Venkataramani Nagarajan: లెఫ్ట్ రైట్ తేడా లేని ఆనాటి నిర్బంధం
ABN , Publish Date - Jun 24 , 2025 | 03:38 AM
ఎమర్జెన్సీలో ఆంతరంగిక భద్రత చట్టం (మీసా) కింద 21 నెలలు ఖైదు అనుభవించిన వారిలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్‌ఎస్‌యు) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటరమణి నాగరాజన్ ఒకరు....
ఎమర్జెన్సీలో ఆంతరంగిక భద్రత చట్టం (మీసా) కింద 21 నెలలు ఖైదు అనుభవించిన వారిలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్‌ఎస్‌యు) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటరమణి నాగరాజన్ ఒకరు. ప్రస్తుతం ఆయన స్వీడన్‌లో ఉంటున్నారు. అత్యయిక స్థితికి 50 ఏళ్లు నిండిన నేపథ్యంలో, విద్యార్థి సంఘం నాయకుడిగా ఆనాడు జైలుకు వెళ్లిన ఆయనను ఆంధ్రజ్యోతి పలకరించింది.
విద్యార్థిగా ఉన్న మిమ్మల్ని ఎమర్జెన్సీలో అరెస్టు చేయడానికి కారణం?
అప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ రెండవ సంవత్సరం చదువుతున్నాను. ఎమర్జెన్సీ విధించడానికి కొద్దిరోజుల ముందు, అంటే 1975, ఫిబ్రవరి 20, 21న రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్‌ఎస్‌యూ)ఏర్పడింది. బొగ్గులకుంట సారస్వత పరిషత్ హాల్ వేదికగా వందలాదిమంది విద్యార్థుల సమక్షంలో నన్ను విప్లవ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆనాటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. అలా 1975, జూన్ 25న వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో సభ నిర్వహించి, హైదరాబాద్‌లోని మా ఇంటికి చేరేసరికి అర్ధరాత్రి అయింది. మంచం మీద నడుం వాల్చానో లేదో నలుగురు పోలీసులు వచ్చి నన్ను జీపు ఎక్కించారు. ఈ సంగతి సివిల్ లిబర్టీస్ న్యాయవాది పత్తిపాటి వెంకటేశ్వర్లుకు తెలియజేయమని మా చిన్న తమ్ముడికి చెప్పాను. అప్పుడు నా వయసు 22 ఏళ్లు. దేశంలో ఎమర్జెన్సీ విధించారన్న సంగతి కూడా నాకు ఆ క్షణాన తెలియదు.
మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లారు?
నన్ను పోలీస్ కంట్రోల్ రూమ్‌కు తీసుకెళ్లారు. లోపల అడుగుపెట్టగానే పత్తిపాటి వెంకటేశ్వర్లు ఎదురయ్యారు. ఆయన్ను చూడగానే నాకు చాలా ధైర్యం వచ్చింది. ‘ఏంటి సర్! మాకన్నా ముందే చేరుకున్నారు, మా తమ్ముడు ఫోన్ చేశాడా?’ అనడిగాను. ‘కాదయ్యా, నన్ను కూడా అరెస్టు చేశారు’ అని పత్తిపాటి చెప్పగానే ఇద్దరం నవ్వుకున్నాం. మరో రెండు అడుగులు ముందుకు వేస్తే.. లోపల సోఫాలో ఎంటీఖాన్, చెరబండరాజు, కేశవరావు జాదవ్, సీతల్ సింగ్ లష్కరీ లాంటి పెద్దలంతా ఉన్నారు. తరువాత మమ్మల్ని చంచల్‌గూడ జైలుకు తీసుకెళ్ళారు. అక్కడ వరవరరావు, నాయిని నరసింహారెడ్డి, బొజ్జా తారకం, గుర్రం విజయకుమార్ ఇంకా చాలామంది ఉన్నారు. మరొకవైపు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు బండారు దత్తాత్రేయ, ఆలె నరేంద్ర, బంగారు లక్ష్మణ్‌తో పాటు అడ్వకేట్ సుబ్బారాయుడు వంటి సీనియర్ నాయకులు, విశ్వహిందూ పరిషత్, జమాతే ఇస్లామి హింద్ సభ్యులు, హేతు వాదులు, ఆనందమార్గం భక్తులు... ఇలా భిన్న భావజాలాలు, విభిన్న దృక్పథాలు కలిగిన వారందరినీ పోలీసులు అరెస్టు చేసి తీసుకొచ్చారు.
ఆర్‌ఎస్‌ఎస్ నుంచి ఆర్‌ఎస్‌యూ వరకు... రాజకీయ వైరుధ్యాలు కలిగిన మీరంతా జైల్లో కలిసే ఉన్నారా?
చంచల్‌గూడ జైలు ఒక బ్యారక్‌లోని ఓ వింగ్‌లో విరసం, పౌరహక్కుల నేతలతో పాటు వామపక్ష భావజాలంతో సారూప్యత కలిగిన సోషలిస్టులు, హేతువాదులను ఉంచారు. జనసంఘ్, ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ, జమాతే ఇస్లామి, ఆనందమార్గంతో పాటు మిగతావారందరికి మరొక వింగ్ కేటాయించారు. అయితే, వంటశాల మాత్రం ఎవరిది వారికే. లెఫ్ట్ సంబంధిత మిత్రులందరికి ఒక కిచెన్ ఉండేది. ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లది మరొకటి, వెజిటేరియన్స్ కావడంతో వీహెచ్‌పీ వారిది ఇంకొకటి... ఇలా ఎవరికివారుగా ఆహార పద్ధతులు, అభిరుచులు ఆధారంగా కలసి వంట చేసుకొనేవారు. అయితే, దోశ పెనం, చపాతీ కాల్చే తవ్వా వంటి కొన్ని వంట పాత్రలు ఒకరికొకరం ఇచ్చిపుచ్చుకొనేవాళ్లం. జైల్లో అడుగుపెట్టినప్పటికి మాకు కనీస సౌకర్యాలు లేవు. లెఫ్ట్ రైట్ తేడా లేకుండా మేమంతా కలసి రాజకీయ ఖైదీల హక్కులు అమలుపరచాలని నిరసనలు తెలిపాం. ఫలితంగా మంచం, చద్దర్లు, టూత్‌పేస్ట్, బ్రష్... ఇలా ఒక్కొక్కటిగా సౌకర్యాలు సమకూరాయి.
మీ మధ్య సైద్ధాంతిక చర్చలు ఏమైనా కొనసాగేవా?
లెఫ్టిస్టులు, రైటిస్టులు అన్న తేడా లేకుండా జైల్లో అంతా చాలా స్నేహపూర్వకంగా మెలిగేవాళ్లం. భార్యాపిల్లలు గుర్తొచ్చి లేదంటే ఇంటిమీద బెంగతోనో ఎవరైనా ఏడుస్తుంటే కూడా, వారి రాజకీయ అభిప్రాయాలతో సంబంధం లేకుండా ఒకరినొకరు ఓదార్చుకొని ధైర్యం చెప్పుకొన్న సందర్భాలెన్నో! దేశ్‌ముఖ్ అని ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ ఒకరు రోజూ యోగా సాధన చేయించేవారు. ఆ శిబిరానికి నేనూ కొద్దిరోజులు వెళ్లాను. అయినా వరవరరావు, ఎంటీఖాన్ నాకు అభ్యంతరం చెప్పలేదు. ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ నాయకులంతా కమ్యూనిస్టుల పట్ల చాలా గౌరవంగా ఉండేవారు. వీళ్లూ అవతలి వారి పట్ల ఎంతో హుందాగా ప్రవర్తించేవారు. మాటలు లేదా చేతల ద్వారా ఎప్పుడూ కవ్వించే విధంగా ప్రవర్తించలేదు. అయితే, ఎవరికివారుగా రాజకీయ చర్చాగోష్ఠులు నిత్యం నిర్వహించుకొనేవారు.
జైల్లో మీకు ఎవరైనా స్నేహితులు అయ్యారా?
ఓహ్ చాలామంది! ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ దేశ్‌ముఖ్ నన్ను తరచుగా ప్రశంసిస్తుండేవారు. కొద్దిరోజుల తర్వాత చంచల్‌గూడ జైలుకు పరిటాల శ్రీరాములు వచ్చారు. ‘చిన్నవయసు లోనే సామాజిక మార్పు కోసం పనిచేస్తున్నావు’ అంటూ నన్ను అభినందిస్తుండేవారు. జైల్లో ఉన్నన్నాళ్లు నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు. నాయిని నరసింహారెడ్డి, పరిటాల శ్రీరాములు, బీచ్‌పల్లి గౌడ్... మాదంతా వాలీబాల్‌లో ఒక టీమ్. బీచ్‌పల్లి గౌడ్ ఆర్‌ఎస్‌ఎస్ అయినా, నేనంటే చాలా అభిమానం. బయటకు వచ్చాక కూడా ఒకటి రెండుసార్లు కలసిన జ్ఞాపకం. ఆలె నరేంద్ర, బండారు దత్తాత్రేయ కూడా నాతో స్నేహంగా మెలిగేవాళ్లు. తర్వాత యలమంచలి శివాజీ కూడా కొద్దిరోజులు చంచలగూడ జైల్లో ఉన్నారు, నాకు స్నేహితుడయ్యారు. నాయిని నరసింహారెడ్డి స్నానాల గదిలో ఉన్నప్పుడు మేమంతా బయట నుంచి ‘త్వరగా రా నాయిని... పెరోల్ వచ్చింది’ అని అరుస్తూ ఆటపట్టిస్తుండేవాళ్లం. ఆయన చాలా స్పోర్టివ్‌గా తీసుకొనేవారు. ఇలా 1977, ఫిబ్రవరిలో జైలు నుంచి మేమంతా విడుదలయ్యే వరకు బోలెడన్ని జ్ఞాపకాలు మిగిలాయి.
ఆ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్, వామపక్ష వాదుల మధ్య ఘర్షణలు ఎప్పుడైనా తలెత్తాయా?
ఒక సందర్భంలో విప్లవ కవి చెరబండ రాజు, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త ఆలె నరేంద్ర మధ్య చిన్నపాటి ఘర్షణ తలెత్తింది. అదీ వంటపాత్రల శుభ్రత విషయంలోనే. ఇరుపక్షాల పెద్దలు వారించడంతో సద్దుమణిగింది. అంతకు మించి మరెప్పుడూ ఎవరి మధ్య ఎలాంటి పేచీ లేదు. జమాతె ఇస్లామి, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు కూడా కలసిమెలసి ఉన్నారు. రోజూ సాయంత్రం 4 గంటలు కాగానే మేమంతా కలసి మైదానంలో వాలీబాల్, బ్యాడ్మింటన్ ఆడేవాళ్లం. విశ్వహిందూ పరిషత్, ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లు మమ్మల్ని శ్రీరామ నవమి ఉత్సవాలకు ఆహ్వానించేవారు, మేడే సమావేశాలకు మేము వాళ్లను పిలవగానే వచ్చేవారు. మా మధ్య సైద్ధాంతిక విభేదాలున్నా, ఆనాటి నిర్బంధ సమయంలో ఎప్పుడూ హుందాతనాన్ని కోల్పోయిన సందర్భం లేదు.
మీ జైలు జ్ఞాపకాల నుంచి ఇంకొన్ని విశేషాలు..?
ఒకరోజు మహాకవి శ్రీశ్రీ నుంచి విప్లవ రచయితల సంఘం నాయకులకు ఉత్తరం వచ్చింది. అంతకు ముందు ఏడాది ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా ‘తెలుగువీర లేవరా...’ పాటకుగాను కేంద్రం శ్రీశ్రీకి ఉత్తమ గేయరచయితగా జాతీయ చలనచిత్ర పురస్కారం ప్రకటించింది. దాని ప్రదానోత్సవం 1975 ఎమర్జెన్సీ కాలంలో! ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కారణంగా అవార్డుతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పదివేల రూపాయల నగదు బహుమతిని అందుకోడానికి అనుమతించాల్సిందిగా విరసం నేతలను కోరుతూ శ్రీశ్రీ ఆ లేఖ రాశారు. అప్పుడు కేవీ రమణారెడ్డి కూడా చంచల్‌గూడ జైల్లో ఉన్నట్టు గుర్తు. విరసం సభ్యుడిని కాకపోయినా, ఉత్తరం మీద సాగిన సంభాషణలో నేనూ పాల్గొన్నాను. తర్వాత వారంతా సానుకూలంగా స్పందిస్తూ శ్రీశ్రీకి జాబు రాసినట్టు జ్ఞాపకం.
మీకు విప్లవ రాజకీయాలతో పరిచయం ఎలా ఏర్పడింది?
దోమల్‌గూడలోని ఆంధ్ర విద్యాలయ(ఏవీ) కాలేజీలో డిగ్రీలో చేరినప్పుడు మాకు జార్జిరెడ్డి ఫిజిక్స్ లెక్చరర్. ఏడాది తర్వాత మంచి ర్యాంకు రావడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం బీఎస్సీ హానర్స్‌లో చేరాను. అప్పుడు అక్కడ జార్జిరెడ్డి పీహెచ్‌డీ చేస్తున్నారు. రోజూ సాయంత్రం సైన్స్ కాలేజీ క్యాంటీన్ బయట రాళ్లమీద కూర్చొని మాట్లాడుకునేవాళ్లం. మార్క్సిజం, లెనినిజం, ఎకనామిక్స్ థియరీ లాంటి సంక్లిష్టమైన విషయాలను చాలా సరళంగా, నిత్య జీవిత ఉదాహరణలతో చెప్పాలంటే జార్జిరెడ్డి తర్వాతే మరెవరైనా! ఒకసారి ఆయన వెంట సైకిల్‌మీద వరంగల్ వెళ్లాను. కేజీ సత్యమూర్తిని కలిశాం. జార్జిరెడ్డి వల్లే నాకు విప్లవ రాజకీయాలతో పరిచయం ఏర్పడింది. ఆయన మరణం తర్వాత నేను మరింతగా ఆ రాజకీయాలతో మమేకం కావడానికి ప్రధాన ప్రేరణ కొండపల్లి సీతారామయ్య. ఆర్‌ఎస్‌యూ వ్యవస్థాపక అధ్యక్షుడిగా 1977 వరకు బాధ్యతలు నిర్వర్తించాను. నా తర్వాత ఆ బాధ్యతలు స్వీకరించిన చెరుకూరి రాజ్‌కుమార్, నేను, కిషన్‌జీ ఉస్మానియా లా కాలేజీలో చేరాం. గణపతి కూడా తరచుగా కలుస్తుండేవాడు. మేమంతా మంచి స్నేహితులం.
ప్రస్తుత దేశ పరిస్థితుల మీద మీ అభిప్రాయం?
దేశంలో పదేళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. ఆనాటి అత్యయిక స్థితికన్నా ఇది ప్రమాదకరమైంది. సూక్ష్మంగా చూస్తేకానీ అంత సులువుగా మనకు అర్థం కావడం కష్టం. ఈ నిర్బంధం మరెంతో కాలం సాగదు. చీకటి మబ్బులు వీడేరోజులు త్వరలోనే వస్తాయి.
-కారుసాల వెంకటేశ్