Trumps Tariff Battle: సుప్రీంలో సుంకాల పోరు
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:23 AM
మిగతా ప్రపంచంమీద తాను సాగిస్తున్న సుంకాల సమరం అమెరికా ప్రయోజనాల పరిరక్షణకే కాదు, యుద్ధనివారణకూ, ప్రపంచశాంతికీ కూడా అత్యంత ముఖ్యమని సుప్రీంకోర్టులో...
మిగతా ప్రపంచంమీద తాను సాగిస్తున్న సుంకాల సమరం అమెరికా ప్రయోజనాల పరిరక్షణకే కాదు, యుద్ధనివారణకూ, ప్రపంచశాంతికీ కూడా అత్యంత ముఖ్యమని సుప్రీంకోర్టులో ట్రంప్ చెప్పుకున్నారు. దిగుమతులపై సుంకాలు విధించేందుకు ఫెడరల్ చట్టాల ప్రకారం అధ్యక్షుడికి విస్తృతమైన అధికారాలున్నాయని ట్రంప్ ప్రభుత్వం వాదించింది. ఆర్థిక అత్యయిక అధికారాలు వాడి సుంకాలు ప్రయోగించడం చట్టవిరుద్ధమంటూ అప్పీల్స్‌కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో, ట్రంప్ ప్రభుత్వం అమితవేగంతో సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పాటు, వెంటనే విచారణ ఆరంభించి, తీర్పు త్వరితంగా వెలువడేట్టు చూడాలని కూడా విజ్ఞప్తి చేసుకుంది. ఐదునెలలుగా విదేశాలతో సాగిస్తున్న చర్చలను, సాధించిన విజయాలను దిగువకోర్టుతీర్పు అనిశ్చితిలో పడేస్తుందని ట్రంప్ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారతదేశాన్ని అదనపు సుంకాలతో శిక్షిస్తూ ఉక్రెయిన్‌లో రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నట్టు సుప్రీంకోర్టులో ట్రంప్ ప్రభుత్వం చెప్పుకుంది. దిగువకోర్టు అంటున్నట్టుగా ట్రంప్ తన పరిధినేమీ అతిక్రమించలేదని, ప్రపంచ దేశాలన్నింటినీ కొత్త ఒప్పందాలకు దిగివచ్చేట్టుచేసి అమెరికాను ఆర్థికంగా వెలిగేట్టు చేస్తున్నారనీ, ఈ టారిఫ్‌లు కనుక లేకుంటే అమెరికా ఏడాది క్రితం వరకూ ఉన్నట్టుగా ఇకపై శాశ్వతంగా పేదదేశంగానే మిగిలిపోతుందని ప్రభుత్వం వాదన. తాము అధికారంలోకి వచ్చిన తరువాతే దేశం కళ్ళుతెరిచిందనీ, వెలుగుతున్న దేశాన్ని చూసి మిగతా ప్రపంచం అసూయపడుతోందనీ, కుట్రలు చేస్తోందని నాయకులు చెప్పుకోవడం సహజమేకానీ, న్యాయస్థానాలు అవును నిజమేనంటాయా? అన్నది ప్రశ్న.
1977 నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాలచట్టం (ఐఈఈపీఏ) వాడి సుంకాలు ప్రయోగించినప్పటినుంచీ ట్రంప్ చర్యమీద చర్చ జరుగుతూనే ఉంది. ట్రంప్ టారిఫ్‌లు చట్టవిరుద్ధమంటూ దాఖలైన పిటిషన్లపై తొలిగా విచారించిన అమెరికా వాణిజ్య న్యాయస్థానం ఆయనకు విదేశీ వాణిజ్యంతో చిత్తం వచ్చినట్టు వ్యవహరించగల విశేషాధికారాలేమీ లేవని మూడునెలల క్రితమే తేల్చేసింది. అప్పీల్స్‌కోర్టు మరునాడే ఆ తీర్పును నిలిపివేసి ట్రంప్‌కు తాత్కాలికంగా ఊరట కలిగించినా, ఇప్పుడు మంచి మెజారిటీతో కిందికోర్టు మాటే సరైనదని నిర్థారించింది. జిమ్మీకార్టర్ కాలంలో తయారై, ఇప్పటివరకూ ఏ అధ్యక్షుడూ వినియోగించని ఈ ఆర్థిక అత్యయిక చట్టాన్ని వాడి ట్రంప్ మిగతా ప్రపంచంతో యుద్ధం చేస్తున్నాడు. ఈ పురాతన చట్టంతో తాను న్యాయస్థానాల్లో నెగ్గుకురాగలనో లేదో ట్రంప్‌కు తెలియకపోయినా న్యాయనిపుణులు తెలియచెప్పకుండా ఉండరు. తన చర్య చట్టబాహ్యమైనది అయినప్పటికీ, ట్రంప్‌కు కావల్సింది సామాన్యజనంలో రక్షకుడని అనిపించుకోవడం. గత పాలకుల చేతగానితనం వల్ల దుర్భరమైన పేదరికంలో కడుదీనాతిదీనంగా బతుకీడుస్తున్న అమెరికాను తిరిగి వెలుగుజిలుగుల అగ్రరాజ్యంగా ఉన్నతంగా నిలబెట్టే పేరిట ఆయన ఎన్ని విన్యాసాలైనా చేస్తాడు. ఏప్రిల్ 2న ‘లిబరేషన్ డే’ పేరిట ఆయన అక్షరక్రమంలో ప్రతీదేశానికీ టారిఫ్‌లు విధించిన దృశ్యం చూసినవారికి ఆయనకు దేశాన్ని తీర్చిదిద్దడంకంటే తాను గ్రేట్ అనిపించుకోవడం ప్రధానమని అర్థమైంది. మిగతా ప్రపంచంతో పోరాడుతున్నానని ఆయన అంటూంటే, ఆయన మీద రాష్ట్రాలు, వాణిజ్య సంస్థలు, వేదికలు న్యాయపోరాటం చేస్తూ ఒక్కోమెట్టూ ఎక్కుతున్నాయి. ట్రేడ్‌కోర్టు తీర్పులోనూ, ఇప్పుడు అప్పీల్స్‌కోర్టు తీర్పులోనూ ఆయనకు రాజకీయ కుట్రలూ, తనపట్ల ద్వేషం, దేశంపట్ల న్యాయమూర్తుల బాధ్యతారాహిత్యం కనిపించాయి. సుంకాలను సంధించి శాంతిని సాధిస్తున్నానంటూ భారత్–పాక్ యుద్ధాన్ని కూడా ఆయన గతంలో న్యాయస్థానంలో వాడుకున్నాడు. దౌత్యం కంటే, చర్చలకంటే సుంకాల సమరమే సర్వరోగనివారిణి అని ఆయన నమ్ముతున్నాడు. ఎంతటి మొండిదేశాన్ని అయినా టారిఫ్‌వార్‌తో లొంగదీయగలనని గర్విస్తున్న ట్రంప్‌కు ఇది మరింత పెద్ద ఎదురుదెబ్బ. అమెరికన్ కాంగ్రెస్‌లో ఎటువంటి చర్చా చేయకుండా, దానిని పక్కకునెట్టేసి, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్‌కు రేపు సర్వోన్నత న్యాయస్థానంలో కూడా ఇదే పరిస్థితి ఎదురైతే నైతికంగా ఓడిపోయినట్టే.