Child Rights: బాలకార్మికతకు అంతమెప్పుడు
ABN , Publish Date - Jun 12 , 2025 | 06:21 AM
ఈ రోజు అంతర్జాతీయ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేకదినం. అంటే బానిస సంకెళ్ళను తెంచుకొని, మూసిన కనురెప్పలు విప్పుకొని, రెక్కలు కట్టుకొని స్వేచ్ఛా విహంగాలై చిన్నారులు ఎగిరిపోవాల్సిన రోజు ఇది. ఈ ప్రపంచంలో అత్యంత...
ఈ రోజు అంతర్జాతీయ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేకదినం. అంటే బానిస సంకెళ్ళను తెంచుకొని, మూసిన కనురెప్పలు విప్పుకొని, రెక్కలు కట్టుకొని స్వేచ్ఛా విహంగాలై చిన్నారులు ఎగిరిపోవాల్సిన రోజు ఇది. ఈ ప్రపంచంలో అత్యంత దయనీయమైన విషయం ఏదైనా ఉందీ అంటే అది బాలకార్మిక వ్యవస్థ. రేపటి తరం అని మురుస్తున్న ఆ భవిష్యత్ తరం వేరే దిక్కులేక అన్నమో రామచంద్రా అంటూ రోడ్డున పడడం ప్రపంచంలో అన్నింటినీ మించిన విషాదం. పాపం, పుణ్యం, ప్రపంచ మార్గం ఏదీ తెలియని బాలలు మోయలేని భారాన్ని మోస్తున్నారు. పలకా బలపం పట్టాల్సిన చేతులు పత్తి చేలల్లో మగ్గిపోతున్నాయి. చెంగు చెంగున గంతులు వేయాల్సిన బాల్యం ఇటుక బట్టీల్లో మసిబారిపోతోంది. కాఫీ హోటళ్లలో, కార్ఖానాల్లో, ఇంకా కాదంటే ఖరీదైన ఇళ్ళల్లో పసిబతుకులు వసివాడి పోతున్నాయి. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా 160 మిలియన్ల మంది బాలలు బాలకార్మిక వ్యవస్థ విషవలయంలో చిక్కుకున్నారని యూనిసెఫ్ లెక్కలు తెలియజేస్తున్నాయి. దీనర్థం ప్రపంచంలోని ప్రతి పదిమందిలో ఒక పసిప్రాణం బాలకార్మిక వ్యవస్థకు బలైపోతోంది. ఇది స్వయంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన గణాంకాలు. బాలలను శారీరకంగా, మానసికంగా, సామాజికంగా అణచివేసి, శ్రమదోపిడీకి పాల్పడుతున్న ధనిక, పెట్టుబడీదారీ వర్గం బాలకార్మిక వ్యవస్థను పెంచి పోషిస్తోంది. బట్టీల్లోనూ, గనుల్లోనూ, కార్ఖానాల్లోనూ, కార్యాలయాల్లోనే కాదు... చివరకు అక్రమ రవాణా ద్వారా చిన్నారులపై లైంగిక దోపిడీ కూడా సర్వసాధారణంగా మారిపోయింది. దీన్ని అడ్డుకునేందుకు అరాకొరా చర్యలే తప్ప, పూర్తిస్థాయిలో, చిత్తశుద్ధితో జరుగుతున్న పనులు చాలా తక్కువ. బాలకార్మిక వ్యవస్థకు ప్రధానమైన కారణం పేదరికం. రెక్కలు ముక్కలు చేసుకున్నా కడుపు నిండని జీవితాలు చిట్టి చేతుల చిన్నారులను పనుల్లోకి దింపుతున్నాయి. దీనికి తోడు నిరక్షరాస్యత చిన్నారులను బడులవైపు కాకుండా పనుల వైపు మళ్ళిస్తోంది. యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తోన్న చైల్డ్ లేబర్ సమస్యని ప్రపంచ దేశాలు దశాబ్దాల క్రితమే గుర్తించినప్పటికీ నేటికీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే అన్న చందంగా ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన గణాంకాలకే పరిమితమైంది. ఈ నేలపైన పుట్టిన ప్రతి బిడ్డకీ జీవించే హక్కు ఉంటుంది. బాలలకు విద్య, ఆరోగ్యం... రాజ్యాంగం కల్పించిన హక్కులు. బాలకార్మిక వ్యవస్థ చిన్నారుల ప్రతి హక్కునీ హరించివేస్తోంది. కానీ పేదరికంలో జన్మించిన ప్రతి చిన్నారికీ ఇవేవీ వర్తించడం లేదు.
బాలకార్మిక నిషేధ చట్టం పనితీరు, చట్టానికి వ్యతిరేకంగా పనిచేయించుకుంటున్న వారికి వేస్తున్న శిక్షలను బట్టి అంచనా వేయవచ్చు. ఇక స్వంత కుటుంబాల్లోనే బాలకార్మికులుగా మిగిలిపోతున్నవారు మన దేశంలో కోకొల్లలు. తల్లిదండ్రులు కూలికిపోతే, బడిమానేసి, బిడ్డల సంరక్షణ చేస్తున్న చిన్నారుల సంఖ్య మనదేశ పాలకుల లెక్కలకు అందనిది. బడ్జెట్ కేటాయింపుల్లో దేశంలో సంగతి సరే, ప్రపంచవ్యాప్తంగా చూసినా సామాజిక రక్షణ నగదు ప్రయోజనాలు (సోషల్ ప్రొటెక్షన్ క్యాష్ బెనిఫిట్స్) పొందుతున్న బాలలు 26.4 శాతం మాత్రమే. ఇక పేదల ఇళ్ళు గడవని స్థితిలో ప్రభుత్వ పథకాల కోసం ఎదురుచూస్తున్న స్థితి. పేదలు బతుకు గడవని స్థితిలో తమ బిడ్డలనే బానిసలుగా మారుస్తున్నారు. దీన్ని అడ్డుకోవడానికి వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడం తప్ప మరో మార్గమే లేదు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టం చేసి చేతులు దులుపుకునే పరిస్థితి నుంచి దేశం బయటపడాలంటే బడ్జెట్ కేటాయింపులపై దృష్టి సారించాలి. అలాగే వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ, నైపుణ్యం లేమితో బాధపడుతున్న మన దేశంలో భవిష్యత్ తరాల చదువుకి ప్రాధాన్యత అత్యంత ఆవశ్యకం. చిన్నారులను విజ్ఞానవంతులుగా తయారుచేయడంలో తొలి అడుగు అక్షరాస్యతను పెంపొందించడం. బడుల నుంచి దూరమవుతోన్న బాలలను గుర్తించి పాఠశాలల్లోకి వారు అడుగిడే ప్రయత్నం చేయడం. నాణ్యమైన చదువుని పిల్లలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న విషయం గుర్తించే వరకూ సమైక్యంగా పోరాడటం. ఇందుకు సుదీర్ఘ కార్యాచరణని రూపొందించుకొని ముందుకు సాగాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
– మద్దులూరి ఆంజనేయులు అక్షరం,
వ్యవస్థాపక కార్యదర్శి