Share News

దిగంబర కవిత్వంపై గిన్స్‌బర్గ్ ప్రభావం

ABN , Publish Date - Mar 10 , 2025 | 01:18 AM

1960 నుంచి 1975 మధ్య కాలంలో ప్రపంచ సాహిత్యంలో దాదాపు పది తిరుగుబాటు ఉద్యమాలు సంభవించటానికి కారణం నాటి సామాజిక...

దిగంబర కవిత్వంపై గిన్స్‌బర్గ్ ప్రభావం

1960 నుంచి 1975 మధ్య కాలంలో ప్రపంచ సాహిత్యంలో దాదాపు పది తిరుగుబాటు ఉద్యమాలు సంభవించటానికి కారణం నాటి సామాజిక పరిస్థితులే. ‘బీట్ జనరేషన్’, ‘గ్రే జనరేషన్’, ‘యాంగ్రీ యంగ్‌మెన్‌ మూమెంట్’, ‘వూండెడ్ యూత్’, ‘ప్రోవో మూమెంట్’, ‘హంగ్రీ జనరేషన్’, ‘ప్రొటెస్ట్ లిటరేచర్’, ‘దిగంబర కవిత్వం’, ‘బండయా కవిత్వం’... ఈ ఉద్యమాల్లోంచి ఉబికివచ్చిన కవిత్వమంతా ఒక బలమైన తాత్విక భూమికతో, విశ్వమానవ శ్రేయస్సు కోసం ఆవేదనతో రాసిన కవిత్వం.

సంక్లిష్టమైన ఇరవయ్యవ శతాబ్దపు ఆధునిక మనిషి ఆధ్యాత్మిక, మానసిక అణచివేతలను కవిత్వంలో వ్యక్తం చేసిన అత్యంత ఆధునిక అర్బన్ పొయెట్ అలెన్‌ గిన్స్‌బర్గ్‌. అమెరికాలో 1950ల బీట్ జనరేషన్‌లో అతను ఒక సాహిత్య సంచలనం. బీట్ కవిత్వ ఉద్యమంలోను, ఆ తర్వాత 1960ల హిప్పీ ఉద్యమంలోను కీలకపాత్ర పోషించాడు. తత్వశాస్త్రం, ముఖ్యంగా అస్తిత్వవాదం చేత ప్రభావితుడు. కవిత్వ అభివ్యక్తిలో మార్మికవాది.


మానవతావాదం, ఘాటైన పదజాలం, ఇతివృత్తపరంగా అధిక్షేపం... ఈ కోణాల్లోంచి చూసినప్పుడు అలెన్‌ గిన్స్‌బర్గ్ కవిత్వానికీ, తెలుగులో దిగంబరకవుల కవిత్వానికి కొంత సామ్యం కనినిపిస్తుంది. గిన్స్‌బర్గ్ 1962లో ఇండియాలో పర్యటించి ‘ఇండియన్ జర్నల్’ అనే గ్రంథాన్ని వెలువరించడమే గాక, ఆ పర్యటనలో పశ్చిమ బెంగాల్ వెళ్ళి హంగ్రీ జనరేషన్ కవులైన మలయ్ రాయ్ చౌదరి, సమీర్ రాయ్ చౌదరి, ఉత్పల్ కుమార్ బసులకు ప్రేరణ అందించాడు.

తెలుగులో దిగంబరకవులుగా దూసుకొచ్చిన ఆరుగురు నగ్నముని, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, చెరబండరాజు, మహస్వప్న, భైరవయ్యలు 1965లో మొదటి కవిత్వ సంపుటిని, 1966లో రెండవ, 1968లో మూడవ కవిత్వ సంపుటాలను వెలువరించారు. ఈ మూడు సంపుటాల్లోని కవిత్వం వెనుకా గిన్స్‌బర్గ్ స్ఫూర్తి కనిపిస్తుంది.

మొదటి సంపుటిలో దిగంబర కవితోద్యమ ఉద్దేశ్యాన్ని ఆ కవులు ఇలా చెబుతారు: ‘‘ఈ దేశంలో, ఈ గోళంలో ఊపిరిపీల్చే ప్రతిమనిషి ఉనికి కోసం తపనపడి అతడి భావిని చూసి వెక్కి వెక్కి ఏడ్చి, పిచ్చి ఎత్తి ప్రవచించిన కవిత. మేం ‘దిగంబరులం’. మంచి కోసం, మనిషి లోని నిప్పు లాంటి నిజమైన మనిషి కోసం, కపటం లేని చిరునవ్వులు చిందే సమాజం కోసం, అహోరాత్రులు ఆరని అగ్నిలో నడిచిన ఆత్మల లోంచి పలుకుతున్న గొంతుకలం.’’


బీట్ కవులు, దిగంబరకవులు ఒకే తాత్వికచింతనతో కవిత్వసృజన చేసినప్పటికీ దిగంబర కవులు బీట్ కవులచే ప్రభావితులై కవిత్వం రాశారా లేదా అనేది చర్చనీయాంశం. బీట్ జనరేషన్ తర్వాతి కాలంలోనే దిగంబరకవిత్యోద్యమం వచ్చినందున ఎంతో కొంత ప్రభావం ఉండివుంటుందని భావించవచ్చు.

ఇతర బీట్ కవుల కంటే గిన్స్‌బర్గ్ కవిత్వం తీవ్రమైన poetic forceతో ఉండి పాఠకుల్ని, విమర్శకుల్ని షాక్‌కు గురి చేసింది. అమెరికన్‌ జీవితం లోని అవినీతిని, క్రూర విషాదకర అమానవీయ సంఘటనల్ని తన కవిత్వం ద్వారా వ్యక్తపరిచి బీట్‌ కవుల కొత్త డీన్‌ (గురువు) అని ప్రశంశలందుకున్నాడు గిన్స్‌బర్గ్. తన కాలపు ఆధునికులు దేవుడి మీదనే కాదు, తమ మీద తాము కూడా నమ్మకం కోల్పోయి ఎలాంటి ఆధ్యాత్మిక విలువల్లేని యంత్రాల్లా జీవిస్తున్నారని వాపోతూ ‘హౌల్’ (పొలికేక/ ఊళ) అనే ఒక దీర్ఘకవితను సృజించాడు. ఆ కవిత ఇలా మొదలవుతుంది:


‘‘నేను చూశాను-

పిచ్చితో నాశనమై, ఆకలితో, ఉన్మాదంతో నగ్నంగా

తెల్లవారుజామున నీగ్రో వీధుల్లో తిరిగే నా తరం మేధావుల్ని...

రాత్రియంత్రాల నక్షత్రపు వెలుగులో

పురాతన స్వర్గపు తలంపులతో

దేవదూతల ముఖాలతో తిరిగే అతిస్వేచ్ఛావాదుల్ని

పేదరికంతో, చిరిగిపోయిన బట్టలతో జీవంలేని కళ్ళతో...

ఎత్తయిన చల్లటి నీటిగదుల్లో అతీంద్రియచీకట్లో

ధూమపానం చేస్తున్నవారిని...

వెర్రితో కపాలాలకిటికీలపై అశ్లీలకవితల్ని ప్రచురించినందుకు అకాడెమీల నుండి బహిష్కరింపపడ్డవారిని...

అపరిశుభ్రమైన గదుల్లో అర్ధనగ్నంగా డబ్బును చెత్తబుట్టల్లో తగులబెట్టి, గోడల్లోంచి బీభత్సాన్ని వింటున్నవాళ్ళని...’’

1956లో ‘హౌల్’ మహాకావ్య ప్రచురణతో గిన్స్‌బర్గ్ అమెరికాను దిగ్భ్రమకు గురిచేశాడు. అమెరికా సమాజం తన యువతరాన్ని ఎలా నాశనం చేసిందో భావగర్భితంగా వ్యక్తం చేసే ఈ కవితను అమెరికా ప్రభుత్వం నిషేధించింది. ‘హౌల్’ కవిత అమెరికాలో వ్యవస్థీకృత యాంత్రిక నాగరికతకు వ్యతిరేకంగా రాసిన మొట్టమొదటి నిరసన కవిత.


గిన్స్‌బర్గ్ లాగే దిగంబర కవి నగ్నముని కూడా సమాజంలో రోజురోజుకు దిగజారిపోతున్న విలువలను, ఆధునికమానవుని దుస్థితిని చూసి భరించలేని బాధతో ‘జైల్లో సముద్రం’ అనే అధివాస్తవిక కవిత రాశాడు. అందులో:- ‘‘మనిషిని మనిషిగా/ ఈ కృత్రిమ దుస్తుల్ని విప్పేసి/ నగ్నంగా నిశ్చలంగా సజీవంగా సాక్షాత్తు మానవుడిగా మట్టిలో పుట్టి మట్టిలో ఎదిగే/ మానవతా నక్షత్రం...’’ అని అంటాడు. నగ్నముని భాషలోను, కవిత్వతీవ్రతలోను, సామాజిక సంఘటనలకు ప్రతిస్పందించే గుణంలోను గిన్స్‌బర్గ్‌ను పోలి ఉంటాడు. ఈ ఇరువురి కవిత్వంలో ప్రవాహగుణం ప్రస్ఫుటం. గిన్స్‌బర్గ్ లాగే నగ్నముని కూడా కవిత్వంలో అత్యంత జుగుప్సాకరమైన భాషను వాడి తీవ్ర విమర్శలకు గురయ్యాడు. ‘కొజ్జాల కామకేళి చూస్తున్నాను’ అనే కవితలో: ‘‘అశ్లీలం పలుకుతోంది దిగంబరాక్షరం అంటున్నావు సిగ్గులేకుండా/ నీ మెదడు పురుగు తినేసింది/ నీ చర్మం కుళ్లిపోయింది/ నీ అవయవం పుచ్చిపోయింది...’’ అంటాడు.

సమాజమే వ్యక్తులను పనికిరానివాళ్ళుగా చేస్తుందని ఆరోపిస్తూ, యువత దిగజారడానికి కారణమైన సమాజంపై గిన్స్‌బర్గ్ లాగే దిగంబరకవులు తమ ఆగ్రహాన్ని, ఆవేదనను తీవ్రస్వరంతో వ్యక్తపరుస్తారు. మహస్వప్న ‘గ్లానిర్భవతి భారతః’ అనే కవితలో ‘‘మానవత రెండు కళ్ళు మూసుకు పోయినప్పుడు/ విప్పుకుంటున్న మూడో కన్నునై/ కాలం వాయులీనం మీద కమానునై/ చరిత్ర నిద్రా సముద్రం మీద తుఫానునై/ నేను వస్తున్నాను దిగంబర కవిని...’’ అంటాడు. ‘చెరచబడ్డగీతాన్ని’ అనే కవితలో మరో దిగంబర కవి భైరవయ్య మనుషులు యాంత్రిక జీవన విధానాలకు దూరంగా ఉండాలని గిన్స్‌బర్గ్ లాగే ఉద్బోధిస్తాడు: ‘‘నేను చెరచబడ్డ గీతాన్ని/ నగ్నంగా నడివీధిలో కాటేసిన భూతాన్ని/ స్వార్థపు కాంక్రీటు తొడలమధ్య/ నలిపివేయబడ్డ రాగాన్ని.’’ ఈ కవితలోని ‘నేను’ అన్న మాట మానవత్వాన్ని, సమాజాన్ని, కవిత్వాన్ని, మనిషిని సూచిస్తుంది. మానసిక దిగంబరత్వం కోసం నిత్యసచేతన ఆత్మస్ఫూర్తితో జీవించడమే ఆశయంగా చెప్పుకున్న దిగంబరులు గిన్స్‌బర్గ్ లాగే తమ కావ్యరచనలో జీవితంలోని నిజాయితీని, సరళత్వాన్ని, యుగసందేశాన్ని, అనుభూతుల అభివ్యక్తిని ఊపిరిగా పీల్చగల ఆధునికమానవుని అస్తిత్వాన్ని ఆవిష్కరిస్తారు. నిఖిలేశ్వర్ ‘ఆత్మయోని’ అనే కవితలో- ‘‘దిగంబర కవితలో మరొకడు -మరొకడు/ నిండుగా నిజంగా ఊపిరి పీల్చేవాడు/ ఆత్మయోని నుండి పుట్టుకొస్తాడు’’ అంటాడు. చెరబండరాజు ‘నా మనుష్య ప్రపంచంలోకి’ అనే కవితలో ‘‘మంచి చచ్చి పుచ్చిన మానవతలో/ శవాలుగా మిగిలిన మనుషుల ఆశల చరమశ్వాసలుగా చూసి జాలిపడి/ వారి వెన్నుపూసలుగా మారి వారిని నిలబెడుతున్నాయి’’ అంటూ కవిత్వ నిబద్ధతకి నిలువెత్తు నిదర్శనమౌతాడు.


అప్పటివరకు చెలామణీలో ఉన్న కవిత్వ నిర్మాణ సూత్రాలను చెరిపేసి పొడవైన వాక్యాలు రాసిన అధివాస్తవిక కవి గిన్స్‌బర్గ్‌. ఛందోబద్ధ వాక్యనిర్మాణానికి తిరుగుబాటుగా ‘హౌల్’ మొదటి భాగంలో 75 పంక్తుల సుదీర్ఘ వాక్యాన్ని రాస్తాడు. అశ్లీల పదాలను కూడా కవిత్వీకరిస్తాడు. గిన్స్‌బర్గ్ లాగే అశ్లీలపదాల్ని కవిత్వంలో విస్తారంగా ఉపయోగించి వివాదాస్పదమైనారు దిగంబరకవులు. జుగుప్స కలిగించే సమాజాన్ని ప్రతిబింబించాలంటే అలాంటి భాషను, ప్రతీకల్నే వాడాలన్న దిగంబరుల వాదనను ఆరుద్ర, కొడవటిగంటి లాంటి కొద్దిమంది ప్రముఖులు సమర్థించారు. మానవుని ఉనికి కోసం తపనపడుతూ రాసిన కవిత్వమే కానీ తమ భాషలో జుగుప్స లేదంటాడు బైరవయ్య. ‘‘బూతును అస్పృశ్యంగా చూడడానికి మనలో ఉన్న ఒక రకమైన పిరికితనం కారణం. దిగంబర కవితలోని బూతుపదాల స్పందన సెక్స్ వైపుకు వెళ్ళనీయదు. సమాజాన్ని ఉన్నదున్నట్లుగా చిత్రించడమే దిగంబర కవిత’’.


అంతిమంగా గిన్స్‌బర్గ్ గానీ, దిగంబర కవులు గానీ తమ లక్ష్యాన్ని పూర్తిగా చేరుకోలేదు. బీట్ కవులు వ్యక్తిగత విభేదాల కారణంగా విడిపోగా, దిగంబరకవులు ఐదేళ్ల వరకు తమ నిరసన స్వరంతో కలిసి ప్రయాణం చేశారే కానీ ఆ తర్వాత ఆ ఉద్యమాన్ని కొనసాగించలేకపోయారు. వారు ఇతర తెలుగుకవుల్ని ప్రభావితం చేయలేక పోవడమే కాక, వారి అభిప్రాయాలతో, కవిత్వంతో పాఠకులు ఏకీభవించలేదని అర్థం చేసుకున్నారు. ఏ నిరసన కవైనా ప్రజల్లోకి చేరితే తప్ప ప్రభావవంతంగా ఉండలేడని గ్రహించి 1970లో విరసం ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. దిగంబరోద్యమం దిగంబర కవులచే ప్రారంభించబడి వారితోనే ముగిసిందని చెప్పొచ్చు.

(మార్చి 12తో దిగంబర కవిత్వానికి 60 ఏళ్ళు)

బాణాల శ్రీనివాసరావు

94404 71423

For Telangana News And Telugu News

Updated Date - Mar 10 , 2025 | 01:18 AM