Tribal Rights: ఆదివాసీలపై మతం రుద్దవద్దు
ABN , Publish Date - Aug 19 , 2025 | 06:02 AM
భారతదేశానికి అసలు వారసులైన ఆదివాసులపై నేటి హిందూ మతోన్మాదులు మతం రంగు పులిమేందుకు ఉవ్విళ్లూరుతున్నారు...
భారతదేశానికి అసలు వారసులైన ఆదివాసులపై నేటి హిందూ మతోన్మాదులు మతం రంగు పులిమేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ‘ఆదివాసుల మతం ఏమిటి?’ పేరుతో భంగ్యా భూక్యా రాసిన వ్యాసానికి (ఆంధ్రజ్యోతి: 24–07–25) స్పందనగా కాయం నవేంద్ర ‘ఆదివాసీలు ముమ్మాటికీ హిందువులే’ పేరుతో రాసిన వ్యాసం (12–08–25) అసత్యాలతో, ఆదివాసీ సమాజాన్ని గందరగోళపరిచేలా ఉన్నది. కాయం నవేంద్ర రాసినట్టు ఆదివాసీలు ఏ మతానికీ ‘శాఖ’ కాదు, ఏ మతంలోనూ అంతర్భాగం కాదు. వారికి వారే ఒక ప్రత్యేక వృక్షం. భారతదేశంలోని ఆదివాసీలు తమ స్వంత మత, సాంస్కృతిక, సామాజిక వ్యవస్థలతో స్వతంత్ర గుర్తింపును కలిగి ఉన్నారు. వారు హిందూ మతంలో భాగం కాదు. వారిని ఒక ప్రత్యేక సమాజంగా గుర్తించాలి. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛను (ఆర్టికల్ 25), సాంస్కృతిక స్వయం ప్రతిపత్తిని (ఆర్టికల్ 29, 30) హామీ ఇస్తుంది. ఈ హక్కులు ఎవరి చరిత్రను, మతాన్ని, సంప్రదాయాన్ని వక్రీకరించి మరొక మతంలో బలవంతంగా కలపడానికి అనుమతించవు. హిందూ శాస్త్రాలతో (వేదాలు, పురాణాలు), కర్మకాండలతో (యజ్ఞాలు, మంత్రాలు) పోల్చినపుడు ఆదివాసీల విశ్వాసాలు (ప్రకృతి ఆరాధన, ఆత్మల పూజ) మౌలికంగా భిన్నమైనవి. ఆదివాసీలు హిందూ మతంలో ఎప్పటి నుంచో భాగం అనే వాదన చారిత్రకంగా అసత్యం. ప్రాచీన వేద సాహిత్యంలో నిషాదులు, కిరాతులు, పులిందులు, శబరులు వంటి అరణ్యవాసులు హిందూ కులవ్యవస్థకు వెలుపలివారిగా వర్ణించబడ్డారు, నాగరికతకు దూరంగా చూపబడ్డారు.
మధ్యయుగంలో ఆదివాసీలు స్వతంత్ర రాజ్యాలను స్థాపించారు. గోదావరి పరిసరాల్లోని కోయ రాజ్యాలలో 12వ శతాబ్దం నుండి స్థానిక పాలన వ్యవస్థ ఉన్నది. వీరి దేవతలు పుట్ట పెన్, గంగమ్మ, భూమత్తల్లి. వీరి పూజలు అడవి గూడెంలో మాత్రమే. బస్తర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణలో 14వ శతాబ్దం నుండి 1948 వరకు విస్తరించిన గోండు రాజ్యాలలో దండకారణ్య మహాపూజ, జంతు బలి, నృత్యాలు ఉన్నాయే గాని హిందూ పద్ధతులు లేవు. జార్ఖండ్, బిహార్, బెంగాల్, ఒడిశాలోని సాంతాళ్ రాజ్యాలు మరాంగ్ బురు, జాహెర థాన్ మతాలను పాటించాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో విస్తరించిన భీల్ సమాజం వనం, నదుల ఆరాధనను పాటిస్తాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలోని బైగా తెగ భూమిపూజ, ప్రకృతి సంరక్షణను పాటిస్తుంది. కులవ్యవస్థను తిరస్కరిస్తుంది. జానపద కథల్లో మహాదేవ్ బైగా రూపంలో ఉంటాడు, కానీ హిందూ సంప్రదాయాలు భిన్నం. ప్రకృతి ఆరాధన (nature worship) ప్రపంచవ్యాప్త ప్రాచీన మతాల లక్షణం. దానిని హిందూ ‘పంచభూతాల’తో కలపడం చరిత్ర వక్రీకరణ. ఆదివాసీ తెగ చట్టాలు (వారి వివాహం, వారసత్వం, పూజలు ఇవన్నీ) హిందూ ధర్మశాస్త్రాలకు (మనుస్మృతి మొదలైనవాటికి) భిన్నంగా ఉంటాయి. ఆదివాసులు ఎప్పుడూ హిందూవులే అనే హిందూత్వ వాదుల వాదన తర్కానికి నిలబడదు. భారత రాజ్యాంగమూ వారిని ప్రత్యేకంగా గుర్తిస్తుంది. ఆర్టికల్ 342 ప్రకారం ఎస్టీ గుర్తింపు మతం ఆధారంగా కాదు. అనేక కోర్టు తీర్పులూ ఇదే విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. బ్రిటిష్ వారి కంటే ముందు కూడా తెగలు స్వతంత్ర సంప్రదాయాలను కలిగి ఉన్నాయి. వారు హిందూ పండుగల్లో పాల్గొనడం సాంస్కృతికం మాత్రమే తప్ప, మత ఏకీకరణ కాదు. ఆదివాసులను హిందూ మతంలో కలపడం అంటే వారి చరిత్రను చెరిపేయడం, భవిష్యత్తును దోచుకోవడం.
ప్రాచీన సింధూ నాగరికత వారసత్వమైన ఈ భారతదేశ ఆదివాసీలే ఆది బౌద్ధులు. ఈ ఆదివాసీలే స్వతంత్ర గణతంత్ర కళింగులు, నాగాజాతి బిడ్డలు. సామ్రాట్ అశోక చక్రవర్తితో సామ్రాజ్యవాదానికి దీటుగా పోరాడి కళింగ యుద్ధం చేశారు. యుద్ధం తర్వాత మారిన అశోకుడు వారి నుంచి బౌద్ధం స్వీకరించాకే బహుజన చక్రవర్తి అయ్యాడు. కాలక్రమంలో వలస ఆర్యన్ రాజుల దాడుల్లో సంస్కృతిని పోగొట్టుకున్న సింధూ నాగరికత ప్రజలు హిందువులు అయ్యారు. వలస బ్రాహ్మణిజ పాలనలో వేద చరిత్ర మొదలై బౌద్ధం అంతరించింది. సంస్కృతి దాడిని తట్టుకోలేని ఆదివాసీలు కొందరు అడవుల్లోకి పారిపోయారు, కొందరు బ్రాహ్మణీకరణ చెందారు. నాగా జాతి (నాగుల) చావు కోసమే జనమేజయుని యాగం అని వారి పురాణాల్లోనే రాసుకున్నారు. అందుకే ప్రాచీన సింధూ నాగరికత వారసులు, ప్రకృతి ఆరాధకులైన ఆదివాసీలకు మతమే లేదు.
-వజ్జ వెంకటేశ్వర్లు