Share News

Chandrababu Naidu: విద్యార్థి నాయకుడిగా చంద్రబాబు

ABN , Publish Date - Sep 03 , 2025 | 05:48 AM

ఇటీవల సోషల్‌ మీడియాలో విశ్వవిద్యాలయ విద్యార్థిగా నారా చంద్రబాబు నాయుడు జీవితంపై అవాస్తవాలతో కూడిన కథనాలు వస్తున్నాయి...

Chandrababu Naidu: విద్యార్థి నాయకుడిగా చంద్రబాబు

టీవల సోషల్‌ మీడియాలో విశ్వవిద్యాలయ విద్యార్థిగా నారా చంద్రబాబు నాయుడు జీవితంపై అవాస్తవాలతో కూడిన కథనాలు వస్తున్నాయి. నాకు చంద్రబాబుతో సన్నిహిత పరిచయం ఉంది. ఆనాటి వాస్తవాలు అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ వ్యాసం రాస్తున్నాను. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1975లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఈ ఎమర్జెన్సీని దాదాపు 21 నెలలపాటు కొనసాగించి మార్చి 21, 1977న ఎత్తివేశారు. ఈ కాలంలో ఏ కళాశాలకూ ఎన్నికలు జరగలేదు. 1976–77లో చంద్రబాబు ఎంతో చురుగ్గా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. కాంగ్రెస్ పార్టీలో చేరి చిన్న వయస్సులోనే ఎంతో మంది పార్టీ పెద్దల్ని ఆకర్షించారు. సంజయ్‌గాంధీతో కూడా ఎంతో సాన్నిహిత్యం ఏర్పడింది. 1977లో దివిసీమ ఉప్పెన రాష్ట్రాన్ని శోక సంద్రంలో ముంచెత్తింది. దివిసీమ నిండా గుట్టల గుట్టల శవాలు. అలాంటి విపత్కర స్థితిలో బాధితుల్ని ఆదుకొనేందుకు చంద్రబాబు రేయింబవళ్ళు శ్రమించారు. బియ్యం, వస్త్రాలు, పప్పుధాన్యాలు విరాళాలుగా సేకరించి దివిసీమలోని అందరికీ పంచారు. ఆయన చేస్తున్న కృషి విశ్వవిద్యాలయంలో కొత్తగా చేరిన మాలాంటి వారందరికీ ఎంతో ఆదర్శంగా నిలిచింది.


1977లో దేశంలో ప్రజాస్వామ్యం తిరిగి నెలకొన్నాక విశ్వవిద్యాలయ కళాశాలలకు ఎన్నికలు ప్రకటించారు. మా కళాశాలలో సోషియాలజీలో పరిశోధకుడుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక వర్గానికి, మరో వర్గానికి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వహించారు. ఈ ఎన్నికలు రెండు వర్గాల విద్యార్థుల మధ్య శతృత్వానికి బీజం వేశాయి. తొలిసారి కులాల కుంపట్లు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఆర్ట్స్ గ్రూప్‌కు చెందిన చైర్మన్, సెక్రటరీ పోస్టులకు ఎంతో ఉత్కంఠభరిత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. అన్ని శాఖల్లోనూ ఈ ఇరువురు నాయకులు తమ అభ్యర్థుల్ని ఎంపిక చేసి యుద్ధ భేరి మోగించారు. దాదాపు పది రోజులపాటు ప్రచారాన్ని హెూరెత్తించారు. నాకు తెలిసి అధ్యాపకులెవ్వరూ విద్యార్థుల ఎన్నికల్లో పరోక్షంగా కూడా పాల్గొనలేదు. ఇద్దరు నాయకులు ఎదురుపడిందీ లేదు, తలపడిందీ లేదు. విద్యార్థులు మాత్రం కొన్నిసార్లు కొట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఒక సైద్ధాంతిక కూటమికి తెరలేపాడు. ఒక వర్గానికి వ్యతిరేకంగా అన్ని కులాలు, మతాల వారిని ఒక తాటిపైకి తీసుకొచ్చాడు. నేను చంద్రబాబు వర్గంలో చేరాను. సోషియాలజీలో చైర్మన్‌ పోస్టుకు నిలబడ్డాను. మా రీసెర్చ్ స్కాలర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా నిలబడడం గొప్ప సాహసమే! ఎప్పటికప్పుడు చంద్రబాబు మాకు ధైర్యం చెప్పేవాడు. అన్ని కులాల్ని ఏకం చేయడం చంద్రబాబు చాణక్యతనం. ఆయన విధానం అందరికీ ఎంతో నచ్చింది. సరైన నాయకత్వాన్ని ఇవ్వగల్గినవాడే నిజమైన నాయకుడిగా ఎదుగుతాడు. ఇప్పటి శాసనసభ ఎన్నికలు కూడా అంత హెూరాహెూరీగా జరగలేదనిపిస్తున్నది. ఆ యుద్ధం ఆఖరు ఘట్టం చేరిన రోజు రాత్రి ఎవరికీ కంటిమీద కునుకు లేదు. రాత్రంతా ఆయా శాఖల విద్యార్థుల్ని మరోసారి అర్థించడం ముఖ్యంగా తటస్థుల్ని తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు జరిగాయి. చంద్రబాబు కూడా తిరుగుతూనే కనిపించాడు. ఒక్క ఓటు కోసం నేనూ దాదాపు 15 కి.మీ. దూరంలోని ఒక హరిజన గ్రామానికి టెంపో మాట్లాడుకొని రాత్రిపూట వెళ్లొచ్చాను. ఆ రాత్రంతా అభ్యర్థులందరూ నాలాగే తిరిగారు. ఎన్నికల మలుపు కాస్త క్రూరత్వానికి కూడా దారితీసింది. చాలామంది తమకు ఓటు వేయరన్న అభిప్రాయంతో వ్యతిరేకుల్ని ఇరువర్గాలు కిడ్నాప్ చేశాయి.


ఎన్నికలు ముగిశాయి. ప్రతి శాఖ నుంచి ద్వితీయ సంవత్సరం చదివే వ్యక్తి ఆ శాఖ చైర్మన్‌గాను, ప్రథమ సంవత్సరం చదివే వ్యక్తి ఆ శాఖ సెక్రటరీగాను ఎంపికయ్యారు. అందరూ కలసి కాలేజీ ఆర్ట్స్ విభాగపు చైర్మన్‌ను, సెక్రటరీని ఎన్నుకున్నారు. క్లాస్ వారీ ఓటింగ్ ముగిసి, కౌంటింగ్ స్టార్ట్ చేశారు. ఉత్కంఠగా సాగిన చివరి ఎన్నికలో కిరీటం చంద్రబాబుకు దక్కింది. పెద్దిరెడ్డి వర్గం నా ఒక్క ఓటు తేడాతో అపజయం పాలయింది. పెద్దిరెడ్డి నిలబెట్టిన పరంధామయ్యరెడ్డి ఓడిపోయాడు. ఇరువైపులా సైన్యాలు పోరాడాయే గానీ నాయకులు కొట్టుకోలేదు. ఈ వాస్తవాల్ని వక్రీకరించి చంద్రబాబును పెద్దిరెడ్డి కొట్టాడని కొంతమంది ఇప్పుడు దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటు. నిజానికి ఆ గెలుపే చంద్రబాబు రాజకీయ జీవితానికి మలుపు అయింది. చంద్రబాబుకు ఆడపిల్లలతో సంబంధాలు ఉన్నాయన్న దుష్ప్రచారం కూడా కొందరు చేస్తున్నారు. రాజకీయాల కోసం వ్యక్తిత్వాన్ని హననం చేయడం ఎంతమాత్రం భావ్యం కాదు. ఎన్నికల్లో గెలుపు కోసం, పార్టీల సిద్ధాంతాలపై, మేనిఫెస్టోలపై ఒకర్నొకరు విమర్శించుకోవాలే కానీ వ్యక్తుల శీలాన్ని గూర్చి కల్పిత కథలు ప్రచారం చేయడం మంచి సంప్రదాయం కాదు. చంద్రబాబును నేను 40 సంవత్సరాలు సన్నిహితంగా చూశాను. అప్పటి విద్యార్థి దశలోనూ, ఆపై రాజకీయ సింహాసనంపై కూర్చున్నప్పుడు కూడా ఆయనకు రాజకీయ వ్యామోహం తప్ప, ఎలాంటి స్త్రీ వ్యామోహం లేదు. ఏ స్త్రీతోను సంబంధాలు లేవు. నాకు తెలిసి చంద్రబాబు మహిళల్ని సోదరీ భావంతోనే చూసేవారు. అలాంటి దుర్బుద్ధి ఆయనకు ఈనాటికీ లేదు. చంద్రబాబు మెప్పుకోసం నేను ఈ విషయాల్ని రాయడం లేదు. ఏడు పదుల వయస్సు దాటిన నాకు ఇంకా ఏమి అవసరాలు ఉంటాయి ఆయనతో. నాకు నచ్చని విషయాల్ని ఆయనకే చెప్పేసేవాడిని.


అందర్నీ కలుపుకుపోయే తత్వం చంద్రబాబుకు ముందు ముందు చాలా లాభకారి అయింది. నాటి మా విద్యార్థుల సమైక్యత, ఆయనకు చాలాకాలం వరకు అండగా నిలిచింది. 1978లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారిగా ఏర్పడ్డ చంద్రగిరి నియోజకవర్గానికి ఇందిరా కాంగ్రెస్ తరఫున చంద్రబాబు టిక్కెట్టు తెచ్చుకున్నాడు. అనేక మంది విద్యార్థి బృందాలు చంద్రబాబు కోసం గ్రామగ్రామాన తిరిగి ప్రచారం నిర్వహించాయి. చంద్రగిరి నియోజకవర్గ పరిధి చాలా పెద్దది. నేను ప్రతిరోజు ఓ పదిమంది స్నేహితుల్ని వెంటబెట్టుకొని కాలినడకన అన్ని పల్లెలు తిరుగుతూ ఓట్లు అడిగాను. కొన్ని చోట్ల రైతులు మొహంమీదే జనతాపార్టీకి ఓట్లేస్తాం అని చెప్పేవాళ్ళు. మేమిచ్చిన కరపత్రాలు మా ఎదుటే చించేవారు. బడుగు, బలహీనవర్గాలు మాత్రం ఇందిరమ్మకే మా ఓట్లు అనేవారు. విద్యార్థులు నిస్వార్థంతో, విద్యార్థి నాయకుడైన చంద్రబాబు ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో పనిచేశారు. ఫలితాల రోజు సాయంత్రానికి ఆఖరు రౌండ్‌లో చంద్రబాబు మెజారిటీ సాధించి, గెలుపొందాడు. విద్యార్థుల సంఘీభావం, సమైక్యత చంద్రబాబును మంత్రిగా చేసే వరకు కొనసాగింది. టి. అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. రాజకీయ పోరాటంలో చంద్రబాబు, రామచంద్రారెడ్డి తలపడ్డా అదృష్ట దేవత మొదట చంద్రబాబునే వరించింది. రెండుసార్లు ఓటమి తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అంచెలంచెలుగా ఎదిగాడు. అపార రాజకీయ చతురత, పట్టుదల, కలిసొచ్చిన అదృష్టం, అసాధ్య వ్యూహ రచన, మాటతీరు, మంచితనం, అందర్నీ కలుపుకెళ్ళాలన్న మనస్తత్వం చంద్రబాబును ముఖ్యమంత్రి పీఠానికి చేర్చాయి.

-డా. యస్. విజయకుమార్ సీఎంఓ

మాజీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి

Updated Date - Sep 03 , 2025 | 05:48 AM