Attack on Narendra: ఆ దాడి.. వాస్తవం కాదు
ABN , Publish Date - Jun 27 , 2025 | 04:45 AM
అత్యవసర పరిస్థితి అమలై యాభయ్యేళ్ళు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ లోని చంచల్‌గూడ జైలులో నిర్బంధించిన మీసా డిటెన్యూలైన ఆర్‌ఎస్‌యు వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటరమణి, విరసం నేత వరవరరావుల వ్యాసాలలోని అనుభవాలకు...
అత్యవసర పరిస్థితి అమలై యాభయ్యేళ్ళు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ లోని చంచల్‌గూడ జైలులో నిర్బంధించిన మీసా డిటెన్యూలైన ఆర్‌ఎస్‌యు వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటరమణి, విరసం నేత వరవరరావుల వ్యాసాలలోని అనుభవాలకు సంబంధించి కొన్ని అంశాలను ప్రస్తావిస్తున్నాను. వెంకటరమణి చెప్పినట్లు లెఫ్ట్, రైట్ వంటి విబేధాలు లేకుండా, చివరకు ఆర్ఎస్ఎస్, జమాతే ఇస్లామి హింద్, ఆనంద్ మార్గ్ వంటి వారంతా కలిసి ఒక కుటుంబం మాదిరిగా ఉండేవాళ్లం. అయితే 50 ఏళ్ళు కావడంతో కొన్ని జ్ఞాపకాలు మసకబారి ఉండవచ్చు. వరవరరావు చెప్పినట్లు చెరబండరాజును మాజీ కేంద్ర మంత్రి ఆలె నరేంద్ర వెనుకగా వచ్చి కర్రతో కొట్టారనడం, తిరిగి నరేంద్రపై దాడి చేశారనడం వాస్తవం కాదు. అలాగే వందేమాతరం పాటతో కోపగించుకున్నారనడం కూడా నిజం కాదు. భారత మాతను కించపరుస్తూ పాడడంతో పాతబస్తీకి చెందిన శివాజీరావు పవార్ ఆగ్రహంతో నిలదీశాడు. అయితే, సాయంత్రం వంటపాత్రలు ఇచ్చే దగ్గర జరిగిన వాగ్వివాదంలో వరవరరావు వంట చేసే పెనంపై కాలు వేయడంతో కోపం పట్టలేక, అన్నం వండే దానిపై కాలు వేస్తావా? అంటూ అందరూ ఉండగానే చెంపపై చేతితో కొట్టాడు. దాంతో కొంత అలజడి జరిగింది. తర్వాత, వీరిద్దరూ పేర్కొన్నట్లు భావజాలాన్ని బట్టి అక్కడ మెస్‌లు లేవు. వాస్తవానికి భావజాలాలు బట్టి కాకుండా వ్యక్తిగత అహంకారాలతో ఎక్కువగా వివాదాలు చెలరేగుతూ ఉండేవి. స్వాతంత్ర్య పోరాటంలో తన జైలు జీవితం గురించి రాస్తూ టంగుటూరి ప్రకాశం ‘‘నేను జైలులో పెద్దవారి చిన్న మనస్సులను, చిన్నవారి పెద్ద మనసులను చూశాను’’ అన్నారు. అంటే, బయట ఎంతో ప్రఖ్యాతులైన వారు జైలులో చిన్న చిన్న విషయాలలో సంకుచితంగా, మొండిగా వ్యవహరిస్తూ ఉండేవారు. ఇక్కడ కూడా అటువంటి ఘటనలు కొన్ని జరిగినా కొట్లాటల వరకు వెళ్లలేదు. ప్రతిరోజూ అందరం కలిసి చర్చాగోష్ఠులు నిర్వహించుకొనేవాళ్ళం. ఆ పక్రియలోనే తరిమెల నాగిరెడ్డి మరణం సందర్భంగా సంతాప సభ జరిగింది. ఆ సభలో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ విఎల్ దేశముఖ్ మాట్లాడటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.
– చలసాని నరేంద్ర