Indian Economy: జీఎస్టీ తగ్గింపు తెచ్చే లబ్ధి ఎంత
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:40 AM
జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజల చేతుల్లో దాదాపు రూ. 2 లక్షల కోట్లు పెట్టినట్లే. ఇక దేశంలో వినియోగదారుల కొనుగోళ్లు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి....
‘జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజల చేతుల్లో దాదాపు రూ. 2 లక్షల కోట్లు పెట్టినట్లే. ఇక దేశంలో వినియోగదారుల కొనుగోళ్లు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి..’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత వారం మీడియాకు వెల్లడించారు. ‘ఈ నవరాత్రి నుంచి దేశంలో నూతన ఆర్థిక అధ్యాయం ప్రారంభమవుతోంది. ఇప్పటికే జీఎస్టీ తగ్గింపునకు, మీకు కల్పించిన ఆదాయపన్ను రాయితీలను కలిపితే 2.5 లక్షల కోట్లు మీరు ఆదా చేసినట్లే. ఇక ఆదా ఉత్సవాలు జరుపుకోండి’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అన్నారు. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు దేశవ్యాప్తంగా పర్యటిస్తూ వర్తకులు, కొనుగోలుదారులతో భేటీ అవుతున్నారు. ‘జీఎస్టీ తగ్గింపు ఒక వరం’ అంటూ బీజేపీ నేతలంతా వాట్సాప్ స్టేటస్‌లో మోదీ ఫొటో పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. నిజానికి జీఎస్టీ తగ్గించడం అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ఉమ్మడి నిర్ణయం. ఈ విషయాన్ని బీజేపీ అగ్రనేతలు మాత్రమే ప్రచారం చేసుకోవడం సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమే. అయితే దేశంలోనూ విదేశాల్లోనూ అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న దృష్ట్యా బిహార్ ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని అధికార పార్టీ ఈ ప్రచారాన్ని చేసుకోవడాన్ని తప్పు పట్టలేము. బీజేపీ మాత్రమే కాదు, కాంగ్రెస్ కూడా జీఎస్టీ తగ్గింపును తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటోంది తామెప్పటి నుంచో జీఎస్టీని గబ్బర్ సింగ్ టాక్స్‌గా అభివర్ణిస్తున్నామని, నిత్యావసర వస్తువులపై జీఎస్టీని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నామని, జీఎస్టీ తగ్గించడం తమ వల్లేనని ఆ పార్టీ చెప్పుకుంటోంది. చిదంబరం వంటి కాంగ్రెస్ ఆర్థికవేత్తలు మాత్రమే కాదు, జీఎస్టీ మండలి సమావేశంలో ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా జీఎస్టీ తగ్గింపును స్వాగతించారు. అంటే ప్రస్తుత తగ్గింపు అభిలషణీయమేనని ఒప్పుకోవాలి. ఎవరు తీసుకున్నా, ఎందుకు తీసుకున్నా ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలు పెరగడం అనేది మంచిదే కదా!
నవరాత్రులు ప్రారంభమైనప్పటి నుంచీ ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి తాము ఆదా చేసిన 2.5 లక్షల కోట్లను ఖర్చు పెట్టి వినియోగ వస్తువులను కొనుగోలు చేస్తారని ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి ఆశిస్తున్నారు. ఈ మొత్తం ముందు జీఎస్టీ తగ్గింపువల్ల ప్రభుత్వానికి జరిగే రూ. 48వేల కోట్ల నష్టమెంత? అని నిర్మలా సీతారామన్ అంటున్నారు. భారతదేశంలో ఆర్థికాభివృద్ది గత పదేళ్ల నుంచి ప్రధానంగా స్వదేశీ వినియోగం ద్వారానే లభించిందని, జీడీపీలో 60 శాతం పైగా వినియోగం వల్లే వచ్చిందని మన ప్రభుత్వం చెప్పుకుంటోంది. 2027 నాటికి మూడవ అతి పెద్ద వినియోగ మార్కెట్ భారత్‌లో ఏర్పడుతుందని ప్రైస్ వాటర్ కూపర్స్ నివేదిక పేర్కొంది. అయితే కొవిడ్ తర్వాత భారతదేశంలో వినియోగం మళ్లీ ఊపందుకున్నప్పటికీ గత రెండుమూడేళ్లుగా పరిస్థితులు మారడం ప్రారంభమైన విషయాన్ని ఆర్థికవేత్తలు గమనించారు. అంతిమ ప్రైవేట్ వినియోగ వ్యయం బాగా తగ్గిపోతోందని, ఆహారం, దుస్తులు, చెప్పులు, రవాణా, ఇళ్లు వంటి వాటి విషయంలో ఖర్చు తగ్గిందని వారు గ్రహించారు. ముఖ్యంగా వినియోగ వస్తువులపై ఖర్చు తగ్గిపోవడం, అత్యవసరం కాని కొనుగోళ్లపై జనం దృష్టి మళ్లించడం, రుతుపవన పరిస్థితుల వల్ల గ్రామీణ డిమాండ్ దెబ్బతినడం, పంట ఉత్పత్తులు పడిపోవడం జరిగింది. అంతేగాక ఉపాధి కల్పన లేకపోవడం వల్ల పట్టణ డిమాండ్ కూడా బలహీనపడడం వల్ల జీడీపీ అభివృద్ధితో నిమిత్తం లేకుండా ఆర్థిక వ్యవస్థ మందకొడిగా మారడం ఆర్థికవేత్తల దృష్టి దాటిపోలేదు. తక్కువ ఆదాయ వర్గాల కొనుగోలు శక్తి తగ్గిపోవడం, ద్రవ్యోల్బణం మూలంగా ఖర్చు ప్రాధాన్యతలు మారిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రైవేట్ ఖర్చు తగ్గిపోవడం అనేది పన్ను వసూళ్లపై కూడా ప్రభావం చూపుతుంది. డిమాండ్ తగ్గిపోవడం వల్ల ప్రైవేట్ పెట్టుబడులు కూడా తగ్గిపోతాయి. దాని వల్ల ప్రభుత్వంపై భారం పెరుగుతుంది. దేశంలో ఎగుమతుల కన్నా దిగుమతులు పెరగడం వల్ల వర్తక లోటు కూడా పెరుగుతోంది. 2024 సంవత్సరపు అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక ప్రకారం దేశంలో బలహీనమైన ఉపాధి కల్పనా వాతావరణం ఉన్నది. ధరల పెరుగుదలతో పోలిస్తే ఆదాయాల పెరుగుదల చాలా నిదానంగా ఉంది. అభివృద్ధిని వేగవంతం చేసే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గిపోతున్నాయి. వేగంగా అమ్ముడుపోయే వినియోగ వస్తువుల వ్యాపారం (ఎఫ్ఎంసీజీ) అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నది. ప్రధానంగా గత మూడేళ్లలో వాటి ధరలు 30 శాతం మేరకు పెరగడంతో వినియోగదారులు జాగ్రత్తపడాల్సి వచ్చింది. ఇవి మాత్రమే కాదు కార్ల కొనుగోళ్లు కూడా గత జూన్ వరకు బాగా పడిపోయినట్లు నివేదికలు వచ్చాయి. ఐటీ కంపెనీలు అతి పెద్ద ప్రైవేట్ రంగ సంస్థలైనప్పటికీ అవి కల్పించే ఉపాధి శాతం తక్కువ, ఇచ్చే జీతాలు కూడా తక్కువే. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను అవి పూరించడం లేదు.
ఏఐ వల్ల మున్ముందు అవి తగ్గే అవకాశాలే కాని పెరిగే అవకాశాలు లేవు. నైపుణ్యం ఉన్న యువత దేశంలోనే ఉండేందుకు ఇష్టపడడం లేదు. ఏ చిన్న దేశం వెళ్లినా అక్కడ భారతీయులే కనపడుతున్నారు. ప్రైవేట్ పెట్టుబడులే కాదు, ప్రభుత్వ ఉత్పాదక వ్యయం కూడా పెద్దగా పెరగడం లేదు. రూ. 150 కోట్లకు మించి పెట్టుబడులతో ఏర్పరచే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సరైన సమయంలో అమలు కాకుండా ఖర్చులు పెరిగిపోయి అనుకున్నదానికంటే అదనంగా కొన్ని లక్షల కోట్ల మేరకు చేరుకున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక దుష్పరిణామాలు ఉన్నాయి. సంపద, పరిశ్రమలు కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కావడం, ఒకే రాష్ట్రానికి తరలివెళ్లేలా చేయడం వంటివి ఇందులో ఒకటి. అదే విధంగా కేంద్రంతో సహా వివిధ రాష్ట్రాల అప్పులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. జీడీపీతో పోలిస్తే అప్పుల శాతం 30 నుంచి 50 శాతం ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. ప్రభుత్వాల నిరుత్పాదక వ్యయం కూడా తీవ్రంగా పెరిగిపోతోంది. గత ఐదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ ‘ఉద్యమ్’ పోర్టల్‌లో నమోదు చేసుకున్న 75 వేలకు పైగా ఎంఎస్ఎంఈ సంస్థలు మూతపడ్డాయి. ఎంతమంది ఉద్యోగం కోల్పోయారో చెప్పలేం. కానీ 2024 జులైలో ఎంఎస్ఎంఈ మంత్రి జితన్ రాం మాఝీ లోక్‌సభలో చెప్పిన జవాబు ప్రకారం 2020 జూలై నుంచి 2024 జూలై వరకు 49,342 సంస్థలు మూతపడి 3.18 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ప్రతి ఏడాదీ 70 నుంచి 80 లక్షల మంది లేబర్ మార్కెట్‌కు చేరుకుంటున్నారు. జనాభా పెరగడం మనకు వరం అనేవారు ఉన్నారు. కానీ వారికి ఉపాధి కల్పించేందుకు పెరుగుతున్నంత వేగంగా తీసుకుంటున్న చర్యలేవీ? ఉత్పాదక రంగంలో వారికి కేవలం 1.7 శాతం మేరకు ఉపాధి లభిస్తోంది. ఈ నేపథ్యంలో జీఎస్టీని రెండు ప్రధాన రేట్లకు తగ్గించడం అనేది చెప్పుకోదగిన నిర్ణయమైనప్పటికీ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉన్నదని విమర్శలు వస్తున్నాయి. నిజానికి చాలా వస్తువుల ధరలు గత మూడేళ్లుగా ఎంతో పెరిగిపోవడం వల్ల ఇప్పుడు వాటిని తగ్గించడం ప్రాయశ్చిత్తం చేసుకోవడమే కానీ వరాలు ప్రకటించడం కాదని విమర్శించేవారు లేకపోలేదు. ఇన్నాళ్లూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా ప్రభుత్వం మౌనంగా ఉండి మాటిమాటికీ జీఎస్టీ రేట్లలో మార్పులు చేస్తూ, ఆరు రేట్లను అమలు చేస్తూనే ఎందుకు ఉండిపోయిందనేదే తెలియడం లేదు. జీడీపీ పెరుగుదలపై ట్రంప్ విధించిన టారిఫ్‌ల వ్యతిరేక ప్రభావాన్ని తట్టుకునేందుకు కూడా ఈ రేట్ల తగ్గింపు దోహదం చేస్తుందని ప్రభుత్వం ఆశిస్తున్నట్లు కనపడుతోంది.
ఐతే ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా పుంజుకునేందుకు సంస్కరణలు చేపట్టడం, ప్రత్యామ్నాయ మార్కెట్ లను అన్వేషించడం కూడా అవసరం. పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గనంతకాలం సరుకుల, ప్రయాణికుల రవాణా వ్యయం తగ్గే అవకాశాలు లేవు. సెస్‌ల ద్వారా, అదనపు ఎక్సైజ్ సుంకాల ద్వారా సేకరించే 85 శాతాన్ని కేంద్రం పంచుకునేందుకు ఇష్టపడదు. ప్రైవేట్ పెట్టుబడులు పెరిగినప్పటికీ 6.5 శాతం అభివృద్ధి రేటు నుంచి 8 శాతం పెరిగేందుకు అవి ఇప్పట్లో దోహదం చేసే అవకాశాలు లేవు. అందువల్ల డిమాండ్ పెంచడం తప్ప ప్రభుత్వానికి మరో గత్యంతరం లేదు. కాగా జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రభావం ఆ రేట్ల తగ్గింపు వినియోగదారుల వరకు చేరడాన్ని బట్టి ఉంటుందని క్రిసిల్ ఒక నివేదికలో పేర్కొంది. పెద్ద కంపెనీలే ఈ లాభాల్ని హస్తగతం చేసుకుంటాయా, లేక వినియోగదారుడితో పంచుకుంటాయా అన్నది వేచి చూడాల్సి ఉన్నది. జీఎస్టీ రేట్ల తగ్గింపును పర్యవేక్షించే నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీకి పెద్ద అధికారాలు లేవని విమర్శలు ఉన్నాయి. ఇక రేట్ల తగ్గింపు మూలంగా జీఎస్టీ ఆదాయంలో 15 నుంచి 20 శాతం తగ్గిపోతుందని, దాదాపు రూ. 2లక్షల కోట్ల మేరకు రెవెన్యూ నష్టం వస్తుందని రాష్ట్రాలు అంటున్నాయి. ఈ మొత్తాన్ని కేంద్రం ఎలా పూరిస్తుందో అగమ్య గోచరంగా ఉన్నది. ఏమైనా అనేక ఆర్థిక ఒత్తిళ్లు, అంతర్జాతీయ పరిణామాల వల్ల ఏర్పడిన ఆర్థిక అస్థిరత వల్ల ప్రధానమంత్రికి మళ్లీ ఆత్మనిర్భర్ భారత్ గుర్తుకు వచ్చింది. 2014లో అట్టహాసంగా ఆయన మేక్ ఇన్ ఇండియా గురించి ప్రకటించినప్పటికీ ఉత్పాదక రంగం వాటా జీడీపీలో 16.7 శాతం నుంచి 13 శాతానికి తగ్గిపోయిందన్న విషయం ఆయనకు తెలియనిది కాదు.
ఎ. కృష్ణారావు (ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)