Share News

NABARD: పల్లె భారతిలో నాబార్డ్‌ ప్రగతి సేద్యం

ABN , Publish Date - Jul 15 , 2025 | 01:33 AM

హరిత విప్లవానంతరం భారత వ్యవసాయ రంగం ఆధునికీకరణ దిశగా ముందడుగు వేస్తున్న సమయంలో, వ్యవసాయానికి అవసరమైన రుణాల కోసం రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులపై ఆధారపడేవారు

NABARD: పల్లె భారతిలో నాబార్డ్‌ ప్రగతి సేద్యం

రిత విప్లవానంతరం భారత వ్యవసాయ రంగం ఆధునికీకరణ దిశగా ముందడుగు వేస్తున్న సమయంలో, వ్యవసాయానికి అవసరమైన రుణాల కోసం రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులపై ఆధారపడేవారు. అప్పట్లో దేశంలోని బ్యాంకులన్నీ ప్రైవేటు రంగంలో ఉండటంతో, వ్యవసాయ రంగానికి రుణాల వాటా మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో ఒక శాతం కంటే కూడా తక్కువగా ఉండేది. ఈ పరిస్థితిని గమనించిన అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ, వ్యవసాయ-–గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలన్న దృక్పథంతో 1969లో 14 పెద్ద బ్యాంకులను, 1980లో మరో ఆరు బ్యాంకులను జాతీయం చేశారు. బ్యాంకుల జాతీయీకరణ తరువాత, వ్యవసాయ–గ్రామీణ రంగాలను ప్రాధాన్య రంగాలుగా గుర్తిస్తూ, మొత్తం బ్యాంక్ రుణాల్లో కనీసం 40 శాతం ఈ రంగాలకు కేటాయించాలన్న నిబంధనను అప్పటి కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. అంతేకాకుండా, గ్రామీణాభివృద్ధికి మరింత బలమిచ్చే ఉద్దేశంతో 1975లో గ్రామీణ బ్యాంకుల వ్యవస్థను ప్రారంభించింది.


భారతదేశంలో వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి రంగాలకు బ్యాంకుల జాతీయీకరణ అనంతరం పెట్టుబడుల కోసం రుణాలు గణనీయంగా పెరిగినా, ఆ రంగాల కోసం ప్రత్యేకంగా సమన్వయం, నియంత్రణ చేపట్టే జాతీయస్థాయి శిఖరాగ్ర బ్యాంకు లేదు. అప్పటివరకు ఆర్బీఐలోని ప్రత్యేక విభాగం వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన రుణాలు, పెట్టుబడులను సమన్వయం చేస్తున్నది. ఈ లోపాన్ని గుర్తించిన ఇందిరాగాంధీ 1982 జూలై 12న రూ. 100 కోట్ల మూలధనంతో జాతీయ వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి బ్యాంకు (NABARD)ను ముంబయి కేంద్రంగా స్థాపించి, జూలై 15న జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి నాబార్డ్ ప్రస్థానం నానాటికీ విస్తరించి, నేడు 43 సంవత్సరాల ప్రయాణంలో ఒక మహావృక్షంగా రూపాంతరం చెందింది. 2023–24 నాటికి నాబార్డ్ వివిధ రూపాల్లో వ్యవసాయం, నీటిపారుదల, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు, రుణాలు అందించింది. దేశవ్యాప్తంగా విస్తృతంగా సేవలందిస్తోంది.


సహకార సంఘాల అభివృద్ధిలో నాబార్డ్ పాత్ర అసాధారణమైనది. ఈ బ్యాంకు దేశవ్యాప్తంగా సహకార బ్యాంకులకు అవసరమైన రీఫైనాన్స్ నిధులను అందించింది. తద్వారా సహకార బ్యాంకులు ముఖ్యంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు... గ్రామీణ రుణాల పంపిణీకి ప్రధాన కేంద్రాలుగా మారాయి. నాబార్డ్ సమర్థమైన పర్యవేక్షణ, ఆర్థిక మద్దతుతో ఈ సహకార సంఘాలు రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు, వితరణ సేవలు, నిల్వ సదుపాయాలు, సబ్సిడీ విధానాలను అమలుచేశాయి. అంతేకాక, స్వయం సహాయక సంఘాల అభివృద్ధిలో నాబార్డ్ పాత్ర అపూర్వం. 1992లో ప్రారంభించిన స్వయం సహాయక సంఘాలను బ్యాంకులకు అనుసంధానించడం ద్వారా గ్రామీణ మహిళలు సమూహాలుగా ఏర్పడి, బ్యాంకుల ద్వారా రుణాలు పొందడం సుగమమైంది. నాబార్డ్ శిక్షణ, నిధుల మంజూరు, పర్యవేక్షణతో స్వయం సహాయక సంఘాలు స్థిరమైన ఆర్థిక సంఘాలుగా మారాయి.


గ్రామీణ బ్యాంకింగ్‌ను ఆధునికీకరించడంలో నాబార్డ్ కీలకపాత్ర పోషించింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 63వేల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను డిజిటలైజ్ చేయడం ద్వారా, రుణాల మంజూరు, నిల్వ నిర్వహణ, పంట నష్టపరిహారాల లింకేజీ వంటి సేవలన్నీ పారదర్శకంగా అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఈ సంస్థలు ప్రజల విశ్వాసాన్ని మరింతగా పొందాయి. నాబార్డ్ దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో రైతు ఉత్పత్తిదారుల సంస్థల (ఎఫ్‌పీఓ) ఏర్పాటుకు నిధులు, శిక్షణ, మార్కెట్ లింకేజీలతో సహకారం అందిస్తోంది. మధ్యవర్తులపై ఆధారాన్ని తగ్గించి, రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా నాబార్డ్ ఈ రంగంలో మార్గనిర్దేశక పాత్ర పోషిస్తోంది.


1995లో ప్రారంభించిన రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఆర్‌ఐడిఎఫ్‌) ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రేటుతో నాబార్డ్‌ రుణాలు అందించింది. ఈ నిధులతో గ్రామీణ రహదారులు, చెక్‌డ్యామ్‌లు, మార్కెట్ యార్డులు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, శీతల గిడ్డంగులు వంటి మౌలిక వసతుల నిర్మాణం వీలైంది. నీటిపారుదల రంగంలో నాబార్డ్ అందించిన రీఫైనాన్స్ వల్ల చిన్న, మధ్యస్థ సాగునీటి ప్రాజెక్టులు అమలులోకి వచ్చాయి. ఇది సాగు విస్తీర్ణం పెరుగుదలకు దోహదం చేసింది. ప్రాంతీయ వ్యవసాయ వ్యాపార ఇన్క్యుబేటర్ కేంద్రాల ద్వారా యువతకు నాబార్డ్ కొత్త అవకాశాలను అందిస్తోంది. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల మద్దతుతో ఏర్పడిన ఈ కేంద్రాలు... యువతకు శిక్షణ, మార్గదర్శకత్వం, మార్కెట్ లింకేజీ వంటి అంశాల్లో సహాయపడుతూ, స్వయం ఉపాధి రంగాన్ని అభివృద్ధి చేస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో నూతన ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తున్నాయి. ఇలా భారత గ్రామీణ అభివృద్ధి చరిత్రలో నాబార్డ్ ఒక కీలక మైలురాయిగా నిలిచింది. వ్యవసాయ రంగానికి నిధుల సమకూర్పు, మౌలిక వసతుల నిర్మాణం, సహకార సంస్థల పునరుద్ధరణ, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు వంటి అనేక అంశాల్లో నాబార్డ్ పాత్ర ఎంతో అమోఘమైనది. గ్రామీణ బ్యాంకింగ్‌ను డిజిటలైజ్ చేస్తూ, విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ, వ్యవసాయ స్టార్టప్‌లకు తోడ్పాటుతో నాబార్డ్ గ్రామీణ భారత ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తోంది.

-ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఉపకులపతి,

తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం

Updated Date - Jul 15 , 2025 | 01:33 AM