Democracy: ప్రమాదంలో ప్రజాస్వామ్య శ్వాసకోశాలు
ABN , Publish Date - Nov 22 , 2025 | 04:22 AM
మీరు ఆ ప్రసంగాన్ని వింటే ఆ మాటలు బాల్‌గంగాధర్ తిలక్‌వో, జవహర్‌లాల్ నెహ్రూవో, జయప్రకాశ్ నారాయణ్‌వో లేదా నెల్సన్ మండేలావో అయివుండొచ్చని భావిస్తారు. అయితే మీరు పొరపడ్డారు. ఆ వక్త సాక్షాత్తు గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.....
మీరు ఆ ప్రసంగాన్ని వింటే ఆ మాటలు బాల్‌గంగాధర్ తిలక్‌వో, జవహర్‌లాల్ నెహ్రూవో, జయప్రకాశ్ నారాయణ్‌వో లేదా నెల్సన్ మండేలావో అయివుండొచ్చని భావిస్తారు. అయితే మీరు పొరపడ్డారు. ఆ వక్త సాక్షాత్తు గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
ఆ ప్రసంగం విలేఖర్లకు వీనుల విందుగా ఉంటుందేమో?! గత పదకొండు సంవత్సరాలుగా విలేఖర్ల సమావేశంలో పాల్గొనేలా ప్రధానమంత్రిని అంగీకరింప చేసేందుకు వారు చేయని ప్రయత్నం లేదు కదా. విఫల మనోరథులు అయిన పాత్రికేయులు ఎట్టకేలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెలువరించిన ఆ ప్రసంగాన్ని విని సహజంగానే ఆనందభరితులయివుంటారు. ప్రత్యక్ష ప్రసారమయ్యే పత్రికా గోష్ఠిలో విలేఖర్లు అడిగే ప్రశ్నలకు సమాధానమివ్వకూడదన్న తన దృఢ సంకల్పాన్ని ప్రధానమంత్రి ఎట్టకేలకు సడలించుకున్నారేమోనన్న ఆశాభావం సైతం వారి మనస్సుల్లో తటిల్లమని ఉంటుంది. తాము ఇక నిరంతరం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం లేదని, తమ అభిప్రాయాలను ‘ఒక వైపు’ లేదా ‘మరో వైపు’ అనే పదబంధాలతో వివరిస్తూ సమతుల్య సంపాదకీయాలు రాయవచ్చనే భరోసాను సంపాదకీయ రచయితలకు ప్రధానమంత్రి ప్రసంగం కలిగిస్తున్నది. ఆయన మాటలు వ్యంగ్య చిత్రకారులకు కూడా ఎనలేని ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ‘ఎవరినీ వదలవద్దు, ప్రధానమంత్రిని సైతం విడిచి పెట్టవద్దు’ అన్న వివేకవంతమైన మాటలను గుర్తు చేసుకుంటూ కార్టూనిస్టులు తమ పెన్సిళ్లకు పదునుపెడతారు. అవి జాలువార్చిన గీతలు, వ్యాఖ్యలు ప్రజలు తమ పాలకుల అవివేకానికి, అధికార ఔద్ధత్యానికి పగలబడి నవ్వుకునేలా చేస్తాయి. ‘పాఠక మహాశయా, నన్ను క్షమించు నేను ఏమి చేస్తున్నానో నాకు తెలుసు’ అన్న ప్రార్థనతో సమాజ యథార్థాలను ఎత్తిచూపిన వార్తలు, వార్తా వ్యాఖ్యలు అనేకాన్ని చెత్తబుట్ట పాలు జేసిన ఎడిటర్లకు ఆ మాటలు తమ అసలు విధ్యుక్త ధర్మ నిర్వహణకు ప్రోత్సాహకరమైన పిలుపు అవుతాయి.
నరేంద్ర మోదీ మాటలు నిజంగా చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి, సందేహం లేదు. రామ్‌నాథ్ గోయెంకా (1904–1991) ఔదలదాల్చిన ఆదర్శం సాహసోపేత పాత్రికేయం (Journalism of Courage). ఆ ఆదర్శమే ఆయన నెలకొల్పిన వార్తపత్రికకు మార్గదర్శక ధర్మసూత్రమయింది. ప్రతి రోజూ ఆ పత్రిక మాస్ట్ హెడ్‌లో భాగంగా ఉంటోంది. రామ్‌నాథ్ గోయెంకాను కొనియాడుతూ ప్రధాన మంత్రి ఇలా ఉద్ఘాటించారు: ‘రామ్‌నాథ్ గోయెంకా బ్రిటిష్ పాలకుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా దృఢవైఖరితో వ్యవహరించారు. బ్రిటిష్ వారి ఆదేశాలను పాటించడం కంటే తన పత్రికను మూసివేసేందుకే ప్రాధాన్యమిస్తానని ఆయన ఒక సంపాదకీయంలో స్పష్టం చేశారు. అదే విధంగా, మన దేశాన్ని ఎమర్జెన్సీ రూపంలో దేశాన్ని బానిసత్వ అంధకారంలోకి నెట్టివేసినప్పుడు కూడా రామ్‌నాథ్ గోయెంకా నాటి పాలకులపై రాజీలేని పోరాటం చేశారు. ఎమర్జెన్సీ విధించి యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ ఏడాది జూన్‌లో దేశ ప్రజలు అందరూ ఆ చీకటి రోజులు గుర్తు చేసుకున్నారు’.
బాగా చెప్పారు. అయితే నేటి పత్రికా రంగంలో ఉన్న వాస్తవ పరిస్థితులు ఏమిటి? భారతదేశ ప్రముఖ వార్తా పత్రికలు భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రభవించినవే. ఆ మహోన్నత పోరాట లక్ష్యాలు, ఆదర్శాలతో స్ఫూర్తి పొందినవే. పత్రికారంగం పరిస్థితులకు అద్దం పట్టే గోది మీడియా (ప్రభుత్వ పక్షపాతంతో వ్యవహరించే పత్రికలు, ఛానెల్స్) అనే పదాన్ని సృష్టించవలసిన అవసరం 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశం కల్పిస్తుందని నాటి త్యాగధనుల తరం ఊహించి ఉండదు. అసంఖ్యాక పాఠకులు, వీక్షకులు చదవడానికి, చూడడానికి తిరస్కరిస్తున్నప్పటికీ అనేక వార్తా పత్రికలు, టీవీ ఛానెల్స్ ప్రభుత్వ అండదండల పుణ్యమా అని ఇంకా పచ్చగా వర్ధిల్లుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ఇంకా ఇలా అన్నారు: ‘రామ్‌నాథ్ గోయెంకా సదా సత్యం పక్షాన నిలబడ్డారు. తనను వ్యతిరేకిస్తున్నవారు ఎంత శక్తిమంతులు అయినప్పటికీ తన విధ్యుక్త ధర్మ నిర్వహణకే ఆయన అధిక ప్రాధాన్యమిచ్చారు’.
పత్రికా వార్తలు ఒకప్పుడు ప్రజాసమస్యల పరిష్కారానికి దోహదం చేసేవిగా ఉండేవి. ఇప్పుడు భిన్నమైన వార్తలు పత్రికల గురించి వినవస్తున్నాయి. ఉదాహరణకు ఒక ఎడిటర్ గురించి వినవచ్చిన వార్తను చూడండి: తాను పనిచేస్తున్న పత్రిక యాజమాన్యంతో ఆయన కుదుర్చుకున్న కాంట్రాక్టు ముగిసేందుకు ఇంకా చాలా కాలం ఉంది. అయితే ఒక రోజున ఉన్న పాటుగా ఆయనకు మిగతా కాంట్రాక్టు కాలపు వేతన భత్యాల మొత్తానికి సంబంధించిన చెక్ అందింది. అదే రోజు సాయంత్రానికి బాధ్యతలను కొత్త ఎడిటర్‌కు అప్పగించి ఇంటికి వెళ్లిపోవాలని యాజమాన్యం నుంచి ఆదేశమూ జారీ అయింది. ఒక టీవీ యాంకర్‌కు విశేష వీక్షకాదరణ ఉన్నది. ఆయన పనిచేస్తున్న టీవీ ఛానెల్ యాజమాన్యం మారింది, ఆ యాంకర్‌ను ఆ సంస్థ నుంచి పంపించివేశారు. ఈ ఉదంతాన్ని అర్ధరాత్రి తిరుగుబాటుగా మీడియా వర్గాలలో చెప్పుకున్నారు. ఇంకా ఎంతోమంది ప్రముఖ పాత్రికేయులకు అంతకంటే దిగ్భ్రాంతికరమైన అనుభవాలు ఎదురయ్యాయి. గత పది సంవత్సరాలలో ప్రఖ్యాత పాత్రికేయులు ఎందరో తమ ఉద్యోగాన్ని కోల్పోయారు. ఇప్పటికీ వారిలో చాలామంది ఉద్యోగాన్వేషణలోనే ఉన్నారు!
కొద్ది రోజుల క్రితం న్యూఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన ఒక సమావేశం గురించి యశ్వంత్ సిన్హా ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. ప్రెస్ క్లబ్ ఆహ్వానంపై సిన్హా అక్కడకు వెళ్లి ఒక ప్రసంగాన్ని వెలువరించారు. ప్రసంగం అనంతరం పాత్రికేయులతో ఆయన పిచ్చా పాటీ చేశారు. ఆ సందర్భంగా ఆయన తాను అప్పుడప్పుడు చేస్తున్న ప్రకటనల గురించి ఎలాంటి వార్తలు రావడం లేదని మృదువుగా మందలించారు. ఆయన మాటతో ప్రతి ఒక్కరూ మౌనం వహించారు. చివరకు ఒక యువ పాత్రికేయుడు ఇలా అన్నాడు: ‘యశ్వంత్ సిన్హా గారూ, మీ ప్రకటనలపై నేను వార్తలు రాస్తాను. నేను గనుక ఉద్యోగాన్ని కోల్పోతే, నాకు మరెక్కడైనా ఒక ఉద్యోగాన్ని ఇప్పించగలరా?’. యశ్వంత్ సిన్హా దిగ్భ్రాంతి చెందారు.. తేరుకొని మెల్లగా ఆ పాత్రికేయుడుతో ఇలా అన్నారు: ‘మీరు మీ ఉద్యోగాన్ని కాపాడుకోండి’.
నేను ఒక సాయంత్రం ఒక చిన్న రెస్టారెంట్‌కు పాత్రికేయ మిత్రుడు ఒకరితో కలిసి డిన్నర్‌కు వెళ్లాను. మేము విందులో ఉండగా రాత్రి పదిగంటల సమయంలో ఆ పాత్రికేయుడికి అతని కార్యాలయం నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తక్షణమే ఇంటికి వెళ్లాలని, అక్కడ ఒబి వ్యాన్ వేచి ఉన్నదని, ముందుగా సిద్ధం చేసి ఉన్న ఒక ప్రకటనను చదవాలనేది ఆయనకు అప్పగించిన పని. ఈ సందేశమందిన వెన్వెంటనే నా పాత్రికేయ మిత్రుడు ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ‘ఇప్పటికే గృహానికి చేరిన మరో విలేఖరికి ఆ బాధ్యత అప్పగించండి అని మీ బాస్‌కు చెప్పవచ్చు కదా’ అని నేను అన్నాను. ‘నా తల్లిదండ్రులు వృద్ధులు. నా పై ఆధారపడి ఉన్నారు. పైగా నేను చెల్లించవలసిన రుణాలు కూడా ఉన్నాయి’ అంటూ నా మిత్రుడు విధి నిర్వహణకు వెళ్లిపోయాడు.
కొంతమంది పాత్రికేయులు అత్యాశాపరులు. వారే వృత్తి జీవితంలో వృద్ధి చెందుతూవుంటారు. ఈ అత్యాశాపరులు విచిత్రమైన వార్తలు సృష్టిస్తారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతీయ నావికాదళ యుద్ధ నౌకలు కరాచీని దిగ్బంధం చేశాయని, భారత సైనిక దళాలు కరాచీ నగరంలో ప్రవేశించేందుకు సంసిద్ధంగా ఉన్నాయనే వార్తలను ప్రసారం చేయడం ఇందుకు ఓ ఉదాహరణ.
యశ్వంత్ సిన్హా, నేను చెప్పిన ఉదంతాలు, ఇంకా మీరు విన్నవీ పత్రికారంగంలో ఎల్లెడలా పరివ్యాప్తమై ఉన్న భయోత్పాత పరిస్థితులను వెల్లడిస్తున్నాయి. విశ్వసనీయమైన వ్యక్తులు నాకు చెప్పిన, నేను స్వయంగా తెలుసుకున్న కొన్ని విషయాలను వెల్లడిస్తాను: అగోచర సెన్సార్ అనుక్షణమూ పనిచేస్తూ ఉన్నది; ప్రధాన వార్తాపత్రికలు, టీవీ ఛానెల్స్ అన్నీ 24x7 పర్యవేక్షణలో ఉన్నాయి; ఎడిటర్లకు ఫోన్ కాల్స్ వెళ్లుతున్నాయి; ఏవి ప్రచురించాలో, ఏవి ప్రచురించకూడదో సలహాలు లేదా సలహాపూర్వక సూచనలు ఇవ్వడం జరుగుతోంది; పాటించని వారికి సమస్యలు, ఇబ్బందులు తప్పడం లేదు. ఇదీ మీడియా పరిస్థితి, నన్ను నమ్మండి. హిందీ మీడియా మినహా మిగతా భారతీయ భాషలలోని చిన్న మీడియా సంస్థలకు మాత్రమే ఈ నిరంతర నిఘా, నిత్యపర్యవేక్షణల నుంచి మినహాయింపు లభిస్తున్నట్టుగా కనిపిస్తోంది. భయం స్వేచ్ఛకు పరమ శత్రువు. భయంతో రాజీపడిన మీడియా, లేదా నిర్భీతితో తలెత్తుకొని నిలబడే మీడియా.. భారత్ ముందు రెండుదారులున్నాయి. భయం గల మీడియా ప్రజాస్వామ్యాన్ని రక్షించలేదు.
పి. చిదంబరం