Share News

True Tribute to Ambedkar: రాజ్యాధికారమే అంబేడ్కర్‌కు అసలైన నివాళి

ABN , Publish Date - Dec 06 , 2025 | 04:56 AM

ఆధునిక భారతదేశ చరిత్రలో అంబేడ్కర్‌కు అత్యంత ప్రాముఖ్యం ఉంది. దేశ జనాభాలో పదిశాతం ఉన్న అగ్రవర్ణాలవారు, తొంభైశాతం ఉన్న అణగారిన వర్గాల ప్రజల మెదళ్లకు...

True Tribute to Ambedkar: రాజ్యాధికారమే అంబేడ్కర్‌కు అసలైన నివాళి

ఆధునిక భారతదేశ చరిత్రలో అంబేడ్కర్‌కు అత్యంత ప్రాముఖ్యం ఉంది. దేశ జనాభాలో పదిశాతం ఉన్న అగ్రవర్ణాలవారు, తొంభైశాతం ఉన్న అణగారిన వర్గాల ప్రజల మెదళ్లకు బానిస సంకెళ్లు వేసి తరతరాలుగా వారితో వెట్టిచాకిరీ చేయించుకున్నారు. స్వాతంత్ర్యానంతరం ఇలాంటి పరిస్థితులను రూపుమాపి, దేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులను సరిసమానం చేసేందుకు కృషి చేసిన వ్యక్తి డా. బీఆర్‌ అంబేడ్కర్. ‘దళిత కుటుంబంలో జన్మించి, ఎన్నో కష్టాలు పడి, పోరాటాలు, త్యాగాలు చేసి భారత రాజ్యాంగం అనే గ్రంథాన్ని రచించిన ఒక విశిష్ట సంఘ సంస్కర్త’గా మాత్రమే నేటి పాలకులు అంబేడ్కర్‌ను పరిమితం చేశారు. కానీ, అణగారిన వర్గాలకు ఏ లక్ష్యాలను సాధించుకోవాలని చెప్పాడో వాటిని నేటి పాఠ్యాంశాల్లో చేర్చకపోవడం దేశ అగ్రవర్ణ పాలకుల స్వార్థబుద్ధికి నిదర్శనం. వారు అంబేడ్కర్‌ స్థాయిని ఉద్దేశపూర్వకంగానే తగ్గించి రాశారు. ఆ చరిత్రే నిజమని నేడు ఎందరో విద్యావంతులు, మేధావులూ నమ్ముతుండడం విచారకరం.

అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాత, గొప్ప సంఘసంస్కర్త మాత్రమే కాదు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, ఉచిత స్కాలర్‌షిప్‌లు, రిజర్వేషన్లు అంతకంటే కాదు. అంబేడ్కర్ సమానత్వాన్ని కాంక్షించారు. జనాభాలో పదిశాతం ఉన్న అగ్రవర్ణాలకు, తొంభైశాతం ఉన్న అణగారిన వర్గాలకు మధ్య ఒక స్పష్టమైన సైద్ధాంతిక గీత గీశారు. అసమానతలను పెంచి పోషించాలనుకునే అగ్రవర్ణ సమాజానికి– సమసమాజం, ప్రజాస్వామ్య, గణతంత్ర విలువలు కావాలనుకునే అణగారిన సమాజానికి మధ్య ‘సామాజిక రాజకీయ సాంస్కృతిక’ భావజాల పోరాటం చేశారు. భారత ప్రజలందరి మధ్యా ‘స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, ప్రజాస్వామ్య, గణతంత్ర’ భావాలు విరజిల్లాలని కలలుగని, ఆయా అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచాడు. ఒకపక్క బ్రిటిష్ పాలకులపై రాజీపడని స్వాతంత్ర్య పోరాటం సాగిస్తూనే, మరోపక్క నాటి అగ్రవర్ణ నాయకులతోనూ అంతే స్థాయిలో తీవ్ర పోరాటం చేశాడు. స్వాతంత్ర్యానంతరం అగ్రవర్ణాల వారే పాలకులై, అణగారిన వర్గాలను బానిసలుగా మార్చకూడని భావించాడు. అంబేడ్కర్ అంతటి విశాల భావాలు ఉన్నవాడు కాబట్టే ఆయన జయంతిని జ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

ఓటు అనే వజ్రాయుధాన్ని రాజ్యాంగం ద్వారా అంబేడ్కర్‌ ప్రజలకందించాడు. జనాభాలో అధిక శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు అధికారంలోకి రావాలని ఆకాంక్షించాడు. అంబేడ్కర్‌ జయంతి, వర్ధంతి రోజుల్లో ఏదో హడావిడి చేయడం కాదు ‘రాజ్యాధికారంతో సమాజాన్ని మార్చడం, సమాజంతో రాజ్యాధికారానికి రావడం– దీన్ని పునరావృతమయ్యేలా సామాజిక పరివర్తన చేయడ’మే అంబేడ్కర్‌కు మనం ఇచ్చే ఘనమైన నివాళి.

– పుల్లెంల గణేశ్‌

Updated Date - Dec 06 , 2025 | 04:56 AM