Endless Political Decline: అంతులేని రాజకీయ పతనం
ABN , Publish Date - Sep 09 , 2025 | 04:58 AM
ముప్పై మంది ఎంపీలు తమను కలవడానికి ఎన్నికల కమిషన్ గత నెల అనుమతిని ఇచ్చింది. ఆగస్టు 10న ఆ ఎంపీలు తమ ఫిర్యాదును..
ముప్పై మంది ఎంపీలు తమను కలవడానికి ఎన్నికల కమిషన్ గత నెల అనుమతిని ఇచ్చింది. ఆగస్టు 10న ఆ ఎంపీలు తమ ఫిర్యాదును దాఖలు చేయడానికి ఈసీ కార్యాలయానికి బయలుదేరారు. యాత్ర ప్రశాంతంగా జరుగుతోంది. పార్లమెంటు నుంచి ఆ ఆఫీస్‌కు దూరం ఒక కిలోమీటరు కంటే తక్కువే. ఊరేగింపు బయలుదేరిన సమయం ట్రాఫిక్ రద్దీ ఉండే సమయం కూడా కాదు. అయినప్పటికీ, పార్లమెంట్ సభ్యుల యాత్రను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ప్రజాప్రతినిధుల ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడానికి కూడా ఈ ప్రభుత్వం వెనుకాడలేదు. బీజేపీకీ, ఎన్నికల కమిషన్‌కు మధ్య ఉన్న సంబంధం గురించి రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఒక నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియపై ఆయన చేసిన పరిశోధన ప్రకారం– జాబితాలోని లక్ష కంటే ఎక్కువమంది ఓటర్ల నమోదులో చాలా అవకతవకలు ఉన్నాయి. ఇవి రెండు అంశాలను స్పష్టం చేస్తున్నాయి: ఒకటి, నిజాయితీతో కూడిన దిద్దుబాట్లు చేయాల్సిన అవసరాన్ని; రెండు, ఓటర్ల నమోదులో మోసం చేసే ఉద్దేశం ఉండే అవకాశాన్ని. ఈ విధమైన వాదనలు చేసే అవకాశం ఉన్నప్పటికీ రాహుల్‌గాంధీ తన విజ్ఞాపన పత్రంలో అణకువతో కూడిన అభ్యర్థన మాత్రమే చేసారు. అన్ని నియోజకవర్గాలలో నిష్పాక్షిక దర్యాప్తు నిర్వహించాలన్నారు. అవకతవకలకు కారణాలను వివరించమన్నారు. జాబితా తాలూకు ఎలక్ట్రానిక్ వెర్షన్‌ను తనకు ఇస్తే అన్ని నియోజకవర్గాల్లో ఈ విధమైన విశ్లేషణను చేపట్టడానికి సంసిద్ధంగా ఉన్నానని తెలియజేశారు.
ఈ విషయాలు వెల్లడైన కొన్ని గంటల్లోనే, దీన్ని కాదనే రుజువులేమీ చూపించకుండా, రాహుల్‌గాంధీ ఎత్తి చూపిన విషయాలన్నీ అబద్ధాలనీ, తప్పుదారి పట్టించేవనీ బీజేపీ ఖండించింది. కేబినెట్ మంత్రులు రాహుల్‌పై వ్యక్తిగత దూషణలతో విరుచుకుపడ్డారు, ఆయన వ్యక్తిత్వ హననానికి పూనుకున్నారు. ఆయనపై దేశ వ్యతిరేకి అని ముద్ర వేస్తూ తీవ్రంగా విమర్శించారు. రాహుల్ విశ్లేషణ తప్పు అని ప్రకటించడానికి బీజేపీ దగ్గర ఉన్న డేటా ఏమిటి? అసలు ఎన్నికల కమిషన్ తరఫున మాట్లాడాల్సిన అవసరం ఆ పార్టీకి ఎందుకు వచ్చింది? మరోపక్క గోదీ మీడియా బీజేపీ వాదనలనే ప్రతిధ్వనించింది. ఇంతటి జాతీయ సమస్య కంటే వీధి కుక్కలపై సుప్రీం తీర్పు వంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది. ఎన్నికల కమిషన్ మరింత దారుణంగా వ్యవహరించింది. రాహుల్ తన ఆధారాలను బైటపెట్టిన కొన్ని గంటల్లోనే, ఆ డేటా తప్పు అని తోసిపుచ్చింది. రాహుల్ క్షమాపణ చెప్పాలని, అఫిడవిట్ సమర్పించాలని డిమాండ్ చేసింది. రాహుల్‌గాంధీ వెల్లడించిన వివరాలు వారి దగ్గర ఇప్పటికే ఉన్నాయా? లేక రాహుల్ డేటా తప్పు అని నిరూపించే విధంగా ఈ లోగా ఓటర్ల జాబితాను సవరించగలమన్న విశ్వాసమా? ఎన్నికల కమిషన్ అందించిన డేటా ఆధారంగానే తన విశ్లేషణ ఉందని రాహుల్ గాంధీ విలేఖరుల బహిరంగ సమావేశంలో సుస్పష్టంగా ప్రకటించారు. అలాంటప్పుడు ఒక నిష్పాక్షిక సంస్థగా ఈసీ మొదటి ప్రతిస్పందన ఏమై ఉండాల్సింది? ఎత్తి చూపిన అవకతవకలపై దర్యాప్తు చేసి ఫలితాలు ప్రకటిస్తామని చెప్పాల్సింది. కానీ రాహుల్ వాదనను ఖండించడంలో ఎన్నికల కమిషన్ చూపించిన తొందరపాటు దాని ఉద్దేశాలపై అనుమానాలను కలిగిస్తున్నది. అంతేగాక, అది దర్యాప్తులను తారుమారు చేసే అవకాశం ఉందని కూడా సూచిస్తున్నది. సామాన్యుడి ప్రాథమిక హక్కులపై ప్రభావం చూపే ఈ విషయంపై పూర్తిగా పారదర్శకంగా, నిష్పాక్షికంగా, నిజాయితీగా దర్యాప్తు జరగడం చాలా ముఖ్యం. ప్రతిపక్షాలు లేవనెత్తిన ఓటరు జాబితాలో అవకతవకలూ, డేటా తారుమారు వంటి అంశాలు దర్యాప్తునకు అర్హమైనవి. ఈ విషయంలో ఎన్నికల సంఘం ఆ డేటా కచ్చితత్వాన్ని నిర్ధారణ చేసుకోవడానికి దర్యాప్తు చేపట్టాలి. అంతేతప్ప, వారికి రాహుల్ అఫిడవిట్ ఎందుకు అవసరం? రాహుల్‌గాంధీని జవాబుదారీగా నిలబెట్టేందుకు అఫిడవిట్ అవసరం అనేటట్లయితే, ఒకవేళ లోపాలు ఉన్నట్టు వెల్లడైన పక్షాన క్రిమినల్‌గా ప్రాసిక్యూషన్‌కు సిద్ధపడుతూ ఈసీ కూడా అఫిడవిట్ ఇవ్వాలి కదా?
న్యాయం కోసం కోర్టులను సంప్రదించమని ప్రతిపక్షాలకు ప్రభుత్వం, ఈసీ సలహా ఇస్తున్నాయి. తక్కువ సమయంలో న్యాయం జరుగుతుందని వారు నిర్ధారించగలరా? కోర్టులు చాలా సమయం తీసుకుంటాయని, ఈలోగానే మరో ఎన్నికలు వస్తాయని తెలిసిందే. అదలా వుంచితే, కోర్టులు చట్టపరమైన ఆదేశాల ద్వారా అన్ని రాజకీయ పరిపాలనా సమస్యలను పరిష్కరించగలవా? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) గురించి ప్రతిపక్షాలు పార్లమెంటులో చర్చించాలని చేసిన ప్రయత్నాన్ని ప్రభుత్వం అడ్డుకుంది. ఎన్నికల కమిషన్ ఒక స్వయంప్రతిపత్తి గల సంస్థ అనీ, అందువల్ల దానిని పార్లమెంటులో చర్చించలేమని పేర్కొంది. కానీ కాగ్, ఈడీ, సీబీఐలు కూడా స్వయంప్రతిపత్తి గల సంస్థలే. మరి వాటి గురించి పార్లమెంటులో చర్చను అనుమతిస్తున్నారు, చర్చ జరుగుతున్నది కూడా. ఎస్‌ఐఆర్‌పై చర్చ విషయంలో మాత్రం ప్రభుత్వమూ, గోదీ మీడియా కలిసి ప్రతిపక్షాలు పార్లమెంటు కార్యకలాపాలకు అడ్డు వస్తున్నాయని నిందిస్తున్నాయి. న్యాయమైన, స్వేచ్ఛాయుతమైన ఎన్నికలను డిమాండ్ చేయడానికి సాధారణ వ్యక్తికి ఉన్న రాజ్యాంగ హక్కు కంటే మరేదీ ముఖ్యమైనది కాదన్నది ఇక్కడ గమనించాలి.
ఈ రోజు వరకు, ఎంపీలను అరెస్టు చేయడానికి పోలీసులు కారణాలు పేర్కొనలేదు. నైతిక దృక్కోణం నుంచి చూస్తే, ప్రజల్లో 60శాతం ఆకాంక్షలకు ప్రతిపక్ష ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తుండగా ప్రభుత్వ పక్షం పార్లమెంట్ సభ్యులు 40శాతం జనాభా ఆకాంక్షలకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తారు. కాబట్టి, ప్రతిపక్షాల వారు ఒక సమస్యపై ప్రాతినిధ్యం వహించడానికి శాంతియుత నిరసన ప్రదర్శనను చేపడుతుంటే ప్రభుత్వం ఎలా తిరస్కరించగలదు? నిరంకుశ రాజకీయాలను దేశం అనుమతించాలా? ప్రజలు తమకు అధికారం ఇచ్చారని క్లెయిమ్ చేయడానికి ప్రభుత్వానికి చట్టబద్ధత ఉంది నిజమే. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడగడానికీ, దానిని జవాబుదారీగా నిలబెట్టడానికీ ప్రజలు ఒక ప్రతిపక్షాన్ని ఎన్నుకున్నారనే నిజాన్ని కూడా గౌరవించాలి. ప్రతి విమర్శను దేశ వ్యతిరేకమైనదిగా లేదా భారతదేశానికి వ్యతిరేక కుట్రగా నిరంతరం పేర్కొనడం అనేది అతిగా ఉపయోగించబడుతున్న ఒక జిత్తులమారి ఎత్తుగడ. న్యాయమైన, స్వేచ్ఛాయుత ఎన్నికలు దేశంలోని సామాన్యులకు అత్యంత ముఖ్యమైన అంశం. రాహుల్‌గాంధీ ఆరోపణలు ఒక విస్ఫోటన స్వభావం గలవి కావటం వలన సుప్రీంకోర్టు లేదా దేశాధ్యక్షుడు పారదర్శకమైన, నిష్పాక్షికమైన స్వతంత్ర దర్యాప్తును ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉంది. పౌర సమాజం ఇప్పుటికిప్పుడే అప్రమత్తమై సమతుల్యతను పునరుద్ధరించడానికి నడుం బిగించకపోతే, దేశానికి కోలుకోలేని నష్టం జరిగే అవకాశం ఉన్నది.
-కె. విజయ్‌రావు వైస్ చైర్మన్,
సొసైటీ ఫర్ కమ్యూనల్ హార్మనీ