Share News

Telangana Armed Struggle: జ్వలిస్తున్న కడవెండి ఇతిహాసం

ABN , Publish Date - Jul 04 , 2025 | 01:12 AM

నిజాం రాజ్యంలో ఉన్న ఒక ప్రాంతం విస్నూరు. దీని దేశముఖ్ రాపాక రామచంద్రారెడ్డి. 60 గ్రామాలు ఇతని అధీనంలో ఉండేవి. కడవెండి గ్రామం వాటిలో ఒకటి. ఈ గ్రామంలోనే దేశముఖ్ తల్లి జానమ్మ ఉంటూ తన అకృత్యాలను కొనసాగిస్తూ ఉండేది.

Telangana Armed Struggle: జ్వలిస్తున్న కడవెండి ఇతిహాసం

నిజాం రాజ్యంలో ఉన్న ఒక ప్రాంతం విస్నూరు. దీని దేశముఖ్ రాపాక రామచంద్రారెడ్డి. 60 గ్రామాలు ఇతని అధీనంలో ఉండేవి. కడవెండి గ్రామం వాటిలో ఒకటి. ఈ గ్రామంలోనే దేశముఖ్ తల్లి జానమ్మ ఉంటూ తన అకృత్యాలను కొనసాగిస్తూ ఉండేది. నలభై ఎకరాల సాగును 400 వందల ఏకరాలకు చేర్చింది. అన్ని గ్రామాలలాగే కడవెండి కూడా రాచరిక, భూస్వామ్య పాలన దుష్ఫలితాలను అనుభవిస్తున్నది. ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్ట్ పార్టీ ప్రవేశించకముందే ఈ గ్రామం దేశముఖ్ అకృత్యాలను, పెత్తందారీ సంస్కృతిని విమర్శించడం, ధిక్కరించడం మొదలుపెట్టింది. స్వీయ చైతన్యంతో అన్యాయాలకు వ్యతిరేకంగా సంఘటితమయ్యింది. 1944 భువనగిరి ఆంధ్రమహాసభలో రావి నారాయణరెడ్డి పిలుపుతో కడవెండి గ్రామం అగ్నిశిఖగా మారింది. తమ సంఘటిత శక్తికి భరోసా ఉందని, దున్నేవానికి భూమి, అక్రమ పన్నుల రద్దు వంటి కమ్యూనిస్ట్ నినాదాలతో ప్రేరితమయ్యి, సంతోషంతో, ఉత్తేజంతో, దొరల అక్రమాలను ఎదుర్కోవడం కోసం దొడ్డి కొమురయ్య, మల్లయ్య, నల్లా నరిసింహులు, కొండల్ రెడ్డి, కొండయ్య, అస్నాల నర్సోజీ, మోహన్‌రెడ్డి, దావిద్‌రెడ్డి వంటి వారితో గ్రామ రక్షణ కమిటీ ఏర్పడింది. నల్లా వజ్రమ్మ, శేరమ్మతో మహిళా దళం ఏర్పడింది.


ఈ క్రమంలో కడవెండి గ్రామానికి 1946 జూలై 4న నిజాం రాజ్య రెవెన్యూ అధికారులు లెవీ ధాన్యపు సేకరణకు రావడం జరిగింది. తమ దగ్గర తిండికి ధాన్యం లేదని, లెవీ సేకరణకు ఒక్క గింజ లేదని రైతులు కూలీలు తేల్చి చెప్పారు. తమ గ్రామంలో కల జానమ్మ దొరసాని ఇంట్లో 800 బస్తాల ధాన్యం ఉందని దానిని సేకరించమని చెప్పారు. ధాన్యపు గిడ్డంగులకు కాపాలా కాస్తున్న దొర గుండాలకు వ్యతిరేకంగా కడవెండి గ్రామంలో పెద్ద ఊరేగింపును గ్రామ కమిటీ తీసింది. ఊరేగింపుపై మిస్కిన్ అలీ నేతృత్వంలో దొర గుండాలు కాల్పులు జరిపారు. నాయకత్వం వహిస్తున్న దొడ్డి కొమురయ్య గుళ్ల వానకు బెదరలేదు, చలించలేదు, వళ్లంతా తూట్లు తూట్లు అవుతున్నా ఆంధ్ర మహాసభకు జై, కమ్యూనిస్ట్ పార్టీకి జై అంటూ ప్రాణాలు వదిలాడు. ఇంకా అనేక మందికి గాయాలయ్యాయి. ఈ వీర మరణం తెలంగాణ చరిత్రను నూతన యుగంలోకి తీసుకెళ్లింది.

– అస్నాల శ్రీనివాస్ (నేడు దొడ్డి కొమురయ్య వర్ధంతి)

Updated Date - Jul 04 , 2025 | 01:12 AM