Share News

Tamil Nadu Governor Bill: ఇంతకూ ధర్మాసనం ఎందుకు

ABN , Publish Date - Jun 03 , 2025 | 12:45 AM

గవర్నర్లు బిల్లుల ఆమోదంపై కాలపరిమితిని పాటించకపోవడం రాజ్యాంగ సమస్యగా మారింది. రాష్ట్రపతి 14 కీలక ప్రశ్నలతో సుప్రీంకోర్టును సందర్శించడంతో, పాలనా జాప్యాలపై చర్చ మరింత తీవ్రతరమైంది.

Tamil Nadu Governor Bill: ఇంతకూ ధర్మాసనం ఎందుకు

న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు, కేంద్ర రాష్ట్ర కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ళు, పరిపాలన సంబంధిత నిబంధనల నిర్వహణ... ఇవన్నీ ప్రజలకు తక్షణం పరిష్కారం కావాల్సిన అవసరాలు. ఇటీవల బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతికి, గవర్నర్లకు కాలపరిమితిని సూచిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఇది కొత్త ఆలోచన కాదు. హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాల్లోనే ఉంది. హోంమంత్రిత్వ శాఖే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ విచారణలో బిల్లుల ఆమోదంపై గడువును నిర్ణయించాలని అన్నది. ‍ఇప్పుడు మళ్లీ సుప్రీం తీర్పుపై వివరణ కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలు సంధించారు. గడువు అవసరాన్ని ప్రభుత్వమే ఒప్పుకున్న తర్వాత మరలా ఆ గడువుకు సంబంధించిన తీర్పు మీదనే సుప్రీంకోర్టుకే 14 రెఫెరెన్స్‌లు ఎందుకు? అందుకోసం సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇటూ అటూ లాయర్లు సుదీర్ఘ కాలం నడిపిస్తారు. చివరకు సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా, ‘‘మాకిష్టం లేదు. మేం ఒప్పుకోం,’’ అనే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉందని రాజ్యాంగంలోనే మనం రాసుకున్నాం. అలాంటప్పుడు ఇదంతా వృథా కాదా?

2024 ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో: ‘‘మేము కేవలం హోం మంత్రిత్వ శాఖ 2016లో జారీ చేసిన మెమొరండమ్ రూపంలోని మార్గదర్శకాలను అనుసరిస్తున్నాం, అవి మూడు నెలల గడువును సూచించాయి’’ అని పేర్కొంది. అంటే ఈ కాల పరిమితిని మొదట కేంద్ర ప్రభుత్వమే సూచించింది. అటువంటప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు విచారణ అవసరం ఎందుకు?


భారత రాష్ట్రపతి దేశ పాలనలో రాజ్యాంగ అత్యున్నత పదవిలో ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నిక కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటింగ్ చేస్తారు. దేశవ్యాప్తంగా అత్యంత విశాలమైన ప్రజాతంత్ర ప్రాతినిధ్యం కలిగి ఉంటుంది. అందుకే ఆ పదవికి గౌరవం. గవర్నర్లను రాష్ట్రపతి ద్వారా ప్రధానమంత్రి, మంత్రివర్గ సిఫార్సు మేరకు నియమిస్తారు. ఇది ఎన్నిక కాదు. వారు చేసే ఎంపిక. ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లకు అత్యున్నత పరిపాలనాధికారాలు ఉంటాయి. వాటిని దుర్వినియోగం చేయకూడదు. బాధ్యతాయుతంగా పనిచేయాలి. కానీ ఇది జరగటం లేదు. ఇది కేవలం తమిళనాడు సమస్యేకాదు, ఎన్డీయేతర రాష్ట్రాలన్నిటిలోనూ ఈ సమస్య ఉంది. ఆర్టికల్ 200, 201లో కాల పరిమితులు లేకపోవటం తప్పుగా పరిగణించాల్సిన అవసరం లేదు. కానీ పరిపాలనలో సమయానుకూల నిర్ణయాలు కీలకం. గవర్నర్లు ఈ బాధ్యతను విస్మరించరాదు. తాము సంప్రదాయ పరిపాలనా అధికారం కలిగినప్పటికీ, నిర్ణయాలు ఆలస్యం చేయకూడదు. సుప్రీంకోర్టు తీర్పు అందరు గవర్నర్లకు వర్తిస్తుంది. గవర్నర్ – ముఖ్యమంత్రుల మధ్య ప్రతి రాష్ట్రంలోనూ గొడవ ఉండదు. కేంద్రంలో రాష్ట్రాల్లో వేరే పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆలస్యాలు కావాలని చేస్తున్నట్టు కనపడుతూనే ఉంది. ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసుకోలేక పరిపాలన స్తంభించిపోతున్నది. తమిళనాడు వెర్సస్‌ గవర్నర్‌ ఆఫ్‌ తమిళనాడు (2025) కేసులో గవర్నర్ ‘పాకెట్ వీటో’ వాడుతున్నారని తీవ్ర విమర్శలు వచ్చాయి. ‘పాకెట్‌ వీటో’ అంటే బిల్లులను నిరవధికంగా పెండింగ్‌లో ఉంచటం.


రాష్ట్రపతి వేసిన ఐదు కీలక ప్రశ్నలు ఇవే: 1) ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ అధికారాలు న్యాయపరంగా పరిశీలించదగినవేనా? 2) ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్/ రాష్ట్రపతి పూర్తిగా న్యాయ సమీక్షకు అతీతమా? 3) రాజ్యాంగ కాలపరిమితి లేకపోతే గవర్నర్ బిల్లుపై నిర్ణయం తీసుకోవడం ఏ విధంగా జరగాలి? 4) ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి చేసే నిర్ణయాలు న్యాయపరంగా సమీక్షించదగినవేనా? 5) ఆర్టికల్ 201 ప్రకారం బిల్లులపై రాష్ట్రపతికి గడువు విధించవచ్చా? ఉందనుకుంటే సుప్రీంకోర్టు గడువులు ఇవ్వవచ్చా?

రకరకాల అనుమానాలు: 1) ఆర్టికల్‌ 200 ప్రకారం గవర్నర్‌కి నిర్ణయాల విచక్షణాధికారాలు ఉన్నాయా? గవర్నర్ రాష్ట్ర కేబినెట్ సలహా మేరకే పనిచేయాలా? అప్పుడు రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా తీసుకోవచ్చా? 2) ఆర్టికల్‌ 142 ప్రకారం కోర్టులు గవర్నర్/ రాష్ట్రపతిని తొలగించే ఆదేశాలు ఇవ్వగలవా? 3) గవర్నర్ అంగీకారం లేకుండా రాష్ట్ర శాసనసభ ఆమోదించిన చట్టం చట్టబద్ధమా? 4) ఈ అంశంపైన ఆర్టికల్‌ 145(3) ప్రకారం కనీసం ఐదుగురు న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాల్సిన అవసరముందా? 5) ఆర్టికల్ 131 ప్రకారం ఒరిజినల్ సూట్ లేకుండా కేంద్రం – రాష్ట్రాల మధ్య విభేదాలను సుప్రీంకోర్టు పరిష్కరించగలదా?


న్యాయమూర్తి పార్థివాలా అభిప్రాయం ప్రకారం గవర్నర్‌కు ఒక బిల్లు వచ్చాక... మూడు మార్గాలు మాత్రమే ఉంటాయి. ఒకసారి బిల్లు తిరిగి శాసనసభకి పంపి, అదే రూపంలో తిరిగి వస్తే రాష్ట్రపతికి పంపించే హక్కు గవర్నర్‌కు ఉండదు. ఆయన సూచనల మేరకే మార్పులు జరిగితే తప్ప. గవర్నర్ లేదా రాష్ట్రపతి బిల్లులపై జాప్యం చేస్తే ఆ ప్రభుత్వాలు కోర్టులో మాండమస్‌ రిట్‌ వేయవచ్చు. బిల్లుల ఆమోదంపై సుప్రీంకోర్టు తీర్పు దిశను సూచించినప్పటికీ, తుది స్పష్టత కోసం రాజ్యాంగ ధర్మాసనం అవసరమే. కానీ ఆర్టికల్‌ 143 ప్రకారం, సుప్రీంకోర్టు ఇచ్చే సలహాను ప్రభుత్వం పాటించాల్సిన అవసరం లేదు. ఈలోగా మంత్రిత్వ శాఖల ఆమోదానికి పంపిన బోలెడు బిల్లులు ఎక్కడివక్కడే ఆగిపోతాయి. ఇది ప్రజల పాలనపై హక్కును దారుణంగా ఉల్లంఘించటమే.

-మాడభూషి శ్రీధర

Updated Date - Jun 03 , 2025 | 12:46 AM