్చిన వివరణలూ, సమర్థనలూ ఇంకే విషయంపైనా రాలేదు. మతాలు ప్రబోధాలనూ, తత్వశాస్త్రాల చర్చలనూ తరచిచూస్తే అవే ఎక్కువగా కనపడతాయి.
మానవ సమాజంలో అసమానతలపై వచ్చిన వివరణలూ, సమర్థనలూ ఇంకే విషయంపైనా రాలేదు. మతాలు ప్రబోధాలనూ, తత్వశాస్త్రాల చర్చలనూ తరచిచూస్తే అవే ఎక్కువగా కనపడతాయి. అన్ని సందర్భాల్లో అవి ప్రత్యక్షంగా వ్యక్తంకాకపోవచ్చు. విశ్వవిద్యాలయాల్లో నిష్ణాతుల మధ్య చర్చల్లా అవి ఉండకపోవచ్చు. ఈనాటి వాదప్రతివాదాల్లాగా స్పష్టంగా వెల్లడి కాకపోవచ్చు. కానీ మన సంప్రదాయ కథల్లో, పురాణాల్లో, కావ్యాల్లో, పాపపుణ్యాల వివేచనల్లో, ధర్మాధర్మ ఆలోచనల్లో.. అంతస్తుల్లో ఎక్కువ తక్కువలను వివరించి తాత్విక సమర్థనలు ఇవ్వటమే ప్రధానంగా ఉంటుంది. మన కర్మ సిద్ధాంతమే ఇందుకు నిదర్శనం. గతజన్మలో చెడు కర్మలు చేసినవారు కష్టాలను అనుభవిస్తున్నారనీ, మంచి కర్మలు చేస్తే వచ్చే జన్మలో ఉన్నతస్థాయికి వెళతారన్న భరోసా ఇవ్వటమే అందులో కనపడుతుంది. ఆ భరోసాతోనే సర్దుకుపోయే మనస్తత్వం ఏర్పడుతుంది. అన్ని దేశాల్లోనూ ఇలాంటి సిద్ధాంతాలు ఉన్నాయి. ‘ధనికులను పేదలు చంపకుండా మతమే నిలువరిస్తోంది’ అని నెపోలియన్ రెండు వందల ఏళ్ల క్రితమే చాలా నిక్కచ్చిగా చెప్పాడు. సాధారణ ప్రజలను నిశ్శబ్దంగా ఉంచటానికి అదొక అద్భుత సాధనమని కూడా నెపోలియన్ వ్యాఖ్యానించాడు. ఈ అద్భుత సాధనం ఇప్పటికీ ఉన్నప్పటికీ ఒకనాటి పదునును కోల్పోతోంది. ఆధునిక సమాజంలో అసమానతలను ప్రశ్నించటం పౌరహక్కుగా మారిపోతోంది. ఒకస్థాయి వరకే అసమానతలను సహించే పరిస్థితి నెలకొంటోంది. మితిమీరిన అసమానతలపై ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒకరూపంలో అలజడులు, ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్యానికీ, ఆర్థికాభివృద్ధికీ, పర్యావరణానికీ అసమానతలు తీవ్ర ఆటంకాలుగా పరిణమించటంపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. అసమానతలు కలిగిస్తున్న విపరిణామాల విషయమై అంతర్జాతీయ వేదికలపై చర్చలూ మొదలయ్యాయి. ఈ నెల 22, 23 తేదీల్లో దక్షిణాఫ్రికాలోని జోహానెస్‌బర్గ్‌లో జరిగే జీ–20 సదస్సులో అసమానతల అంశాన్ని కూడా ప్రధాన అజెండాలో చేర్చారు. జీ–20 కూటమికి అధ్యక్షత వహిస్తున్న దక్షిణాఫ్రికా సారథ్యంలో అసమానతలపై నివేదికను ఇవ్వటానికి స్వతంత్ర నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటైంది. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన జోసెఫ్ స్టిగ్లిట్స్ నేతృత్వంలో ఏర్పడిన ఆ కమిటీ అసమానతలను పలుకోణాల్లో విశ్లేషించి నివేదికను రూపొందించింది. తీవ్ర అసమానతల కారణంగా వివిధ కీలక రంగాలకు ప్రమాదం ఎలా పొంచి ఉందో నివేదికలో స్పష్టంగా వివరించారు. సంపద, ఆదాయాల పరంగా పెరిగిపోతున్న అసమానతలను లోతుగా విశ్లేషించారు.
గత 40 ఏళ్లల్లో 50శాతం ప్రజల సగటు వాస్తవ ఆదాయం 358 డాలర్లు మాత్రమే పెరిగింది. ఒక శాతమున్న బడా ధనికుల సగటు ఆదాయం అదే కాలంలో 191,000 డాలర్లకు చేరింది. సంపదలో అసమానతలు ఇంకా దారుణంగా తయారయ్యాయి. 2020–2024 మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన మొత్తం సంపదలో 41శాతం ఒక శాతంగా ఉన్న శ్రీమంతుల చేతుల్లోకి వెళ్లింది. దిగువనున్న 50 శాతం ప్రజలకు పెరిగిన సంపదలో లభించిన వాటా 1 శాతం మాత్రమే. శ్రీమంతులకు సగటున 13 లక్షల డాలర్ల సంపద లభిస్తే అట్టడుగునున్న 50శాతం ప్రజలకు సగటున 585 డాలర్ల సంపదే దక్కింది. అంటే 2,655 రెట్లు ఎక్కువ సంపద 1 శాతం శ్రీమంతుల చేతుల్లోకి వెళ్లింది. ప్రపంచ వస్తు, సేవల విలువలో (జీడీపీ) 16శాతానికి సమానమైన సంపద 3,000 మంది కుబేరుల చేతుల్లో పోగుపడింది. ఇప్పటివరకూ బిలియనీర్లను మాత్రమే మనం చూశాం. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరో పదేళ్లల్లో ట్రిలియనీర్లు రంగంపైకి వచ్చేస్తారు. బిలియనీర్లు అందరూ సొంతంగా పరిశ్రమలూ, కంపెనీలూ పెట్టి కిందా మీదా పడి సంపదను కూడబెట్టినవాళ్లు కాదు. వారసత్వంగా సంపదను పొందినవాళ్లే ఎక్కువ. అసమానతలు తీవ్రంగా ఉన్న దేశాల్లో ప్రజాస్వామ్య క్షీణత ఏడు రెట్లు ఎక్కువగా ఉంది. పెరిగిపోతున్న అసమానతల వల్ల 2020ల నుంచి దారిద్య్రం నుంచి ప్రజలను గట్టెక్కించే ప్రక్రియల్లో వేగం తగ్గింది. దీంతో 230 కోట్ల మంది ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు. సగం ప్రపంచ జనాభాకు అత్యవసర ఆరోగ్యసేవలు అందటం లేదు. వైద్య ఖర్చులకు సొంత డబ్బులు చెల్లించాల్సి రావటంతో 130 కోట్ల మంది ఆర్థిక పరిస్థితి దిగజారింది. అసమానతల వల్ల ప్రజాస్వామ్య సంస్థల్లో నమ్మకం తగ్గిపోతోంది. విభజన రాజకీయాలకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఉన్మాద రాజకీయాల ప్రాబల్యం విస్తరిస్తోంది. ప్రజాస్వామిక ప్రక్రియల్లో పాల్గొనాలనే ఆసక్తిలోనూ క్షీణత కనపడుతోంది. అసమానతలు ఎక్కువగా ఉన్న 23 దేశాల్లో 22 చోట్ల ప్రజాస్వామ్యం అన్ని రకాలుగా దిగజారింది. చట్టసభలు, న్యాయవ్యవస్థల పనితీరు కూడా మందగిస్తోంది. అసమానతలు కలిగించిన అసంతృప్తిని ఆసరా చేసుకుని విపరీత పోకడలతో, జనాకర్షక నినాదాలతో, నియంతృత్వ లక్షణాలతో ఎన్నికల్లో గెలిచే నాయకుల సంఖ్యా ఎక్కువైంది. సంపన్న వర్గాల ప్రత్యక్ష, పరోక్ష ప్రభావంతో రాజకీయాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. రాజకీయ అధికారాన్ని శాసించటం ద్వారా సంపన్న వర్గాలు తమ అనుకూల విధానాలనే అమలయ్యేలా చూస్తున్నాయి. సంపద బలం నుంచి రాజకీయ ప్రాబల్యం... మళ్లీ ఈ ప్రాబల్యం అండతో సంపదను పెంచుకునే మార్గాలను సుస్థిరపరచుకోవటం... ఇట్లా ఎడతెగని బంధం ఒకటి ఏర్పడుతోంది. ప్రభుత్వ జోక్యం లేకుండా మార్కెట్‌కే అన్ని వదిలేస్తే ఆర్థికాభివృద్ధి పరుగులు పెడుతుందనే భావన ఎంత తప్పో అనేక దేశాల్లో పరిణామాలను చూస్తే అర్థం అవుతుంది.
అసలు ప్రభుత్వం జోక్యం తగ్గిన తర్వాతే అసమానతలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయాయి. 1990ల నుంచి ఇదింకా స్పష్టంగా కనపడుతోంది. అసమానతలు ఆర్ధికాభివృద్ధికి ఆటంకాలు ఎలా అవుతున్నాయో ఏడు విషయాలను పరిశీలిస్తే తేలికగా అర్థం అవుతాయి. 1) అసమానతల వల్ల తగినంత డబ్బు కింది వర్గాల్లో లేకపోవటంతో వస్తు, సేవలకు గిరాకీ తగ్గిపోతుంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థకు కావాల్సిన వస్తు–సేవల డిమాండ్ ఉండదు. కింది వర్గాలు తమ దగ్గర ఉన్న మొత్తం డబ్బుని ఖర్చుచేసినా వారు సృష్టించే డిమాండు తక్కువగానే ఉంటుంది. పై వర్గాల చేతుల్లో డబ్బు ఉన్నా కొనుగోళ్లు పరిమితం అవ్వటం వల్ల అవసరమైన డిమాండును సృష్టించలేరు. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ తన సామర్థ్యానికి అనుగుణంగా పనిచేయలేదు. 2) ఆదాయం అంతంత మాత్రంగా ఉండటం వల్ల సరైన పోషకాహరాన్ని ఎక్కువ మంది పొందలేరు. అవసరమైన వైద్యాన్నీ పొందలేరు. పిల్లల చదువుకూ ఇబ్బందులు ఏర్పడతాయి. అంతర్గత శక్తులు పూర్తిగా విప్పారని వారిగా ఆ పిల్లలు తయారవుతారు. దాంతో తక్కువ ఉత్పాదకత (లెస్ ప్రడక్టివ్) జీవులుగా మారతారు. దీని ప్రభావం మొత్తం ఆర్థిక వ్యవస్థపై ఉంటుంది. 3) ఉద్యోగ భద్రత లేకుండా అసంఘటితరంగంలో పనిచేసేవారు ఆర్థికరంగంలో వచ్చే ఒడిదుడుకులకు తీవ్రంగా ప్రభావితం అవుతారు. ప్రభుత్వపరంగా వీరిని ఆదుకోటానికి సామాజిక భద్రతా పథకాల్లేని చోట పరిస్థితి దారుణంగా తయారవుతుంది. ఆందోళన చుట్టుముడుతుంది. దీంతో సరిగా పనిచేయలేరు. వాళ్ల ఉత్పాదకతా తగ్గిపోతుంది. మరోవైపు పిల్లల విద్యపై పెట్టే ఖర్చునీ తగ్గించివేస్తారు. కొత్త నైపుణ్యాల కోసం ఖర్చుపెట్టి మరో ఉద్యోగాన్ని పొందటమూ కష్టమవుతుంది. భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకోలేని అశక్తతలో కూరుకుపోతారు. 4) తక్కువ ఆదాయం ఉన్నవాళ్లకు మంచి విద్య, వైద్యం లభించదు. ఇక వాళ్ల పిల్లలకు వయస్సుతో పాటు అందాల్సిన పోషకాహారం లభించకపోవటంతో వాళ్ల మేధో సామర్థ్యం పూర్తిగా వికసించదు. దీంతో పెద్దయ్యాక కూడా వాళ్లు పోటీలు పడి మంచి ఉద్యోగాలను సాధించలేరు. సామాజికంగా పై మెట్టును ఎక్కలేరు. అసమానతల వల్ల పేదరికం తరాలపాటు కొనసాగుతుంది. సామాజిక పురోగతి స్తంభించిపోతుంది. ప్రభుత్వాలు ఆరోగ్య ఖర్చుని 1 శాతం పెంచితే తరాల మధ్య అసమానత 14 శాతం తగ్గుతుంది. కానీ అదే చాలాచోట్ల జరగటం లేదు. 5) అసమానతలు మెజారిటీ ప్రజలను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తాయి. దీంతో ఆర్థిక స్థిరత్వానికి ముప్పు ఎప్పుడూ పొంచి ఉంటుంది. 6) సంపద అధికంగా ఉన్న వర్గాలు తమ దగ్గరున్న డబ్బును ఉత్పాదకతను పెంచే రంగాల్లో పెట్టుబడులు పెట్టకుండా కూడా సమాజానికి హాని కల్గిస్తారు. సహజవనరులపై గుత్తాధిపత్యం సాధించి లాభాలను సంపాదించాలని చూస్తారు. కొత్త పరికరాల సృష్టికో, అదనపు విలువను జోడించటానికో ప్రయత్నించకుండా ప్రభుత్వ యంత్రాగాన్ని ప్రభావితంచేసి లాభాలను (రెంట్ సీకింగ్) గడించాలని చూడటం ఆర్థిక వ్యవస్థకే కాకుండా ప్రజలకూ తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతుంది.
గనులు, చమురు, సహజవాయువు వనరులపై ప్రభుత్వ నియంత్రణ తక్కువ ఉండేలా చూసి లాభాలను అధికం చేసుకుంటారు. స్థానిక ప్రజల ఆరోగ్యం, పర్యావరణ నాశనం, భవిష్యత్తు తరాల సంక్షేమం పట్టకుండా వ్యవహరిస్తారు. 7) ఇక ఒక దేశంలో ఉన్న అసమానతలు ఆ దేశానికే పరిమితం కావు. ఆరోగ్యసేవలు బలహీనంగా ఉన్నచోట వ్యాధులు వేగంగా వ్యాపించి ఇతర దేశాలకూ చేరతాయి. ఒక దేశంలో కాలుష్యం ఇతర దేశాలకూ వ్యాపిస్తుంది. ధనికుల అతి విలాసాల వల్ల అధిక కార్బన్ వినియోగం జరిగి వాతావరణం విపరీత మార్పులకు లోనవుతోంది. అమెరికా, యూరపుల్లో ధనికుల జీవనశైలి వల్ల పేదదేశాల ప్రజలు అతివృష్టి, అనావృష్టిని ఎదుర్కొంటున్నారు. అందుకే దేశాల మధ్యా, దేశాల లోపలా అసమానతలను కట్టడిచేయకపోతే అస్థిరతలు, సంక్షోభాలు, తిరుగుబాట్లు, ప్రజాస్వామ్యం ముసుగులో నియంతల వీరవిహారాలు చేయటం సర్వసాధారణం అవుతాయి. అసమానతలు ఉన్నచోటే.. పైకి ఎదగాలన్న ఆర్తి రగులుతున్న చోటే.. ఆర్థికాభివృద్ధి పరుగులు పెడుతుందన్న సిద్ధాంతమే ఇప్పటికీ చెలుబాటు అవుతోంది. ప్రభుత్వ నియంత్రణలు తక్కువగా ఉంటే కొత్త ఆవిష్కరణలతో, కొత్త సాంకేతిక పరిజ్ఞానాలతో, ప్రయోగశీల మనస్తత్వంతో ఆర్థిక వ్యవస్థ కొత్తదారులు పడుతుందన్నది స్థూలంగా నిజమే కావచ్చు! కానీ ఆ కొత్తదారులతో అసమానతలు విపరీతంగా పెరిగి ప్రజాస్వామ్యానికీ, పర్యావరణానికీ, ఆర్థికాభివృద్ధికీ అడ్డంకులుగా మారుతున్న దృశ్యం ప్రపంచవ్యాప్తంగా కనపడుతోంది. అసమానతలు కలగచేసే విపరిణామాలపై ప్రసరిస్తున్న కొత్తవెలుగులతోనైనా వాటిని కట్టడి చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోతే మానవాళి మనుగడే ప్రమాదంలో పడిపోతుంది. సామాజిక జీవితం సాఫీగా నడవాలంటే ఆ జీవితంలో భాగస్వాములైన వారి మధ్య పరస్పరం మంచి జరుగుతుందనే నమ్మకం ఉండాలి. సమానత భావం ఎంతో కొంత ఉండాలి. సౌహార్దత నెలకొనాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలూ, సంస్థలూ మనకోసం పనిచేస్తాయనే భరోసా ఉండాలి. మితిమీరుతున్న అసమానతలు వీటన్నిటినీ దెబ్బతీస్తున్నాయి. అందుకే అన్ని అనర్థాలకు మూలం అసమానతలేనన్న భావం బలపడుతోంది!
(ఆంధ్రజ్యోతి ఎడిటర్)