Air India: సందేహాలు సశేషం
ABN , Publish Date - Jul 15 , 2025 | 01:28 AM
మన దేశాన్నే కాదు, యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటనపై ఇటీవల విడుదలైన ప్రాథమిక నివేదిక, సమాధానాలకంటే కొత్త సందేహాలు, ప్రశ్నలు రేకెత్తించింది
మన దేశాన్నే కాదు, యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటనపై ఇటీవల విడుదలైన ప్రాథమిక నివేదిక, సమాధానాలకంటే కొత్త సందేహాలు, ప్రశ్నలు రేకెత్తించింది. విమాన ఇంజన్లకు ఇంధనాన్ని సరఫరాచేసే కంట్రోల్ స్విచ్‌లు ఆఫ్ కావడంతో ఈ ఘోరం జరిగిందని నివేదిక అంటోంది. ప్రమాదానికి ముందు ఏ క్షణానికి ఏం జరిగిందన్న వరుసక్రమంతో పాటు, కాక్‌పిట్ సంభాషణల వివరాలను కూడా ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్‌బ్యూరో (ఎఎఐబి) ఈ ప్రాథమిక నివేదికలో అతిపరిమితంగా ఉంచింది. గాల్లోకి లేచిన కొద్దిక్షణాల్లోనే బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం కుప్పకూలి, క్షణాల్లో తగలబడిపోయిన ఈ దారుణఘటనకు అనేకానేక సాంకేతిక అంశాలూ, తప్పిదాలు దోహదం చేశాయని నివేదిక నిగ్గుతేల్చవచ్చునని నిపుణులు సైతం భావించారు. తుదినివేదికలో మరెన్ని వివరాలు, ఇంకెన్ని లోతులు ఉంటాయో తెలియదు గానీ, పదిహేను పేజీల ఈ ప్రాథమిక నివేదిక తన గడువు లక్ష్యాన్ని అయితే అందుకోగలిగింది కానీ, తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది.
ప్రాథమిక నివేదిక ఆధారంగా మాట్లాడటం సరికాదని ప్రభుత్వపెద్దలు ఒకపక్క అంటున్నప్పటికీ, తప్పును తమమీదకు తోసేసే ప్రయత్నంగా పైలట్ల సంఘం అనుమానిస్తోంది. ఎందుకు, ఎలా, సాంకేతికమా, మానవతప్పిదమా వంటి వివరణలూ, వివరాలూ ఏ మాత్రం లేకుండా, పైలట్ల సంభాషణను కూడా పూర్తిగా అందివ్వకుండా నివేదిక విడుదలైనందున పైలట్లకు ఆగ్రహం కలగడం సహజం. ఏం జరిగిందో చెప్పిన ఆ నివేదిక, ఆ చిరు సంభాషణను ప్రస్తావించడం ద్వారా పైలట్లే ఏదో గందరగోళం చేశారన్న అనుమానానికే ఆస్కారం కల్పించింది. ఈ తరహా విమానాల్లో ఇంధన సరఫరా స్విచ్‌లకు లాక్ ఉంటుందని, కుదుపులకు జారిపోకుండా బ్రాకెట్లూ ఉంటాయని నిపుణులు అంటున్నారు కనుక, ఈ విమానంలో ఆ వ్యవస్థ ఉంటే, సక్రమంగా పనిచేస్తున్నదా అన్నది ముఖ్యం. అనుభవజ్ఞులైన పైలట్లు నడుపుతున్న ఈ విమానంలో వారు తమకు నిర్దేశించిన ప్రక్రియలను నిర్లక్ష్యం చేయడమన్నది జరగకపోవచ్చును. కానీ, లాకింగ్ సదుపాయంలేని విమానాలు కూడా ఉన్నందున, పైలట్ ప్రమేయం లేకుండా అవి ట్రిప్ అయ్యే అవకాశాల గురించి నివేదిక రేఖామాత్రంగా ప్రస్తావించి ఉంటే బాగుండేది. టేకాఫ్‌లో స్విచ్‌లు కటాఫ్ కావడం, ఇంధనం అందక విమానం జారిపోవడం, క్షణాల్లో పైలట్లు సరిదిద్దినా ఒక ఇంజన్ మాత్రమే పుంజుకోవడం ఇత్యాది వరుస పరిణామాల మధ్య వారిరువురూ ఎంత ఒత్తిడికి గురై ఉంటారో అర్థమవుతూనే ఉంది.
ఇంధన సరఫరా ఎలా నిలిచిపోయిందన్నది పైలట్లకు అర్థంకాలేదని ఆ సంభాషణలో తెలుస్తూనే ఉంది. కానీ, సీవీఆర్ డేటానుంచి, ఈ రెండు వాక్యాలు మాత్రమే నివేదికలో ఉండటం వల్ల తప్పును వారిమీదకు నెట్టివేసి, విమాన నిర్వహణ సంస్థ, తయారీ సంస్థ తప్పించుకోచూస్తున్నాయన్న విమర్శలకు ఆస్కారం కలిగింది. ఈ నెలరోజుల దర్యాప్తులో చాలా విషయాలు తెలిసినప్పటికీ, వాటిని బయటపెట్టకుండా, ఈ నివేదికను ఆన్‌లైన్‌లో ఏ హడావుడీ లేకుండా ఉంచడం వెనుక ఏవో అంతిమ లక్ష్యాలున్నాయన్న అనుమానాలకూ అవకాశం ఏర్పడింది. ఈ పదిహేనుపేజీల నివేదికలోని అంశాలమీద నిపుణులతో వివరణ ఇప్పించే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేదు. స్పష్టతను ఇవ్వాల్సిన నివేదిక సామాన్యులు కొన్ని ప్రమాదకరమైన నిర్థారణలకు వచ్చేట్టుగా చేసింది. రిపోర్టుమీద ఎవరూ సంతకాలు చేయలేదని, మనకంటే ముందు విదేశీమీడియా సంస్థలకు అది అందిందని కూడా అంటున్నారు. ఇంతటి భయానకమైన ప్రమాదాలు జరిగినప్పుడు, వాటిపై జరిగే దర్యాప్తులను ప్రభావితం చేయడానికి అనేకశక్తులు సహజంగానే ప్రయత్నిస్తాయి. కానీ, ఒత్తిళ్ళకు తలొగ్గి కారణాలను కచ్చితంగా నిర్థారించని పక్షంలో మన పౌరవిమానయాన రంగానికీ, ప్రభుత్వానికీ అప్రదిష్ట కలుగుతుంది. తుదినివేదిక విడుదల కావడానికి ఎన్ని నెలలు పట్టినప్పటికీ, ఈ పుకార్లు, నిందలకూ అది స్వస్తిచెప్పడం అవసరం. అత్యంత నిజాయితీగా ఆ నివేదిక రూపొంది, బాధిత కుటుంబాలవారికి ఉపశమనం కలిగించాలి.