Educational Initiatives: సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా
ABN , Publish Date - May 06 , 2025 | 06:49 AM
తెలంగాణలో విద్యా రంగంలో సంక్షోభం తలెత్తిన విషయం పై, ప్రభుత్వం పునరుద్ధరణ చర్యలు తీసుకుంటున్నది. గత ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని చూపిన దృష్ట్యా, ప్రస్తుత ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దగా నిధులను కేటాయించి, ఉద్యోగ నియామకాలు చేపడుతోంది.
ఈ మధ్య విడుదలైన 'వార్షిక విద్యాస్థితి నివేదిక (ASER 2021) ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న దాదాపు సగం మంది విద్యార్థులు రెండో తరగతి పుస్తకాన్ని చదవడంలో విఫలం అయ్యారు. 2014లో కేవలం 27 శాతంగా ఉన్న ఈ పరిస్థితి 2024 నాటికి 50 శాతానికి పెరిగింది. విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలు ఏ మేరకు సాధించబడ్డాయో ఈ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. ఈ నివేదికలో బిహార్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల కంటే తెలంగాణ దిగువ స్థానంలో నిలవడం విచారకరం. జాతీయస్థాయిలో ప్రతి ఏడాది నిర్వహించే 'నేషనల్ అచీవ్మెంట్ సర్వే'లోనూ మన రాష్ట్రానిది ఇదే పరిస్థితి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 'పాఠశాలల పనితీరు గ్రేడింగ్ సూచిక'లో తెలంగాణ క్రింది నుంచి ఆరో స్థానంలో ఉండడం మన విద్యావ్యవస్థపై జరిగిన విధ్వంసం స్థాయిని కళ్లకు కట్టి నట్లుగా చూపుతోంది.
కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్టు విద్యారంగంలో ఈ పరిస్థితి నెల కొనడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది. విద్యపై గత పాలకుల నిర్లక్ష్యం. టీచర్ల నియామకాన్ని బీఆర్ఎస్ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇక ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీల సంగతి సరేసరి, డీఈవో, డిప్యూటీ ఈవో, ఎంఈఓ వంటి పర్యవేక్షణాధికారుల పోస్టులను భర్తీ చేయలేదు. దీంతో బడులపై పర్యవేక్షణ కరువైంది. నాటి ప్రభుత్వం హడావుడిగా ప్రారంభించిన కేజీ టు పీజీ విద్య కేవలం ఆ పార్టీ నాయకుల జేబులు నింపడానికే అన్నట్టు మారింది. కేజీబీవీ, సర్వశిక్షా అభియాన్, అంగన్వాడీలలో పని చేస్తున్న ఉద్యోగులను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల పట్ల అవమానకరంగా వ్యవహరించింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయంతో నాది ప్రత్యేక అనుబంధం. నేను ఎమ్మెల్యేగా గెలిచాక ఓ కార్యక్రమం కోసం యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళాను. ఒకప్పుడు నేను చూసిన ఓయూ వేరు. ఇప్పటి ఓయూ వేరు. గురువులు లేక చాలా డిపార్ట్మెంట్లు మూతపడ్డాయి. ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితే ఇలాఉంటే ఇక మిగిలిన కాకతీయ, తెలంగాణ, పాలమూరు,మహాత్మాగాంధీ వంటి యూనివర్సిటీల పరిస్థితి చెప్పనవసరం లేదు.
ఉద్యమ సమయంలో ప్రొఫెసర్లతో కలిసి నడిచిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా వారిని అవమానపరిచారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం ప్రాతిపదికనే తెలంగాణ ఉద్యమం కొనసాగింది. కేసీఆర్ ఇంట్లో అందరికీ నియామకాలు జరిగాయి. కానీ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మాత్రం శూన్యమే మిగిలింది.
'అణగారిన బతుకుల్లో వెలుగులు నింపేది విద్య' అనే అంబేడ్కర్ సిద్ధాంతాన్ని బలంగా నమ్మే కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విద్యారంగాన్ని చక్కదిద్దే ప్రయత్నాలు మొదలుపెట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్లో విద్యాశాఖకు 23,108 కోట్లు కేటాయించడం ఈ ప్రభుత్వానికి విద్యారంగం పట్ల ఉన్న చిత్త శుద్ధికి నిదర్శనం. టీచర్స్ పదోన్నతులు, బదిలీలను చేపట్టింది. విద్యా రంగాన్ని పునరుద్ధరించడానికి 2024 సెప్టెంబర్ 4న తెలంగాణ విద్యా కమిషన్ను ఏర్పాటు చేసింది. దీనికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని చైర్మన్ గా నియమించింది.అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే దాదాపు యాభై వేలకు పైచిలుకు ఉద్యోగా లకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చింది. అందులో టీచర్, లెక్చరర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి.
చరిత్రలో నిలిచేలా రాష్ట్రంలో 58 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాల'లను నెలకొల్పాలని సంకల్పించడం ఓ శుభ పరిణామం, రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లు, కస్తూర్బా పాఠశాలల్లో డైట్ చార్జీలను పెంచింది. రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు వీసీలను నియమించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి సంబంధించిన మార్గదర్శకాలకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లతో సమానంగా మన రాష్ట్ర ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయస్సును 6న కు పెంచింది. యువతలో నైపుణ్యాలు పెంపొం దించాలనే ప్రణాళికతో రాష్ట్రంలో "స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పనే లక్ష్యంగా 'రాజీవ్ యువ వికాసం' పథకాన్ని ప్రారంభించింది.
ఉద్యోగ నియామకాల క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాల కల్పనపై తనకున్న చిత్తశుద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం చాటుకుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. అయితే.. విద్య అనేది సమాజ ఉమ్మడి ప్రయత్నాల ద్వారా విజయవంతమయ్యే కార్యక్రమం. కాంగ్రెస్ పాలనలో ఒక యజ్ఞంలా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో విద్యావంతులు, మేధావులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలి. అప్పుడే సంపూర్ణ ఫలాలు
-పొందగలుగుతాం.
డా. మేడిపల్లి సత్యం
శాసనసభ్యులు, చొప్పదండి నియోజకవర్గం.