Share News

Gaza Crisis: శోకధ్రువ ప్రపంచంలో గాజాకాష్ఠం

ABN , Publish Date - Jul 29 , 2025 | 03:16 AM

గాజాను తలచుకుంటే తల తిరిగి పడిపోతామేమో, గుండె పగిలి చస్తామేమో నన్న భయంతో ప్రపంచం అటువైపు..

Gaza Crisis: శోకధ్రువ ప్రపంచంలో గాజాకాష్ఠం

గాజాను తలచుకుంటే తల తిరిగి పడిపోతామేమో, గుండె పగిలి చస్తామేమో నన్న భయంతో ప్రపంచం అటువైపు కన్నెత్తి చూడడం లేదనిపిస్తోంది. ఇరవై మాసాల కాలంలో 70,000 మందిని, అత్యధికంగా పిల్లలను, మహిళలను బలి తీసుకున్న ఇజ్రాయెల్, దాని వెన్ను దన్ను అమెరికా అచ్చోసిన ఆంబోతుల్లా విశ్వం నడివీధుల్లో బోర విరుచుకు తిరుగుతున్నాయి. ఈ ఘన కార్యానికి గాను ట్రంప్‌కి ఈ ఏడాది నోబెల్‌ బహుమతి ఇవ్వాలని నరహంతకుల్లో నంబర్ వన్ జాబితాలో చేరిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ సిఫారసు చేశాడు, పులికి తోడేలు వంత పాడినట్టు!


గాజా నేడొక నరరక్త జీవనది. ఈ రోజుటి లెక్క రేపటికి మాయమై మృతుల కొత్త సంఖ్య తెర మీదికి వస్తున్నది. చైనా, రష్యా సహా ఎవరూ దీనికి అడ్డుకట్ట వేయలేకపోవడం కంటే దయనీయస్థితి ఉండదు. అందుకే గాజాలో ఈ నిరంతర అగ్నివర్షం ఒక కలలా అనిపిస్తున్నది, మనం మానవేతర అమానుష సమాజంలో బతుకుతున్నామనే నమ్మలేని నిజం కళ్లకు కడుతున్నది. ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రదర్శనలతో అమెరికా విశ్వవిద్యాలయాలు అట్టుడికిపోతే ట్రంప్‌ ప్రభుత్వం ఆ ప్రదర్శనలలో పాల్గొన్న విదేశీ విద్యార్థులను బంధించి స్వదేశాలకు పంపించివేయటమే గాక, హార్వర్డ్ వర్సిటీకి నిధులను నిలిపివేసింది. కొలంబియా, కార్నల్, నార్త్ వెస్ట్రన్ వంటి ప్రముఖ కళాశాలలపై కక్షతో వ్యవహరించింది. గాజన్ల రక్తంలో ట్రంప్ తనివితీరా స్నానం చేయడం ఎంతవరకు వెళ్లిందంటే వేలాదిమంది పాలస్తీనియన్లను బలి తీసుకోవడాన్ని ఖండించిన ఐక్యరాజ్యసమితి నియమిత హక్కుల స్వతంత్ర ఉద్యమకారిణి ఫ్రాన్సెస్కా ఆల్బనీస్‌పై అగ్రరాజ్యం ఆంక్షలు విధించింది.


ట్రంప్ రెండోసారి సారథ్యంలో అమెరికా తన పునాది ఆదర్శాలైన స్వేచ్ఛ, అవకాశాలు, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, సమానత్వం అనే మహత్తర అంశాలకు స్వస్తి చెబుతున్నది. ఒకప్పుడు అలీనోద్యమాన్ని నిర్మించిన ఇండియా ఇప్పుడు ట్రంప్‌కి ఇజ్రాయెల్‌కి దాసోహమంటున్నది. అమానుషాలను ప్రతిఘటించడంలో ప్రపంచం రోజురోజుకీ బలహీనమైపోతున్నది. దౌర్జన్యాన్ని ఎదిరించడానికి సంఘటితం కాలేకపోతున్న అశక్తత నలువైపులా తాండవిస్తున్నది. దీనికి కారణాలను వెతికి అరికట్టకపోతే పాత రాచరికాలు ఆధునిక రూపంలో తిరిగి పుంజుకునే ప్రమాదం కనిపిస్తున్నది. అప్పుడు నియమబద్ధ అంతర్జాతీయ వ్యవస్థకు అంతిమ దినాలు దాపురిస్తాయి. ట్రంప్ ఆగ్రహ అనుగ్రహాలను బట్టి ప్రతి ఒక్కరూ బతకవలసి వస్తుంది. ట్రిగ్గర్ మీద వేలుపెట్టి దేశదేశాలను భయపెడుతున్న ట్రంప్ విధానాలను అదుపులో ఉంచే దిశగా మానవాళి లోతుగా ఆలోచించాలి. జనరల్ అసెంబ్లీ అభీష్టాన్ని కాలరాసే భద్రతామండలికి శాశ్వతంగా తెరపడాలి.


బలవంతులు యూదు మత విశ్వాసాల ఆధారంగా ఇజ్రాయెల్ దేశానికి పాలస్తీనాలో ఉనికి కల్పించినప్పుడు అరబ్ దేశాలు సంఘటితంగా ప్రతిఘటించాయి. ఈజిప్ట్, సిరియా, లెబనాన్, ఇరాక్‌లు అరబ్ లీగ్ పతాకం కింద పోరాడాయి. అటువంటి అరబ్ ఐక్యత ఇప్పుడు గాలికి పేలపిండి అయిపోయింది. వాస్తవానికి యూదులకు అవసరమైన దానికంటే ఎక్కువ పాలస్తీనా భూభాగాన్ని మొదట్లోనే వారికి కట్టబెట్టారు. అప్పట్లో పాలస్తీనా జనాభాలో సగం మంది కంటే తక్కువమందిగా ఉన్న యూదులకు సగం పాలస్తీనా కంటే ఎక్కువ భూభాగం లభించింది. 1967లో ఆరు రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ తన భూభాగాన్ని విశేషంగా విస్తరించుకున్నది. జోర్డాన్‌, ఈజిప్ట్, సిరియాలలో భాగాలను, జెరూసలేం పాత నగరాన్ని, సినాయి ద్వీపకల్పాన్ని, గాజాను, జోర్డాన్ నది పశ్చిమ తీరాన్ని, గోలాన్ హెయిట్స్‌ను దురాక్రమించుకున్నది. అగ్గికి ఆజ్యంలా టెల్ అవివ్‌కి బదులు జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించి అమెరికా తన రాయబార కార్యాలయాన్ని అక్కడికి తరలించింది.


ఇజ్రాయెల్ పుట్టినప్పటి నుంచి ఇంతవరకు అమెరికా దానికి చేసిన సాయం 300 బిలియన్ డాలర్ల దాకా ఉంటుంది. ఇందులో ఎక్కువ భాగం సైనిక సాయమే. 2023 అక్టోబర్ 7న హమాస్ మెరుపు దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్‌కు అమెరికా చేసిన అదనపు సైనిక సాయం విలువ 4.86 బిలియన్ డాలర్లు. మరొక సమాచారం ప్రకారం 2023 అక్టోబర్ 7 అనంతరం ఇజ్రాయెల్‌కు అమెరికా 17.19 బిలియన్ డాలర్ల సైనిక సాయం అందించడానికి నిర్ణయించింది. ఈ పొగరుతో ఇజ్రాయెల్ ఒక్క పాలస్తీనియన్ల పైనే కాదు ఇతర అరబ్ దేశాలపైనా దాడులకు దిగుతోంది. తాజాగా, సిరియాలోని డ్రుజ్ అనే మైనారిటీ వర్గంతో శాంతి చర్చలు విఫలం కావడంతో ఆ వర్గానికి దన్నుగా, సిరియా రాజధాని డమాస్కస్ పైనే ఇజ్రాయెల్ దాడులు చేపట్టింది. ఇటీవలనే ఇరాన్ నాయకులను కొందరిని హతమార్చిన అమెరికా ఇంతకుముందు 2020 జనవరిలో ట్రంప్ మొదటి విడత పరిపాలనా కాలంలో ఇరాన్ ముఖ్య సైనికాధికారి సోలేమానిని డ్రోన్ దాడి ద్వారా హతమార్చింది. మొన్న మొన్న మరికొందరు కీలక ఇరాన్ అధికారులను పొట్టనపెట్టుకున్నది. దేశాధినేత అలీ ఖమేనీనే హతమార్చాలని చూసింది. ఆయన కొన్ని రోజులు బంకర్‌లో తల దాచుకున్నారు. ఏ దేశ సార్వభౌమాధికార పరిధులనూ గౌరవించే సంస్కారం, మర్యాద అమెరికాకు లేవు. దానిని, దాని విష పుత్రిక ఇజ్రాయెల్‌నూ ఎదుర్కోడం దక్షిణాసియా దేశాలకు సాధ్యం కాదు. అక్కడి పాలకులు తమ ప్రజల్లోని పోరాట శక్తిని తామే చంపివేస్తున్నారు. దీనికి తోడు అంతటా ఆవహించిన పెట్టుబడిదారీ మారణాస్త్రమైన వినియోగ సంస్కృతి అక్కడా వేళ్లూనుకున్నది.


వాస్తవానికి ప్రపంచ ఆయిల్ నిల్వలలో అధిక శాతం ఉన్న పశ్చిమాసియా దేశాలు ఆర్థికంగా అత్యంత బలసంపన్నమైనవి. ప్రపంచ చమురు నిల్వల్లో 60 శాతం వరకు పశ్చిమాసియాలో ఉన్నాయని కొన్ని అంచనాలు చెబుతున్నాయి. అత్యధికంగా ఆయిల్ నిల్వలున్నది సౌదీ అరేబియా కాగా దానికి చేరువలో ఆ తర్వాత స్థానంలో ఇరాన్ ఉన్నది. ఇంకా ఇరాక్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కతర్, ఒమన్ తదితర దేశాల్లో ఆయిల్ నిల్వలు దండిగా ఉన్నాయి. ఇంత ఆర్థిక శక్తి ఉన్నందుకు, ఇందుకు తగ్గట్టు పరిశోధన రంగంలో ముందుండి అంతర్గత విబేధాలు లేకుండా ఉండి ఉంటే పశ్చిమాసియా దేశాలు అమెరికా సహా మొత్తం ప్రపంచాన్ని చెప్పుచేతల్లో ఉంచుకోగలిగేవి. ప్రధాన ఆయిల్ ఉత్పత్తి దేశాలు సౌదీ, ఇరాన్‌ల మధ్య నిన్న మొన్నటి వరకు వైషమ్యాలు తీవ్ర స్థాయిలో ఉండేవి. ఈ రెండింటి మధ్య గల సున్నీ (సౌదీ) షియా (ఇరాన్) తేడాలను అమెరికా వాడుకుంటూ వచ్చింది. సౌదీ అరేబియా అమెరికా జేబులో బొమ్మగా అమరిపోతే అమెరికా, ఇజ్రాయెల్‌లకు ఇరాన్ సవాలుగా నిలబడింది. చైనా చొరవతో ఇటీవలనే ఈ రెండు దిగ్గజ దేశాలు దగ్గర అవుతుండడం మంచి పరిణామం.


ఒకవైపు ఆయుధ బలంతో ఇంకోవైపు సుంకాల అంకుశాలతో ట్రంప్ దేశ దేశాలను వణికిస్తున్నాడు. ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాన్ని అడ్డుకునే నెపంతో అమెరికా దానిపై ఆంక్షలు విధించి దాడులకు తెగబడుతున్నది. ఇంకోవైపు అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌కు లొంగిపోయేలా చేసే ఎత్తుగడను పాటిస్తున్నది. ఈజిప్ట్ –ఇజ్రాయెల్ మధ్య అమెరికా ప్రోత్సాహంతో 1977లోనే శాంతి ఒప్పందం కుదిరింది. అప్పుడు ఈజిప్ట్ అధినేత అన్వర్ సాదత్ ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు. ‘‘మధ్య (దక్షిణాసియా) ప్రాచ్యంలో 99శాతం కార్డులు వాషింగ్టన్ చేతుల్లో ఉన్నాయి. సోవియట్ యూనియన్ కుప్పకూలడం ఆ ప్రాంతాన్నంతటినీ అమెరికా చెప్పుచేతల్లోకి నెట్టివేసింది’’ అని సాదత్ తేల్చి చెప్పాడు. అరబ్–ఇజ్రాయెల్ మధ్య అమెరికా కుదిర్చిన ప్రతి ఒప్పందం ఇజ్రాయెల్ శక్తిని పెంచి పాలస్తీనాను, అరబ్ ఐక్యతను దారుణంగా దెబ్బతీసింది. పాలస్తీనా అథారిటీ (పీఏ) పట్టు కోల్పోయి హమాస్‌ను అక్కడి ప్రజలు నమ్మడం బలపడిన తర్వాత వారి మధ్య అనైక్యతను చూపి అరబ్ దేశాలు పాలస్తీనా పోరాటానికి మద్దతు తగ్గించివేశాయి.


అరబ్–ఇజ్రాయెల్ మధ్య 2020లో ట్రంప్ ప్రభుత్వం కుదిర్చిన అబ్రహామ్ ఒప్పందాలు అరబ్ ఐక్యతకు పూర్తిగా తెరదించి పాలస్తీనా ప్రజలను దిక్కు మొక్కు లేనివారుగా చేశాయి. చైనా తర్వాత అయినా మరో దృఢమైన శక్తిగా ఎదగాలని చూస్తున్న ఇండియా కలలను సైతం ట్రంప్ కాల రాస్తున్నాడు. మోదీతో స్నేహం ట్రంప్ మోసకారి నాటకమే అనడానికి నిదర్శనం రష్యా ఆయిల్ కొంటున్నందుకు ట్రంప్ 100 శాతం సుంకాలు విధించదలచిన దేశాల్లో ఇండియా కూడా ఉండడమే. మరోవైపు యూరప్‌ దేశాలనూ ఆయన భయపెడుతున్నాడు. ఉక్రెయిన్ విషయంలో ఆయన తీసుకున్న విధానం దీనిని ఎత్తిచూపుతున్నది. అందుచేత ఇప్పుడు ప్రపంచం తక్షణం పట్టించుకోవలసిన విషయం– ప్రతి రోజూ 50 నుంచి 100 దాకా స్త్రీలూ, పిల్లల ప్రాణాలను అమెరికా–ఇజ్రాయెల్‌లకు బలి ఇచ్చుకుంటున్న గాజాను ఈ నర రక్త వరద నది నుంచి కాపాడడం. అంతేగాక నాటి సోవియట్ యూనియన్‌లా అమెరికాకు ఒక ప్రత్యామ్నాయ ధ్రువం తయారు కావడం నేటి తక్షణావసరం. కనీసం అలీనోద్యమం మాదిరిగా శాంతి కాముక దేశాలన్నీ ఏకమై ట్రంపరితనాన్ని గట్టిగా ఎదిరించాలి. పిల్లి మెడపై కత్తిని వేలాడదీసే ఎలుకలు కావాలిప్పుడు.

-గార శ్రీరామమూర్తి ,

సీనియర్‌ పాత్రికేయులు

Updated Date - Jul 29 , 2025 | 03:16 AM