Share News

Indias Foreign Policy Missteps in South Asia: పొరుగు ప్రళయాల సుడిలో విశ్వగురు

ABN , Publish Date - Sep 12 , 2025 | 06:13 AM

నరేంద్ర మోదీ అధికార ప్రస్థానం జాతీయ మలుపు తిరిగిన సందర్భమది. 2014లో ఆయన ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి దక్షిణాసి...

Indias Foreign Policy Missteps in South Asia: పొరుగు ప్రళయాల సుడిలో విశ్వగురు

నరేంద్ర మోదీ అధికార ప్రస్థానం జాతీయ మలుపు తిరిగిన సందర్భమది. 2014లో ఆయన ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి దక్షిణాసియాలోని అన్ని దేశాల ప్రభుత్వాధినేతలను ఆయన సాదరంగా ఆహ్వానించారు. అద్భుత రాజనీతిజ్ఞత అది, సందేహం లేదు. దక్షిణాసియా ప్రాంతీయ సమైక్యత విషయమై భారత్‌ ప్రగాఢ ఆరాటాన్ని మోదీ అసాధారణ దౌత్యనీతి ప్రతిబింబించిందని ఆనాడు అందరూ భావించారు. పదకొండు సంవత్సరాలు గడిచిపోయాయి. దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్‌) గుర్తుందా? దాని పునరుద్ధరణ ఆలోచనే ఇప్పుడు ఎవరికీ లేదు. అంతర్గత రాజకీయాలు, జాతీయవాద భావోద్రేకాలు, ఆర్థిక అవస్థలు, పరస్పర విరోధాలు మళ్లీ అనూహ్య రీతుల్లో పెచ్చరిల్లుతున్నాయి. సార్క్‌ ఎవరికి కావాలి? ‘పొరుగుదేశాలకే ప్రథమ ప్రాధాన్యం’ అన్న మోదీ ప్రభుత్వ సుభాషితం ఒట్టి మాటగా మిగిలిపోయింది.

నేపాల్‌ను తాజాగా అతలాకుతలం చేస్తున్న హింసాత్మక నిరసనలే అందుకు ఒక నిదర్శనం. ఒక దశాబ్ద కాలంగా నిరంతర అస్థిరతతో కుదేలైపోతున్న దేశమది. 2015లో ఒక కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచి నేపాల్‌ తొమ్మిది ప్రభుత్వాలను చూసింది. పదో ప్రభుత్వం అధికారంలోకి రానున్నది. పేదరికం, నిరుద్యోగం అవినీతి మితిమీరిపోయిన కారణంగా ఆ హిమాలయ రాజ్యంలో తిరుగుబాటు సంభవించింది. యువ నేపాలీలే ఆ తిరుగుబాటుకు పురిగొల్పడం, అందులో అత్యధికంగా పాల్గొనడం గమనార్హం. నేపాల్‌ పరిణామాలను మోదీ ప్రభుత్వం ఏ మాత్రం ఊహించలేకపోయిందన్నది అంగీకరించవలసిన సత్యం.


నేపాల్‌లో జనరేషన్‌ జెడ్‌ (1997–2012 సంవత్సరాల మధ్య జన్మించిన యువజనులు. పుట్టినప్పటి నుంచి ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియా, మొబైల్‌ టెక్నాలజీతో పెరిగిన మొదటితరంవారు) నిరసనలు గత ఏడాది జూలైలో సంభవించిన పరిణామాలను ప్రతిబింబించాయి. నేపాల్‌లో సామాజిక మాధ్యమాలపై నిషేధం యువజనుల నిరసనలను ప్రజ్వలింపచేస్తే బంగ్లాదేశ్‌లో సివిల్‌ సర్వీస్‌లలో రిజర్వేషన్ల విధానానికి వ్యతిరేకంగా విద్యార్థులు తిరుగుబాటు చేశారు. అది అంతిమంగా షేక్‌ హసీనా ప్రభుత్వ పతనానికి, ఆమె భారత్‌లో ఆశ్రయం పొందడానికి దారితీసింది. అటు నేపాల్‌లోను, ఇటు బంగ్లాదేశ్‌లోను ప్రభుత్వాల అవినీతి, ఆశ్రిత పక్షపాతం యువజనుల తిరుగుబాటుకు పురిగొల్పాయి.

బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా ప్రభుత్వానికి అన్ని విధాల మద్దతునిచ్చిన మోదీ ప్రభుత్వం విద్యార్థుల తిరుగుబాటును ముందుగా పసిగట్టలేకపోయింది. ఇస్లామిక్‌ పార్టీల ప్రాబల్యం పెరిగిపోవడంతో భారత్‌ వ్యతిరేక, అందునా హిందూ వ్యతిరేక ధోరణులు పెచ్చరిల్లిపోయాయి. స్వదేశంలో హిందూ ఆధిపత్య పాలనను నెలకొల్పడానికి ప్రయత్నిస్తోందన్న విమర్శల నెదుర్కొంటున్న మోదీ సర్కార్‌ బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలను కాపాడేందుకు ప్రభావశీలంగా వ్యవహరించలేకపోతోంది. ప్రజల తిరుగుబాటుతో అధికారాన్ని కోల్పోయిన షేక్‌ హసీనాకు భారత్‌ ఆశ్రయమివ్వడాన్ని బంగ్లాదేశ్ పాలకులేకాకుండా ప్రజలు సైతం హర్షించలేకున్నారు. న్యూఢిల్లీ–ఢాకాల మధ్య సుహృద్భావ సంబంధాల పునరుద్ధరణకు ఇది తీవ్ర అవరోధంగా ఉన్నది.

మరో పొరుగుదేశం శ్రీలంక సైతం ఇటీవలి కాలంలో పలు ఉపద్రవాలను చవి చూసింది. భ్రష్ట రాజకీయాలు, అవినీతి పాలన, పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, ఇంధనం కొరత మొదలైన సమస్యలతో విసిగిపోయిన ప్రజలు ప్రభుత్వంపై తిరగబడ్డారు. శ్రీలంక పాలనా వ్యవస్థపై పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించిన రాజపక్స సోదరులు అధికారచ్యుతులయ్యారు. కొలంబోలో అధ్యక్ష భవనాన్ని ప్రజలు స్వాధీనం చేసుకున్న తీరు చూస్తే ఎంత బలమైన పాలకులైనా ప్రజాందోళనలతో ఎంతగా దుర్బలమవుతారో అర్థమవుతుంది. శ్రీలంక పరిణామాలను తొలుత ఉపేక్షించిన మోదీ ప్రభుత్వం సకాలంలో శ్రీలంకకు తగు ఆర్థిక సహాయమందించడం ద్వారా ఆ దేశంతో భారత్‌ సంబంధాలు మరింతగా దిగజారిపోకుండా నివారించగలిగింది.


నేపాల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంకల్లో నెలకొన్న పరిణామాల విషయంలో భారత్‌కు ప్రత్యక్ష బాధ్యత లేదు. అయితే 2024లో మాల్దీవులతో నెలకొన్న దౌత్య ప్రతిష్టంభన పూర్తిగా నివారింపదగినది. ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు భారత్‌ను వ్యతిరేకించడం ప్రాతిపదికపైనే ఎన్నికలలో విజయం సాధించాడు. న్యూఢిల్లీకి వ్యతిరేకంగా ఆయన తీసుకున్న నిర్ణయాల పట్ల సామాజిక మాధ్యమాలలో పాలకపక్ష ప్రేరేపిత విమర్శలు వెల్లువెత్తాయి. విహారయాత్రకు మాల్దీవులకు వెళ్లవద్దని పలువురు సెలెబ్రిటీలు పిలుపునిచ్చారు. సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని విదేశాంగ విధాన సంబంధిత విషయాలను రాజకీయం చేయడం భారత్‌కు తగని పని అని చెప్పక తప్పదు. ఇటీవల ప్రధాని మోదీ మాల్దీవులలో పర్యటించిన తరువాత ఉభయ దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా మెరుగుపడ్డాయి. అయితే చిన్న దేశాల నిర్ణయాలకు అతిగా ప్రతిస్పందించడం శ్రేయస్కరం కాదన్న వాస్తవాన్ని గత ఏడాది మాల్దీవులతో నెలకొన్న దౌత్య ప్రతిష్టంభన స్పష్టం చేసింది.

ఇక మనకు ‘నిత్య’ శత్రువుగా ఉన్న పాకిస్థాన్‌ విషయాన్ని చూద్దాం. మన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతునివ్వడం పాక్‌ ప్రభుత్వ విధానంగా ఉందనేది కొట్టివేయలేని వాస్తవం. కనుకనే పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఎటువంటి ఉగ్రదాడినైనా ‘యుద్ధచర్య’గా పరిగణిస్తామని న్యూఢిల్లీ నిక్కచ్చిగా ప్రకటించవలసి వచ్చింది. పాకిస్థాన్‌ ఒక విఫల రాజ్యం. సైన్యం–జిహాదీ బంధనాల నుంచి ఎంతకూ బయటపడలేకపోతోంది. ఉమ్మడి ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ దక్షిణాసియా వ్యవహారాలపై మరింత ప్రభావాన్ని నెరిపేందుకు దోహదం చేసే ఒక సుసంగత, సమ్మిళిత విధానాన్ని రూపొందించుకోవడంలో న్యూఢిల్లీ విఫలమయింది. చేరువనే ఉన్న సకల దేశాలలో సంభవించే పరిణామాలను నిరంతరం గమనిస్తూ ఆ దేశాలలో తన పలుకుబడిని విస్తరించుకోవాలి. ఇరుగుపొరుగు దేశాలలో ఏ ఒక్కదానినీ ఎట్టి పరిస్థితులలోను నిర్లక్ష్యం చేయకూడదు. ప్రస్తుత అనిశ్చిత ప్రపంచ పరిస్థితులలో అటువంటి వ్యవహారశైలి భారత్‌ ప్రయోజనాలకు దోహదం చేయదు. ఈ రాజనీతిజ్ఞతను విస్మరించినందువల్లే నేడు నేపాల్‌లో సంభవిస్తున్న పరిణామాలకు తల్లడిల్లుతున్నాం; నిన్న బంగ్లాదేశ్‌, శ్రీలంకలో చోటుచేసుకున్న ఘటనలకు కలవరపడ్డాం; మరి రేపు ఏ పొరుగు దేశం నుంచి మన ప్రయోజనాలకు విఘాతం వాటిల్లనున్నదో ఎవరికి తెలుసు?

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌)

Updated Date - Sep 12 , 2025 | 06:13 AM