Annabhau Sathe: దళిత సాహిత్య వైతాళికుడు
ABN , Publish Date - Aug 01 , 2025 | 05:37 AM
ఆధిపత్య వర్గాల ధోరణి బహుజనులను విద్యకు దూరం చేయడంతో దేశ స్వాతంత్ర్యానికి పూర్వం, ఆ తరువాత ఎంతో మంది అక్షర జ్ఞానానికి
ఆధిపత్య వర్గాల ధోరణి బహుజనులను విద్యకు దూరం చేయడంతో దేశ స్వాతంత్ర్యానికి పూర్వం, ఆ తరువాత ఎంతో మంది అక్షర జ్ఞానానికి దూరమయ్యారు. అయినా, జ్యోతిబా ఫూలే, బి.ఆర్. అంబేడ్కర్ వంటి ఎందరో మహనీయులు విద్యావంతులుగా మారి సమాజానికి వెలుగులు పంచారు. వీరిలో అన్నాభావు సాఠె ఒకరు. అందరిలా బడికి వెళ్లి చదువుకునే అవకాశం లేకపోయినా, జీవితమనే పాఠశాలలో విద్యార్థిగా చేరి ‘విద్యా జ్ఞానం అన్ని సమస్యలకు దివ్య ఔషధం’ అనే ముక్తా సాల్వె మాటలను ప్రేరణగా తీసుకుని, అక్షర జ్ఞానియై సాహిత్య సమ్రాట్‌గా ప్రసిద్ధిచెందారు. దేశ విదేశీయులతో ‘అన్నా’ అని పిలుపునందుకున్న మొదటి భారతీయుడు అన్నాభావు సాఠె.
ఆయన అసలు పేరు ‘తుకారాం భావురావ్ సాఠె’. మహారాష్ట్ర, వాటేగావ్ గ్రామంలో ఉన్న మాంగ్ వాడాలో 1920 ఆగస్టు 1న జన్మించారు. అన్నా చిన్నప్పుడు అభంగ్స్ (భక్తి పాటలు)ను లయబద్ధంగా పాడేవారు. వంశపారంపర్యంగా బంధువులు నిర్వహించే ‘తమాషా’ ప్రదర్శనలలో చురుకుగా పాల్గొని, జానపద వాయిద్యాలు వాయించడం, పాటలు పాడటం నేర్చుకున్నారు. కత్తి, ఈటె, బాకు, దాండ్ పట్టా, కర్రసాము యుద్ధ కళను తమాషాలకు జోడించి, బహుళ ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో విశేషకృషి చేశారు. పదేళ్ళ వయస్సులో స్వాతంత్ర్యోద్యమంలో కూడా పాల్గొన్నాడు. బతుకుతెరువు కోసం కుటుంబం బొంబాయికి వలస వచ్చినపుడు ఒక సినిమా థియేటర్‌లో డోర్ కీపర్‌గా పని చేయడం అన్నా జీవితాన్ని మార్చేసింది. సినిమాల ప్రభావంతో దుకాణాలు, హోటళ్లు, సినిమా పోస్టర్లపై ఉన్న అక్షరాలను చదవడానికి యత్నిస్తూ చదవడం, రాయడం నేర్చుకున్నారు. మొదట్లో విలేకరిగా పనిచేస్తూ స్వీయ అనుభవాలు, నిజ ఘటనల ఆధారంగా కథలు రాసేవారు. సాంస్కృతిక చైతన్యం ద్వారా స్వాతంత్ర్యోద్యమంలో సామాన్య ప్రజలను భాగస్వాములను చేసేందుకు 1943లో ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ ఏర్పాటులో ముఖ్యపాత్ర వహించిన అన్నా, తన ఇద్దరు సహచరులతో 1944లో ‘రెడ్ ఫ్లాగ్ కల్చరల్ స్క్వాడ్’ అనే కొత్త తమాషా బృందాన్ని ఏర్పాటు చేసి, హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. తన పాటలు, మాటలతో ప్రజలను ఉర్రూతలూగించడంతో, ప్రజలు ఆయనను ‘లోక్ షాహిర్’ అని పిలిచేవారు. కొంతకాలం తర్వాత ప్రభుత్వం తమాషాలను నిషేధించింది. లాల్ బావతా కళాపాథక్ కోసం రాసిన నాటకాలను ‘లావని’ (మహారాష్ట్రలో ప్రసిద్ధిగాంచిన సంగీత నృత్య ప్రదర్శన), ‘పోవాడా’ (జానపద పాటలు) రూపంలోకి మార్చారు.
రష్యా విప్లవం విజయగాథను వివరిస్తూ ‘స్టాలిన్ గ్రాడ్’ నాటకాన్ని రాయగా, అది రష్యన్ భాషలోకి అనువాదమైంది. అన్నా 1961లో రష్యాను సందర్శించారు. ఆ ప్రయాణ అనుభవాలను ‘మాజా రష్యా చా ప్రవాస్’ రూపంలో గ్రంథస్థం చేసిన మొదటి వ్యక్తిగా ఆశ్రితవర్గాల నుంచి చరిత్రకెక్కారు. తన జీవితకాలంలో నవలలు, చిన్న కథల సంకలనాలు, నాటకాలు వంటి 100కు పైగా రచనలు చేశారు. ఇవి రష్యన్, ఫ్రెంచ్, జర్మన్, చెక్, ఇంగ్లీష్, స్పానిష్ మొదలైన 27 అంతర్జాతీయ భాషల్లోకి అనువాదమై, ఆయన కీర్తిప్రతిష్ఠలు విదేశాలలో కూడా ప్రజ్వరిల్లాయి. బాబాసాహెబ్ భావజాలం వైపు మొగ్గు చూపి, బడుగు బలహీన కార్మిక వర్గాలను చైతన్యపరిచే రచనలు చేశారు. ‘ఫకీరా’ నవలను బాబాసాహెబ్‌కు అంకితం చేశారు అన్నా. రష్యాలో సినిమా నటుడు రాజ్‌కపూర్‌తో పాటు విపరీతమైన అభిమానులు కలిగిన మరొక భారతీయుడు అన్నా భావు సాఠె అని తెలుసుకొని అప్పటి భారత ప్రధాని నెహ్రూ ఆశ్చర్యానికి గురయ్యారు. 1958లో బొంబాయిలో తన అధ్యక్షతన నిర్వహించిన ‘మొదటి దళిత సాహిత్య సమ్మేళనం’ ప్రారంభ ప్రసంగంలో ‘‘ఈ భూమి శేష్‌నాగ్ అని పిలిచే పాము తలపై కాకుండా దళిత, బహుజన వర్గాల శ్రమ శక్తి మీద సమతుల్యతతో నిలిచివుంది’’ అని ప్రకటించారు. అన్నాభావు రచించిన అనేక నవలలు, కథల ఆధారంగా అనేక చలన చిత్రాలు నిర్మించారు, ఇంకా నిర్మిస్తూనే ఉన్నారు.
రష్యాలో అన్నా పేరుమీద స్కాలర్‌షిప్ ఇవ్వడం మామూలు విషయం కాదు. కవి, రచయిత, విలేకరి, కార్మికుడు, నటుడు, దర్శకుడు, స్ర్కీన్‌ప్లే రచయిత ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన అన్నా సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయన జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం వివిధ కట్టడాలకు, సంస్థలకు ఆయన పేరు పెట్టి గౌరవించింది. ఇటీవల మహాత్మా గాంధీ మెమోరియల్ విశ్వవిద్యాలయం మరణానంతరం అన్నా భావు సాఠెకు ‘డాక్టరేట్’ను ప్రదానం చేసింది. రష్యా రాజధాని ‘మాస్కో’లో అన్నా విగ్రహాన్ని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. పాఠశాలలో విద్యాభ్యాసం చేయకుండానే తన రచనల ద్వారా గ్రామీణ వ్యవస్థ, బడుగు బలహీన, మహిళా, కార్మిక వర్గాల స్థితిని కళ్ళకు కట్టినట్టు బహిర్గతం చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. దళిత సాహిత్య పితామహుడిగా, సాహిత్య సమ్రాట్‌గా ప్రసిద్ధి చెందిన అన్నాకు ‘భారతరత్న’ ఇవ్వాలని ఆయన అభిమానులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే అధికారికంగా ఆయన జయంతిని జరపాలని కోరుతున్నారు.
-గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్ మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు