Share News

Cure Pure Rare policy: క్యూర్‌.. ప్యూర్‌.. రేర్‌ సమగ్రాభివృద్ధికేనా?

ABN , Publish Date - Dec 13 , 2025 | 04:22 AM

ఇటీవల విడుదలైన తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్‌ను పరిశీలించాక స్పందించి రాసిన వ్యాసం ఇది. సీఎం రేవంత్‌రెడ్డి ఎంతో గొప్ప అని చెప్పి....

Cure Pure Rare policy: క్యూర్‌.. ప్యూర్‌.. రేర్‌ సమగ్రాభివృద్ధికేనా?

ఇటీవల విడుదలైన ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’ డాక్యుమెంట్‌ను పరిశీలించాక స్పందించి రాసిన వ్యాసం ఇది. సీఎం రేవంత్‌రెడ్డి ఎంతో గొప్ప అని చెప్పి ప్రకటించిన అభివృద్ధి విజన్‌ ‘క్యూర్‌.. ప్యూర్‌.. రేర్‌’ గురించి విన్నప్పుడు ‘ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగిరినట్టు..’ అన్న సామెత గుర్తుకు వచ్చింది.

రేవంత్‌రెడ్డి చెప్పినదాన్ని బట్టి తెలంగాణను మూడు ఆర్థిక జోన్లుగా విభజించి అభివృద్ధి చేయడమే ఈ క్యూర్‌.. ప్యూర్‌.. రేర్‌ పాలసీ. ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉన్న ప్రాంతమంతా (ఇటీవల జీహెచ్‌ఎంసీలో విలీనం చేసిన మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు సహా) క్యూర్‌. ఈ ప్రాంతాన్ని సర్వీస్‌ సెక్టార్‌ హబ్‌గా, నెట్‌ జీరో సిటీ (కాలుష్య రహిత నగరం)గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం ప్రకటించారు. ఇందుకోసం కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను నగరం వెలుపలికి తరలించాలని నిర్ణయించారు. వరదలు, ట్రాఫిక్‌ సమస్యలను తగ్గించడంతో పాటు మూసీ ప్రక్షాళన, మెట్రో రైలు విస్తరణ ఇందులో ఉంటాయని చెప్పారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి రాబోయే రీజనల్‌ రింగ్‌ రోడ్డు మధ్య ఉన్న ప్రాంతం– ప్యూర్‌. ఈ ప్రాంతాన్ని మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌గా మారుస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీ, ఫార్మా కంపెనీలు, ఐటీ సెజ్‌ల ఏర్పాటు, బుల్లెట్‌ రైలు కారిడార్లు, గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేల వంటి రవాణా సౌకర్యాలు ఈ ప్రాంతంలో వస్తాయని ఆయన చెప్పారు. రీజనల్‌ రింగ్‌ రోడ్డు నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు విస్తరించిన ప్రాంతమంతా– రేర్‌. రేవంత్‌రెడ్డి దృష్టిలో ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కిందకు వస్తుంది. ఇక్కడ వ్యవసాయ ఆధారిత వృద్ధిని బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మూడు ప్రాంతాల అభివృద్ధి ద్వారా తెలంగాణను 2047 నాటికి బలమైన ఆర్థిక శక్తిగా, 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా మార్చాలని భావిస్తున్నట్లు రేవంత్‌ చెప్పారు.


అయితే, ఈ పాలసీ రూపకల్పనలోనే లోపం ఉంది. రాష్ర్టాన్ని మూడు జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని చూస్తే ప్రాంతీయ అసమానతలు పెరిగే ప్రమాదం ఉంది. ఈ పాలసీలో భాగంగా హైదరాబాద్‌లోని పరిశ్రమలను ఔటర్‌ వెలుపలకు ఎలా తరలిస్తారు? వాటి కోసం అక్కడ భూములను కేటాయించారా? భూసేకరణ చేశారా? పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడారా? లాంటి ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. ఒకవేళ పరిశ్రమలను హైదరాబాద్‌ నుంచి తరలిస్తే ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? వాళ్లంతా వలస వెళ్తే ఆ ప్రభావం అక్కడి గ్రామాలపై పడదా? ఈ మోడల్‌ వల్ల ప్రాంతీయ అసమానతలే కాకుండా, ప్రస్తుతం ఉన్న సామాజిక స్థిరత్వం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్యూర్‌ ప్రాంతంలో కొత్త పరిశ్రమలు వస్తే అక్కడి ప్రజలపై కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతుంది. వ్యవసాయం దెబ్బతిని, భూగర్భ జలాలపై ప్రభావం పడుతుంది.

రేర్‌ అంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అని రేవంత్‌రెడ్డి తేల్చేశారు. నిజంగా ఆ ప్రాంతమంతా గ్రామీణ ప్రాంతమేనా? పూర్వపు వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ లాంటి జిల్లా కేంద్రాలు కూడా గ్రామీణ ప్రాంతాలేనా? కేవలం వ్యవసాయ ఆధారిత పరిశ్రమల పేరు చెప్పి, ఈ నగరాల అభివృద్ధిని అడ్డుకుంటారా? ఇప్పటికే అనేక జిల్లాల్లో సిమెంట్‌ పరిశ్రమలు, రైస్‌ మిల్లులు, సింగరేణి, ఐటీసీ, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు, టెక్స్‌టైల్‌ పార్క్‌, ఎంఎస్‌ఎంఈలు ఉన్నాయి. ఆ పరిశ్రమలను ఏం చేస్తారు? ఈ ప్రాంతాల్లో కొత్తగా ఆహారేతర పరిశ్రమలు పెట్టాలనుకుంటే వాటికి ప్రోత్సాహకాలు ఉంటాయా? ఈ విషయాలపై స్పష్టత ఇవ్వాలి.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతమంతా సమగ్రంగా (వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, సేవల రంగం) అభివృద్ధి చెందుతూ వచ్చింది. జిల్లా కేంద్రాల్లో ఐటీ హబ్‌లతో పాటు ఇతర పరిశ్రమలను ఏర్పాటు చేసి బీఆర్‌ఎస్‌ ఒకే తరహా అభివృద్ధికి సంకల్పించి, ప్రణాళికలు రూపొందించి, అమలు చేసింది. దాంతో యువతకు స్థానికంగా ఉపాధి లభించింది. చైనా కూడా ఇలాంటి నమూనానే ఎంచుకున్నది. అందుకే అంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. నేను ఇటీవల చైనాలో పర్యటించినప్పుడు.. అక్కడి రైతులను కలిసి ‘‘మీకున్న ఈ కొద్ది రెండెకరాలతో కుటుంబం ఎలా గడుస్తుంది?’’ అని అడిగాను. అప్పుడు ఓ వృద్ధురాలు.. ‘‘మా పిల్లలంతా వ్యవసాయానికి అవసరమైనప్పుడు ఆ పనులు చేస్తారు.. ఖాళీ సమయాల్లో (దూరంగా ఉన్న ఓ పరిశ్రమను చూపిస్తూ) ఆ పరిశ్రమలో ఉపాధి పొందుతారు. అందుకే మాకు భూమి తక్కువ ఉన్నా ఆర్థికంగా ఇబ్బంది లేదు’’ అని చెప్పింది. అభివృద్ధి వికేంద్రీకరణతో ఉండే ప్రయోజనమిదే. వ్యవసాయంపైనే ఆధారపడకుండా పరిశ్రమలతో అక్కడి యువతకు ఉపాధి కల్పించేలా విధానాల రూపకల్పన జరగాల్సిన అవసరాన్ని ఈ అనుభవం స్పష్టం చేస్తోంది.


రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మొదట క్యూర్‌.. తర్వాత ప్యూర్‌.. ఆ తర్వాత రేర్‌పైన దృష్టి పెట్టే ప్రమాదం ఉంది. విస్తీర్ణం పరంగా రేర్‌ ప్రాంతమే విశాలమైనది. కానీ, గ్రామీణ ప్రాంతమన్న కారణంగా ఇక్కడి అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంది. ఉద్యోగావకాశాలు తగ్గి యువత క్యూర్‌, ప్యూర్‌ పైన ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. రేర్‌ జోన్‌ ప్రాంతంలో పారిశ్రామిక, పట్టణ మౌలిక సదుపాయాల కల్పన కంటే గ్రామీణ, వ్యవసాయ ఆర్థిక పురోగతికి ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చే అవకాశం లేకపోలేదు.

ఇప్పుడు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది.. హైదరాబాద్‌ ఇండస్ట్రియల్‌ ల్యాండ్స్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ పాలసీ (హిల్ట్‌) గురించి. రేవంత్‌రెడ్డి చెప్పిన క్యూర్‌.. ప్యూర్‌.. రేర్‌కు మూలం ఈ పాలసీలోనే ఉంది. మొదట రేవంత్‌ సర్కారు దీనినే ప్రకటించింది. హైదరాబాద్‌లోని పరిశ్రమల భూములను ఇతర అవసరాల కోసం వాడుకుంటామని, పరిశ్రమలను ఔటర్‌ వెలుపలకు తరలిస్తామని అప్పుడే చెప్పారు. ఈ హిల్ట్‌ పాలసీకి పైపూతగా మూడంచెల అభివృద్ధి మోడల్‌ను ప్రకటించారు రేవంత్‌. జాగ్రత్తగా గమనిస్తే ఈ మోడల్‌లో మొదటి అంశం పరిశ్రమలను తరలించడమే. అందుకోసమే హిల్ట్‌ను తీసుకొచ్చారు. దీని వెనుక ఉన్న లోగుట్టు ఏమిటనేది తెలంగాణ సమాజం తెలుసుకోవాలి. రేవంత్‌ విజన్‌ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం రాష్ట్ర సమగ్రాభివృద్ధేనా అన్నదే అసలు అనుమానం.

బోయినపల్లి వినోద్‌కుమార్‌

పార్లమెంట్‌ మాజీ సభ్యుడు

Updated Date - Dec 13 , 2025 | 04:22 AM