Share News

Poor Pay with Their Lives: కోరి తెచ్చుకున్న చావులా ఇవి?

ABN , Publish Date - Nov 07 , 2025 | 02:57 AM

ఈ దేశంలో అనేకచోట్ల, అనేక సందర్భాల్లో జరిగే తొక్కిసలాటల్లో కేవలం పేదలే మరణిస్తున్నారు....

Poor Pay with Their Lives: కోరి తెచ్చుకున్న చావులా ఇవి?

ఈ దేశంలో అనేకచోట్ల, అనేక సందర్భాల్లో జరిగే తొక్కిసలాటల్లో కేవలం పేదలే మరణిస్తున్నారు. ఆ తొక్కిసలాటలు కూడా పేదల మానసిక ఆవరణ చుట్టూ ఉన్న దారిద్య్రం, అభద్రత, అజ్ఞానం, అసహాయత, ఉపాధిలేమి వంటి కారణాలే కాక, ‘పక్కవాడిని తొక్కేసయినా దక్కించుకోవటమే విజయానికి మెట్లు’ అన్న భావనలు పెంచి, పోషించే వ్యవస్థలూ దొంతర్లుగా పేరుకుపోయినందునే ఇవి జరుగుతున్నాయి. ‘పుట్టినవాడు గిట్టకమాన’డన్న గీతాచార్యుడూ గిట్టక తప్పలేదు. కాకపోతే చావును కోరితెచ్చుకోరెవ్వరూ. యే ఉద్దేశంతో రాసేడోగానీ ‘చావు కూడా పెళ్లిలాంటిదే’ అని ఓ సినిమా కవి రాసేడు. చాలా చావులు పెళ్లిలాంటివి కానేకావు, చచ్చేచావులే. ఏ ధర్మాత్ముడో విసిరే చిల్లర నాణేలకోసం ఎగబడి, ఎగ ఊపిరొదిలిన చావులు, ఏ స్వాములోరి పాదధూళి కోసమో, పోటీపడి చచ్చే చావులు, ఏ అభిమాన నటుడి సినిమా కోసమో కొనప్రాణం కొట్టుకుచచ్చిన చావులు. ఆలయ ప్రహరీలు విరిగిపడి ఒరిగిన చావులు, పుణ్యస్నానాల చావులు, పుష్కరాల చావులు... కోరి తెచ్చుకున్న చావులా ఇవి? భవంతుల నిర్మాణంలో కూలిన బతుకుల చావులు, నెత్తుటితో తడిసే రోడ్ల మీది చావులు, రోగాల, రొప్పుల చావులు, ఆసుపత్రి చావులు, ఆఖరికి కర్కోటక కారాగారాల దిక్కులేని చావులు... కోరి తెచ్చుకున్న చావులేనా ఇవి? దేశానికిపుడు ‘చావులమదుం’ అన్న పేరు సరిపోతుంది (విశాఖపట్నంలో ఓ స్థలానికి చావులమదుం అన్న పేరుంది). నిన్న, మొన్న శ్రీకాకుళం జిల్లా, కాశీబుగ్గలో కొందరు భక్తుల చావు నన్ను కలవరపెడుతోంది. ఒరిస్సా పండా ఎవరో నిర్మించిన వేంకటేశ్వరాలయంలో భక్తుల తొక్కిసలాట జరగటం, పదిమంది దాకా మరణించటం... మనసును కలచివేస్తోంది. దేవాలయంలో కార్తీకమాసంలో తొలి దినాన పూజలు చేస్తే పరలోకంలో సుఖంగా జీవిస్తారన్న ప్రచారం కంటే, ఇహలోకంలో కలిగే ఇబ్బందుల నుంచి శ్రీ వేంకటేశ్వరస్వామి రక్షిస్తాడన్న నమ్మకం జనాల్లో బాగా ఉంది. వాళ్లకి రేపెప్పుడో లేదా మరణానంతరమో కలిగే ప్రయోజనమ్మీద ఏ నమ్మకమూ, ఆశా లేదు. ఉన్నదల్లా ఇప్పుడే, ఇక్కడే ప్రయోజనం కావాలి. అలా నమ్మించగలిగే సామాజిక వాతావరణం నిండి వున్నదిపుడు! అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోవటమే కాశీబుగ్గ ప్రమాదానికి కారణమా? నేరమెవరిది? ఈ ప్రశ్నలేవో వేసుకోవచ్చు. నేరమెవరిమీదనో నెట్టేయవచ్చు. నిజానికి ఈ దేశంలో బాధితులే నేరస్థులు. జైలు నిర్మాణంలో శ్రమించిన శ్రామికులే జైలుపాలవుతారు గానీ, జైలు నిర్మాణాన్ని చేయించినవారు జైలుపాలు కావడం జరగలేదు. ఇక్కడ కూడా చనిపోయిన వారిమీదనే నేరం నెట్టేయవచ్చు. లేదా ప్రతిపక్ష రాజకీయులమీద తోసేయవచ్చు. ఇంకా మించిపోతే నాస్తికులకు నేరం అంటగట్టవచ్చు.


వీటన్నిటి కంటే... నన్ను వేధించేది వేరొకటి. గత, వర్తమానాల విశ్లేషణేదో అవసరమన్పిస్తోంది. ఒకానొక ఆలయ పూజారిగా వచ్చి, ఒకానొక ఊరిని, ఊరి పరిసరాలనూ, జిల్లానూ, రాష్ట్రాన్నీ తన అపూర్వకళా ప్రతిభతో ప్రభావితం చేసిన (ఒరియా బ్రామ్మడయిన) సుబ్బారావు పాణిగ్రాహి గుర్తుకొస్తున్నాడిప్పుడు. జీవితాలను చక్కదిద్దుకోవడం తమ చేతుల్లోనే వుంటుందని, కార్యాచరణను బోధించి, ‘చేతులు జోడించి దేవుణ్ణి మొక్కటం కాదు, పిడికిలి బిగించి పోరాడ’మని నేర్పినవాడు పాణిగ్రాహి. ఆ ఊరి ప్రజలు ప్రేమగా ‘పూజారిబాపు’ అని పాణిగ్రాహిని పిలుచుకునేవారు. ప్రజలను చైతన్యవంతం చేయడం, సంఘటితం చేయడం, జీవితాల ఉన్నతికి ఉద్యమింపచేయడం పూజారిగా పాణిగ్రాహి కార్యకలాపాలు. కొన్నాళ్లకు ఆలయంలోని మూలవిరాట్టులకు బదులుగా మార్క్సిస్టు మూలపురుషుల ఫొటోలను పెట్టడం, ప్రజలను పోరుబాట నడపడం... వీరోచిత ఘటనలు! ఇవి కేవలం కథలుగా మాత్రమే మిగిలాయా? అన్న వేదన. కాశీబుగ్గలో కానీ, కళింగాంధ్రలో కానీ జనాలు చావుతో సాము చేసి బతుకుతారు. భవంతుల నిర్మాణంలోనో, రోడ్ల ప్రమాదాల్లోనో, రోగాల అసుపత్రుల్లోనో అలవిగానపుడు చనిపోయారే తప్పా, చావుతో పోరాడినోళ్లే పోరాటంలో చనిపోయినోళ్లు గావచ్చు. నాడు అశోకుడితో యుద్ధం చేసి కొందరు కళింగులు మరణిస్తే, నేడు కార్పొరేట్‌ కర్మాగారాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరికొందరు మరణించారు. పుణ్యస్నానాల్లోనో, ఆలయ పూజల్లోనో తొక్కిసలాడి చనిపోలేదిలా. సింహాచలంలో కూడా ప్రహరీగోడ కూలి, జనాల మీద పడి చనిపోయేరు తప్పా, తొక్కిసలాటలో కాదు. ఇంతటి మూఢభక్తి కళింగ జనాల్లో కూడా నిండివుందా? కేవలం మూఢభక్తి అని నిర్ధారిద్దామా? ఆ జనాల జీవన సంక్షోభ స్థితికి వారు వెదుకుతున్న ఊరట మార్గమేమోనని ఆలోచిద్దామా? పాణిగ్రాహి గానీ, అతని బాట గానీ జనాల మనసుల్లోంచి మాసిపోయిందనుకుందామా? ఏ భూమిని యే కర్మాగారం నొల్లేస్తాదో, యే ఇంటిని యే ఎనిమిదో, తొమ్మిదో లైన్ల రోడ్డు మింగేస్తదో, యే ఊరిని యే విమానాశ్రయం ఆక్రమించేస్తాదో, యే అడవిని, కొండని, సముద్రాన్ని... సమస్తాన్ని ఏ శక్తులు చప్పరించేస్తాయో..! నిత్యగండాల సుడిగుండంలా వుందికదా కళింగం? ఓట్లేసి, గెలిపించిన నేతలంతా సామంతరాజులే తప్పా, చక్రవర్తుల (కార్పొరేట్ల) ఆజ్ఞల పాలన తప్పా, ప్రజల ఆలనా పాలనా చూడకపోవటం, శత్రువే శ్రేయోభిలాషిగా నటించడం, అక్కరకు రాని కంపెనీల రాక, అక్కరకొచ్చే ఫ్యాక్టరీల మూత, ప్రమాదాల పరవాడలు... కళింగాంధ్రను కలవరపరుస్తున్నవేమో? కలవరంలో ‘పరమాత్ముడొకడు కలడో, లేడో’నన్న ప్రశ్నకు జవాబు వెదుకులాట ఈ చావులనుకుందామా? అన్నీ ప్రశ్నలే! ప్రశ్నభూమి కళింగాంధ్ర ప్రశ్న కావడమే చిత్రం!

-అట్టాడ అప్పల్నాయుడు

ఉత్తరాంధ్ర రచయితల, కళాకారుల వేదిక (ఉరకవే) అధ్యక్షులు

Updated Date - Nov 07 , 2025 | 02:57 AM