Gorati Venkanna Poem: మంకెన పూలు
ABN , Publish Date - May 12 , 2025 | 03:36 AM
ప్రకృతి, ప్రేమ, తపస్సు, కరుణ వంటి భావాలను శిల్పంగా మిళితం చేస్తూ, గోరటి వెంకన్న జీవితాన్ని ప్రతిబింబించే కవితను అద్భుతంగా రాశారు. సామాజిక తార్కికతలపై ఆవేదనతో, ఆశ మరియు మార్పు కోసం ప్రయాణిస్తున్న చిత్తచైతన్యాన్ని కవితలో చర్చించారు.
జంబునేరేడు కొప్పెర జారు ముంగురు నొసలుతో
కవ్వించి అల్లుకుపోయే కాటుక తమాలపాకు పొదరేసోన
కాంత వలపుకు వశమైన సంజోగి ఎరుక
పగటింటి పాలరాతి నునుపు గద్దెలకెన్నడర్థమవుతది
అడవి నడిజామున కదునులేల్ల
పాలభాగమున పూసిన
మంకెన పూల పుప్పొడితో సూపులు
సానబెట్టుకొని సాగే
కంబయలి సంచారికి నిదురమానుల కూల్చి నిర్మించె
వంతెనగోడల ఎత్తులతో కొత్తగ ఒరిగేదేముంది
నేలగరిక పాలపుంతల లేకొసల తడిపూత
మేతలనే మేసె సాధుజీవుల రాకడను
పసిగట్టి కదిలే మెఖాల అడుగుల పరికించి
దయాలువై అపరాతిరి గోదరిల్లే తీతువ
పలువరింతకు పదం కలిపే వాడి బోధ
కంపరపు హైనాల చెవిసోకి వెనుదిగిరితె
ఎంత బాగుండు
పొత్తిటిలోని పిట్టగూటికి విష పురుగులతో
చేటు వాటిళ్లకుండ చెమ్మతో కదిలే కొమ్మల
కదలికతో కదును కలిపేవాడికి
నెనరులేని పన్నాగపు ఉచ్చుతాళ్ల కొరికే
ఉడుతల కిటుకు నెరగటం ఓటమేమీ కాదు
నవ్వే నది కొప్పులో పొంగె మెరుపు సుడులను
అవలీలగా ఈది వేగం పొదుముకున్న వాడి
నెలవంక విల్లు
మంచులేపనమద్దుకోవడమంటే మెతకపడటం కాదు
ఏనెదారి కోనలోయల్లో కాసింత
సలువుటెన్నెల వెదజల్లడం
శిశిరము ఆకులను రాల్పినట్టు
వనగుణ రాశిని వరుసపెట్టి మాయంచేసే
మెఖాల మంద ఎగేసే వాడి
యూప మంత్రదండపు హోమ సెగలనాపే
మేఘతారల మీరా పల్లవుల జల్లులు కాసింత రాలిన
చెరిగే నిప్పుల కొలుములు
శంకు భస్మధూపాలవుతాయి
కటు సీకటినైన కరిగించే గొరుకొయ్యల నవ్వును
అమాస పడగవిప్పి అడ్డుకుంటున్న వేళ
చిన్న మిణుగురు కాంతి అయిన దిక్కు చూపె దివ్వెనె
ఇప్పపూల ఈత పండ్లతొ అన్ని మరసి
దవ్వున నేగె మున్నాటి యోగుల నేలకు
నెర్రెలు జేయదలసిన
దిష్టి కళ్ళ ఇంద్రజాలికుని పొరలు
ఏ మెరుపుతీగ ప్రసరింతకైన తొలగి
కరుణ మొగ్గ తొడిగితె బాగుండు
వెదురు బొంగుల మంచెపై పరుసుకున్న
వెన్నెల గుమ్మడి పూతన వాలిన తేనిగ
చిన్ని రెక్కల చిదిమేస్తున్న ఇనుప సువ్వల
వడగాడ్పుల గాంచి కంపించి కదిలిపోయే తీగలెన్నో
ఇరుకు రాతి గోడల ఇటుక పొడిగ మార్చే
తిరగలి దీవెన దీపం సీకటి గుయ్యారపు
దారి పెదవిన వేకువ నవ్వుల వెలిగించేందుకు
కాలం ద్వారక మాయి వైపు పయనిస్తున్నది
- గోరటి వెంకన్న
‘జీవాళి’ వ్యాస సంపుటి ఆవిష్కరణ
మరువం చర్చావేదిక, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో వయోలిన్ కళాకారులు ద్వారం దుర్గా ప్రసాద రావు సంగీతం సాహిత్యం ఇతర విషయా లపై రాసిన వ్యాస సంపుటి ‘జీవాళి’ ఆవిష్క రణ సభ, చర్చా కార్యక్రమం మే 16 సా.6 గంటలకు రవీంద్ర భారతి మినీ హాల్, హైదరాబాద్‌లో జరుగుతుంది.
-సుమనస్పతి రెడ్డి
‘జీవజలం చలం’ స్మారకోపన్యాస సభ
చలం జయంతి సందర్భంగా ‘జీవజలం చలం’ సాహిత్య స్మారకోపన్యాస సభ మే 18 సా.6గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాలు, హైదరాబాద్‌లో జరుగుతుంది. చలం ‘స్త్రీ’, ‘ప్రేమలేఖలు’ గ్రంథాలపై కె.ఎన్. మల్లీశ్వరి, నెల్లుట్ల రమాదేవి ప్రసంగిస్తారు. మామిడి హరికృష్ణ ఆప్తవాక్యం పలుకుతారు. చలం స్త్రీ, ప్రేమలేఖలలోని కొన్ని ముఖ్య భాగాలను– సలీమా, లక్ష్మీ అసిరెడ్డి, దాసోజు పద్మావతి, శ్రీభాష్యం అనురాధ, నస్రీన్ ఖాన్‌లు వినిపిస్తారు. వివరాలకు: 94404 51960
-నాళేశ్వరం శంకరం
భూపతి చంద్ర కథానికా పురస్కారాలు
‘భూపతి చంద్ర’ మెమోరియల్ ట్రస్ట్ కథానిక పురస్కారాల ప్రదాన సభ మే 18 సా.5.30గంటలకు దేవులపల్లి రామానుజరావు కళామందిరం, తెలంగాణ సారస్వత పరిషత్తు, హైదరాబాద్‌లో జరుగుతుంది. అధ్యక్షత ఎమ్.ఎల్. కాంతారావు; ముఖ్య అతిథి కె. రామచంద్ర మూర్తి; అతిథులు మన్నవ సత్యనారాయణ, బి. నర్సింగ రావు; సభా నిర్వహణ సి.ఎస్. రాంబాబు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమానాలను వరుసగా చాగంటి ప్రసాద్, మధుపత్ర శైలజ, కొండి మల్లారెడ్డి అందుకుంటారు. ప్రోత్సాహక పురస్కారాలను ఎం. శ్రీనివాసరావు, గొర్తివాణి శ్రీనివాస్, కామరాజుగడ్డ వాసవదత్త రమణ, ఎస్. గంగాలక్ష్మి, పప్పు శాంతాదేవి అందుకుంటారు.
- ఎమ్. ఎల్. కాంతారావు