Ch. Vidyasagar Rao: నా బిడ్డ నన్ను గుర్తుపట్టలేదు
ABN , Publish Date - Jun 28 , 2025 | 02:43 AM
దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా గతాన్ని తలచుకుంటుంటే ఆనాటి భయంకర జ్ఞాపకాలు కట్టలు తెంచుకొని, ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అందులో కొన్ని బాధించేవి ఉన్నాయి, ఆవేదనాభరితమైనవి ఉన్నాయి...
దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా గతాన్ని తలచుకుంటుంటే ఆనాటి భయంకర జ్ఞాపకాలు కట్టలు తెంచుకొని, ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అందులో కొన్ని బాధించేవి ఉన్నాయి, ఆవేదనాభరితమైనవి ఉన్నాయి, కన్నీరు చెరమర్చేవి ఉన్నాయి, ఆశ్చర్యం కలిగించేవీ ఉన్నాయి. ఎమర్జెన్సీ కాలంలో ‘మీసా’ చట్టం కింద అరెస్టయ్యేనాటికి నా వయసు 30 సంవత్సరాలు. వరంగల్ కేంద్ర కారాగారంలో నన్ను బంధించారు. ఒకరోజు ఏదో కారణంతో నన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నన్ను చూడడానికి నా పెద్ద కుమారుడు వివేక్‌ను తీసుకొని, నా శ్రీమతి అక్కడికి వచ్చింది. చాలా రోజుల తర్వాత కన్న కొడుకు కంటికి కనిపించేసరికి ఆత్రంగా ఎత్తుకుని, ముద్దాడాలని ఆరాటపడ్డాను. కానీ, నా చేతికి బేడీలు ఉండడం వల్ల నా కుమారుడిని ఎత్తుకోలేకపోయాను. ఈ సంఘటన ఇప్పటికీ పదే పదే జ్ఞప్తికి వచ్చి నాలో ఒక రకమైన భావోద్వేగాన్ని నింపుతుంది. మరొక సందర్భంలో నా కుమార్తె వినయను తీసుకొని శ్రీమతి జైలుకు వస్తే జైలు అధికారులు ములాఖత్ నిరాకరించారు. అయితే ఒక చిన్న కేసులో శిక్ష అనుభవిస్తున్న మల్లారెడ్డి చెస్యాల ఏదోవిధంగా జైలరును ఒప్పించి, నా బిడ్డను మాత్రం జైలులోపలికి తీసుకొచ్చి, నాకు చూపించి, తిరిగి తీసుకెళ్లారు. అయితే, నేను, నా మిత్రబృందం నా చిన్నారిని చూసి ఆనందించాం. కానీ ఆమె మాత్రం నన్ను గుర్తుపట్టలేదు. ఒక తండ్రిగా అప్పుడు నాకు కలిగిన ఆవేదన మరపురానిది. దశాబ్దాలు గడిచినా మనస్సులో ఇప్పటికీ తాజాగా ఉన్న ఎన్నో మరపురాని సంఘటనలకు ఇవి మచ్చుతునకలు.
లాల్‌కృష్ణ అద్వానీ ‘ప్రిజనర్స్ స్క్రాప్ బుక్’ ఆనాటి పరిస్థితులను, ఇందిరాగాంధీ మనస్తత్వాన్ని, ఆమెకున్న అభద్రతా భావాన్ని విశదీకరించింది. ఇందిర ఎన్నిక చెల్లదని, ఆరు సంవత్సరాల పాటు ఆమె ఎన్నికలలో పోటీ చేసే అర్హత లేదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే కోర్టు ఏ చట్టాలు, ఉత్తర్వుల ప్రకారం ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసిందో, వాటన్నింటికీ సవరణలు తీసుకొచ్చి, అవి ఆమెకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పునకు ముందు నుంచే అన్వయించేలా (Retrospective) చట్టాలు చేశారు! ఈ తరానికి ఊహకు కూడా అందని ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన అరాచకాలెన్నో ఎమర్జెన్సీలో జరిగాయి. 1977లో జరిగిన ఎన్నికలలో ప్రజలు నియంతృత్వానికి వ్యతిరేకంగా చరిత్రాత్మక తీర్పునిచ్చారు. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా జనతా ప్రభుత్వం కొలువుదీరింది. ఎమర్జెన్సీ కాలంలో తీసుకొచ్చిన నల్ల చట్టాలను జనతా ప్రభుత్వం రద్దు చేసింది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మరొకసారి అలాంటి తప్పు జరగకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత ప్రజలపైనే ఉంది.
– సిహెచ్. విద్యాసాగర్‌రావు
మహారాష్ట్ర మాజీ గవర్నర్