Ethanol Industry: కాలుష్య సమస్యకు కులం పులుముతున్నారు
ABN , Publish Date - Jun 28 , 2025 | 02:58 AM
గద్వాల జిల్లా రాజోలు మండలం పెద్ద ధన్వాడ, దానికి సమీపంలోని మరో పన్నెండు గ్రామాల ప్రజలు తమ గ్రామాలు, పొలాల మధ్యలో ఇథనాల్ ప్లాంటు నిర్మాణం ప్రారంభించేందుకు కంపెనీ యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఏడాది కాలంగా ఆందోళన చేస్తున్నారు.
గద్వాల జిల్లా రాజోలు మండలం పెద్ద ధన్వాడ, దానికి సమీపంలోని మరో పన్నెండు గ్రామాల ప్రజలు తమ గ్రామాలు, పొలాల మధ్యలో ఇథనాల్ ప్లాంటు నిర్మాణం ప్రారంభించేందుకు కంపెనీ యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఏడాది కాలంగా ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ నాయకుడు ఒకరు ప్లాంటు నిర్మాణాన్ని ఆపిస్తానని హామీ ఇవ్వటంతో తమకు న్యాయం జరుగుతుందని నమ్మి ఆందోళన విరమించారు. కానీ మూడు నెలల తరువాత కంపెనీ నిర్మాణ ప్రక్రియను తిరిగి ప్రారంభించడంతో ప్రజలు మరలా సంఘటితమయ్యారు. వేలాదిమందిగా కంపెనీ స్థలానికి చేరారు. కంపెనీ బౌన్సర్లు ప్రజలపై దాడి చేయటంతో ఒకామె తలకు గాయమైంది. ఆగ్రహించిన ప్రజలు పనివారి కోసం కట్టిన గుడారాలను ధ్వంసం చేసి, కంటైనర్‌ను తగులబెట్టారు.
దీనిపై పోలీసులు నలభై మందిపై కేసులు పెట్టి, వారిలో పన్నెండు మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు. జూన్ 18న వారిని కోర్టుకు తీసుకువచ్చినప్పుడు రైతుల చేతులకు బేడీలు వేశారు. గతంలో లగచర్ల ఘటనలో రైతుల చేతులకు బేడీలు వేయడాన్ని రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టి మందలించినా, తిరిగి అదే తప్పును పోలీసులు పెద్ద ధన్వాడ రైతుల విషయంలో చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ఖమ్మం రైతులతో ఇలానే వ్యవహరించి, ఫలితాన్ని అనుభవించిందని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలి. పెద్ద ధన్వాడ ఘటన నేపథ్యంలో రాష్ట్ర పరిశ్రమల శాఖామాత్యులు శ్రీధర్‌బాబు ఆ ప్రాంతంలో ఇథనాల్ ప్లాంటు ఏర్పాటు తథ్యమని ప్రకటించారు. ఇథనాల్ ప్లాంట్లతో కాలుష్యానికి అవకాశమే లేదనీ, అత్యాధునిక పద్ధతులలో వాటిని నిర్మిస్తారనీ తెలిపారు. ప్లాంటుకు సంబంధించిన అన్ని అంశాలపై రైతులకు అవగాహన కల్పించామనీ, ప్రభుత్వ వివరణతో ప్రజలు సంతృప్తి చెందారనీ ప్రకటించారు.
ఇథనాల్ ప్లాంట్లతో కాలుష్యానికి అవకాశమే లేదన్నది నిరాధారం. ప్రపంచంలోనే అత్యధికంగా ఇథనాల్ ఉత్పత్తి చేసే దేశం అమెరికా. అక్కడ కాలుష్య నియంత్రణ సంస్థలు వాయు కాలుష్యాన్ని తొలగించడానికి కంపెనీలపై అనేక నియమాలు పెడతాయి. ఇథనాల్ ప్లాంట్ల నుంచి వెలువడే ‘వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్’ (వీఓసీ)లను తొలగించడానికి థర్మల్ ఆక్సిడైజర్ గానీ, ఇతర బయో ట్రిక్లింగ్ సాధనాలను గానీ వినియోగిస్తే, అవి ప్లాంట్‌ల నుంచి వెలువడే వాయు కాలుష్యం 95–99 శాతం వరకూ తగ్గిస్తాయి. ప్రపంచ వనరుల సంస్థ జూన్ 10 నాటి తమ విశ్లేషణలో అమెరికాలో ఇథనాల్ ఉత్పత్తి, విస్తరణ, దాని వాతావరణ ప్రభావాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఈ విశ్లేషణ ప్రకారం, 2021లో ఇథనాల్ రిఫైనరీలు 17.4 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్‌కు సమానమైన గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేశాయి. ఇది 44 బిలియన్ మైళ్ల డ్రైవింగ్‌తో వచ్చే కాలుష్యానికి సమానం. అదనంగా ఈ ప్లాంట్లు ఆయిల్ రిఫైనరీలతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ అసిటాల్డిహైడ్, అక్రోలిన్, ఫార్మాల్డిహైడ్, హెక్సేన్ వంటి వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్‌ను విడుదల చేస్తాయి. ఇవి శ్వాసకోశ సమస్యలకు కారణమవుతాయి. ఇథనాల్ కోసం– అధిక నీటి వినియోగాన్ని కలిగిన వరి, మొక్కజొన్న, సోయాబీన్ పంటల సాగు భూగర్భ జలాలను క్షీణింపజేస్తుంది. అమెరికాలోని ఎన్విరాన్‌మెంటల్ ఇంటెగ్రిటీ ప్రాజెక్ట్ (ఇఐపి) 2024లో విడుదల చేసిన నివేదిక ప్రకారం అక్కడి 191 ఇథనాల్ ప్లాంట్లు, 71 బయో డీజిల్ ప్లాంట్లు, 13 రెన్యూవబుల్ డీజిల్ ప్లాంట్లు కలసి 12.9 మిలియన్ పౌండ్ల విషపదార్థాలను వాతావరణంలోకి విడుదల చేశాయి. తగిన నియంత్రణ పద్ధతులలో 95–99 శాతం వరకూ వాయు కాలుష్యాన్ని తొలగించిన తరువాతనే అదనంగా ఇంత కాలుష్యం విడుదలైందన్నది మనం గుర్తించాలి.
నిజానికి భారతదేశంలో, మన రాష్ట్రంలో ఇథనాల్ ప్లాంట్లకు ఇచ్చే పర్యావరణ అనుమతుల్లో ఈ వాయు కాలుష్యాన్ని అసలు గుర్తించడమే లేదు. అందుకే ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభమైన నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరు ఇథనాల్ ప్లాంట్ పరిసర గ్రామాల ప్రజలు దుర్వాసనలతో తల్లడిల్లుతున్నారు. ఇథనాల్ ప్లాంట్లు అక్రోలిన్ (శ్వాస సమస్యలు, ఆస్తమాకు కారణం), హెక్సేన్ (నాడీ మండలం దెబ్బతింటుంది), అసెటాల్డిహైడ్, ఫార్మాల్డిహైడ్‌ల (క్యాన్సర్ కారకం) వంటి విష రసాయనాలను ఎక్కువగా విడుదల చేస్తాయి. ఇథనాల్ కోసం అదనంగా పండించే మొక్కజొన్న ఉత్పత్తి భూసార క్షీణతకు, అడవుల నిర్మూలనకు, ఆవాస నష్టానికి కారణమవుతుంది. ఇవన్నీ కలిపి భూతాపాన్ని మరింత పెంచుతాయి.
ఇథనాల్ ప్లాంట్‌ల కాలుష్య సమస్యకు సరైన వివరణ ఇచ్చి ప్రజలను సమాధానపరచే బదులు, కంపెనీ యాజమాన్యం ఈ సమస్యను కుల సమస్యగా చిత్రించే ప్రయత్నం చేసింది. బీసీ కుల సంఘాల నాయకులతో పత్రికా సమావేశం ఏర్పాటు చేయించింది. బీసీలు పరిశ్రమలు నిర్మించి తెలంగాణను అభివృద్ధి చేస్తుంటే, ఓర్వలేని కొంతమంది వ్యక్తులు రాజకీయ పార్టీల మద్దతుతో దాడులకు పాల్పడుతున్నారని వారు ప్రకటించారు. ఈ వాదన ఆధారాలు లేనిది. ఎందుకంటే ఇప్పటి వరకూ చిత్తనూరు, దిలావర్‌పూర్, పెద్ద ధన్వాడ ప్రాంతాలలో ఇథనాల్ వ్యతిరేక పోరాటాలలో పాల్గొన్న వారిలో అత్యధికులు దళితులు, వెనుకబడిన వర్గాల ప్రజలే. వారు కేసులకు, రాజ్యహింసకు గురై జైలు పాలయ్యారు. ప్రజల ఆందోళనలకు ఇథనాల్ ప్లాంట్‌ల కాలుష్య భయమే ప్రధాన కారణం.
పైగా, ఈ ప్లాంట్లను నిర్మిస్తున్న ప్రాంతాలలో ‘‘రైతులకు ప్రయోజనం, నిరుద్యోగులకు ఉద్యోగాలు’’ అనే వాదనలు కూడా అబద్ధమని ఇప్పటికే తేలిపోయింది. దేశ వ్యాపితంగా ఈ ఇథనాల్ ప్లాంట్‌లు ప్రారంభమైన ప్రాంతాల్లో స్థానిక కంపెనీలు కనీసమద్దతు ధరలకు నేరుగా రైతుల నుంచి వడ్లు, మొక్కజొన్న కొనుగోలు చేయలేదు. కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీ ధరతో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.సి.ఐ) నుంచి బియ్యం సరఫరా చేసింది. కనీసమద్దతు ధరలతో తాము రైతుల నుంచి నేరుగా వరి ధాన్యం, మొక్కజొన్న కొనలేమనీ, అందువల్ల ఈ ప్లాంట్‌లకు ఎఫ్‌సిఐ ద్వారా రాబోయే ఐదేళ్ల పాటు చవక ధరలకు బియ్యం సప్లై చేయాలనీ, జన్యు మార్పిడి మొక్కజొన్నను అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటామనీ, దానిపై దిగుమతి సుంకం పూర్తిగా రద్దు చేయాలనీ కోరుతూ ఈ కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశాయి. ప్రెస్ మీట్ పెట్టి డిమాండ్ చేశాయి. ఈ ప్లాంట్‌ల వల్ల రైతులకు ఏ లాభమూ లేదు.
పెట్టుబడిదారులు ఏ కులం వారైనప్పటికీ, కాలుష్యం అనేది అన్ని కులాలపై సమానంగా ప్రభావం చూపుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కంపెనీ, ప్రభుత్వం సంయుక్తంగా ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ నిర్వహించి, ఫలితాలను ప్రజల ముందు ఉంచాలి. ప్రభుత్వ అధికారులు, పర్యావరణవేత్తలు, ప్రజలు, ప్రజాసంఘాలు, పౌర సమాజ ప్రతినిధులతో ఒక సంయుక్త కమిటీని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి వాస్తవాలు, అంతర్జాతీయ నివేదికల ఆధారంగా చర్చించాలి. ఇప్పటివరకూ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో జరిగిన ఇథనాల్ వ్యతిరేక పోరాటాలలో పాల్గొన్న వారిపైన, నాయకులపైన పెట్టిన అన్ని కేసులూ వెనక్కు తీసుకోవాలి. పోలీస్ దాడులలో గాయపడినవారికి, అరెస్ట్ అయిన వారికీ న్యాయం కల్పించేందుకు స్వతంత్ర దర్యాప్తు చేయాలి.
-కలపాల బాబూరావు
సైంటిస్ట్స్ ఫర్ పీపుల్
- కన్నెగంటి రవి
తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ