Share News

Short Story Collection: బౌద్ధ దృక్పథంతో తెలుగులో మొదటి కథా సంకలనం

ABN , Publish Date - Sep 08 , 2025 | 12:09 AM

బౌద్ధం నేపథ్యంగా కథా సంకలనం తేవాలన్న ఆలోచన ఎందుకు కలిగింది? దీనికి ఎలాంటి పరిశోధన చేయాల్సి వచ్చింది? బుద్ధుడికి సంబంధించిన..

Short Story Collection: బౌద్ధ దృక్పథంతో తెలుగులో  మొదటి కథా సంకలనం

బౌద్ధం నేపథ్యంగా కథా సంకలనం తేవాలన్న ఆలోచన ఎందుకు కలిగింది? దీనికి ఎలాంటి పరిశోధన చేయాల్సి వచ్చింది? బుద్ధుడికి సంబంధించిన జీవిత చరిత్ర, బౌద్ధ గాథలు, జాతక కథలు చిన్నప్పటి నుంచి మనసు మీద గాఢమైన ముద్రవేశాయి. స్వీయ సత్యాన్వేషణలో బౌద్ధం ప్రధాన పాత్ర వహించింది. బుద్ధుడు పేరెత్తగానే మనసంతా ఒక రకమైన ప్రశాంతతకు లోనవుతుంది. ఈ అలౌకికమైన ఆకర్షణ, ప్రత్యేకత బౌద్ధ ధర్మాలలోనే కాదు బుద్దిస్ట్ ఈస్థటిక్స్‌లో కూడా ఉన్నాయి. బౌద్ధానికే చెందిన ప్రత్యేకమైన భాష, చిత్రకళ, శిల్పం, సాహిత్యం మన మిగతా సాంప్రదాయకమైన సాంస్కృతిక వాతావరణానికి భిన్నంగా ఉంటాయి. తెలుగు సమాజంలో ప్రొఫెసర్ లక్ష్మీనరసు మొదలుకొని అన్నపరెడ్డి బుద్ధఘోషుడు వంటి అనేకమంది లబ్దప్రతిష్టులు తమదైన మార్గంలో బౌద్ధం మీద విశేషమైన కృషి చేశారు. తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి గారి జాతకకథలు తరవాత తెలుగు సాహిత్యంలో బౌద్ధం మీద కథల పరంగా నిర్దిష్టమైన సంకలనం లేదు. బౌద్ధంలోని కథలు పద్య రూప కావ్యాలుగా, రవీంద్రుని అనువాదాలుగా, ధమ్మపద కథలు వంటివి కూడా వచ్చాయి. ఇవన్నీ చాలావరకు గ్రాంథిక భాషలో ఉండిపోయాయి. ఈ సందర్భంలో గురజాడ మొదలుకుని శ్రీసుధ మోదుగు వరకు బౌద్ధం పునాదిగానో, చారిత్రక నేపథ్యంగానో వచ్చిన సృజనాత్మక కథలను ఒక సంకలనంగా తెస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. పైగా ‘ఆధునికాంధ్ర కవిత్వంపై బౌద్ధమత ప్రభావం’ అనే అంశంపైన అధ్యయనం చేసి థీసిస్ సమర్పించి ఉన్నాను. బౌద్ధం పైన ‘మిసిమి’, ‘బుద్ధభూమి’ వంటి పత్రికలలో అనేక వ్యాసాలు రాసాను. ఈ పరిశోధనలో భాగంగా బౌద్ధం మీద సేకరించి పెట్టుకున్న కథలు ఇలా సంకలనంగా తేవడానికి ఉపకరించాయి. ఈ సందర్భంలో సహ సంపాదకులు అజయ్ ప్రసాద్ గారు తను కూడా కొన్ని బౌద్ధ కథలు సేకరించి పెట్టుకున్నానని చెప్పగానే ఆయన సహకారంతో ఈ పుస్తకాన్ని తేవడం జరిగింది.


మీరు ఎంపిక చేసుకున్న ఈ ఇరవై కథలు ఎలాంటి అంశాల చుట్టూ నడిచాయి? అన్ని కథలకూ బౌద్ధమే ఉమ్మడి నేపథ్యం. కానీ భిన్నమైన కథాంశాలు సంకలనాన్నీ పరిపుష్టం చేస్తున్నాయి. బుద్ధుని కాలంలోనే ఆంధ్రదేశంలో బౌద్ధం ప్రవేశించింది అన్న అరుదైన గౌరవానికి చిలుకూరి ఉమామహేశ్వ శర్మ కథ ‘బావరి’ నిదర్శనమౌతుంది. అస్సక గణరాజ్యం ద్వారా అంటే నేటి తెలంగాణ నుండి ఆంధ్ర దేశంలోకి బౌద్ధం ప్రవేశించింది అనడం చారిత్రక సత్యం. బౌద్ధాన్ని స్వీకరించిన తొలి గురువు, జ్ఞానోదయం సంధర్భంలో స్వయంగా బుద్ధుని నుండి మొదటగా బిక్షుక దీక్షను గ్రహించిన కొండన్న తొలి తెలుగు వాడు కాగా, బుద్ధుని కాలంలోనే ఆంధ్రదేశానికి బౌద్ధాన్ని తెచ్చిన వారు బావరి. గ్లోబల్ సమస్యగా మారనున్న అదే నీటి సమస్య బుద్ధునికాలంలో ఏర్పడినప్పుడు– ఒకరు పూర్తిగా నాశనం కావడంకన్నా, తాము కొంత నష్టపోవడంలో తప్పులేదని, కరుణతో మైత్రి భావనతో ఆలోచించి నిర్ణయం తీసుకోవలసింది భూమిని సాగు చేస్తున్న రైతులే కానీ ప్రభుత్వాలు కావు అని గొప్ప సందేశాన్ని తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి ‘రోహిణి’ ఇస్తుంది. దుఃఖ కారణాన్ని తెలుసుకుంటే నివా రణ మార్గం సులభమని చెప్పే బౌద్ధంలోని ఆర్యసత్యానికి పిలకా గణపతిశాస్త్రి ‘సిద్ధార్థాన్వేషణ’ కథ; ఆ ఆర్యసత్యానికి పొడిగింపుగా బాల్యంలో ఏర్పడిన అభిప్రాయాలు మనసు మీద గట్టి ముద్రను వేస్తాయని, ఆ ప్రభావంతో తమ జీవిత గమ్యాన్ని మలుచుకోవడం అపురూపమైన విషయమని కూనపరాజు కుమార్‌ ‘లిటిల్ బుద్ధాస్’ కథ, తాను చేసే తప్పులను సరిదిద్దుకునే అవకాశం బౌద్ధంలో లభిస్తుంది అన్నదానికి ఉదాహరణగా పాలగుమ్మి విశ్వనాథం ‘మహాభినిష్క్రమణం’ కథ నిలుస్తాయి. ఒకప్పుడు పరిఢవిల్లిన బౌద్ధం క్షీణదశను చేరినప్పుడు ప్రజలలో వచ్చిన మార్పులను చెబుతూ, దానికి సామాజిక పరమైన కారణాలను కూడా అన్వేషించిన అజయ్‌ ప్రసాద్‌ కథ ‘జాతక కథ’, సముద్రాంతరాలను దాటి వ్యాపారాలు సాగించిన బౌద్ధాన్ని చూపించే ఉణుదుర్తి సుధాకర్‌ కథ ‘పూర్ణ చంద్రోదయం’, బౌద్ధం ఆంధ్రదేశంలో క్షీణ దశకకు వచ్చినా, సింహళంలోని మూల గ్రంథాలను కాపీ చేసుకు వచ్చిన నాటి బౌద్ధ భిక్షువుల సాహసాలను చెప్పే ఉణుదుర్తి సుధాకర్‌ మరో కథ ‘తూరుపు గాలులు’... ఇలా ఇందులోని అన్ని కథలు దేనికదే ప్రత్యేకమైనవి.


ఈ పుస్తకం ద్వారా పాఠకులకు మీరు ఎలాంటి సారం అందాలని ఆశించారు? వర్తమాన ప్రపంచ పరిస్థితులు మధ్యయుగాలనాటి మతయుద్ధాలకి ఏమాత్రం తీసిపోలేదని స్పష్టంగా మనకు అర్థమవుతో ఉంది. ముఖ్యంగా మన దేశంలో మతప్రాతిపదికన స్పష్టమైన విభజన రేఖలు ఏర్పడుతున్నాయి. ఈ వాతావరణంలో స్వేచ్ఛ, సమానత్వం మైత్రీభావం వంటి ఆదర్శభావాలు కొరవడుతున్నాయి. ఇటువంటి ఆదర్శ భావాలు జన సామాన్యంలో మరింతగా విస్తరించడానికి బౌద్ధం సరికొత్త మార్గాన్ని చూపిస్తుంది. ఎవరికివారు స్వీయానుభవంతో సత్యాన్వేషణ చేయడానికి తద్వారా వ్యక్తిగత జీవితంలోనూ, సమాజంలోనూ శాంతిని నెలకొల్పడానికి బౌద్ధం ఉపకరిస్తుంది. సమస్త శాంతి సౌభ్రాతృత్వాలకు సమాజంలో పునాదిగా పేరుకుపోయిన లోటుపాట్లను మరింత లోతుగా అర్థం చేసుకుని తొలగించుకోడానికి ఈ కథలు ఉపకరిస్తాయని మా నమ్మకం.

4.jpg

సంపాదకులు: రాయదుర్గం విజయలక్ష్మి, బి. అజయ్ ప్రసాద్

Updated Date - Sep 08 , 2025 | 12:09 AM