Poet Ommi Ramesh Babu: చిన్న పుస్తకమైనా అనుకోని స్పందన
ABN , Publish Date - Jun 16 , 2025 | 03:02 AM
రాజమండ్రి నుంచి నలుగురు మిత్రులం (ఒమ్మి రమేష్ బాబు, తల్లావజ్ఝల శశిశేఖర్, ఇక్బాల్ చంద్) 1990లలో ఇస్మాయిల్ గారిని కలవడానికి కాకినాడ వెళుతుండేవాళ్ళం. ఆయన ఆచితూచి మాట్లాడిన తర్వాత...
రాజమండ్రి నుంచి నలుగురు మిత్రులం (ఒమ్మి రమేష్ బాబు, తల్లావజ్ఝల శశిశేఖర్, ఇక్బాల్ చంద్) 1990లలో ఇస్మాయిల్ గారిని కలవడానికి కాకినాడ వెళుతుండేవాళ్ళం. ఆయన ఆచితూచి మాట్లాడిన తర్వాత అప్పుడప్పుడు నేను ఒకటిరెండు కవితలను వినిపించేవాడిని. ఓసారి నన్ను ఉద్దేశించి ఆయనన్నారు: ‘‘మీ కవితలతో చిన్న పుస్తకం వేయండి.’’ ఆ ప్రతిపాదన ఆనాటి నుంచి నా మనసులో మెదులుతుండేది. ఆలోపు ఉద్యోగనిమిత్తం హైదరాబాద్ చేరుకున్నాను. అక్కడే నా కవిత్వం ‘ఆకుపచ్చ లోయ’ (1996) పుస్తకరూపం తాల్చింది.
వాడ్రేవు చినవీరభద్రుడు, సతీష్ చందర్, అఫ్సర్ గార్లు అపురూపమైన ముందుమాటలు రాశారు. కవిత్వసారాన్ని తల్లావజ్ఝల శివాజీగారు ముఖచిత్రంలోకి పట్టితెచ్చారు. కవర్ పేజీ కోసం ‘చేతితో తయారు చేసిన కాగితం’ ఎంచుకున్నాను. పుస్తకానికయ్యే మొత్తం వ్యయంలో ముఖపత్రానికి సగం ఖర్చుచేశాను. చరిత ప్రెసులో అచ్చువేశారు. అందుకు అవసరమైన డబ్బుని మా నాన్నగారు సమకూర్చారు.
నిజానికి అది చిన్న పుస్తకం. అయినా అనుకోని స్పందన లభించింది. మిత్రులు, పలువురు ఇష్టకవులు అక్కున చేర్చుకున్నారు. ‘‘మాటల గాజుపెంకుల మీద జాగ్రత్తగా అడుగులు వేయడం నేర్చుకున్నారు’’ అని జాబు రాశారు ఇస్మాయిల్. ‘‘సబ్బుతో చేతుల్ని శుభ్రంగా కడుక్కొన్న తర్వాత పుస్తకం తెరిచాను’’ అని వేగుంట మోహన్ ప్రసాద్ చెప్పారు. అద్భుతమైన సాహిత్య సంపాదకీయంతో ఎబికె ప్రసాద్ అబ్బురపరిచారు. ‘అంతర్ముఖుడి గాయాలాపన’ అంటూ కలేకూరి ప్రసాద్ తన సమీక్షలో అభివర్ణించారు. అలాగే సహృదయుల ప్రశంసకి పాత్రమై గొప్ప ఉత్తరాల్ని అందుకున్నాను.
నిబద్ధత, నిమగ్నతల మధ్య సరిహద్దురేఖని తుడిచివేసిన తరానికి చెందుతాను నేను. ఏనాటికీ ప్రత్యుత్తరం లేని ప్రేమలేఖల ప్రతీక్ష; యావత్ప్రపంచం కోనసీమలాగ సతతం హరితమనే అమాయకత; హృదయాంతరాళంలోంచి ఉప్పొంగిన నినాదం శుష్కవచనమైన సంవేదన ‘ఆకుపచ్చ లోయ’ పుటల్లో దాగి ఉన్నాయి. నా కవితలు క్లుప్తంగా ఉండటంతో కవిభావన చదువరికి సరిగా అందడం లేదని ఒకరిద్దరు విమర్శించారు. ఆ వ్యాఖ్యని గమనంలోకి తీసుకున్నాను. కానీ కవితకి క్లుప్తత, గాఢత చిరశాశ్వతమైన మౌలికగుణాలనే ఎరుకతో ఉన్నాను. డేవిడ్ షుల్మాన్ ‘పురాగానం’ కవితని ఆంగ్లంలోకి అనువదించారు. దానిని తన ‘Spring, Heat, Rains: A South Indian Dairy’ (2009) పుస్తకంలో చేర్చారు.
‘ఆకుపచ్చ లోయ’ని ఇప్పటికీ కొందరు గుర్తుపెట్టుకున్నారు. ఎక్కడో ఎవరో తారసపడినప్పుడు అందులోంచి ఒకటిరెండు స్టాంజాలని ఉదహరిస్తుంటారు. అలా సుదూరగత స్మృతిపేటికని తెరుస్తారు. అటువంటివేళ సంభ్రమాశ్చర్యాలతో నవయవ్వనంలోకి రెక్కలు విప్పుతాను. పుస్తకం ప్రచురించిన స్వల్పకాలానికి మా అమ్మగారు అర్ధాంతరంగా కనుమూశారు. అనంతరం ఓనాడు ఆమె బీరువా తెరిచాను. నేను తనకి రాసిన లేఖలతో పాటు పదిలపరిచిన ‘ఆకుపచ్చ లోయ’ ప్రతిని కూడా చెమ్మగిల్లే కళ్ళతో చూశాను.
- 93968 07070