Government Schools: పెరుగుదల సరే, నిలకడ సంగతేమిటి
ABN , Publish Date - Jul 02 , 2025 | 02:25 AM
ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 48వేల మందికి పైగా విద్యార్థులు కొత్తగా నమోదయ్యారని ఇటీవలి సమీక్షా సమావేశంలో విద్యాశాఖ వెల్లడించింది. ఈ చేరికలపై బడిబాట ప్రభావం చాలా ఉందంటూ ఉపాధ్యాయుల కృషిని అభినందించింది.
ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 48వేల మందికి పైగా విద్యార్థులు కొత్తగా నమోదయ్యారని ఇటీవలి సమీక్షా సమావేశంలో విద్యాశాఖ వెల్లడించింది. ఈ చేరికలపై ‘బడిబాట’ ప్రభావం చాలా ఉందంటూ ఉపాధ్యాయుల కృషిని అభినందించింది. కానీ, చేరిక లెక్కలు చూసి సంబరపడితే సరిపోదు. ఆ సంఖ్య నిలకడగా కొనసాగడం ముఖ్యం. తల్లిదండ్రులు ఏం ఆశించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారో, ఆ ఆశయాలతో పాటు విద్యా లక్ష్యాలు సాధించాలి. పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు రుచి, శుచితో మధ్యాహ్న భోజనం అందించాలి. పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలతో పాటు, ఆధునిక సాంకేతికతతో కూడిన డిజిటల్ బోర్డు, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్‌లు, గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలి. ప్రాథమిక, ఉన్నత స్థాయిల్లో విద్యార్థులకు నైతిక విద్య, కౌమార విద్య, పారిశ్రామిక విద్య, వ్యవసాయ విద్యను పరిచయం చేయాలి. ప్రీప్రైమరీ విద్యను కొనసాగిస్తూ, రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలను ప్లే స్కూళ్లుగా మార్చాలి. గురుకులాలు, ఆదర్శ పాఠశాలల వంటి రెసిడెన్షియల్ స్కూళ్లపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
కనీసం వారానికి రెండు రోజులు పాఠశాలలను తప్పనిసరిగా తనిఖీ చేయాలంటూ అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించడం మంచి నిర్ణయమే! అయితే కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో మానిటరింగ్ వ్యవస్థ కుప్పకూలింది. విద్యాశాఖలో ఏళ్లుగా జిల్లా ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారుల నియామకాలు లేకపోవడం విచారకరం. విద్యాశాఖలో ఇన్‌చార్జి అధికారులతోనే ప్రభుత్వం సరిపెడుతోంది. అవసరమైతే రిటైర్డ్ విద్యాశాఖ అధికారులు, అనుభవజ్ఞులైన రిటైర్డ్ ఉపాధ్యాయుల సేవలను స్వచ్ఛందంగా వినియోగించుకోవడం మంచి ప్రత్యామ్నాయం. కానీ, ఉపాధ్యాయులనే ఇతర ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల తనిఖీకి వాడుకోవడం వల్ల బోధన కుంటుపడుతుంది. ‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిన’ చందంగా తయారవుతుంది. కాబట్టి విద్యాశాఖ తీసుకునే నిర్ణయాలు ఆ శాఖకే ప్రతిబంధకాలుగా మారకూడదు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎప్పటికప్పుడు అంతర్గత శిక్షణతోపాటు, పటిష్ఠమైన మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ బడుల సంస్కరణను ప్రభుత్వం కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలి.
– ఎన్. తిర్మల్