Palaniappan Chidambaram: ఈ సంప్రదింపులు సార్థకమయ్యేనా
ABN , Publish Date - Jun 28 , 2025 | 03:06 AM
ప్రతి మంత్రిత్వ శాఖకు ఒక సంప్రదింపుల సంఘం ఉంటుంది. పార్లమెంటు ఉభయసభలలోని ఎంపీలను ఈ కమిటీలో సభ్యులుగా నామినేట్ చేస్తారు. అన్ని పార్టీలకు విధిగా ప్రాతినిధ్యముంటుంది. జూన్ 2024లో 18వ లోక్‌సభ ఏర్పాటైన తరువాత ఆర్థిక మంత్రిత్వశాఖ తన సంప్రదింపుల సంఘ సమావేశాన్ని ప్రప్రథమంగా ఈ జూన్ 19న నిర్వహించింది.
ప్రతి మంత్రిత్వ శాఖకు ఒక సంప్రదింపుల సంఘం ఉంటుంది. పార్లమెంటు ఉభయసభలలోని ఎంపీలను ఈ కమిటీలో సభ్యులుగా నామినేట్ చేస్తారు. అన్ని పార్టీలకు విధిగా ప్రాతినిధ్యముంటుంది. జూన్ 2024లో 18వ లోక్‌సభ ఏర్పాటైన తరువాత ఆర్థిక మంత్రిత్వశాఖ తన సంప్రదింపుల సంఘ సమావేశాన్ని ప్రప్రథమంగా ఈ జూన్ 19న నిర్వహించింది. దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్యలను సాకల్యంగా పరిశీలించి, పరిష్కారాలు కనుగొనేందుకు ప్రభుత్వం ఈ సంఘాన్ని ఉపయోగించుకుంటే ఆ సంప్రదింపులు నిస్సందేహంగా ప్రయోజనకరమవుతాయి. ఆర్థిక మంత్రి ఈ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.
ఈ నెల 19న జరిగిన సమావేశం లాంఛనప్రాయమైనది. ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) 19 స్లైడ్‌ల పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. సభ్యుల నుంచి వ్యాఖ్యలు, అభిప్రాయాలను ఆహ్వానించారు. ఆర్థికశాఖ కార్యదర్శి వాటన్నిటినీ ప్రశస్తంగా సంగ్రహించారు. అయితే సభ్యుల విమర్శలకు సమాధానమివ్వలేదు, సందేహాలకు వివరణ ఇవ్వలేదు. ఆర్థిక మంత్రి ముగింపు ప్రసంగం చేశారు. ఏ సమస్య విషయమై కూడా సంప్రదింపులు జరపనే లేదు!
అయితే సీఈఏ తన పవర్ పాయింట్ ప్రజంటేషన్ సందర్భంగా నాలుగు సమస్యలపై సభ్యులు సూచనలు ఇవ్వాలని కోరారు. అవి: (1) వ్యవసాయ ఉత్పాదకతను మరింతగా మెరుగుపరిచేందుకు; (2) నిబంధనలను పాటించడంలో కష్ట నష్టాలను తగ్గించేందుకు ఉద్దేశించిన డీ రెగ్యులేషన్ అజెండా; (3) మన ఉపాధి శిక్షణా కార్యక్రమాలను కృత్రిమ మేధ, కొత్త సాంకేతికతల ఆధారిత అంతరాయాలను అధిగమించేందుకు అణుగుణంగా రూపొందించుకుని అమలుపరచటం; (4) ఆర్థిక వ్యవస్థ అధికారికీకరణను వేగవంతం చేయడం ఎలా... అన్న అంశాలపై సీఈఏ సభ్యుల సూచనలను ఆహ్వానించారు.
మంచి అభ్యర్థన, సందేహం లేదు. అయితే నేను అక్కడికక్కడే వెన్వెంటనే సూచనలు చేయదలుచుకోలేదు. ఆ తరువాత ఆ నాలుగు అంశాలపైన బాగా ఆలోచించాను. ఇవిగో ఇవీ నా సూచనలు:
సీఈఏ పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లోని ఒక స్లైడ్‌లో కనీస మద్దతు ధర, పీఎమ్–కిసాన్, పీఎమ్–ఫసల్ బీమా, కేసీసీ, e–NAM, ఫుడ్ పార్క్స్,... ఇవన్నీ వ్యవసాయ ఉత్పాదక సామర్థ్యాన్ని, దిగుబడులను పెంపొందించేందుకు ఉద్దేశించినవి. మరో స్లైడ్‌లో ప్రధాన పంటల దిగుబడుల్లో పెరుగుదల వివరాలు ఇచ్చారు. ప్రతి ప్రధాన పంట విషయంలోను 2013–14, 2023–24 సంవత్సరాల మధ్య ప్రతి హెక్టారుకు దిగుబడుల సగటు పెరుగుదల, ఉత్తమ గరిష్ఠ పెరుగుదల అంకెలు ఇచ్చారు. నిజానికి 2013–14 నుంచే కాదు, 1965లో హరిత విప్లవం ప్రారంభమైన నాటి నుంచీ ఉత్పాదకత పెరుగుదలను ప్రపంచ ప్రమాణాలతో కొలవడం జరుగుతోంది. ఉదాహరణకు హెక్టారుకు గోధుమ, వరి దిగుబడుల విషయాన్ని చూద్దాం. (అంకెలు అన్నీ కిలోల్లో) గోధుమ విషయంలో మన సగటు దిగుబడులు 3,559 కాగా గరిష్ఠ దిగుబడులు 5,045 కాగా ప్రపంచ సగటు 3,548. అయితే గరిష్ఠ దిగుబడులు యూరోపియన్ యూనియన్, ఈజిప్ట్‌లలో 6,500 నుంచి 7,700 దాకా ఉన్నాయి. వరి విషయానికి వస్తే మన సగటు దిగుబడులు 2,882, గరిష్ఠ దిగుబడులు 4,516 కాగా ప్రపంచ సగటు 3,548. ప్రపంచ గరిష్ఠ దిగుబడులు చైనాలో 6,500గా ఉన్నాయి.
మరో ఉత్పాదకత కొలమానం కూడా ఉన్నది: రైతు/ రైతు కూలీ సగటు ఉత్పాదకత. భారత జనాభాలో 58 శాతం మంది వ్యవసాయం, వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలపై ఆధారపడి ఉన్నారు (చైనా జనాభాలో కేవలం 22 శాతం మంది మాత్రమే వ్యవసాయంపై ఆధారపడుతున్నారు). ఈ కారణంగా రైతు సగటు ఉత్పాదకత మన దేశంలో తక్కువగా ఉంటోంది. సగటు రైతు పేదవాడు మాత్రమే కాదు, రుణ భారంతో కుంగిపోతున్న కుటుంబీకుడు కూడా.
రైతులు ఒక్కొక్కరి ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంపొందించేందుకు వ్యవసాయేతర రంగాలలో ఉద్యోగాలు సృష్టించి వ్యవసాయ రంగం నుంచి లక్షలాది రైతులు, రైతుకూలీలను వ్యవసాయేతర జీవనోపాధుల్లోకి పంపడం. అయితే పట్టణ, నగర ప్రాంతాలలో నిరుద్యోగిత ఇప్పటికే చాలా అధిక శాతంలో ఉంది. వస్తు తయారీరంగంలో పరిస్థితులు సజావుగా లేవు. ఈ కారణంగా వ్యవసాయదారులు ఇతర రంగాలకు వలసపోయేలా చేయడమనేది ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు చందంగా ఉంది. నిజానికి వ్యవసాయేతర రంగాలలోని శ్రామికులు ఇటీవలికాలంలో వ్యవసాయరంగానికి తిరిగి వెళ్లినట్టు విశ్వసనీయమైన సమాచారం ఉంది. ఈ అంశంపై ఇదీ నా సూచన: వృద్ధిరేటును శీఘ్రగతిన పెంపొందించి, తయారీరంగాన్ని విస్తరింపచేయాలి.
2014–15 ఆర్థిక సంవత్సరం తరువాత మోదీ ప్రభుత్వం పారిశ్రామిక రంగంపై నియంత్రణ మరింతగా పెంచింది. ఆర్బీఐ, కంపెనీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఆదాయ పన్ను విభాగం, యూజీసీ, ఇంకా ప్రతి మంత్రిత్వశాఖ, ప్రభుత్వ విభాగం కూడా వందలాది పేజీల నియమ నిబంధనలను రూపొందించి అమలుపరుస్తున్నాయి. పాత నియంత్రణ వ్యవస్థ ‘క్రమబద్ధీకరణల’ రూపంలో తిరిగివచ్చింది. భారతదేశంలో వ్యాపారం చేయడమంటే నియమ నిబంధనలు, ప్రభుత్వ ఆదేశాలను సవాల్ చేయడం, న్యాయస్థానాలు, ట్రిబ్యునల్స్‌లో ఉపశమనాలకు ప్రయత్నించడమే. జీఎస్టీ చట్టాలు వ్యాపార సంస్థలపై ఈ భారాలను మరింతగా పెంచాయి. జీఎస్టీ రేట్లు అధిక స్థాయిలో ఉండడం స్వతహాగా శుభస్కర విషయం కాదు. అందునా జీఎస్టీ చట్టాల కింద నియమ నిబంధనలు, నోటిఫికేషన్లు మరిన్ని అవస్థలకు కారణమవుతున్నాయి. ఆదాయపు పన్ను శాఖ, కస్టమ్స్, డీజీఎఫ్‌టీ, జీఎస్టీ విభాగాలు చట్టాలకు చెబుతున్న భాష్యాలు, వాటిని అమలుపరుస్తున్న తీరు తెన్నులు ఏ వ్యాపార సంస్థకైనా వదలని పీడకలలుగా పరిణమించాయి.
ప్రతి వ్యాపారస్తుడు చట్ట అతిక్రమణకు పాల్పడినవాడుగా, ప్రతి చార్టర్డ్ అకౌంటెంట్ సహాపరాధి, ప్రతి న్యాయవాది తోడుదొంగ అయినట్టుగా సీబీఐ, ఈడీ, డీఆర్‌ఐ, జీఎస్టీ, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎస్‌ఎఫ్‌ఐఓ వ్యవహరిస్తున్నాయి! వాణిజ్యం, పరిశ్రమలు ఆర్థికాభివృద్ధి చోదకశక్తులుగా భావిస్తే వాటికి ఊపిరాడకుండా చేస్తున్న పరిస్థితులను తొలగించాలి. ఈ అంశంలో ఇదీ నా సూచన: ప్రతి మంత్రిత్వశాఖ, ప్రతి ప్రభుత్వ విభాగమూ తాము రూపొందించిన నియమనిబంధనల పత్రాలను దహనం చేయాలి.
యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిపోర్ట్స్ చదవండి. పాఠశాల బాలల్లో పఠన, లేఖన సామర్థ్యాలు, గణిత కౌశలాలు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో విశదమవుతుంది. నాసిరకం విద్యా ప్రమాణాలతో జీవితంలోకి ప్రవేశించిన వారికి అధునాతన సాంకేతికతలను ఉపయోగించుకునే నైపుణ్యాలు ఉంటాయా? సమాజాభివృద్ధికి దోహదం చేయడం విశ్వవిద్యాలయాల కర్తవ్యం. జ్ఞాన వికాసానికి, కొత్త ఆవిష్కరణలకు అవి తోడ్పడాలి. మరి యూజీసీ, ఎన్‌టీఏ, న్యాక్‌లు విశ్వవిద్యాలయాలు తమ విధ్యుక్తధర్మాలను సమర్థంగా నిర్వర్తించేందుకు సహాయపడుతున్నాయా? ప్రతిభావంతులైన అధ్యాపకులు, పరిశోధకులు, విద్వజ్ఞులు విదేశాలకు వలసపోక తప్పని పరిస్థితులు కల్పిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల మంజూరును నిలిపివేస్తూ లేదా జాప్యం చేస్తూ విశ్వవిద్యాలయాలు తమ విధులు నిర్వర్తించకుండా అవరోధాలు సృష్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలలో వేలాది అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారు? అక్టోబర్ 31, 2024న పార్లమెంటులో ప్రభుత్వం ఇచ్చిన ఒక సమాధానం ప్రకారం కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో 5,182 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ సమస్యకు పరిష్కారం ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారాల పరిధిలో లేదని నేను భావిస్తున్నాను. ఈ అంశంపై ఇదీ నా సూచన: తాను నిర్వర్తించవలసిన పనుల జాబితా నుంచి సీఈఏ ఈ అంశాన్ని తొలగించాలి.
ప్రభుత్వ ప్రధాన సలహాదారు ‘ఆర్థిక వ్యవస్థ అధికారికీకరణ’ అన్నారు. అంటే ఏమిటి? అనియత రంగంలో నిర్వర్తించే ఆర్థిక కార్యకలాపాల (ఉదాహరణకు మధ్యతరగతి కుటుంబాలలో పనివాళ్ల సేవలు మొదలైనవి)ను అధికారికీకరణ చేయాలని సీఈఏ అభిలషిస్తున్నారా? ఈ అంశంపై స్పష్టత లేదు. నేను చేయగల సూచన ఏదీ లేదు. చివరగా ఒక మాట: నా ఈ సూచనలు ఆమోదించండి లేదా తిరస్కరించండి. అయితే ఎట్టిపరిస్థితులలోను వాటిని ఉపేక్షించవద్దు.
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,
కాంగ్రెస్ సీనియర్ నాయకులు)