Share News

భద్రప్రయాణానికి భరోసా కల్పించాలి

ABN , Publish Date - Jun 17 , 2025 | 02:47 AM

ఇటీవల ముంబైలో జరిగిన లోకల్ రైలు ప్రమాదంలో ప్రయాణికులు చనిపోవడం, పలువురు గాయపడడం అత్యంత విషాదకరమైన సంఘటన. గతంలో ప్రమాదాలు రైళ్లు పట్టాలు తప్పడం, ఒకదానికి ఒకటి ఢీకొనడం...

భద్రప్రయాణానికి భరోసా కల్పించాలి

ఇటీవల ముంబైలో జరిగిన లోకల్ రైలు ప్రమాదంలో ప్రయాణికులు చనిపోవడం, పలువురు గాయపడడం అత్యంత విషాదకరమైన సంఘటన. గతంలో ప్రమాదాలు రైళ్లు పట్టాలు తప్పడం, ఒకదానికి ఒకటి ఢీకొనడం, వరదల వల్ల పట్టాలు కొట్టుకొనిపోవడం, విద్రోహ చర్యలు వంటి వాటివల్ల జరిగేవి. ఇప్పుడు ప్రయాణికుల రద్దీ వల్ల జరుగుతున్నాయి. ఒకసారి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట వల్ల ప్రయాణికులు చనిపోయిన ఘటన కూడా జరిగింది. వీటిన్నిటికీ రైల్వే శాఖకు ముందస్తు ప్రణాళిక లేకపోవడం కారణమవుతోంది.

రైల్వే స్టేషన్లను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మౌలిక వసతులు, ఆకర్షణీయమైన రీతిలో అంతర్జాతీయ సాంకేతిక ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్నారు, ఇది చాలా హర్షించదగ్గ విషయం. కానీ వీటిని ఉపయోగించే ప్రయాణికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. జనాభా అవసరాలకు తగ్గట్టు ప్రయాణికుల రైళ్లు పెరగడం లేదు. ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చడంతో పాటు కొన్ని స్టేషన్లలో హాల్ట్‌లను ఎత్తివేస్తున్నారు. అత్యంత వేగంతో నడిచే రైళ్లు ప్రవేశపెట్టడానికి చూపించే శ్రద్ధ, సామాన్య ప్యాసింజర్ రైళ్ల విషయంలో చూపడం లేదు. చార్జీలు కూడా విపరీతంగా పెంచారు. స్లీపర్ బోగీల సంఖ్య తక్కువగా ఉంటోంది. జనరల్ బోగీల్లో సీట్లు సామర్థ్యానికి మించి టికెట్లు జారీ చేస్తున్నారు. ఫలితంగా ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణించాల్సి వస్తున్నది.


దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆధునీకరించిన స్టేషన్ల సముదాయాల వల్ల రైల్వే శాఖకు ఆదాయం విస్తృత స్థాయిలో లభిస్తోంది. కాబట్టి కొత్త ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రవేశపెట్టడం, ఉన్నవాటికి బోగీలను పెంచడం, ప్రజలకు అవసరం ఉన్న స్టేషన్లలో హాల్ట్‌లను కల్పించడం చేయాలి. ప్రజలు ప్రమాదరహితంగా, సుఖసంతోషాలతో రైలు ప్రయాణం చేయడానికి వీలు కల్పించి భారతీయ రైల్వేను ప్రపంచ పటంలో ఆదర్శవంతమైన వ్యవస్థగా నిలపాలి.

దండంరాజు రాంచందర్‌రావు

Updated Date - Jun 17 , 2025 | 02:47 AM