Share News

Afghanistan in Crisis: ఆపదలో అఫ్ఘాన్‌

ABN , Publish Date - Sep 04 , 2025 | 01:00 AM

కుంగదీసే పేదరికం, కనికరం లేని ప్రకృతి, ఆంక్షల కట్టడిలో పాలకులు... అఫ్ఘానిస్తాన్‌ను సదా విడీవిడవని విషాదాలు. విశాల ప్రపంచం ఒక దోసెడు తీరుబాటు చేసుకుని ఆపదలో ఉన్న అప్ఘాన్‌ పట్ల ఒక జానెడు సానుభూతి చూపవలసిన ఆపత్సమయమిది....

Afghanistan in Crisis: ఆపదలో అఫ్ఘాన్‌

కుంగదీసే పేదరికం, కనికరం లేని ప్రకృతి, ఆంక్షల కట్టడిలో పాలకులు... అఫ్ఘానిస్తాన్‌ను సదా విడీవిడవని విషాదాలు. విశాల ప్రపంచం ఒక దోసెడు తీరుబాటు చేసుకుని ఆపదలో ఉన్న అప్ఘాన్‌ పట్ల ఒక జానెడు సానుభూతి చూపవలసిన ఆపత్సమయమిది. నాలుగు సంవత్సరాల క్రితం అఫ్ఘానిస్తాన్‌లో ప్రజాస్వామిక ప్రభుత్వం కూలిపోయింది. మతఛాందసులైన తాలిబన్లు మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకున్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేశారు. పౌర హక్కులను కాలరాచివేశారు. ఇస్లామిక్‌ చట్టాలను ఔదలదాల్చారు. ప్రపంచ దేశాల నుంచి సహాయ సహకారాలు నిలిచిపోయాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ అధికారానికి వచ్చిన తరువాత అమెరికా నుంచి అందుతున్న మానవతాపూర్వక సహాయమూ పూర్తిగా నిలిచిపోయింది. అప్ఘాన్‌ ప్రజల ఆర్థిక అవస్థలు మరింతగా మిక్కుటమయ్యాయి. ముఖ్యంగా ఆరోగ్య భద్రతా సదుపాయాలు పూర్తిగా కూలబడ్డాయి. తాలిబన్ల పాలనకు న్యాయబద్ధత కల్పించకుండా అఫ్ఘాన్‌ ప్రజలను ఆదుకోవడమెలా అనే విషయమై అనేక దేశాలు తర్జనభర్జన పడుతున్న తరుణంలో ఆ దేశంపై ప్రకృతి మరొకసారి ఆగ్రహించింది.


ఆదివారం రాత్రి అప్ఘానిస్తాన్‌కు ఒక కాళరాత్రి. అఫ్ఘాన్‌ తూర్పు ప్రాంతంలో సంభవించిన భూ ప్రళయంలో వందలాది ప్రజలు చనిపోయారు. వేలాది జనులు గాయపడ్డారు. రిక్టర్‌ స్కేల్‌పై 6.3 తీవ్రతతో నమోదైన ఈ భూకంప ప్రభావిత ప్రదేశం మారుమూల, దుర్భేద్యమైన పర్వత శ్రేణుల మధ్య ఉండడంతో పాటు అక్కడి గృహాలు భూకంప తాకిడికి తట్టుకునేవి కాకపోవడంతో మృతుల సంఖ్య మరెంతో అధికంగా ఉండవచ్చు. అఫ్ఘానిస్తాన్‌కు భూకంపాలు అరుదు కాదు. తరచుగా ప్రాణాంతక భూకంపాలు సంభవించే దేశమది. ముఖ్యంగా ఈశాన్య అప్ఘాన్‌ ఈ ప్రాకృతిక విపత్తులకు నెలవుగా ఉన్నది. రెండు భిన్న టెక్టానిక్‌ ప్లేట్లు కలిసే హిందూ కుష్‌ పర్వత ప్రాంతంలో ఉన్న కారణంగా ఈశాన్య అఫ్ఘాన్‌ భూకంపాల తాకిడికి తరచు గురవుతోంది. 2023 అక్టోబర్‌లో హెరాత్‌ రాష్ట్రంలో సంభవించిన పెను భూకంపమే అందుకొక తార్కాణం. అప్పుడూ ఇప్పుడూ సంభవించిన ప్రాణనష్టం, ఆస్తినష్టం తక్కువేమీకాదు. అయితే అఫ్ఘాన్‌లో వలే పలు ఇతర దేశాలలో కూడా అంతే తీవ్రతతో సంభవిస్తున్న భూకంపాలలో ప్రాణ నష్టం, ఆస్తినష్టం తక్కువగా ఉంటోంది. అప్ఘాన్‌లో ఆ నష్టాలు భారీగా ఉండడానికి కారణమేమిటి? ‘భూకంపాలు మనుషులను చంపవు, భవనాలు చంపుతాయి’ అని అంటారు. భవనాల నిర్మాణ వైఫల్యం వల్లే భూకంపాల సమయంలో మనుషులు చనిపోవడం లేదా గాయపడడం జరుగుతుందనే వాదన భద్రతా నియమాలను పాటించకుండా నిర్మించిన భవనాలకు వర్తిస్తుంది. ఇది ఒక సరళీకృత వాదనే అయినప్పటికీ అది సూచిస్తున్న వాస్తవం కొట్టివేయలేనిది. ప్రస్తుత అప్ఘాన్‌ భూకంపం మాదిరిగానే 2011లో న్యూజీలాండ్‌లో అంతే తీవ్రతతో సంభవించిన భూ విపత్తులో కేవలం 185 మందే చనిపోయారు. ఆస్తినష్టమూ తక్కువే. ధరిత్రి దక్షిణ అంచున ఉన్న దక్షిణ అమెరికా దేశమైన చిలీలో సైతం రిక్టర్‌ స్కేల్‌పై 6కు మించిన తీవ్రతతో భూకంపాలు తరచు సంభవిస్తుంటాయి. అయినా ప్రాణనష్టం, ఆస్తినష్టం తక్కువగా ఉంటుంది. ప్రాణనష్టం అసలు ఉండని సందర్భాలే ఎక్కువ అని కూడా చెప్పవచ్చు. భవన నిర్మాణ నిబంధనలు కచ్చితంగా పాటించడం వల్లే ఆ ప్రమాదాలను సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నారు. మరి అప్ఘాన్‌లో పరిస్థితి భిన్నంగా ఉండడానికి అక్కడి పేదరికమే కారణమని మరి చెప్పనవసరం లేదు.


ఆధునిక భవన నిర్మాణ సామగ్రిని ఉపయోగించుకోగల ఆర్థిక సామర్థ్యం అఫ్ఘాన్లకు లేదు. స్థానికంగా లభించే మట్టి, రాళ్లు, కలపను ఉపయోగించుకున్న గృహాలే అత్యధికంగా ఉంటాయి. ఈ కారణంగానే ఆదివారం రాత్రి భూకంపానికి వేలాది గృహలు నేలమట్టమయ్యాయి. ఆ గృహాలేవీ ఇంజనీర్లు రూపొందించిన ప్రణాళికల ప్రకారం నిర్మాణమయినవి కావు. భవన నిర్మాణ నిబంధనలకు విరుద్ధరీతుల్లో కట్టుకున్న ఇళ్లు అవి. మరి తక్కువ తీవ్రతతో సంభవించిన భూకంపానికి సైతం కూలిపోవడంలో ఆశ్చర్యం లేదు. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని వారి ఆర్థిక స్థితిగతులకు అనుకూలంగా ఉండే గృహ నిర్మాణ పద్ధతులను ప్రోత్సహించవలసిన అవసరమున్నది. ప్రస్తుత విపత్తు వేళ అప్ఘాన్‌కు మన దేశం అందించే సహాయంలో ఆ సులభ, సరళ సాంకేతికతలూ ఉండవలసిన అవసరమున్నది. పేద ప్రజలకు ముఖ్యంగా భూకంపాల తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాలలో భద్రమైన గృహ వసతి కల్పనకు వినూత్న పద్ధతులను అభివృద్ధిపరిచిన స్ట్రక్చరల్‌ ఇంజనీర్‌ ప్రొఫెసర్‌ ఆనంద్‌ స్వరూప్‌ ఆర్య (1931–2019)ను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవలసి ఉన్నది. అఫ్ఘాన్‌కు కానుకగా కాబూల్‌లో పార్లమెంటు భవనాన్ని నిర్మించిన భారత్‌, ఇప్పుడు భూకంప బాధిత ప్రాంతాలలో ప్రొఫెసర్‌ ఆనంద్‌ నిర్దేశించిన పద్ధతులలో వందలాది గృహాలు నిర్మించి అప్ఘాన్లను ఆదుకోవడం సముచితంగా ఉంటుంది.

Updated Date - Sep 04 , 2025 | 01:00 AM