DV Subhashree: అనువాదంతోపాటు అదనపు శ్రమా ఉంటుంది!
ABN , Publish Date - Nov 10 , 2025 | 06:03 AM
ముస్లిం బాల్య జీవిత అనుభవాలతో నెల్లూరు మాండలికంలో మహమ్మద్ ఖదీర్‌బాబు రాసిన పుస్తకాలు దర్గామిట్ట కతలు, పోలేరమ్మ బండ కతలు...
ముస్లిం బాల్య జీవిత అనుభవాలతో నెల్లూరు మాండలికంలో మహమ్మద్ ఖదీర్‌బాబు రాసిన పుస్తకాలు ‘దర్గామిట్ట కతలు’, ‘పోలేరమ్మ బండ కతలు’ను అనువాదకురాలు డి.వి. శుభశ్రీ ఇంగ్లీష్ లోకి అనువదించారు. ఈ అనువాదాలను ‘స్పీకింగ్ టైగర్’ ప్రచురణ సంస్థ ‘దట్స్ ఏ ఫైర్ ఆంట్ రైట్ దేర్’ పేరుతో ఇటీవల విడుదల చేసింది. ఈ సందర్భంగా అనువాదకురాలితో ‘వివిధ’ సంభాషణ.
‘దర్గామిట్ట కతలు’, ‘పోలేరమ్మ బండ కతలు’ పుస్తకాలనే అనువాదానికి ఎందుకు ఎంచుకున్నారు?
నిజం చెప్పాలంటే పదేళ్ళ కిందట ఈ పుస్తకాలని చదివినప్పుడు అందరి లాగే ఇవి అనువాదానికి లొంగవని ఊరుకున్నాను. ఆపై ఖదీర్ బాబు గారు రాసినవే ‘మెట్రో కథలు’లో కొన్నింటిని అనువదించాను. అయితే కాలక్రమేణా అనువాద ప్రక్రియపై నా అవగాహన పెరిగింది. అనేక భాషల అనువాదాలు చదవటంతోపాటు, ట్రాన్స్‌లేషన్‌లో పీజీ డిప్లొమా చేసాను. ఆ తర్వాత నాకు అనిపించింది ఏమిటంటే– అనువాదంలో భాషాపరంగాను, ఇతరత్రాను ఎన్నో అంశాలు కోల్పోయినప్పటికీ, ఒక పుస్తకం అనువాదం కావటం వల్ల ఎంతో మేలు కూడా జరుగుతుంది. ఇంగ్లిష్, రష్యన్, బెంగాలీ భాషల నుంచి తెలుగులోకి అనువదించడం కుదరని పని అనుకుని ఉంటే తెలుగువారు ఎంతో కోల్పోయేవారు. ‘దర్గామిట్ట కతలు’, ‘పోలేరమ్మ బండ కతలు’ వంటి పుస్తకాలు ఇంగ్లీష్‌లోకి వెళ్ళడం ద్వారా తెలుగేతరులకు మన సాహిత్యం, సంస్కృతి, భాష రుచి తెలిసే అవకాశం ఉంది. ఈ కథల్లో రచయిత మనల్ని నవ్విస్తూనే ప్రస్తావించిన అనేక విషయాలు సమాజాన్ని ఆలోచింపచేసే విధంగా ఉంటాయి.
బాల్య అనుభవాలతో ప్రాంతీయ మాండలికంలో రాసిన ఈ కథలను ఇంగ్లీష్‌లోకి అనువదించటం ఎలాంటి అనుభవం?
ఈ కథలు అనువదించడం సాహసమే. వీటిలో అనువాదానికి లొంగని మూడు అంశాలున్నాయి: నెల్లూరు మాండలికం, ముస్లిం తెలుగు సంస్కృతి కలగలిసి ఉండటం, అంతర్లీనంగా సాగే హాస్యం. ఈ మూడింటిని ఇంగ్లీష్ లోకి మార్చటం పెనుసవాలు. దీన్ని అధిగమించడానికి మూస పద్ధతిలో మాటకి మాట, పదానికి పదం అన్నట్టు కాకుండా, కొత్త ఆలోచనలు చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా, ఇంగ్లీష్‌లో కూడా మన దేశీయ పరిమళం ఉట్టిపడే విధంగా అనువదించాలని నిర్ణయించుకున్నాను. వీలైనంతవరకు అవసరమైనచోట తెలుగు, ఉర్దూ పదాలను కొద్దిపాటి వివరణతో అలాగే ఉంచేసాను. Formal, written English లోకి కాకుండా, Spoken Indian English లోకి తర్జుమా చేసాను.
మీ అనువాదంతో ప్రచురణ సంస్థలని ఎలా అప్రోచ్ అయ్యారు? ఈ క్రమంలో ఎదురైన అనుభవాలు ఏమిటి?
అనువాదాలకి గుర్తింపు, మార్కెట్ పెరుగుతున్నప్పటికీ, అనువాదాలను ప్రచురణ దాకా తీసుకు వెళ్ళటం ప్రయాసతో కూడుకున్న పనే. నేను ఐదారేళ్ళకు పైగా అనేక ప్రచురణ సంస్థల తలుపు తట్టాను కానీ పెద్దగా లాభం లేకపోయింది. అడపాదడపా ఆన్‌లైన్ మ్యాగజైన్లలో కథలు ప్రచురించాను. అనువాదకులు కేవలం అనువాదం మాత్రమే చేస్తారు అనేది అపోహ. ఒక పుస్తకం మరో భాషలో రావాలంటే అనువాదకులు చేపట్టే స్వచ్ఛంద అదనపు శ్రమ చాలా ఉంటుంది. కాపీరైట్ సంపాదించడం దగ్గర నుంచి, ప్రపోజల్ రాయటం, రీసెర్చ్ చేయటం, ప్రచురణకర్తని ఒప్పించటం వంటి పనులు లెక్క లోకి రావు. భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పనులన్నింటికీ నిర్ధిష్టమైన సంస్థాగత ఆలంబన లేకపోవడం, అనువాద ప్రక్రియకి గానీ అనువాదకులకి గానీ ప్రోత్సాహం లేకపోవడం పెద్ద లోటు.
సంస్థాగతంగా ఏ ప్రోత్సాహం అవసరం?
కేంద్రీయ, రాష్ట్ర సాహిత్య అకాడెమీలు చాలా నాణ్యమైన పని చేస్తున్నాయి కానీ, మనకున్న భాషా సంపదకి అది సరిపోదు. దేశ భాషల్లోకైనా, విదేశీ భాషల్లోకైనా మన సాహిత్యం వెళ్ళాలీ అంటే ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు, పౌరులు అందరూ పూనుకోవాలి. అనువాదకులను తయారు చేయడానికి కావలసిన శిక్షణ, అనువాదాన్ని వృత్తిగా చేపట్టడానికి అవసరమైన ఆర్థిక సాయం, ఫెలోషిప్స్, గ్రాంట్స్, రెసిడెన్సీస్ వంటివి కల్పించి, అనువాదాన్ని ప్రోత్సహించే ఎకోసిస్టమ్‌ను తయారుచేయడం అవసరం.
అనువాదాల్ని పెద్ద ప్రచురణ సంస్థల వద్దకు తీసుకువెళ్లినప్పుడు కొత్త అనువాదకులు ఎలాంటి సవాళ్లకు సిద్ధం కావాలి?
అనువాదకులు తాము అనువాదానికి ఎంచుకున్న పద్ధతిని, తమ నిర్ణయాలని జస్టిఫై చేసుకోగలగాలి. మూల భాషనీ, వస్తువునీ రూపు మాపకుండా, అదే సమయంలో exoticize చేయకుండా చదువరులకు చేర్చడం ముఖ్యం.
ఈ పుస్తకం విషయంలో ‘స్పీకింగ్ టైగర్’ ప్రచురణ సంస్థ ఎడిటర్ల నుంచి మీకు ఎలాంటి సూచనలు అందాయి?
ఎడిటర్లు మొదటి డ్రాఫ్ట్ చదివాక వాళ్ళకి కూడా ఈ కథల్లో హాస్యం వినిపించింది అన్నప్పుడు ఊపిరి పీల్చుకున్నాను. అయితే, తెలుగు, ఉర్దూ మాటలను ఎంతవరకు వివరించాలి అనే ప్రశ్నపై కొంత చర్చ జరిగింది. చదువరులకు మన మాటలు మొదట్లో కొత్తగా అనిపించినా అర్థమయ్యే కొద్దీ అలవాటుపడతారు అనే నమ్మకం మాకు కలిగింది. జెర్రీ పింటో, మినీ కృష్ణన్ వంటి సాహిత్య దిగ్గజాలకు ఈ కొత్తరకం కథలు, అనువాదశైలి నచ్చాయి అంటే, దాన్నే విజయంగా పరిగణిస్తున్నాను.