Green Mobility: ప్రైవేట్ ఈవీలను ప్రోత్సహించాలా
ABN , Publish Date - Jun 20 , 2025 | 02:24 AM
వ్యక్తిగత విద్యుత్ వాహనాల ప్రాముఖ్యత ఏమిటి? టెస్లాలు, బివైడిలు వాతావరణ క్లిష్ట సమస్యను తీర్చగలుగుతాయా? ఇదొక సులభమైన ప్రశ్న కాదు. సమాధానం సులువుగా చెప్పగలిగేదీకాదు.
వ్యక్తిగత విద్యుత్ వాహనాల ప్రాముఖ్యత ఏమిటి? టెస్లాలు, బివైడిలు వాతావరణ క్లిష్ట సమస్యను తీర్చగలుగుతాయా? ఇదొక సులభమైన ప్రశ్న కాదు. సమాధానం సులువుగా చెప్పగలిగేదీకాదు. అయినప్పటికీ మానవాళిని శీఘ్రగతిన వాతావరణ విపత్తుకు చేరువచేస్తున్న హరిత గృహ వాయు (జీహెచ్‌జీ) ఉద్గారాలను నిరోధించేందుకు మరింత బృహత్తర కృషి చేయవలసి ఉన్న దృష్ట్యా ఆ ప్రశ్నను లోతుగా తర్కించడం చాలా ముఖ్యం. విద్యుత్ వాహనాలు (ఈవీ) ఎందుకు? పారిశ్రామిక యుగం తొలినాటి సంపన్న దేశాలు శిలాజ ఇంధనాల వినియోగాన్ని శీఘ్రగతిన పూర్తిగా తగ్గించుకోవల్సిన అగత్యమేర్పడింది. శిలాజ ఇంధనాలతో నడిచే Internal combustion (ఐసీ) ఇంజిన్ వాహనాల వినియోగాన్ని వదిలివేసేందుకు విద్యుత్ వాహనాలు దోహదం చేస్తాయని ఆ దేశాలు విశ్వసిస్తున్నాయి. రవాణా రంగంలో ఈవీల వాడకం ఇతోధికంగా పెరిగితే కాలుష్య కారక వాయు ఉద్గారాలు తగ్గిపోతాయని సంపన్న పారిశ్రామిక దేశాలు భావిస్తున్నాయి. అటువంటి పరివర్తన సుగమమయ్యేందుకు ఆ దేశాలు ఇప్పటికే నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించుకున్నాయి. 2030 నాటికి నమోదయ్యే కొత్త కార్లలో 80 శాతం తప్పనిసరిగా కాలుష్యకారక వాయువులను ఏ మాత్రం ఉద్గారించనివై ఉండాలని యూరోపియన్ దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. వీటి సంఖ్య 2035 నాటికి నూటికి నూరు శాతానికి పెరగాలని కూడా ఆ దేశాలు నిర్దేశించుకున్నాయి. అమెరికాలో కూడా 2030 నాటికి నమోదయ్యే కొత్త కార్లలో 50 శాతం తప్పనిసరిగా విద్యుత్ వాహనాలై ఉండి తీరాలని మాజీ అధ్యక్షుడు జోబైడెన్ ప్రభుత్వం ఆదేశించింది. రవాణారంగాన్ని డీ కార్బనైజ్ (హరిత గృహ వాయువుల ఉద్గారాలను, ముఖ్యంగా కార్బన్ డయాక్సైడ్‌ను తగ్గించి అంతిమంగా వాతావరణం నుంచి పూర్తిగా తొలగించే ప్రక్రియ) చేసేందుకు విద్యుత్ వాహనాలను వినియోగించడమనేది ఈ సంపన్న పాశ్చాత్య దేశాల లక్ష్యం. ఐసీ ఇంజిన్ల వాహనాలను క్రమంగా తొలగించివేసినప్పుడు మాత్రమే ఆ లక్ష్య పరిపూర్తి సాధ్యమవుతుంది. మూడు దశాబ్దాలుగా యూరోపియన్ దేశాల రవాణా రంగంలో జీహెచ్‌జీ ఉద్గారాలు బాగా పెరిగిపోయాయి. రవాణా రంగం నుంచి వెలువడుతున్న మొత్తం ఉద్గారాలలో 60 శాతం ప్రైవేట్ కార్ల నుంచే సంభవిస్తున్నాయి. ఈ వాస్తవం దృష్ట్యానే రవాణా రంగాన్ని డీ కార్బొనైజ్ చేసేందుకు ఆ దేశాలు నిర్ణయించుకున్నాయి. రవాణా రంగంలో ఆవశ్యక మార్పును సాధించేందుకు యూరోపియన్ దేశాలు ప్రైవేట్ కారు యజమానులకు సబ్సిడీలు సమకూరుస్తాయా? లేక ఆ డబ్బును రవాణా రంగాన్ని డీ కార్బొనైజ్ చేసేందుకు, సొంత వాహనాలకు బదులు ప్రజా రవాణా వ్యవస్థలను వినియోగించుకునేలా ప్రజలకు వెసులుబాటు కల్పించేందుకు ఉపయోగిస్తాయా? సంపన్న దేశాలు ఆ రెండూ చేయగలవు. చేస్తాయి కూడా.
అభివృద్ధి చెందుతున్న దేశాల విషయంలో ఈ ప్రశ్నలకు చాలా ప్రాసంగికత ఉన్నది. ఎందుకంటే మన ప్రభుత్వాలు ఆ రెండిటిలో ఏదో ఒకటి మాత్రమే చేయగలవు. ఇప్పటికే ప్రైవేట్ డీజిల్, పెట్రోల్ కార్లకు సబ్సిడీలు సమకూరుస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై పెద్ద ఆర్థిక భారం పడుతోంది. ముఖ్యమైన విషయమేమిటంటే ఈ సబ్సిడీలు ప్రత్యక్షంగా కనపడవు. అవి ఎక్కడా చర్చింపబడవు. కారు యజమానులు చెల్లించే రోడ్ పన్నునే తీసుకోండి. బస్సు ప్రయాణీకులు ఒకొక్కరు చెల్లించే పన్ను కంటే కారు ఉన్న ఆసాములు చెల్లించే పన్ను చాలా తక్కువ. రోడ్లపై 90 శాతం కంటే ఎక్కువ చోటును చిన్న కారులే ఆక్రమించుకుంటాయి. కార్లు సుగమంగా సాగేందుకు నున్నని రోడ్లు, ఫ్లైఓవర్లు, దైనందిన రాకపోకలకు అవసరమైన ఇతర సదుపాయాల నిర్మాణానికి అవసరమయ్యే ఖర్చునూ పరిగణనలోకి తీసుకుంటే ప్రైవేట్ కారు యజమానులకు భారీ సబ్సిడీ సమకూరుతుందనేది స్పష్టం. డీ కార్బొనైజేషన్, వాయు కాలుష్యం తగ్గింపు అనే మన లక్ష్యాల పరిపూర్తికి మన రోడ్లపై ప్రైవేట్ వాహనాల సంఖ్యను ఇతోధికంగా తగ్గించవలసి ఉంటుంది; అదే సమయంలో వాహనాల కంటే ప్రజలకు ప్రాధాన్యమిచ్చే రవాణా పద్ధతుల (నగరాలలోని రవాణా వ్యవస్థలను ప్రైవేట్ వాహనాలకు అనుగుణంగా కాకుండా ప్రజల అవసరాలకు సానుకూలంగా రూపొందించడం)కు మనం మారాలి. ఇది తప్పనిసరి. ఇందుకు మనం ఏమి చెయ్యాలి? నిర్దిష్ట కాలపరిమితిలో కాలుష్య కారకాలను ఉద్గారించని వాహనాలకు మారాలి. ఐసీ ఇంజిన్ల వాహనాలను సంపూర్ణంగా వదిలివేయాలి. ఈ విషయమై ఒక కచ్చితమైన విధాన నిర్ణయం తీసుకుని కఠినంగా అమలుపరచాలి. అప్పుడు మాత్రమే ప్రైవేట్ ఈవీల వల్ల సత్ఫలితాలు సాధ్యమవుతాయి. కేవలం విద్యుత్ వాహనాల వినియోగాన్ని గణనీయంగా పెంచినంతమాత్రాన వాయు కాలుష్యం నియంత్రణకు గానీ, వాతావరణ మార్పు నిరోధానికి గానీ దోహదం జరగదు. శుభకరమైన విషయమేమిటంటే విద్యుత్ వాహనాల విషయంలో భారత ప్రభుత్వ విధానం వాటి పట్ల పూర్తి అనుకూలత చూపడం లేదు.
ప్రజా రవాణా వ్యవస్థల్లో విద్యుత్ బస్సులు ఉపయోగించేందుకు, అనుబంధ రవాణా సేవల్లో ఆటోలు మొదలైన వాహనాల విద్యుదీకరణకు సబ్సిడీలు సమకూరుస్తున్నది. అయితే ఇది మాత్రమే సరిపోదు. ఆటోలు, టాక్సీలు, బస్సులు మొదలైనవి నిర్ణీత కాలపరిమితిలో విద్యుదీకరణ అయితీరాలనే లక్ష్యాన్ని నిర్దేశించి తీరాలి. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కే గాక, కాలం చెల్లిన వాహనాల తొలగింపునకు కూడా ఒక కచ్చితమైన కాలపరిమితిని నిర్దేశించాలి. పార్కింగ్ చార్జీలు, ప్రజా రవాణాకు మరిన్ని ప్రోత్సాహకాల కల్పన మొదలైన చర్యల ద్వారా ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని నియంత్రించాలి. ప్రైవేట్ కార్ల స్థానంలో నడక, సైక్లింగ్, బస్సులు, ట్రాములు, మెట్రోలను ప్రోత్సహించని పక్షంలో మన లక్ష్యాలను సాధించుకోలేము. మన విద్యుదీకరణ అజెండా మొబిలిటీ ట్రాన్స్‌ఫర్మేషన్ అజెండా (మరింత స్థిరమైన, సమర్థమైన, సాంకేతికంగా అభివృద్ధి చెందిన రవాణా వ్యవస్థల దిశగా పరివర్తన)నే. అంతకు ఏమీ తక్కువ కాదు.
(‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్’ డైరెక్టర్ జనరల్, ‘డౌన్ టు ఎర్త్’ సంపాదకురాలు)