Global Politics: ఇంటా బయటా నాయకత్వ శూన్యతే
ABN , Publish Date - Jun 18 , 2025 | 02:45 AM
ప్రపంచ రాజకీయాల్లో నాయకత్వ శూన్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. అణు కార్యక్రమాన్ని చేపడుతోందన్న పేరుతో ఇరాన్‌పై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ దుస్సాహసానికి అడ్డుకట్ట వేసేవారు కనపడడం లేదు. ఇజ్రాయెల్ చెబుతున్నట్లు అమెరికా వింటోందా....
ప్రపంచ రాజకీయాల్లో నాయకత్వ శూన్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. అణు కార్యక్రమాన్ని చేపడుతోందన్న పేరుతో ఇరాన్‌పై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ దుస్సాహసానికి అడ్డుకట్ట వేసేవారు కనపడడం లేదు. ఇజ్రాయెల్ చెబుతున్నట్లు అమెరికా వింటోందా, లేక అమెరికా చెప్పినట్లు ఇజ్రాయెల్ నడుచుకుంటుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇజ్రాయెల్‌లో పదవి కోల్పోయే పరిస్థితిలో ఉన్న సమయంలో హమాస్‌పై దాడులు చేసి తన రాజకీయ అధికారాన్ని నిలుపుకున్న నెతన్యాహు ఇప్పుడు తన మనుగడకోసం ఇరాన్‌లో విధ్వంసానికి పూనుకుంటున్నాడు. గతంలో ఇజ్రాయెల్ ఇలాంటి దాడులకు పాల్పడినప్పుడు అమెరికా అడ్డుకట్ట వేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పే మాటలు వినేవారెవరూ కనపడడం లేదు. ఐక్యరాజ్య సమితి ఒక నామమాత్ర సంస్థగా మారిపోయింది. నిజానికి ప్రపంచంలో అనేక దేశాలు అణ్వస్త్ర తయారీ కార్యక్రమాలను చేపట్టినప్పుడు ఏ దేశమూ మరో దేశాన్ని ఆపలేకపోయింది. ప్రస్తుత విదేశాంగమంత్రి జైశంకర్ తండ్రి, జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్‌గా ఉన్న రక్షణ వ్యూహ నిపుణుడు కె. సుబ్రహ్మణ్యం సలహా మేరకు భారతదేశం అణు పరీక్షలు చేపట్టిన తర్వాతే ఒక బలమైన దేశంగా రూపొందింది. అణ్వస్త్ర దేశాల శ్రేణిలో చేరినప్పుడే భారత్ ఒక బలమైన శక్తిగా మారుతుందని దీనివల్ల మనం ప్రత్యర్థులను నిలువరించగలుగుతామని సుబ్రహ్మణ్యం ఇచ్చిన సలహా అత్యంత విలువైనది. పలు దేశాలు అణు శక్తులుగా మారినప్పుడే ఒక సమతుల్యత ఏర్పడుతుందన్న అభిప్రాయానికి అన్ని దేశాలూ వచ్చాయి. అయితే ఇరాన్ అణ్వస్త్ర తయారీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ ఆ దేశంలో రక్తపాతానికి పూనుకున్నది. ప్రపంచంలో ఏ దేశమూ ఇజ్రాయెల్‌ను ఆపలేని పరిస్థితిలో ఉన్నది. ఈ యుద్ధం ఎన్నాళ్లు కొనసాగుతుందో. ఇది ఏ పర్యవసానాలకు దారితీస్తుందో చెప్పలేము. రష్యా, చైనా, ఇస్లామిక్ దేశాల కదలికలను కూడా ప్రపంచం ఆసక్తితో గమనిస్తోంది. అమెరికా ఈ యుద్ధ నివారణలో విఫలమైతే ప్రపంచ రాజకీయాల్లో నాయకత్వ పాత్రను పూర్తిగా కోల్పోక తప్పదు. ఈ వ్యవహారంలో భారతదేశం ప్రేక్షక పాత్ర వహించక తప్పడం లేదు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఇజ్రాయెల్‌తో స్నేహం చేస్తూనే పాలస్తీనా ప్రయోజనాలను కాపాడేందుకు ప్రయత్నించారు.
పాలస్తీనా విమోచనోద్యమనేత అరాఫత్‌ను భారత్‌కు అహ్వానించారు. మన విలువలకు, ప్రయోజనాలకు మధ్య ఐక్యత సాధించినప్పుడే మన విదేశాంగ విధానం విజయవంతమవుతుంది. ఇజ్రాయెల్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేసినంత మాత్రాన ఆ దేశ పద్ధతులను మనం సమర్థించాలని ఎక్కడా లేదు. ప్రధాని మోదీ ప్రభావదాయక దేశాలతో స్నేహం చేసి భారత్‌ను ఒక అగ్రగామి శక్తిగా మార్చేందుకు శాయశక్తులా కృషి చేశారు. ప్రపంచ రాజకీయాల్లో ఒక నిర్ణాయక శక్తిగా మారేందుకు మనకు ఎన్నో అవకాశాలున్నాయి. 140 కోట్ల మంది వినియోగదారులతో బలమైన మార్కెట్ శక్తిగా అవతరించిన భారతదేశం ప్రపంచ రాజకీయాల్లో ఒక నిర్దిష్ట పాత్ర పోషించగల స్థాయికి చేరుకోవాల్సిన అవసరం ఉన్నది. విచిత్రమేమంటే అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం తర్వాత భారత రాజకీయాలు ఎందుకో స్తబ్ధంగా మారినట్లు కనిపిస్తున్నాయి. నరేంద్రమోదీ 11 సంవత్సరాల పాలనపై బీజేపీ విజయోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో ఈ దుర్ఘటన సంభవించడంతో పార్టీ నేతల ఉత్సాహం నీరు కారినట్లయింది. ఆ తర్వాత మోదీ సైప్రస్‌తో పాటు మూడు దేశాల పర్యటనకు బయలు దేరితే ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ యూరప్‌లో ఏదో దేశానికి వ్యక్తిగత పర్యటన నిమిత్తం వెళ్లారు. రాహుల్ పార్టీ అధ్యక్షుడు కాకపోయినా ఆయన లేకపోతే కాంగ్రెస్ పార్టీలో స్తబ్ధత కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ఆయన సోదరి ప్రియాంకాగాంధీ కేరళలో ఉప ఎన్నికల్లో తలమునకలై ఉన్నారు. భారతీయ జనతా పార్టీలోనూ, కాంగ్రెస్ పార్టీలోనూ చాలా నిర్ణయాలు పెండింగ్‌లో పడినట్లు ఆ పార్టీల నేతలు చెబుతున్నారు. బీజేపీకి సంబంధించి కొన్ని రాష్ట్రాల అధ్యక్షులతో పాటు జాతీయ అధ్యక్షుడు, పార్టీ ఆఫీసుబేరర్ల నియామకం ఎప్పుడు జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ విషయానికి వస్తే కర్ణాటకలో నామినేటెడ్ ఎమ్మెల్సీలకు అభ్యర్థుల ఎంపిక నుంచి రాష్ట్రాల్లో పార్టీని పటిష్ఠం చేసే కార్యక్రమం కూడా పెండింగ్‌లో పడ్డట్లు కనపడుతోంది. ఈ రెండు జాతీయ పార్టీల ప్రధాన కార్యాలయాల్లో నేతల కదలికలు పెద్దగా లేవు. ఇదిలావుంటే భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి పథంలో సాగుతున్నదని నేతలు చేస్తున్న ప్రకటనలు ఒక ఉత్సాహాన్ని కలుగచేస్తున్నాయి. భారత్ త్వరలో ప్రపంచ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైప్రస్‌లో వ్యాపారవేత్తలతో మాట్లాడుతూ ప్రకటించారు.
సరిగ్గా నెల రోజుల క్రితం భారతదేశం జపాన్‌ను అధిగమించి నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. అమెరికా, చైనా, జర్మనీల తర్వాతి స్థానం భారత్‌దే అని ఆయన అన్నారు. మన దేశం నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారితే అంతకంటే కావల్సింది ఏముంటుంది? నిజంగా 4,186.43 బిలియన్ డాలర్ల జపాన్ జీడీపీతో పోలిస్తే 4,187,03 బిలియన్ డాలర్ల జీడీపీని సాధించిన భారతదేశం ఘనతను కాదనలేము. మరో మూడేళ్లలో మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి పూర్తిగా వికసిత్ భారత్‌గా భారత్ అవతరిస్తుందనే ప్రకటనలనూ కొట్టి పారేయలేము. గత 11 సంవత్సరాల్లో దేశంలో జరిగిన రహదారులు, రేవులు, విమానాశ్రయాల నిర్మాణం, డిజిటలీకరణ వంటి సాంకేతిక అభివృద్ధి, పెరుగుతున్న వినియోగదారుల సంఖ్య, ఉత్పాదక, సేవల రంగాల విస్తృతి కూడా చెప్పుకోదగ్గది. భారతదేశం అనేక రాష్ట్రాల సముదాయం కనుక మన దేశంలో అభివృద్ధి సమానంగా ఉండదు. రాష్ట్రాల రెవిన్యూ వసూళ్లు, స్వంత పన్నుల సేకరణ చెప్పుకోదగ్గ విధంగా లేవు. అయినప్పటికీ జీడీపీ పెరుగుదల 6–7 శాతం మధ్య ఉంటూ వేగంగా పెరుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ గుర్తింపు పొందింది. కానీ ఈ పెరుగుదల 8–9 శాతం మధ్య ఉన్నప్పుడే మనం లక్ష్యాలకు చేరుకోగలం. అయినా ఒక దేశంలో జరుగుతున్న అభివృద్ధికి ఆ జీడీపీ కొలమానమా అన్నప్రశ్న ఎంతో విలువైనది. ఎందుకంటే జీడీపీకి ప్రజల బాగుగోగులకూ పెద్దగా సంబంధం ఉండదు. కొనుగోలు శక్తి రీత్యా భారత జీడీపీ ఇప్పటికే 15వేల బిలియన్ డాలర్లకు చేరుకుందని నీతి ఆయోగ్ ప్రకటించింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి ఎంతగా జరుగుతున్నా, దేశ శ్రామిక జనులలో 76 శాతం మంది వ్యవసాయ రంగంలోనూ, అసంఘటిత రంగంలోనూ దినసరి కూలీలుగా చాలీచాలని వేతనాలతో జీవితం గడుపుతున్న విషయం అందరికీ తెలిసిందే.
అందువల్ల ఎవరి కొనుగోలు శక్తిని జీడీపీకి కొలమానంగా తీసుకుంటున్నామన్న విషయం చర్చనీయాంశం. అంతేకాదు, మన దేశంలో ప్రపంచంలో అతిపెద్ద జనాభా రీత్యా మనం చెప్పుకుంటున్న జీడీపీని జనాభా ప్రకారం విభజిస్తే మన తలసరి జీడీపీ శ్రీలంక, భూటాన్, వియత్నాం, కెన్యా, మొరాకో, లిబియా, మారిషస్, దక్షిణాఫ్రికా తదితర దేశాల కంటే తక్కువే ఉన్నదన్న విషయాన్ని కూడా విస్మరించలేం. జీడీపీ రీత్యా భారత్‌ను నాల్గవ అతిపెద్ద దేశంగా పరిగణిస్తే తలసరి జీడీపీ రీత్యా మన దేశం 196 దేశాల్లో 127వ స్థానంలో ఉన్నదన్నది ఒక పచ్చి వాస్తవం. నిజానికి జపాన్‌ను మనం జీడీపీలో అధిగమించాము కానీ జపాన్ తలసరి ఆదాయం భారత్ తలసరి ఆదాయం కంటే 11.8 రెట్లు ఎక్కువ ఉంటుందని ఐఎంఎఫ్ తాజా అంచనా. జపాన్ స్థాయిలో తలసరి జీడీపీని సాధించాలంటే భారత్‌కు మరో 22 ఏళ్లు పడుతుందని నిపుణులు అంటున్నారు. అనేక యూరోపియన్ దేశాల కంటే భారత్‌లో తలసరి ఆదాయం వేగంగా పెరుగుతున్నప్పటికీ ఈ విషయంలోనూ మనకెన్నో సవాళ్లున్నాయి. పేదరికాన్ని తగ్గించడంలోనూ, సాంకేతిక ప్రగతిలోనూ మన దేశం చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది. జపాన్‌తో పోలిస్తే భారతదేశంలో ఉన్న అత్యధిక యువ జనాభా మనకు ఒక వరం. ప్రజల జీవన ప్రమాణాలు, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ, శాంతిభద్రతలు, మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాలు, ఆదాయ అసమానతల తగ్గుదల విషయంలో జపాన్ స్థాయికి మనం చేరుకోవడానికి ఎంతో కాలం పడుతుంది. అనేక ఇతర దేశాలతో పోలిస్తే ప్రైవేట్ రంగ పెట్టుబడులు మన దేశంలో అంత వేగంగా పెరగడం లేదు. జపాన్ లాగా బుల్లెట్ రైళ్లు, ఆధునిక పరిశ్రమలు, పరిశోధనలకు భారీ కేటాయింపులు, అత్యంత నైపుణ్యంతో కూడిన కార్మిక శక్తి మనకు లేవు. నైపుణ్యం లేని శ్రామికులు, సరీ సరిపోని మౌలిక సదుపాయాలు, విదేశాలకు అవకాశాల కోసం పరుగులెత్తే మన సాంకేతిక నిపుణులు, ఏ మాత్రం వినూత్న ఆవిష్కారాలు లేకపోవడం భారతదేశ బలహీనతలు. జీడీపీ పెరుగుదలను సమానంగా పంపిణీ చేసి నిజమైన అభివృద్ధిగా మార్చినప్పుడే మన దేశం విజయం సాధించినట్లు లెక్క.
సగటు జపానీ పౌరుడు సగటు భారతీయుడి కంటే 20 రెట్లు ఎక్కువ సంపాదిస్తాడని అంచనా. స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలు ప్రకటించినప్పటికీ అనేక చిన్నచిన్న దేశాలతో పోలిస్తే మన దేశంలో అపరిశుభ్రత, క్రమశిక్షణారాహిత్యం ఎక్కువ కనపడుతోంది. ఉపాధి రంగంలో ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని నివారించడం భారత్ ముందున్న తక్షణ ప్రధాన కర్తవ్యం. ముఖ్యంగా వ్యవస్థలను పారదర్శకంగా, నిజాయితీగా, అవినీతిరహితంగా పనిచేయించడంలో మన ప్రభుత్వాలు విఫలమయ్యాయి. అందుకు ప్రధాన కారణం మన రాజకీయ సంస్కృతి పూర్తిగా విఫల వ్యవస్థలపైనే ఆధారపడి ఉండడం. ఇంట గెలిచినప్పుడే రచ్చ గెలువగలనన్న విషయం మోదీకి తెలియనిది కాదు.
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)