Share News

Women Empowerment as a Priority: మహిళా సాధికారతే లక్ష్యంగా...

ABN , Publish Date - Aug 19 , 2025 | 06:07 AM

రాష్ట్రంలో డ్వాక్రా మహిళల జీవనాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అనేక ప్రణాళికలు రూపొందించి, వాటిని విజయవంతంగా అమలు చేస్తోంది...

Women Empowerment as a Priority: మహిళా సాధికారతే లక్ష్యంగా...

రాష్ట్రంలో డ్వాక్రా మహిళల జీవనాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అనేక ప్రణాళికలు రూపొందించి, వాటిని విజయవంతంగా అమలు చేస్తోంది. ‘బటన్ నొక్కాలి.. కానీ సాయం అందకూడదు.. హామీలు ఇవ్వాలి.. వాటిని అమలు చేయకూడదు’ అన్న చందంగా గత పాలకుల పనితీరు ఉండేది. యువత, మహిళాభివృద్ధిని వారు విస్మరించారు. ఈ పరిస్థితిని చంద్రన్న ప్రభుత్వం పూర్తిగా మార్చేసింది. మహిళలకు ఆస్తిహక్కు, రాజకీయాల్లో 9 శాతం రిజర్వేషన్లు వంటివి గత ఎన్టీఆర్ ప్రభుత్వం కల్పించగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవులు, కళాశాలల్లో యువతులకు 33 శాతం రిజర్వేషన్లు వంటివి ప్రస్తుత చంద్రన్న ప్రభుత్వం అమలుచేస్తోంది. డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించేందుకు ‘మహిళా MSME పార్కులు’ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. స్ర్తీ నిధి రుణాలను రూ.3.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు, వడ్డీ రాయితీని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు, అలాగే వారికి వడ్డీ రుణాలను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. గ్రామైక్య మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీని రూ.3 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పెంచి, అందులో రూ.10 లక్షల మేర వడ్డీ రాయితీని అందిస్తోంది. ఇవేకాక, ‘స్ఫూర్తి’ పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలకు 90 శాతం సబ్సిడీతో రూ.5 కోట్ల వరకు రుణం ఇచ్చే కార్యక్రమాన్ని తొలి విడతగా 11 జిల్లాల్లో ప్రభుత్వం అమలు చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా స్వయం సహాయక సంఘాలకు ఎలాంటి పూచీకత్తూ లేకుండా రుణాలు అందించడంతో పాటు, నెలవారీ వాయిదాల్లో మహిళలు తిరిగి జమ చేస్తున్న విధానాన్ని ‘మన సంఘం–మన లెక్కలు’ యాప్ ద్వారా చంద్రన్న ప్రభుత్వం ఆన్‌లైన్‌లో పొందుపరుస్తోంది. ఈ విధానంతో అవినీతికి అడ్డుకట్ట వేస్తోంది. ‘స్త్రీ శక్తి’ పథకం మహిళలకు ఎంతో ఉపయోగకరమైనది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉద్యోగాలు, పనులకు వెళ్లలేని మహిళలకు ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోంది. ఈ సదుపాయం వల్ల మహిళలు ఇతర సామాజిక కార్యక్రమాల్లోనూ సులభంగా పాల్గొనగలుగుతున్నారు. సమాజంతో మమేకమవుతున్నారు. ఏపీఎస్ఆర్టీసీ నడిపే మొత్తం 11,449 బస్సుల్లో 8,458 బస్సులను చంద్రన్న ప్రభుత్వం ఈ పథకం కోసం కేటాయించడం సంతోషకరం. మహిళల భద్రత కోసం అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మహిళా కండక్టర్లకు బాడీవోర్న్ కెమెరాలు అందించాలని ఆదేశించడం మహిళల భద్రతపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.


గ్రామీణ ప్రాంతాల్లో డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో రూపొందిస్తున్న ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించాలనే ఉద్దేశంతో నాబార్డు, ఫ్లిప్‌కార్ట్, కేతి, ఫార్మ్ వేద వంటి సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డ్వాక్రా సంఘాలు తమ ఉత్పత్తులను విక్రయించి, లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. డ్రోన్ల కేటాయింపుల్లో కూడా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తూ, 80శాతం సబ్సిడీతో మహిళలకు డ్రోన్లను అందజేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలో రూ.35,291 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించడంతో పాటు, 4,551 కోట్ల బ్యాంక్ లింకేజీలను శ్రీనిధి ద్వారా డ్వాక్రా సంఘాలకు అందించింది. ‘ఉన్నతి’ పథకం కింద ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ.253 కోట్ల సాయాన్ని అందిస్తూ వారి అభివృద్ధికి బాటలు వేస్తోంది. ప్రతి స్వయం సహాయక సంఘానికి ఒక యునిక్ ఐడీ కేటాయించి రుణాల మంజూరు, సంక్షేమ పథకాలు అందించడంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా చంద్రన్న ప్రభుత్వం అమలు చేస్తోంది. స్వయం సహాయక సంఘాల్లో మరింతగా పారదర్శకత పెంపొందించేందుకు ‘క్రెడిట్ స్కోర్’ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు, CIF ఫండ్ ట్రాకింగ్ అప్లికేషన్‌ను సిద్ధం చేసేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. స్త్రీ నిధి నుంచి రుణాలు తీసుకున్న మహిళలు ఏదైనా కారణంతో మరణిస్తే వారి రుణంలో గరిష్టంగా రూ.2 లక్షలు మాఫీ చేయడంతో పాటు, అప్పటి వరకు వారు చెల్లించిన రుణం మొత్తాన్ని నామినీకి తిరిగి చెల్లించే అవకాశం ఉంది. ఈ రుణ బీమా సదుపాయాన్ని మరింతగా విస్తరించి, స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు కూడా దాన్ని వర్తించేలా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ‘పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ’లో రిసోర్స్ పర్సన్‌లుగా పనిచేసే వారికి గత ప్రభుత్వం మూడు సంవత్సరాల కాల పరిమితిని విధించింది. కూటమి ప్రభుత్వం ఆ కాల పరిమితిని రద్దు చేసి, వారికి ఉద్యోగ భద్రత కల్పించింది. ‘డిజిటల్ లక్ష్మి’ పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ‘కామన్ సర్వీస్ సెంటర్ల’ నిర్వహణ బాధ్యతలను, ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అంతేకాదు, గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా సంఘాల మహిళలకు రూ.50 వేల విలువైన ‘ఎగ్ కార్ట్‌’లను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. ఇలా డ్వాక్రా సంఘాల నుంచి గ్లోబల్ బ్రాండ్ల వరకు మహిళలను భాగస్వాములను చేస్తూ, తెలుగు ఆడపడుచుల శక్తిని ప్రపంచానికి కూటమి ప్రభుత్వం చాటిచెబుతోంది.

-ఆచంట సునీత ‘తెలుగునాడు అంగన్‌వాడీ డ్వాక్రా సాధికార సంస్థ’ రాష్ట్ర అధ్యక్షురాలు

Updated Date - Aug 19 , 2025 | 06:07 AM