Gen Z Revolution Shakes Nepal: నేపాల్‌లో యువ ప్రభంజనం
ABN , Publish Date - Sep 09 , 2025 | 04:44 AM
సోషల్ మీడియాపై ప్రభుత్వ నిషేధాన్ని నిరసిస్తూ నేపాల్‌లో యువతరం చేపట్టిన ఉద్యమాన్ని మీడియా జెన్ జీ రివల్యూషన్’గా అభివర్ణిస్తోంది...
సోషల్ మీడియాపై ప్రభుత్వ నిషేధాన్ని నిరసిస్తూ నేపాల్‌లో యువతరం చేపట్టిన ఉద్యమాన్ని మీడియా ‘జెన్ జీ రివల్యూషన్’గా అభివర్ణిస్తోంది. వేలాదిమంది యువతీయువకులు ఏకంగా పార్లమెంట్ భవనం మీదకు లంఘించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రభుత్వ బలగాలు ఏకంగా కాల్పులకు తెగబడటంతో పదహారుమంది మరణించారనీ, వందలాది మంది గాయపడ్డారని వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వం తరహాలో నేపాల్‌లో ఓలి తీవ్ర దమనకాండకు పాల్పడుతున్నా యువత వెనకడుగువేయడం లేదు. పాతికకుపైగా సామాజిక వేదికలు నిషేధానికి గురైన వెంటనే, ఒక ప్రధాన నాయకుడంటూ లేకపోయినా, టిక్‌టాక్ ఆధారంగా ఇంతటి భారీ స్థాయి జనసమీకరణతో సాగుతున్న ఈ ఉద్యమం ఓలి ప్రభుత్వాన్ని దిగివచ్చేట్టు చేస్తుందా, ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితులు ఏర్పడతాయా అన్నది చూడాలి. ఓలి ప్రభుత్వం చైనా యాప్‌లను అనుమతించి, అమెరికా సోషల్ మీడియాను నిషేధించడంతో ఈ ఆగ్రహం వెల్లువెత్తిందనీ, ఉద్యమం వెనుక అమెరికా కుట్ర ఉన్నదన్న విమర్శలను అటుంచితే, అమెరికా కంపెనీలు నేపాల్ నిబంధనలకు, చట్టాలకు అనుగుణంగా నడుచుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిన మాట వాస్తవం. అన్ని సోషల్‌మీడియా సంస్థలు నేపాల్‌లో నమోదు కావాలనీ, స్థానిక ప్రతినిధి, ఫిర్యాదుల పరిష్కర్త వంటి అధికారులను నియమించాలంటూ గత ఏడాది నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశించింది. తదనుగుణంగా నేపాల్ రూపొందించిన నిబంధనలకు చైనా యాప్‌లు రిజిస్టర్ చేసుకున్నాయి కానీ, ప్రధాన ప్లాట్‌ఫామ్‌లు దిగిరాలేదు. నేపాల్ ప్రభుత్వం పలుమార్లు గడువులు పెంచుతూ చివరకు సెప్టెంబర్ 4న 26 అప్లికేషన్లను బ్లాక్ చేసింది. ప్రధానంగా అమెరికన్ సంస్థలు మా దేశ చట్టాల పట్ల ఇలా అగౌరవంగా వ్యవహరించడంతో, ఈ చర్యద్వారా నేపాల్ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నదని ప్రభుత్వం చెబుతోంది. నేపాల్‌లో దాదాపు కోటి ముప్పైఐదులక్షల మంది ఫేస్‌బుక్ వినియోగదారులున్నారు. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి అప్లికేషన్లకు లక్షలాదిమంది ఉన్నారు. ఇప్పుడు ఉద్యమిస్తున్న యువతరం సోషల్ మీడియాకు బానిసలు అయిపోవడంతో ఆత్మాభిమానాన్ని కూడా వదిలేసి, ఇలా రోడ్లమీదకు వచ్చారని కొందరు చులకనగా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా ఈ జెన్ జనరేషన్‌కు ఉల్లాసం, ఉత్సాహంతో పాటు ఉపాధికూడా ఇస్తున్నది. సమస్త సమాచారాన్ని అరచేతిలో చూడగలగడంతోపాటు, ఈ నెట్‌వర్క్ ద్వారా వ్యాపారాలు చేసుకుంటూ, పలువిధాలుగా ఆదాయాలను సంపాదించుకుంటున్న యువత పెద్దసంఖ్యలో ఉన్నారు. స్వదేశంలో ఉపాధిలేక సంపాదనకోసం ఇతర దేశాలకు తరలిపోయిన లక్షలాది మంది నేపాలీ యువత తమ కుటుంబీకులతో, బంధుమిత్రులతో సంభాషించే అవకాశాన్ని కూడా కోల్పోతారు.
నిర్దిష్టమైన ఎజెండా, డిమాండ్లు లేనట్టు పైకి కనిపిస్తున్నప్పటికీ, సోషల్ మీడియాను పునరుద్ధరించాలన్న నినాదం మరింత విస్తరించి, ఇప్పుడు పాలకుల అవినీతినీ, బంధుప్రీతినీ కూడా ప్రశ్నిస్తోంది. పాలకుల, వారి పుత్రరత్నాల విలాసవంతమైన జీవితాలను సామాన్యుల బతుకు కష్టంతో పోలుస్తూ ‘నెపో బేబీ’ వంటి ట్రెండ్స్ విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. ‘నాయకుల పిల్లలు విమానాల్లో వస్తారు, సామాన్యుల పిల్లలు శవపేటికలో తిరిగివస్తారు’ వంటి నినాదాలు ప్రజలను ప్రభావితం చేస్తాయి. రాబడికోసమో, రాజ్యాంగ నిబంధనలకోసమో సామాజిక మాధ్యమాలను నిషేధించలేదని, పాలకుల అవినీతి ప్రజలకు తెలియకుండా, వారిపై విమర్శలు, ప్రశ్నలు వ్యాప్తిచెందకుండా, ఈ నిషేధం అమలు చేశారని ఉద్యమకారుల అభిప్రాయం. సామాజిక మాధ్యమాలతోనే పలు దేశాల్లో అవినీతి ప్రభుత్వాలు కూలిపోయినందున నేపాల్ పాలకులు భయపడుతున్నారని వారంటారు. నిప్పంటూ అంటుకున్నాక అది ఎంతకాలం మండుతుందో, ఎక్కడికి పాకుతుందో, వేటిని తగలబెడుతుందో చెప్పలేం. నేపాల్‌లో యువతరం తన గుండెలను మండిస్తున్న అంశాలన్నింటినీ ఇప్పుడు ముందుపెడుతోంది. దేశ సమూల ప్రక్షాళనకు నడుంబిగిస్తోంది. తమ అధికారకాంక్షతో ఓలి, ప్రచండ నేపాల్ రాజకీయాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించారు. ఒకరి కుర్చీ ఒకరు లాగుతూ రాజ్యాంగాన్నీ, చట్టాలను అపహాస్యం చేస్తూంటే, మిగతాపక్షాలన్నీ అధికారకోసం, అవినీతిలో వాటాకోసం వీరితో వంతులవారీగా చేతులు కలుపుతున్నాయి. నేపాల్ ప్రజలు అనతికాలంలోనే ప్రజాస్వామ్యం మీద నమ్మకం కోల్పోయారు. మళ్ళీ రాజుగారు రావాలంటూ అక్కడ ఉద్యమం మొదలైంది కూడా. యువత ఆందోళనలకు తలొగ్గి, ఆత్మగౌరవాన్ని కూడా వెనక్కునెట్టి, సోషల్ మీడియాపై నిషేధాన్ని ఓలి ప్రభుత్వం ఎత్తివేయవచ్చు. కానీ, ఈ ఉద్యమం నేపాల్ అధికారపక్షాలన్నింటికీ ఒక బలమైన హెచ్చరిక.