Share News

Russian Oil Trade Under Pressure: చమురుతో చెలగాటం

ABN , Publish Date - Jul 22 , 2025 | 02:51 AM

రష్యా ఇంధనరంగం లక్ష్యంగా యూరోపియన్‌ యూనియన్‌ ఈయూ ప్రకటించిన సరికొత్త ఆంక్షల్లో గుజరాత్‌లోని

Russian Oil Trade Under Pressure: చమురుతో చెలగాటం
Russian Oil Trade Under Pressure

ష్యా ఇంధనరంగం లక్ష్యంగా యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) ప్రకటించిన సరికొత్త ఆంక్షల్లో గుజరాత్‌లోని నాయారా ఎనర్జీ లిమిటెడ్‌కు చెందిన వాడినార్‌ రిఫైనరీ కూడా ఉంది. రష్యానుంచి చమురు కొనుగోలు చేసే దేశాలను కఠినఆంక్షలతో ఊపిరాడనివ్వకుండా చేయాలని పాశ్చాత్యదేశాలు సరికొత్తగా సంకల్పం చెప్పుకున్న నేపథ్యంలో, రాబోయే రోజుల్లో ఇటువంటివి అనేకం చూడాల్సిరావచ్చు. రష్యానుంచి చమురుకొంటున్నందుకు భారతదేశంమీద ౫00శాతం సుంకం విధించేందుకు ట్రంప్‌ ఆశీస్సులతో అమెరికా సెనేటర్లు ఒకపక్క బిల్లు సిద్ధం చేస్తుంటే, మరోపక్క నాటో అధినేత నోట ట్రంప్‌ బెదిరింపు భాష వినబడుతోంది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపేలా రష్యామీద భారత్‌, చైనా, బ్రెజిల్‌ ఒత్తిడి తీసుకురావాలని, విఫలమైన పక్షంలో ఆంక్షలకు సిద్ధపడాలని నాటో అధినేత మార్క్‌ రుట్టే హెచ్చరించిన విషయం తెలిసిందే. రష్యన్‌ ఇంధన సంస్థ రోస్నెఫ్ట్‌నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్న రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌కు, 49శాతం రోస్నెఫ్ట్‌ వాటాలున్న నాయారా ఎనర్జీకి ఈయూ నిషేధం పెద్ద సవాల్‌. రష్యా క్రూడ్‌ ఆయిల్‌ను భారత్‌లో శుద్ధిచేసి, యూరోపియన్‌ యూనియన్‌ మార్కెట్‌కు ఎగుమతి చేస్తున్న ఈ రెండు చమురు ఎగుమతి సంస్థలకు కష్టకాలం తప్పదేమో.


నాయారాలో రోస్నెఫ్ట్‌ సహా పలురష్యన్‌ పెట్టుబడులు గణనీయంగా ఉన్నందున అది ప్రథమ, ప్రధాన లక్ష్యమై ఉండవచ్చు. రష్యానుంచి ఏ కంపెనీ ఎంత ముడిచమురు దిగుమతి చేసుకుంటోందో, శుద్ధిచేసిన తరువాత ఎవరికి, ఎంత ఎగుమతి చేస్తోందో మన ప్రభుత్వం గుట్టువిప్పదు. రష్యా చమురుబావుల్లో నుంచి తోడిపోసిన ముడిచమురులో 80శాతం భారతదేశానికే చేరుతోందని, ఈ ఏడాది జూన్‌ వరకూ 231 మిలియన్‌ బారెల్స్‌ ముడి చమురును భారత్‌ కొనుగోలు చేస్తే, అందులో దాదాపు సగం రిలయెన్స్‌, నయారాకు అందిందని అంటారు. ఇప్పుడు రాస్‌నెఫ్ట్‌, యూసీపీ వంటి రష్యన్‌ సంస్థలు నయారా ఎనర్జీని రిలయెన్స్‌కు విక్రయించే ప్రతిపాదనలు చేస్తుండగా, ఈయూ ఆంక్షలు తెరమీదకు వచ్చాయి. ఓ పదేళ్లపాటు రోజుకు ఐదులక్షల బ్యారెళ్ళు దిగుమతి చేసుకోవడానికి రష్యాతో రిలయెన్స్‌ ఏడాది క్రితమే మరో భారీ ఒప్పదం చేసుకున్న విషయం తెలిసిందే.


భారత్‌లో శుద్ధిచేసిన రష్యన్‌ ముడిచమురు యూరప్‌కే పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్నప్పటికీ, పాశ్చాత్యదేశాలు అడపాదడపా మనల్ని తప్పుబట్టడం ఈ యుద్ధకాలమంతా జరుగుతున్నదే. రష్యా ముడిచమురు దిగుమతుల్లో అత్యధికం శుద్ధిచేసిన అనంతరం విదేశాలకే తరలిపోతున్నప్పటికీ, సదరు దిగుమతులు మన దేశ ప్రజల ప్రయోజనార్థం జరుగుతున్నట్టుగా మంత్రులూ అధికారులూ వ్యాఖ్యలు చేయడం అనాదిగా చూస్తున్నదే. భారత్‌ నుంచి ఈయూకు శుద్ధిచేసిన పెట్రోలియం ఎగుమతులు ప్రతీ ఏటా రెట్టింపవుతున్న విషయం గమనించాలి. ఉక్రెయిన్‌–రష్యా యుద్ధానికి ముందు భారత్‌ మొత్తం చమురుదిగుమతుల్లో రష్యా వాటా ఒకశాతం కంటే లేదు. యుద్ధం మొదలుకాగానే, పలు రాయితీలు, మినహాయింపులతో రష్యా చవుకగా అందించిన చమురుతో భారత్‌ లబ్ధిపొందుతూ వచ్చింది. అడ్డూ అదుపూలేకుండా చమురుతోడి, చవుకగా అమ్మి, యుద్ధాన్ని బలంగా, సంవత్సరాలపాటు రష్యా కొనసాగించగలుగుతున్న నేపథ్యంలో, ఆయిల్‌ మీద ఆంక్షలతో రష్యాను నిర్వీర్యం చేయాలన్న మరో ప్రయత్నం ఇది.


యుద్ధానికి నువ్వేకారణమంటూ మొన్నటివరకూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడిని తీవ్రంగా తప్పుబట్టి, అవమానించి, రష్యా అధ్యక్షుడిని తెగవెనకేసుకొచ్చిన ట్రంప్‌ ఇటీవలే మనసుమార్చుకున్నారు. అధికారంలోకి వచ్చిన కొద్దిగంటల్లోనే యుద్ధాన్ని ఆపగలనన్న ట్రంప్‌, తనమాట పూచికపుల్లలాగా తీసిపారేస్తున్న పుతిన్‌మీద అలిగారు, ఆగ్రహించారు. ఆయుధాలతో జెలెన్‌స్కీని బలోపేతం చేయాలని, ఆంక్షలతో పుతిన్‌ను నిర్వీర్యుడిని చేయాలని సంకల్పించారు. నిన్నటివరకూ నోరు విప్పడానికి జడిసిన నాటో, ఈయూ నాయకులంతా ఇప్పుడు ట్రంప్‌ అండ చూసుకొని రష్యామిత్ర దేశాలను బెదిరిస్తున్నారు. ఇటువంటి విన్యాసాలు చాలా చూశామనీ, ఏమి చేయాలో తమకు తెలుసునన్నది చమురు మంత్రి హర్‌దీప్‌ పురి వ్యాఖ్యల సారాంశం. ఆంక్షలు విధిస్తామని మనను బెదిరిస్తున్న ఈ దేశాలు రష్యా నుంచి ఒకపూట దిగుమతి చేసుకుంటున్న చమురు ఉత్పత్తులు మన మూడునెలల దిగుమతులతో సమానమని ఆయన ప్రకటించారు. రష్యా నుంచి ముడిచమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలను ఆంక్షలతో దెబ్బతీయాలన్న ప్రయత్నం అంతిమంగా ప్రపంచ చమురు మార్కెట్‌ను కుప్పకూలేట్టు చేస్తుందని గ్రహించాలి.

Updated Date - Jul 22 , 2025 | 02:52 AM