Share News

Gamu Mallu Dora: మన్యం విప్లవవీరుడు, ఆదివాసీ నాయకుడు

ABN , Publish Date - Jul 19 , 2025 | 02:07 AM

భారత స్వాతంత్ర్య పోరాటంలో చిరస్మరణీయుడు, మన్యం విప్లవవీరుల్లో గొప్ప ఆదివాసీ నాయకుడు గాం మల్లుదొర.

Gamu Mallu Dora: మన్యం విప్లవవీరుడు, ఆదివాసీ నాయకుడు

భారత స్వాతంత్ర్య పోరాటంలో చిరస్మరణీయుడు, మన్యం విప్లవవీరుల్లో గొప్ప ఆదివాసీ నాయకుడు గాం మల్లుదొర. ఆయన బొగ్గు దొర, అక్కమ్మ దంపతులకు ప్రస్తుత అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం, లంకవీధి, బట్టపనుకుల గ్రామంలో జన్మించారు. బ్రిటిష్ నిరంకుశ పాలనలో గిరిజనులు అనుభవిస్తున్న దయనీయ స్థితిని తొలగించి, గిరిజనుల జీవితాలలో వికాస అభ్యుదయాలు కలిగించడానికి అల్లూరి సీతారామరాజుతో కలసి బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆదివాసీ వీరుడు మల్లుదొర. 1922 నుంచి 1924 వరకు సాగిన మన్యం విప్లవంలో ముఖ్యుడు, అల్లూరు సైన్యంలో ఎంతో పేరు పొందిన గాం సోదరుల్లో ఒకరు. అల్లూరి సీతారామ రాజుకి కుడిభుజంగా ఉంటూ బ్రిటిష్ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేశారు. బ్రిటిష్ వారి చేతిలో చావు నుంచి బయటపడి దేశ స్వాతంత్ర్య సముపార్జన అనంతరం స్వేచ్ఛా వాయువులను కూడా పీల్చిన వ్యక్తి మల్లుదొర.


బ్రిటిష్‌ వారి పాలనలో చింతపల్లి తహసీల్దార్‌గా పని చేసే భాష్టియన్, అతని అనుచరులు మన్యంలో ఆదివాసీలను దోచుకుంటూ, ముక్కుపిండి పన్నులు వసూలు చేసేవారు. అప్పట్లో నర్సీపట్నం నుంచి లంబసింగి వరకు రోడ్డు నిర్మాణం జరుగుతుండేది. ఆ పనికి కూలీలుగా వచ్చిన ఆదివాసీలకు బ్రిటిష్‌వారు డబ్బులు కూడా సరిగా ఇచ్చేవారు కాదు. పైగా అప్పటికే బ్రిటీష్ ప్రభుత్వ ఆంక్షల వల్ల సంప్రదాయ సేద్యానికి, ఇతర అటవీ జీవన విధానానికి దూరమవుతున్న ఆదివాసీలు ప్రభుత్వానికి ఎదురు తిరిగారు. వీరి తిరుగుబాటు నుంచే గిరిజన విప్లవం మొదలైంది. అప్పటికే మన్యం ప్రాంతంలో తిరుగుతూ అదివాసీల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న అల్లూరి సీతారామరాజును కలిసిన మొదటివాడు మల్లు దొర. 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై సీతారామరాజు దాడి చేశారు. ఆ దాడుల్లో ఎప్పుడూ 100 మంది వరకు ఆయన వెంట సైన్యంగా ఆదివాసీ స్వాతంత్ర్య పోరాట వీరులు ఉండేవారు. ఇందులో ముఖ్యుడు మల్లుదొర. 1923 సెప్టెంబర్ 17న ఆయన నడింపాలెంలో ఉన్నాడన్న సమాచారంతో బ్రిటీష్‌వారు అతన్ని అరెస్టు చేశారు. విప్లవ వీరుల గురించి చెప్పాలంటూ ఎంత హింసించినా ఆయన చెప్పలేదు. మల్లుదొరపై వివిధ సెక్షన్ల కింది కేసు పెట్టి కోర్టులో ప్రవేశపెట్టగా, వాల్తేరు ఏజెన్సీ జడ్జి 1924 అక్టోబర్ 23న మల్లుదొరకు మరణశిక్ష విధించారు. అయితే అది అమలయ్యే లోపు మద్రాస్ హైకోర్టుకి అప్పీలు చేయడంతో మరణశిక్షను జీవితకాలపు శిక్షగా మార్చింది కోర్టు. ఆయనను అండమాన్ జైలుకు పంపించారు. మల్లుదొర అక్కడ 13 సంవత్సరాల 6 నెలలు దుర్భర జీవితం అనుభవించారు. విడుదలైన తర్వాత సొంత గ్రామంలో స్థిరపడ్డారు.


దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1952లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంట్ రిజర్వుడు స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటిచేసి పార్లమెంటులో అడుగుపెట్టారు. పోరాడి సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని చూడడమే కాకుండా, రాజ్యమేలిన వాడిగా అదృష్టం పొందాడు మల్లుదొర. ఆయన తన తొలి ప్రసంగంలో అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో జరిగిన స్వాతంత్ర్య పోరాటం గురించి చెప్పారు. ప్రసంగం ముగిసిన తర్వాత నాటి ప్రధాని నెహ్రూ సహా సభ్యులందరూ లేచి చప్పట్లు కొడుతూ ఆయనను అభినందించారు. అలాగే అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ మల్లుదొరతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తన పదవీ కాలం పూర్తి అయిన తర్వాత స్వగ్రామంలో నివాసం ఉంటూ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో జీవనం సాగించారు. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనందరెడ్డి కొంత ఆర్థిక సాయం కూడా చేశారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో 1969 జూలై 21న మల్లుదొర తుదిశ్వాస విడిచారు.

– ఎన్. సీతారామయ్య

Updated Date - Jul 19 , 2025 | 02:07 AM